వారాహి యాత్ర నేపథ్యంలో ఆంక్షలు.. 20 రోజుల పాటు పోలీస్ సెక్షన్ 30 అమలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనం ముందుకు వెళ్తున్నారు.. “వారాహి యాత్ర” కు సిద్ధం అయ్యారు.. ఈ నెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభం కానుంది.. అన్నవరం నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో సాగనుంది “వారాహి యాత్ర”.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అలర్ట్ అయ్యారు.. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి నుండి ఈనెల 30వ తేదీ వరకు పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ప్రకటించారు డీఎస్పీ అంబికా ప్రసాద్.. ఇక, ఈ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈనెల 14వ తేదీ నుండి 28వ తేదీ వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.. ఏపీ సర్కార్ అత్యంత అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన.. మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కామ్‌లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపించారు. ఏ స్కామ్ లు ఉన్నాయో.. అన్నింటినీ చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఏ ప్రభుత్వం చేయాని విధంగా వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.. శ్రీకాళహస్తిలో జరిగిన బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు.. కానీ, ఇప్పటికీ అక్కడ ఏమీ జరగలేదని ఫైర్ అయ్యారు జేపీ నడ్డా.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందన్న ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి.. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధిని వైసీపీ సర్కార్ గాలికి వదిలేసింది అని విమర్శించారు జేపీ నడ్డా.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు.. దేశంలో మోడీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మార్చారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను జవాబుదారీ రాజకీయాలుగా, ఫలితాలు చూపే పారదర్శక రాజకీయాలుగా మార్చిన ఘనత మోడీ దే అన్నారు.. 9 ఏళ్లుగా ఈ దేశానికి మోడీ సుపరిపాలన అందించారన్న ఆయన.. బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పాటుపడిన పేదల ప్రభుత్వం ఇది.. కరోనా సమయంలో దేశంలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశామని గుర్తుచేశారు. మోడీ వచ్చాక మన దేశంలో పేదరికం రేటు తగ్గిందన్న నడ్డా.. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే మోడీ వచ్చాక ఈ 9 ఏళ్లలోనే ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. ప్రపంచంలోనే మన దేశం వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు జేపీ నడ్డా..
నన్ను ఓడించేందుకు కుట్రలు.. ఉడత ఊపులకు భయపడే రకం కాదు..
సత్తెనపల్లిలో నన్ను ఓడించటానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నైనా రమ్మనండి తెల్చుకుంటాను అంటూ సవాల్ చేశారు.. అయితే, కన్నా అనే వస్తాదును పంపి నన్ను ఓడించ డానికి చూస్తున్నారన్న ఆయన.. పెదకూరపాడు, గుంటూరు కుస్తీ పోటీలో కన్నా గెలిచాడంట.. ఇప్పుడు సత్తెనపల్లి వచ్చి నన్ను నలిపేస్తాడాని, నన్ను ఓడిస్తాడని కన్నాను రంగంలోకి తెచ్చారు అంటూ సీనియర్ పొలిటీషియన్, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై సెటైర్లు వేశారు.. కన్నా ఉడత ఊపులకు భయపడే రకం కాదు నేన్న అంబటి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడ్ని.. నేను రంగంలో ఉండి ఉంటే వైఎస్ కేబినెట్‌లో కన్నా మంత్రిగా ఉండేవాడే కాదన్నారు.. సత్తెనపల్లిలో మా టీమ్ దెబ్బ ఎలా ఉంటుందో కన్నా లక్ష్మీనారాయణకు రుచి చూపిస్తారంటూ హెచ్చరించారు మంత్రి అంబటి రాంబాబు.
సీఎం జగన్‌పై వీర్రాజు సంచలన వ్యాఖ్యలు.. మోడీ అంటే గౌరవం లేదు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఫైర్ అయ్యారు.. ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ ఇచ్చే బియ్యంపై కూడా సీఎం వైఎస్ జగన్ తన ఫొటోలు వేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ జగన్ వారం వారం ఢిల్లీకి వెళ్లి శ్రీవెంకటేశ్వర స్వామి ఫొటో, లడ్డూలు ఇచ్చి ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకుంటున్నాడు.. ఇక్కడ మాత్రం స్టిక్కర్లు మార్చి, రంగులు చేసుకుంటున్నాడని మండిపడ్డారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ అంటే సీఎం జగన్ కు గౌరవం లేదని విమర్శించారు సోము వీర్రాజు.. జగన్ మోహన్ రెడ్డి దిగజారిపోయాడు… 25 పార్లమెంటుల్లో, 26 జిల్లాలో ఇదే సభలు ఏర్పాటు చేసి వైసీపీ చేస్తున్న అవినీతిని ప్రజలకు చెబుతాం అన్నారు.. తొమ్మిది సంవత్సరాలలో ఏపీ ఎంత అభివృద్ధి చేశామో వివరిస్తాం.. కేంద్రం ఇచ్చే డబ్బులకు సీఎం జగన్ తన స్టిక్కర్ వేసుకుని మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఏపీలో ఎన్నో రోడ్లును కేంద్రం అభివృద్ధి చేస్తోంది.. కానీ, జగన్ ఒక్క రోడ్డు అయినా వేశాడా..? అని నిలదీశారు.. రాష్ట్రానికి కేంద్రం 40 లక్షల ఇళ్లు ఇస్తే.. 20 లక్షలు కూడా నిర్మించలేదు. ప్రజల కోసం నిర్మించే రైల్వే లైన్ల కోసం పావలా వంతు నిధుల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం రోడ్లు వేయిస్తుంటే జగన్ మాత్రం ఆ విషయం చెప్పడం లేదు అని విమర్శించారు. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని తెలిపారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
30 నియోజకవర్గాల్లో భట్టి పాదయాత్ర చిన్న విషయం కాదు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు పాదయాత్రలో భట్టి విక్రమార్క 1000 కిలో మీటర్ల మైలురాయిని దాటారు. దీనిపై పార్టీ నేతలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ.. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నుంచి భట్టి విక్రమార్క ప్రారంభించిన పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల భట్టి విక్రమార్కకు ఆమె అభినందనలు తెలిపారు. అంతేకాకుండా.. దాదాపు 500 గ్రాములు, 30 నియోజకవర్గాల్లో భట్టి పాదయాత్ర చేశారని, ఇది మామూలు విషయం కాదన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నారని, ఆయన వెంట మేము కూడా ఉన్నామన్నారు. పాదయాత్రలో భట్టి విక్రమార్క సామన్య కార్యకర్తలతో టెంట్‌లలోనే ఉంటున్నారని, ఎండావాన లెక్కచేయకుండా ఆయన పాదయాత్రకు కొనసాగిస్తున్నారన్నారు. కర్ణాటకలో గెలిచిన విధంగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె అన్నారు. ఈ పాదయాత్రలో ఈ నెలాఖరు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆమె అన్నారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. మహిళతో సహా నలుగురి అరెస్ట్..
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) మాడ్యూల్‌ను గుజరాత్ ఏటీఎస్ ఛేదించింది. పోర్ బండర్, సూరత్ ప్రాంతాల్లో మూడు చోట్ల ఆపరేషన్ నిర్వహించి ఒక మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరంతా జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించిన యాంటీ టెర్రిరస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) పోర్ బందర్ లో ముగ్గురిని, సూరత్ లో ఒక మహిళను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఉగ్రవాదానికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు గుజరాత్ డీజీపీ వికాస్ సహాయ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు పోర్ బందర్ నుంచి ఒక ఫిషింగ్ బోట్ ను ఉపయోగించి అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ చేరుకుని ఇస్లామిక్ స్టేట్ లో చేరాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం వారిని పోర్ బందర్ నుంచి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. శ్రీనగర్ కు చెందిన ఉబేద్ నాసిర్ మీర్, హనన్ హయత్ షోల్, మహ్మద్ హజీమ్ షాగా గుర్తించామని వెల్లడించారు. అబూ హంజా అనే హ్యాండ్లర్ ద్వారా వీరంతా శిక్షణ పొందారని పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌కు చెందిన జుబేర్ అహ్మద్ మున్షీ, సూరత్‌కు చెందిన సుమేరా బాను, హనీఫ్ మాలెక్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ISKP మాడ్యూల్‌లో సభ్యులుగా ఉన్నారని, ప్రస్తుతం అరెస్ట్ అయిన వారికి వారితో సబంధాలు ఉన్నాయి ఏటీఎస్ తెలిపింది.
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే కదా అద్భుతమైన అవకాశం..
స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చేస్తున్నారా? నచ్చిన మోడల్ ఫోన్‌ను తక్కువ ధరలో అందుకునే అద్భుతమైన అవకాశం వచ్చేసింది.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఆఫర్ల పండుగ తెచ్చింది.. ఈ రోజు ప్రారంభమైన ఈ ప్రత్యేక సేల్.. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ పరిమిత కాల సేల్‌లో ఐఫోన్ 13, శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్23, పోకో ఎక్స్5తో సహా ప్రముఖ బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్.. ఈ సేల్‌కు ముందు కొన్ని ప్రముఖ ఫోన్‌లపై డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్‌లను వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్. iPhone 13, Samsung Galaxy F23, Poco X5 మరియు మరిన్ని ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నట్టు పేర్కొంది.. ఈ-కామర్స్ దిగ్గజం కొన్ని ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ కార్డ్‌లపై కూడా ఆఫర్ ఇస్తోంది.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది.
నందమూరి వారసుడి లుక్ అదిరిపోయిందిగా..!!
నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోల కు ధీటు గా పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అఖండ సినిమా తో సంచలన విజయం సాధించారు బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి తో కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.పవర్ ఫుల్ మాస్ సినిమాల కు కేరాఫ్ అడ్రస్ బాలయ్య అని చెప్పవచ్చు.. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భం గా ఆయన సినిమాల కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులను బాగా అలరిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కు భగవంత్ కేసరి అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. భగవంత్ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోందని చెప్పవచ్చు.అలాగే బాబీ దర్శకత్వం లో ఓ మూవీ ని కూడా చేస్తున్నారు బాలయ్య. ఇదిలా ఉంటే ఇప్పుడు నటసింహం బాలయ్య వారసుడు గురించి అందరి లో కూడా ఆసక్తి పెరిగింది.. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూడా గతం లోనే మోక్షజ్ఞ డెబ్యూ గురించి మాట్లాడినా. అప్పట్లో అయితే సాధ్యం కాలేదు. బాలయ్య వారసుడు త్వరలో వెండితెర మీద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 369 సీక్వెల్ తో వెండితెర కు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకల్లో మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలిచాడు. అచ్చం హీరో లాగా చేంజ్ అయ్యాడు మోక్షజ్ఞ . ఇప్పుడు అతడి లుక్ నందమూరి అభిమానులను ఎంత గానో ఆకట్టుకుంటుంది. ఆ వేడుకల్లో హ్యాండ్సమ్‌గా కనిపించాడు మోక్షజ్ఞ. ఇక ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడు అని తెగ హడావిడి చేస్తున్నారు.
అప్పుడు పవన్‌ని నడిపించాను.. ఇప్పుడు అడుగుజాడల్లో నడుస్తున్నాను
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు పవన్ వస్తున్న సమయంలో.. నాగబాబు స్వయంగా స్వాగతించారు. అతని వెనకాలే నడుచుకుంటూ వచ్చారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘‘అతడు పిల్లాడిగా ఉన్నప్పుడు, ప్రాపర్‌గా ఎలా నడవాలో నేర్పించాను. ఇప్పుడు మేమిద్దరం పెద్దవాళ్లమయ్యాం. పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానాలకి ఎదిగాడు. సరైన మార్గంలో నడిచే అవగాహన సంపాదించాడు. అందుకే, నేను అతని అడుగుజాడల్లో నడుస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఆయన వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థంపై కూడా ఓ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. ఇది తమ జీవితంలో ఓ చిరస్మరణీయమైన ఘట్టమంటూ చెప్పుకొచ్చారు. ‘‘నా తనయుడి నిశ్చితార్థం కావడం, అందమైన వధువు మా ఇంటికి స్వాగతిస్తున్నందుకు.. నేను ఆనందంలో మునిగితేలుతున్నా. ఇది మా గతానికి, వర్తమానానికి వారధి వేసే క్షణం. ఈ జంట తమ ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగించాలని మనసారా దీవిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేస్తూ.. తన ఫ్యామిలీ ఫోటోను నాగబాబు జత చేశారు.