తిరుపతి లోక్‌సభ బై పోల్ ఎపిసోడ్.. మరో అధికారిపై వేటు..
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాల ఎపిసోడులో మరో వికెట్ పడినట్టు అయ్యింది.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డిని సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) సూచనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ.. అయితే, ఓటర్ కార్డుల డౌన్ లోడ్ స్కాంలో చంద్రమౌళీశ్వర రెడ్డిని బాధ్యుడిగా గుర్తించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ).. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వహించారు చంద్రమౌళీశ్వర రెడ్డి.. ఇక, ఓటర్ కార్డుల డౌన్ లోడ్ స్కాంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా సస్పెండ్ అయిన విషయం విదితమే.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు, భద్రతపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది.. ఈ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భద్రతపై నాలుగు జిల్లాల అధికారులతో నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.. మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుండి సుమారు 1,120 ప్రత్యేక బస్సులను నడపనున్నాయి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీ అధికారులు.. ఇక, భక్తుల రద్దీ దృష్ట్యా.. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది అధికార యంత్రాంగం. భక్తుల సౌకర్యార్థం సుమారు 35 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతాం అంటున్నారు ఆలయ చైర్మన్.. ఇక, భక్తులకు సులభతరంగా దర్శనం కోసం నాలుగు ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు వెల్లడించారు.. అయితే, ట్రాఫిక్, పార్కింగ్, త్రాగునీరు, క్యూలైన్స్, విద్యుత్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్.. భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అటవీప్రాంతంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, ట్రాఫిక్ సమస్య లేకుండా 75 సీసీ కెమెరాలతో పాటు అదనంగా డ్రోన్ కెమెరాలతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తాం అని పేర్కొన్నారు ఎస్పీ రఘువీర్ రెడ్డి.. మరోవైపు.. శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. శ్రీశైలంలోని ఔటర్ రింగ్ రోడ్డు, టోల్ గేట్, శౌచాలయలు, పార్కింగ్ ప్రదేశాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
విచారణకు రండీ.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలను మరోసారి విచారణకు పిలిచారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్.. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు.. ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు.. మరోవైపు.. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు గైర్హజరైన విషయం విదితమే..
రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్..
తెలంగాణ ప్రభుత్వం రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. కాగా.. ఈనెల 12, 13వ తేదీల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండటంతో ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.
నీట్ నోటిఫికేషన్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే..!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2024) పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్ష మే 5న జరగనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 నియమించింది. జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జండర్ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు.
పిల్లల్ని కంటే రూ.62 లక్షల ప్రైజ్‌మనీ! ఎక్కడంటే..!
ఈ మధ్య ఆయా దేశాల్లో జననాల రేటు తగ్గిపోతున్నాయి. దీంతో బిడ్డల్ని కనేందుకు తల్లులకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల చైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది. ఇక దక్షిణ కొరియాలో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పాడ్డాయి. అక్కడ కూడా జనాభా తగ్గిపోతుంది. దీంతో దక్షిణ కొరియా ప్రభుత్వం (South Korea).. ఇతర ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఆ దేశానికి చెందిన బూయోంగో అనే నిర్మాణ సంస్థ (Booyoung Group) కూడా బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించింది. బిడ్డకు (Child Cash) జన్మనిచ్చిన ఉద్యోగులకు బోనస్‌గా బూయోంగో అనే నిర్మాణ సంస్థ రూ.62 లక్షలు చెల్లిస్తోంది. 2021 నుంచి ఇప్పటి వరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రూ.43.65 కోట్లు చెల్లించినట్లు ఆ సంస్థ తెలిపింది. మహిళలు, పురుషులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. జన్మనిచ్చిన ప్రతీసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది.
“నేనే గెలిచాను”.. నవాజ్ షరీఫ్ ప్రకటన..
దక్షిణాసియాలో చర్చనీయాంశంగా పాకిస్తాన్ ఎన్నికలు మారాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలు, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఇలా పలు సంక్షోభాల్లో చిక్కుకున్న తరుణంలో ఈ ఎన్నికలు జరిగాయి. గురువారం ఆ దేశంలో పోలింగ్ జరగ్గా, నిన్న సాయంత్రం నుంచి కౌంటింగ్ జరుగుతోంది. 24 గంటలు దాటిని ఇంకా దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఏ పార్టీ గెలుచిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, తాజాగా మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) జాతీయ ఎన్నికల్లో విజయం సాధించానని, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చిస్తామని శుక్రవారం ప్రకటించారు. కాగా, షరీఫ్ ఎన్ని స్థానాలు గెలిచాడనే విషయాన్ని వెల్లడించలేదు. పాక్ జాతీయ అసెంబ్లీలోని 265 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.
మహేష్ కొత్త లుక్… వావ్ అంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28గా తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే మహేష్ అభిమానులకు ఇప్పుడు SSMB29 ఫీవర్ అందుకుంది.ప్రస్తుతం మహేష్ బాబు ఫోకస్ అంతా ఇకపై ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ SSMB29 పైనే వుంది. ఇక ఈ సినిమా కోసం ఈ మధ్యనే మహేష్ విదేశాలకు కూడా వెళ్లి వచ్చాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తీ అయ్యిందని ఇప్పటికే విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ లుక్ మార్చడం మొదలుపెట్టాడు. గుంటూరు కారం లో లైట్ గా గడ్డం, జుట్టుతో కనిపించిన మహేష్.. రాజమౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్ ను పెంచుతున్నాడు. తాజాగా మహేష్ కొత్త లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి పెళ్లి ఫిబ్రవరి 14న అద్వైత రెడ్డి అనే అమ్మాయితో జైపూర్ ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఫ్యామిలీ పలువురు సెలబ్రిటీలను కలిసి వారికి శుభలేఖలు అందజేస్తున్నారు.
వేణు స్వామితో అషు రెడ్డి ప్రత్యేక పూజలు.. వాటి కోసమేనా?
ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు..ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. రాంచరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం చెప్పాడు.. గతంలో ఓ హీరో చనిపోతాడు అని చెప్పాడు అలాగే హీరో తారకరత్న చనిపోయాడు.. ఇక సినిమాల విషయంలో కూడా ఈయన చెప్పినట్లే జరుగుతుండటం తో ప్రతి ఒక్కరు ఆయన సలహాలు, సూచనలు పాటిస్తున్నారు.. అలాగే చాలా మంది హీరోయిన్లు ఆయనతో పూజలు చేయించుకుంటే కేరీర్ దూసుకుపోతుందని నమ్ముతున్నారు.. ఈ క్రమంలోనే హీరోయిన్ రష్మిక మందాన వేణు స్వామితో పూజులు చేయించుకుని తన శిష్యురాలిగా మారిపోయింది. అదేవిధంగా మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వేణు స్వామిని సంప్రదించి తనకు సంబంధించి కొన్ని పూజలు చేయించుకుంది. తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ హాట్ బ్యూటీ అషు రెడ్డి కూడా ఆ లిస్ట్ లోకి చేరింది. ఈ హైదరాబాద్ బ్యూటీ వేణు స్వామితో రహస్య పూజలు చేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..అషు కెరీర్ అంతగా బాగోలేదు. ఆమెకు ఆఫర్స్ వస్తున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు. మంచి సినిమా అవకాశాలు రాలేదని తెలుస్తుంది.. అలాగే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. మళ్లీ తన లైఫ్ బాగుండాలని పూజలు చేయిస్తున్నట్లు తెలుస్తుంది.. ఇక నెక్స్ట్ ఏ హీరోయిన్ ఈ లిస్ట్ లో చేరుతుందో చూడాలి..
విక్రమ్ కు ధీటుగా స్టార్ విలన్.. హిట్ రిపీట్
చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే తంగలాన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా కాకుండా విక్రమ్, ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. తన 62 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శిబు థమీన్ కుమార్తె రియా శిబు ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సిద్దార్థ్ తో చిత్తా అనే మూవీ తీసి హిట్ అందుకున్న దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్. ఆ సినిమా తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి స్టార్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఎస్ జె సూర్య.. విక్రమ్ 62లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ గతంలో ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు విలక్షణ నటుడు ఎస్‌జె సూర్య ఎంట్రీతో మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం వెల్లడించింది. చియాన్ విక్రమ్, ఎస్‌జె సూర్యల కలయికతో అభిమానులలో అంచనాలను పెంచడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.