పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు.. సీఎం ఆదేశాలు
ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. క్యూ ఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఇందులో నమోదు చేయాలని స్పష్టం చేశారు.. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్ నంబర్ ప్రతిచోటా ఉంచాలన్న ఆయన.. అలాగే సమర్థవంతమైన ఎస్‌ఓపీలను పెట్టాలన్నారు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి.. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పనితీరు ఇందులో కీలకం.. ప్రివెంటివ్ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలం అన్నారు.. వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం.. ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని.. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదన్నారు.. 4 వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇక, అక్టోబర్ 22న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించినట్టు వివరించారు సీఎం జగన్.. పేషెంట్‌కు చికిత్స అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్ స్ధాయిలో కంటి పరీక్షలు కూడా చేయాలి.. క్రమం తప్పకుండా ఈ పరీక్షలు జరగాలన్నారు.. మరోవైపు.. సికిల్ సెల్ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.. ఈ ఏడాది 6.68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు అధికారులు. ఈ నెలలోనే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.. ఓరల్ హెల్త్‌లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలియజేశారు.. ఈ సమయంలో దంత సమస్యల చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..
పైసా రాలేదు.. చేతి చమురే వదులుతోంది..
మా కార్యకర్తలు ఆర్ధికంగా చెడిపోయారు.. నాలుగు సంవత్సరాలుగా ఖర్చు మాత్రమే పెట్టారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఏ కార్యకర్తకు పైసా లబ్ధిలేదు, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం, మా కార్యకర్తలు పనిచేశారని తెలిపారు.. మా కార్యకర్తలు అందరూ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ రోజు జరిగిన ఈ మీటింగ్ కు ఖర్చు ఎవరు పెట్టారు.. మా కార్యకర్తే ఆయన జేబులో డబ్బులే ఖర్చు చేశారని తెలిపారు.. ఎక్కడ నుండో డబ్బులు వచ్చి మీటింగులు పెట్టడం లేదు.. మాకు పైసా ఎక్కడ నుండి రాలేదు.. చేతి చమురే వదులుతోందని వ్యాఖ్యానించారు. అవినీతి లేకుండా ప్రతీ ఒక్క లబ్ధిదారుని ఇంటికే పథకాలు అందుతున్నాయని తెలిపారు మంత్రి ధర్మాన.. మమ్ములను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేలా మేం నిజాయితీగా పాలన చేస్తున్నాం అన్నారు.. ఇక, పూర్వం మాదిరి ఎమ్మెల్యే, చైర్మన్, మున్సిపల్ కమీషనర్ కనిపించడం లేదనే మాట ప్రజల నుండి రావడం లేదన్నారు. అధికారులు, నాయకులు నిరంతరం ప్రజలతోనే ఉంటున్నాం.. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నాలుగేళ్లలో మేనిఫెస్టోలో పొందుపర్చిన అన్ని పనులు పూర్తిచేశామన్నారు.. దేశంలో ఇలా మేనిఫెస్టో పూర్తి చేసిన పార్టీ మాదే ఇంకే పార్టీ లేదన్నారు. 75 ఏళ్లుగా ఇలా ప్రభుత్వ నడపడం మనం చూడలేదు.. అవినీతి లేని పాలన ఈ ప్రభుత్వంలోనే ఉందన్నారు.. జన్మభూమి కమిటీ సభ్యులు గతంలో మిమ్ములను ఎలా బెదిరించేవారో తెలియదా..? అని ప్రశ్నించారు.. జన్మభూమి కమిటీ సభ్యులు బ్రోకర్ పనులు మాత్రమే చేసేవారంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
మంత్రి విడదల రజిని శాఖ మార్చేశారు.. ఫ్లెక్సీలు పెట్టేశారు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్2లో మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజినికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత.. అయితే, కొందరు మంత్రి రజిని అభిమానులు ఆమె శాఖను మార్చేశారు.. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పేర్కొన్నారు.. అంతేకాదండోయ్.. ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దారి పొడువునా కట్టేశారు.. ఇది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో.. ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.. అసలు విడదల రజిని శాఖ ఎప్పుడు మారిపోయింది అంటూ ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు మైలవరం పర్యటనకు వెళ్లారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.. అయితే, మంత్రి రజని శాఖ మార్చేశారు ఆమె అభిమానులు.. ఏపీ హోం శాఖ మంత్రి విడదల రజని అంటూ ఫ్లెక్సీలు కట్టేశారు మైలవరం వైసీపీ అభిమానులు.. మైలవరంలో 50 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడానికి మంత్రి విడదల రజని వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఫ్లె్క్సీలు వెలిశాయి.. విడడల రజనికి స్వాగతం పలుకుతూ కట్టిన ఫ్లెక్సీలలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి బదులుగా హోం శాఖ మంత్రిగా రాసుకొచ్చారు ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన వైసీపీ శ్రేణులు.. ఇక, మైలవరంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుతో కలిసి ఆస్పత్రిలో ఏర్పాట్లను పరిశీలించారు..
మేం అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ.. రూ.500కే సిలిండర్..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేపట్టిన ఆయన.. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటేశారు.. వాన, ఎండ అనే తేడా లేకుండా వడివడిగా అడుగులు వేస్తున్నారు.. అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపుతున్నారు.. ఇక, తన పాదయాత్రలో సందర్భంగా ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు.. అది కూడా ఒకే సారి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు భట్టి విక్రమార్క.. పీఎం, సీఎం కలిసి.. గ్యాస్ ధర రూ.1100 దాటించారని విమర్శలు గుప్పించిన ఆయన.. మేం అధికారం చేపడితే.. పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు.. ఇక, రేషన్ కార్డుపై బియ్యంతో పాటు.. ఉప్పు, పప్పు, చక్కర, నూనె, సబ్బులు.. ఇలా తొమ్మిది రకాల వస్తువులను అందిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పేదలకు న్యాయం జరుగుతుంది.. అధికార పార్టీ పెండింగ్‌లో పెట్టిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వారాహి యాత్రకు సర్వం సిద్ధం.. అన్నవరానికి జనసేనాని
జనసేన అధినేత చేపట్టనున్న వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది.. పోలీసు అధికారులు ఓకే చెప్పడంతో జనసేన శ్రేణులు రిలీఫ్ అయ్యాయి. వారాహి యాత్రకు లైన్ క్లియర్ అవడంతో.. రూట్ మ్యాప్ ప్రకారం జనసేనాని జనంలోకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి అన్నవరంలో బస చేయనున్న పవన్.. రేపు సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసి వారాహి ఎక్కనున్నారు. కత్తిపూడిలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు జనసేనాని.. ఇక, అమరావతిలోని జనసేన పార్టీ ఆఫీసులో రెండ్రోజుల యాగ క్రతువు పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. బుధవారం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు పవన్‌కల్యాణ్. వారాహి యాత్రకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పోలీసులు ప్రకటించడంతో జనసేన శ్రేణులు ఫుల్ జోష్ మీదున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు.. మొత్తం నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర పది రోజుల పాటు జరగనుంది. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సెక్షన్ 30ని అమల్లోకి తెచ్చిన పోలీసులు.. వారాహి యాత్రకు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఇవ్వలేదని, మైక్ పర్మిషన్లు కోరలేదని చెప్పడంతో.. మూడు నాలుగు రోజుల పాటు ఉత్కంఠ కొనసాగింది. అసలు వారాహి యాత్రకు పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనే టెన్షన్ కొనసాగింది. ఎట్టకేలకు వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో సస్పెన్ష్‌కు తెరపడింది. డీఎస్పీలతో జనసేన నేతలు టచ్‌లో ఉన్నారు. భారీ పోలీసు భద్రత మధ్య రూట్ మ్యాప్ ప్రకారం జనంలోకి వెళ్లనున్నారు పవన్. వారాహి యాత్రకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్.
కేసీఆర్ అనాలోచిత విధానంతో రాష్ట్రం అప్పుల ఉబిలోకి.. సీఎంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
కేసీఆర్ అనాలోచిత విధానంతో రాష్ట్రం అప్పుల ఉబిలోకి పోయిదంటూ.. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. రూ.4వేల కోట్లతో నీళ్లు అందించే అవకాశం ఉండగా.. మిషన్ భగీరథతో రూ.40 వేల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల పై రు.1,20,000కోట్ల అప్పుల భారం పడిందని అన్నారు. దీంతో రాష్ట్రాన్ని 2 లక్షల అప్పుల ఊబిలోకి నెట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహిస్తున్న అధికారులకు, ప్రజా ప్రతినిధులకు.. ధర్మపురిలో నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు కాన రావడం లేదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ధర్మపురిలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన.. నిరసన వ్యక్తం చేయకుండా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాగు నీళ్లు కావాలని అడిగితే అరెస్ట్ చేస్తారా.. ఇదేనా సుపరి పాలన అంటే అని నిలదీశారు. ఊరికో ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. రూ. 10లక్షల చొప్పున 1000 కోట్లు, పైపు లైన్, నీటి సరఫరాకు మరో 3000 కోట్లు.. మొత్తం 4000 కోట్లతో రాష్ట్ర ప్రజలందరికీ తాగు నీరు అందించే అవకాశం ఉండేది. కానీ రూ.40 వేల కోట్ల అప్పులు చేశారని సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాలో మిషన్ భగీరథ నీరు నెలకు నాలుగు సార్లు బందు ఐతున్నాయని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు భగీరథ నీరు తాగుతున్నారా.. అని ప్రశ్నించారు.
దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా..? సబ్బు కూడా కారణం కావచ్చు..
సాధారణంగా దోమలు మనుషుల్ని కుడుతాయి. ఇందులో పెద్ద వింతేముందని మీరు అనుకోవచ్చు. అయితే కొందరిని మాత్రం దోమలు ఎక్కువగా కుడుతుండటం మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అయితే ఇందుకు ఓ కొత్త కారణాన్ని పరిశోధకులు వెల్లడించారు. మీరు వాడే సబ్బు కూడా దోమలు కట్టడాన్ని ప్రభావితం చేస్తాయని, దోమల్ని ఆకర్షిస్తాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. సాధారణంగా రక్తం దొరకనప్పుడు దోమలు మొక్కల్లోని చెక్కరను ఆహారంగా తీసుకుంటాయి. పండ్లు, పువ్వులను వచ్చే సువాసలకు సాధారణంగా మనుషులు ఆకర్షితం అవుతుంటారు. అయితే ఇదే విధంగా మనుషులు వాడే సబ్బుల నుంచి వచ్చే సువాసనలు కూడా దోమల్ని ఎక్కువగా ఆకర్షించడాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుందని వర్జీనియాలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ టెక్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఐసైన్స్ జర్నల్ లో ప్రచురించారు.
బీహార్ సీఎంకు ఝలక్.. మంత్రి పదవికి కీలక వ్యక్తి రాజీనామా..!
జితన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో రాజీనామా చేసినట్లు వివరించారు. తన ఆందోళనను వ్యక్తం చేస్తూ, బీహార్ మంత్రిగా తన పాత్ర నుండి అధికారికంగా వైదొలగడంతో, నా పార్టీ ఉనికికి ముప్పు ఏర్పడింది” అని సుమన్ పేర్కొన్నాడు. జూన్ 23న పాట్నాలో జరిగే ప్రతిపక్ష పార్టీ సమావేశానికి తమను ఆహ్వానించలేదన్నారు. మమ్మల్ని ఆహ్వానించనప్పుడు, పార్టీగా మాకు గుర్తింపు లేనందున సుమన్ నిరాశ వ్యక్తం చేశారు. దీంతో రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై సంతోష్ స్పందిస్తూ ‘‘మేము కూటమిలో ఉన్నట్లు నితీశ్, తేజశ్వీ భావించడం లేదు. ఏ విషయంలోనూ మమ్మల్ని గుర్తించడం లేదు. విపక్ష కూటమి సమావేశానికి మమ్మల్ని పిలవనే లేదు. మాకు మేముగా మమ్మల్ని ఆహ్వానించారని ఎలా అనుకుంటాం?’’ అని అన్నారు. ‘‘అడవిలో అనేక జంతువులు ఉంటాయి. పులులు ఇతర జంతువుల్ని వేటాడుతాయి. అన్ని తప్పించుకోవాలి. మేము కూడా తప్పించుకోవాలి’’ అని ఆయన అన్నారు.
జరిమానాలు వద్దు.. ఓవర్‌కు 20 పరుగులు ఫైన్ వేయండి!
టీమిండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ అద్భుత ఆటతో ట్రోఫీని ఖాతాలో వేసుకోగా.. రెండుసార్లు ఫైనల్ చేరిన భారత్ మాత్రం చెత్త ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా చాలా ఓవర్లు కోల్పోవడంతో పలువురు మాజీలు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ స్పందించాడు. జరిమానాలు కాకుండా.. ఓవర్‌కు 20 పరుగులు ఫైన్ వేస్తే బాగుంటుందన్నాడు. ‘స్లో ఓవర్‌రేట్ కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో దాదాపు సగం రోజు ఆటను కోల్పోయాం. దీనిని ఎలా నియంత్రించాలి?’ అని ఓ క్రీడా ఛానల్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు ఇంగ్లీష్ మాజీ ప్లేయర్ మైఖెల్ వాన్ రిప్లై ఇచ్చాడు. ‘జరిమానాలు ఏ మాత్రం పనిచేయవు. రోజుల చివరలో బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు అదనంగా పరుగులు ఇవ్వాలి. ఒక్కో ఓవర్‌కు 20 రన్స్’ అని మైఖెల్ వాన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కొందరు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం 20 పరుగులా అంటూ మండిపడుతున్నారు.
భగవంత్ కేసరి స్ట్రీమింగ్ హక్కులను పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. బాలయ్య బాబు బర్త్ డే కానుక గా ఈ సినిమా కు ”భగవంత్ కేసరి” అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసారు.అలాగే బాలయ్య బర్త్ డే కానుక గా భగవంత్ కేసరి టీజర్ కూడా అనిల్ రావిపూడి విడుదల చేయడం తో భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్ చూసిన తర్వాత మరో భారీ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై భారీ గా అంచనాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యం లో తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.. ఈ సినిమా ఓటిటీ హక్కుల గురించి ఒక వార్త వినిపిస్తుంది. ఓటిటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకున్నట్టు సమాచారం.అమెజాన్ ప్రైమ్ వీడియో భగవంత్ కేసరి ఓటిటీ హక్కు ల ను సొంతం చేసుకుందని తెలుస్తుంది… దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.. ఇక ఈ సినిమాలో బాలయ్య కు జోడీ గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.బాలయ్య కూతురు పాత్ర లో శ్రీలీల నటిస్తుంది.అలాగే ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ స్టార్ అయిన అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమా ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నట్లు సమాచారం.మరి ఈ సినిమా దసరా కానుక గా విడుదల కాబోతున్న నేపథ్యం లో స్పీడ్ గా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. మరి అనిల్ రావిపూడి బాలయ్య కు భారీ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.