*నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అన్నది త్వరలో విడుదల చేస్తామన్నారు. పండగ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు. ఎన్ని ఉద్యోగాల భర్తీ, విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించామని.. సంక్రాంతి కానుకగా ప్రకటిస్తున్నామన్నారు. ఇవాళ 4వ లిస్టు విడుదల ప్రచారాలను మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. ఇప్పుడు ఎటువంటి ప్రకటన లేదని, ఏదైనా సమాచారం ఉంటే అందరిని పిలిచే చెబుతామని ఆయన స్పష్టం చేశారు.
*చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ భేటీ.. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చ
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. పవన్‌కళ్యాణ్ వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. చంద్రబాబు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీల్లోకి పలువురు నేతలు చేరుతుండడం, వారికి సీట్ల కేటాయింపుపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. రేపు మందడంలో నిర్వహించే భోగి మంటల కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక జీవోలను కాల్చేయనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య విడుదల చేసిన బహిరంగ లేఖ నేపథ్యంలో ఈ భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఆ బహిరంగ లేఖలో.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్‌తో చర్చించడం జరిగిందన్నారు. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవాల్సి వుందని, 40 వరకు సీట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారని హరిరామ జోగయ్య తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని జనసైనికులు భావిస్తున్నారని, కనీసం రెండున్నరేళ్లయినా పవన్ ముఖ్యమంత్రిగా వుండాలని హరిరామజోగయ్య పేర్కొన్నారు. జనసేన టీడీపీలో కూటమిలో త్వరలో బీజేపీ కూడా చేరే అవకాశం వుందని పవన్ తనకు తెలిపినట్లు ఆయన తెలిపారు. జోగయ్య లేఖ రాసిన కొద్దిగంటల్లోనే పవన్ , చంద్రబాబుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ, జనసేన కూటమి కూడా ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించింది.
*రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకోవాలని అన్నారు. సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలుగు ప్రజలు అత్యంత సంప్రదాయ బద్దంగా ఆనందోత్సహాలతో భోగి, సంక్రాంతి పండుగలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భోగ బాగ్యాల భోగి పండుగ.. సంబరాలు పంచె సంక్రాంతి పండుగ.. రైతులకు ఇష్టమైన కనుమ పండుగలను ప్రజలు సంస్కృతి, సంప్రదాయాల నడుమ వైభవంగా జరుపుకోవాలని, ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
*వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రముఖుల రాజీనామాలు, చేరికలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. టికెట్ రాని ఆశావహులు నిరాశతో పార్టీలు మారుతున్నారు. తాజాగా వైసీపీకి భారీ షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత బందర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బౌలశౌరికి గత కొంతకాలంగా విభేదాలున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరుతారనే టాక్ గత కొంతకాలం నుంచి వినపడుతోంది. ఆ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ కావాలని బాలశౌరి డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై క్లారిటీ వచ్చిన తక్షణం బాలశౌరి జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
*చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. ఈ నెల 16న తీర్పు
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ వేశారు. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. 17Aపై తీర్పు తర్వాత ఫైబర్‌నెట్ కేసు విచారణ చేపడతామని.. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
*టూరిజం ఆదాయం పెరగాలని కోరుతున్నా
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి సారి కైట్ ఫెస్ట్ జరుపుకుంటున్నామని, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలన్నారు. టూరిజం శాఖ నీ దేశం లోనే అగ్రగామి తీసుకెలెందుకు మినిస్టర్ కష్టపడుతున్నాడని, ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కొరుకుంటున్నామన్నారు. టూరిజం ఆదాయం పెరగాలని కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. టూరిజం శాఖకి రవాణా శాఖ నుండి మంచి తోడ్పాటు అందిస్తామని తెలుపుతున్నామన్నారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. దేశ విదేశాల నుండి వచ్చిన కైట్ ఫ్లయర్స్ అందరికీ వెల్కమ్ చెప్పారు. 16 దేశాల నుండి 40 మంది,దేశం లోని ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది కైట్ ఫ్లయర్స్ వచ్చారని, పంట ఇంటికి వచ్చిన సందర్భంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటామని, గ్రామాల్లో ఆ సందడి తగ్గిందన్నారు. అందరినీ భాగస్వాములను చేయడం కోసం ఈ కైట్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కి 15 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నామని, వచ్చే సంవత్సరం నుండి మండల్లాలో కూడా కైట్ ఫెస్టివల్ జరుపుతామన్నారు. కరోనా వల్ల మూడు సంత్సరాలు కైట్ ఫెస్టివల్ కి గ్యాప్ వచ్చిందని, రానున్న రోజుల్లో ఆట పాట ల వైపు కూడా పిల్లకి ఇంట్రెస్ట్ కలిగిలే కార్యక్రమలు ఉంటాయన్నారు. ఏ పండగ అయిన అందరూ పాల్గొనాలని, తెలంగాణ ప్రాముఖ్యత నీ ప్రపంచం అంతటా వ్యాపించే లా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అన్ని రకాల సంపద మన దగ్గర ఉన్నప్పుడు మన గొప్పదనాన్ని చాటాలని, పర్యాటకులను రప్పించి ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు.
*ప్రపంచంలోనే తొలి “నిపా వైరస్” వ్యాక్సిన్.. మానవ పరీక్షలు ప్రారంభం..
ప్రాణాంతక నిపా వైరస్ నుంచి మానవులను కాపాడేందుకు వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే తొలి నిపా వ్యాక్సిన్ మానవ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ విధానంలో ఆస్ట్రాజెనెకా (AZN.L) మరియు సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉపయోగించిన అదే సాంకేతికత ఆధారంగా ఈ వ్యాక్సిన్ రూపొందిస్తు్న్నారు. నిపా వైరస్ కోసం తయారు చేయబడిన ChAdOx1 NiV అని పిలిచే ఈ వ్యాక్సిన్ ప్రిలినికల్ ట్రయల్స్ విజయవంతమైన తర్వాత, హ్యూమన్ టెస్టింగ్ దశలోకి ప్రవేశించింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ 52 మందితో హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించింది. 18-55 ఏళ్ల వయసున్న వారికి టీకా ఇచ్చి వారిలో రోగనిరోధక వ్యవస్థ స్పందన, వారి భద్రతను అంచనా వేస్తారు. ఆక్స్‌ఫర్డ్ ట్రయల్స్‌లో మొదట పాల్గొనే వారు గత వారంలో వ్యా్క్సిన్ డోసుని తీసుకున్నారు. ట్రయల్స్‌కి ఆక్స్‌ఫర్డ్ నాయకత్వం వహిస్తుండగా.. మానవ పరీక్షల కోసం CEPI నిధులు సమకూరుస్తోంది. నిపా అంటువ్యాధి, గబ్బిలాల, పందుల నుంచి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. గబ్బిలాలు తిన్న పండ్లను మానవులు తీసుకుంటే ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. 25 ఏళ్ల క్రితం మొట్టమొదట మలేషియాలో దీనిని గుర్తించారు. బంగ్లాదేశ్, భారత్, సింగపూర్ దేశాల్లో కూడా ఈ వ్యాధి వ్యాప్తికి దారి తీసింది. సెప్టెంబర్ 2023లో, కేరళలో నాలుగోసారి నిపా వైరస్ ప్రబలింది. ఇద్దరు మరణించారు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో పాటు ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వంటి లక్షణాలకు దారి తీస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం దీని మరణాల రేటు 40 శాతం నుండి 75 శాతం వరకు అంచనా
వేసింది.