వారికి ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ జీవో
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఎవ్వరినీ విడిచిపెట్టలేదు.. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఎలా ఎంతో మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, కోవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. కోవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి నియమించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, కోవిడ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2,917 మంది ఉద్యోగులు మృతిచెందారు.. వారిలో ఇప్పటి వరకూ 2,744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.. ప్రత్యేక డ్రైవ్ కింద అర్హులైన వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.. 2023 ఆగస్టు 24 తేదీకల్లా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సెప్టెంబర్ 30 తేదీనాటికి ఈ నియామకాలకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని సూచించింది. అయితే, ఖాళీలు, పాయింట్లు, రోస్టర్లతో ఎటుంవంటి సంబంధం లేకుండా ఈ నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 1,520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు శుభవార్తలు చెబుతూనే ఉంది.. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తుంది.. ఇక, వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది.. ఇక, ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. సెప్టెంబర్ 19వ తేదీ వరకు తుదిగడువుగా ప్రకటించింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు.. అంటే ఆగస్టు 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.. సెప్టెంబర్ 19వ తేదీన సాయంత్రం 5 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించారు.. ఇక, హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ మేళా కొనసాగుతుందంటూ తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్వీట్ చేశారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసిందని పేర్కొన్న ఆయన.. అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీల ప్రకారం.. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల కోసం mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
భారీ వర్షాలు ఎఫెక్ట్.. ‘లాగౌట్’ విధానం పొడిగింపు
హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. రహదారులపై కూడా వరద నీరు భారీగా చేరుకుంటుంది. దీంతో రోడ్లపై వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా నగరంలో ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్ వంటి ఏరియాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అవుతుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీలకు ‘లాగౌట్’ పేరుతో కీలక సూచనలు చేశారు. ఈ విధానాన్ని ఆగష్టు 1 వరకు పొడిగించినట్లు సైబరాబాద్ పోలీసులు బుధవారం తెలిపారు. వర్షాల కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. ఫేజ్ – 1లో ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. ఫేజ్ – 2 ఐకియా నుండి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. ఫేజ్ – 3 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
పార్లమెంట్ ఆవరణలో ఎంపీపై కాకుల దాడి.. వైరల్‌గా మారిన ఫొటోలపై బీజేపీ సెటైర్లు
పార్లమెంట్ ఆవరణలో ఓ ఎంపీపై కాకులు దాడి చేశాయి.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కాకుల దాడి నుండి తప్పించుకుంటున్నట్లు ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు బుధవారం రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా.. పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో, పార్లమెంటు ఆవరణలో ఒక కాకి అతడిపై దాడికి యత్నించింది.. కాకి బారి నుంచి ఎంపీ తప్పించుకుంటున్నారు.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాకుల దాడి నుండి రాఘవ్ చద్దా తప్పించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, రాఘవ్ చద్దాపై కాకి దాడి ఘటన తర్వాత, ఢిల్లీ భారతీయ జనతా పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ చిత్రాన్ని అందరితో పంచుకుంది. కాకి కరిచింది అంటూ ఢిల్లీ బీజేపీ హేళనగా రాసుకొచ్చింది.. ఈ రోజు వరకు నేను విన్నాను, ఈ రోజు కూడా నేను అబద్ధాల కోరును.. కాకి కరిచినట్లు చూశాను! అంటూ కామెంట్ పెట్టింది. మరోవైపు నెటిజన్లు కూడా ఈ ఘటనపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని ఓ ట్విట్టర్ యూజర్ రాశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను కాకి గుచ్చేసింది అని పేర్కొంటే.. అన్షుమాన్ అనే వినియోగదారు తాంజియా యాసలో రాస్తూ.. కాకులు కూడా అతన్ని విడిచిపెట్టడం లేదని రాశాడు.. ఇక, ఈ ఘటనపై సానుభూతి వ్యక్తం చేస్తూ మరో ట్విట్టర్ యూజర్ విక్రమ్ తివారీ.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కాకి కొట్టిందని రాశారు. గుండె చాలా కలత చెందిందని వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాల్లో మిస్సింగ్ వివరాలు వెల్లడించిన కేంద్రం
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్ పై ఇవాళ రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్లు కేంద్రం తెలిపింది. ఏపీలో 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల కాలంలో మొత్తం 7,928 బాలికలు.. 22,278 మహిళలు అదృశ్యమైనట్లు పేర్కొంది. 2019లో 2,186 బాలికలు 6,252 మహిళలు, 2020లో 2,374 బాలికలు 7,057 మంది మహిళలు, 2021లో 3,358 బాలికలు, 8,969 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదైనట్లు పేర్కొంది. అటు తెలంగాణలో సైతం మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులు మరింత ఎక్కువగా ఉన్నట్లు హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో తెలంగాణలో మొత్తం 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యమయ్యారు. 2019లో 2,849 మంది బాలికలు, 10,744 మహిళలు, 2020లో 2,232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు , 2021లో 2,994 మంది బాలికలు 12,834 మంది మహిళలు మిస్సయినట్లు కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.
కన్నీటి పర్యంతమైన బైజూస్ సీఈవో.. ఇవేం కష్టాలు బాబోయ్..!
జీవితం అన్ని సార్లు ఒకేళా ఉండదు.. ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం.. ఒక్క గాలివానతో కూలిపోయినట్టు.. కొన్ని సార్లు తీరన్ని కష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు బైజూస్ సీఈవో రవీంద్రన్‌కు వచ్చింది.. ఈ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ ఓ వెలుగు వెలిగింది.. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే భాషలో.. క్లిష్టమైన సబ్జెక్ట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చిన బైజూస్.. తక్కువ కాలంలోనే ఎంతో మంది ఆదరణ పొందింది.. కొన్ని విద్యాసంస్థల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒప్పందాలు చేసుకునే స్థాయికి ఎదిగింది.. అయితే, ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు నిలిచిపోవడం, బోర్డు నుంచి డైరెక్టర్లు వైదొలగడం,ఆ సంస్థ నుంచి ఆడిటర్ వెళ్లిపోవడం.. ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. అంతేకాదు.. ఏప్రిల్ చివరల్లో బైజూస్ యొక్క బెంగళూరు కార్యాలయాలపై దాడి చేసిన కొందరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత విలువైన విద్య-సాంకేతికత స్టార్టప్‌ను బహిరంగంగా విదేశీ మారకపు ఉల్లంఘనలతో ముడిపెట్టారు. ఇలా వరుసగా కష్టాల్లో చిక్కుకున్న రవీంద్రన్.. ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారట. ఈడీ దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత దుబాయ్‌లో పలువురు ఇన్వెస్టర్లతో మాట్లాడారు రవీంద్రన్.. 1 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ గురించి ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. కంపెనీని కాపాడుకునేందుకు కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది.. ఆ సమావేశంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని తమతో పంచుకున్నట్టు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. కాగా, రవీంద్రన్ కొన్ని నెలల తరబడి సంక్షోభంలో ఉన్నారు. భారతదేశంలో ఈడీ చేసిన దాడితో పాటు, ఆర్థిక ఖాతాలను సకాలంలో ఫైల్ చేయడంలో విఫలమైంది. అనేక US-ఆధారిత పెట్టుబడిదారులు బైజూస్ అర బిలియన్ డాలర్లను దాచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి.. సంస్థ యొక్క తొలి పెట్టుబడిదారులలో ఒకరైన ప్రోసస్ ఎన్‌వి బోర్డు నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు.. పేలవమైన ప్రదర్శనకు తోడు, డైరెక్టర్ల సలహాలను పట్టించుకోకపోవడం వల్లే బోర్డు నుంచి వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు.
రైతు ఆదాయాన్ని పెంచుతున్న పూల సాగు..!
పూలు రైతుకు కాసుల పంటే.. ప్రతి కాలంలోను ఆదాయాన్ని ఇస్తుంది.. అందుకే రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు పూల సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు..అరళం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ శాఖ, గిరిజన పునరావాస అభివృద్ధి మిషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా బంతిపూలు, చెమంతి పూల సాగు ప్రారంభించారు. ఇక్కడ ఎక్కువగా జీడి, రబ్బరు, కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. అయితే అడవి ఏనుగులు, ఇతర జంతువులు వాటిని ధ్వంసం చేయడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ప్రయోగాత్మకంగా సాగు చేసిన పూలు రైతులకు మంచి ఆదాయం తెచ్చి పెట్టడమే కాదు, అడవి జంతువులు కూడా ముట్టుకోవడం లేదు.. దీంతో వందల మంది ఈ పంటల ద్వారా ఆధాయాన్ని పొందుతున్నారు..అక్కడ పండగల సమయంలో పూల దిగుబడి వచ్చేలా రైతులు పండిస్తున్నారు.. ఇక ప్రభుత్వం కూడా పూల రైతులకు భరోసా కల్పిస్తున్నారు.. కేరళలో బంతి, చామంతి, జర్బెరా, మల్లె, గులాబీ పూల సాగు చేపట్టిన రైతులు ఏటా ఎకరాకు రూ.2 లక్షలకు తగ్గకుండా ఆదాయం పొందుతున్నారు. పూల సాగులో చీడపీడలు కూడా తక్కువే. రసాయనాలు వాడటం తక్కువే..
మళ్లీ భారీగా పెరిగిన టమోటా ధరలు..ఆందోళనలో జనం..
టమోటా కూరలను ఇంట్లో చేసుకొని చాలా రోజులు అయ్యింది… ధరలను వింటే గుండె గుబెల్ మంటుంది.. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుతాయి అనుకోవడం తప్ప, నిజంగా ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించలేదు.. తెలుగు రాష్ట్రాల్లో టమోటాలు కాస్తున్న ధరలు రూ.200 పలుకుతున్నాయి.. ఏపీలో ధరలు కాస్త ఎక్కువగానే పలుకుతున్నాయి.. ఏపీ మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ మదనపల్లె మార్కెట్‌లో కిలో నాణ్యమైన టమోటా ఏకంగా రూ. 168 పలికింది.. ఇదే హైయేస్ట్ ధర అని వ్యాపారులు చెబుతున్నారు.. ఏపీలోని అతిపెద్ద టమోటా మార్కెట్‌గా ఉన్న మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు అంతకంతకూ పెరుగుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న రూ. 140 పలికిన కేజీ టమోటా.. ఇవాళ ఏకంగా రికార్డు స్థాయిలో రూ.168కి చేరింది. ఈ మార్కెట్‌లో మొదటి రకం టమోటా ధర కిలో రూ. 140-168, రెండో రకం రూ. 118-138 వరకు ఉంది. అలాగే మూడో రకం టమోటా కిలో ధర రూ 118 నుంచి 130 వరకు పలుకుతోంది.. జనాలు కొనకున్న ధరలు రికార్డ్ స్థాయి లో నమోదు అవుతుండటం విశేషం..
వీడు లక్ష్మణ్ కాదు లత్కోర్.. ఆకట్టుకుంటున్న పేకమేడలు టీజర్
బాహుబలి 2 లో సేనాపతిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్.. హీరోగా మారి ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశాడు. సైలెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక చాలా గ్యాప్ తరువాత రాకేష్.. హీరోగా కాకుండా నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం పేకమేడలు. కే తమిళ్ నటుడు వినోద్ కిషన్ ను తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ నీలగిరి మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పేకమేడలు. ఈ సినిమాలో వినోద్ సరసన అనూష కృష్ణ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ను బట్టి.. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ అనే మిడిల్ క్లాస్ యువకుడు కథనే పేకమేడలు అని తెలుస్తోంది. టీజర్ మొత్తం లక్ష్మణ్ క్యారెక్టర్ ఎలాంటిది అని చూపించారు.
రచ్చ రేపిన ‘కావాలయ్యా’ తెలుగు వర్షన్ వచ్చేసింది.. విన్నారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ జైలర్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘కావాలయ్యా’ పాట తమిళ్ వెర్షన్ లో విడుదలై నేషనల్ వైడ్ గా వైరల్ అయి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో వుంది. అయితే తాజాగా ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ని బాహుబలి స్టార్ రానా చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. అనిరుధ్ ఈ పాటని క్యాచి బీట్స్ తో కంపోజ్ చేశారు. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ కలసి హైలీ ఎనర్జిటిక్ గా పాడగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ అలరింస్తున్నాయి. ఇక రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, రమ్య కృష్ణన్ తో పాటు వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. టాప్ టెక్నీషియన్స్ అయిన విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరామెన్ గా పనిచేస్తుండగా ఆర్ నిర్మల్ ఎడిటర్ గా చేస్తున్నారు. డిఆర్కే కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ గా స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.