జనసేనకు గుడ్‌బై.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
ఏపీలో రాజీనామాలు.. జంపింగ్‌లో కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ పార్టీలో సీటు దక్కలేదని.. మరో పార్టీ గూటికి చేరుతున్నారు నేతలు.. ఇక, ఈ మధ్యే జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు.. ఈ రోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పొత్తుల్లో భాగంగా అమలాపురం అసెంబ్లీ టికెట్ తెలుగుదేశం పార్టీకి వెళ్లిపోయింది.. దీంతో.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాజబాబు.. జనసేన పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.. అయితే, ఈ రోజు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు రాజబాబు.. వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.. కాగా, 2019 ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన శెట్టిబత్తుల రాజబాబు. ఓటమి పాలైన విషయం విదితమే. అయితే, ఈ సారి తనకు టికెట్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్న ఆయనకు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు.. ఆయన సీటుకు ఎసరు పెట్టింది. దీంతో, జనసేనకు గుడ్‌బై చెప్పి.. వైసీపీ గూటికి చేరారు శెట్టిబత్తుల రాజబాబు.
అది నిరూపిస్తే పోటీనుంచి తప్పుకుంటా.. సీఎం రమేష్ ఓపెన్ ఛాలెంజ్..
తన ప్రత్యర్థులకు బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ నేత సీఎం రమేష్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాపై బ్యాంకు రుణాల ఎగవేత, ఫోర్జరీ కేసులు ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆ కేసులు తనపై ఉన్నట్టు నిరూపిస్తే స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకుంటాను అంటూ ఛాలెంజ్ చేశారు. నేను నామినేషన్ వేసిన ప్రతీసారీ ఇటువంటి ప్రచారాలు చేయడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇక, కేంద్రం నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన ఓ ఐఆర్ఏస్ అధికారి ద్వారా రాష్ట్రంలో వ్యాపార సంస్థల పై తనిఖీలు చేయిస్తూ ప్రభుత్వం భయాందోళనలకు గురి చేస్తోందన్నారు. స్టేట్ DRI అనే వ్యవస్థకు చట్ట బద్ధత లేదన్న ఆయన.. ప్రభుత్వం ఆదేశాలతో వ్యాపారులను భయపెడుతున్న IRS అధికారిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాను అని తెలిపారు. మరోవైపు.. సీఎం రమేష్ ఉత్తరాంధ్ర ప్రజలకు మరో ఎర్రన్నాయుడు లాంటి వాడు అని తనను తానే అభివర్ణించుకున్నారు సీఎం రమేష్.. చోడవరంలో టైల్స్ యజమానిని ధర్మ శ్రీ వేధిస్తుంటే ఆడ్డుకున్నానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో స్థానికతకంటే సమర్ధత కే ఓటు అని నినదించారు సీఎం రమేష్.
విశ్వసనీయత.. వంచన మధ్య యుద్ధం.. మంచి జరగాలంటే వైసీపీకే మద్దతు ఇవ్వండి..!
ఈ ఎన్నికల్లో విశ్వసనీయతకు.. వంచనకు మధ్య యుద్ధం నడుస్తోంది.. మీకు మంచి జరగాలంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు.. అవతలి పక్షం తోడేళ్లుగా మోసగాళ్లుగా వస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్నారు. ఒంటరిగా ఎన్నికలము ఎదుర్కొలేక కూటమిగా వస్తున్నారు.. చంద్రబాబు.. దత్త పుత్రుడు వీరికి తోడు బీజేపీని కూడా కలుపుకున్నారు.. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలని కోరారు సీఎం వైఎస్ జగన్.
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ పాలన ఉందా? ఆ హామీల సంగతి ఏంటి..?
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్ పాలన ఉందా? అని నిలదీశారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కావలిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మేం చేసిన దాంట్లో కనీసం 10 శాతమైనా అయినా చేశారా? అని నిలదీశారు. 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి అమలకు సాధ్యం కానీ హామీలను ఇచ్చారు.. ముఖ్యమైన హామీలను చంద్రబాబు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు అని గుర్తుచేశారు సీఎం జగన్.. నరేంద్ర మోడీ, పవన్ కల్యాణ్ ఫోటోలు కూడా ఈ కరపత్రంలో వేశారు.. రైతులకు రుణమాఫీ.. పొదుపు సంఘాలకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పారు. కానీ, వాటిని అమలు చేయలేదు.. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25వేల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు.. ఒకరికైనా చేశారా? అని ప్రశ్నించారు. ఇంటింటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు.. ఇచ్చారా? అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇస్తానని చెప్పారు.. ఒకరికైనా ఇచ్చారా? అని నిలదీశారు.
ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఎందుకు రాజీనామా చేశానంటే..?
ఎన్నికల తరుణంలో హిందూపురం వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. శుక్రవారం రోజు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. సీఎం జగన్, మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖను పంపించినట్టు పేర్కొన్న ఆయన.. వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ రోజు తన రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడిస్తూ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపూర్ టికెట్ ఇవ్వనందుకు కాదు.. అమర్యాదగా ప్రవర్తించినందుకే వైసీపీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. మైనారిటీలకు, పోలీసులకు ఏమీ చేసే అవకాశం ఇవ్వలేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు రక్షణ ఉండేదన్నారు. ఇక, 2 రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని ప్రకటించారు ఎమ్మెల్సీ ఇక్బాల్.
కేంద్రమేమీ ఆకాశం నుండి ఊడి పడలేదు.. ఏపీకి తీరని అన్యాయమే చేసింది..
రాజమండ్రి నగరంలో అభివృద్ధిని గూర్చి మాట్లాడేటప్పుడు ఎవరో చెబితే కాదు.. ఆమె స్వయంగా చూసిన తరువాత మాట్లాడితే బాగుంటుందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిని ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్. రాజమండ్రిలోని మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఒకవైపు రాజమండ్రిలో అభివృద్ధి జరగలేదని, మరోవైపు కేంద్రం నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని ఆమె అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫస్ట్ అభివృద్ధి జరిగిందా, లేదా అనేది పురంధేశ్వరి స్పష్టంగా చెప్పాలన్నారు. ఇక కేంద్రం అనేది పైనుంచేమీ ఊడిపడలేదని, అన్ని రాష్ట్రాలూ ఇచ్చిన నిధులతోనే కేంద్రం మళ్లీ రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. అంతే కానీ కేంద్రం తన సొంత ఖజానా నుంచి ఏమీ ఇవ్వడం లేదన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో, రాష్ట్ర విభజన హామీలు అమలు విషయంలో తీరని అన్యాయం చేసిందని ఎంపీ భరత్ ధ్వజమెత్తారు. ఇక, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఇచ్చిన నిధులు, తదితర పథకాలూ తక్కువేనన్నారు ఎంపీ భరత్.. రాజమండ్రి అభివృద్ధి కోసం ఎంపీగా కేంద్రంతో దెబ్బలాడి నిధులు తీసుకొచ్చానన్నారు. గత ఎంపీ మురళీమోహన్ హయాంలో ఎందుకు అభివృద్ధి పనులు చేయలేదో చెప్పాలన్నారు. అప్పుడు టీడీపీ.. ఎన్డీఏతో అంటకాగే ఉంది కదా.. ఎందుకు మోరంపూడి ప్లే ఓవర్ బ్రిడ్జి, విమానాశ్రయం అభివృద్ధికి, రైల్వేస్టేషన్ అభివృద్ధికి, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు తేలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రంతో ఫైట్ చేసి సాధించిన తరువాత పారాచూట్ నుంచి దిగి ఈ అభివృద్ధి అంతా కేంద్రం ఇచ్చిన నిధులతోనే అంటే సరిపోదన్నారు. గతంలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్లు రాజమండ్రి నగరానికి చేసిన అభివృద్ధి చెప్పగలరా? అని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న నాయకులను కాదని ఎవరెవర్నో ఇక్కడికి వలస పక్షులు మాదిరిగా పంపిస్తే, తమ రాజకీయ లబ్ధి కోసం అవగాహన లేకుండా ఇలానే మాట్లాడతారని విరుచుకుపడ్డారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
వైఎస్ జగన్‌ను కలిసి రాజీనామా చేసిన వాలంటీర్లు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.. ఇక, ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ వస్తున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేస్తూనే ఉన్నారు.. అయితే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసిన పలువురు వాలంటీర్లు.. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ఉన్న రాజీనామా పత్రాలను సీఎంకు అందజేశారు.. నెల్లూరు జిల్లా ఆర్‌ఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లంచ్ స్టే పాయింట్ వద్ద సీఎం వైఎస్ జగన్‌ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు వాలంటీర్లు. అయితే, రాజీనామా చేసిన వాలంటీర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. అంతా రాజీనామా చేశారా? అని ప్రశ్నించిన ఆయన.. జూన్ 4వ తేదీన మనం వస్తూనే మన మొట్టమొదటి సంతకం మరలా మిమ్మల్ని పెట్టడమే అని స్పష్టం చేశారు.. ఇదొక్కటే కాకుండా మీరు ఇంత బాగా పనిచేశారు కాబట్టే.. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నారు. మీరు ఇంత బాగా పనిచేశారు.. కాబట్టి.. మీ అందరికీ సేవా మిత్రలు, సేవా వజ్రాలు, సేవా రత్నాలు అవార్డులు ఇచ్చామని గుర్తుచేశారు. మనం వచ్చిన తర్వాత అవి స్టాండర్డ్ చేస్తాను అని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
‘న్యాయపత్రం’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పూరించింది. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు హస్తం పార్టీ సమరశంఖం పూరించింది. తుక్కుగూడలో జరుగుతున్న కాంగ్రెస్ ‘జనజాతర’ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘న్యాయపత్రం’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 5 గ్యారెంటీల పత్రాన్ని కూడా ఆయన విడుదల చేశారు. కొన్ని రోజుల కిందే తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టోను ఇక్కడ రిలీజ్ చేశానని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లే.. జాతీయ స్థాయిలో కూడా మాటలు నిలబెట్టుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
చేవెళ్లలో ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలు తెస్తా..
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు గ్యారంటీలకు అప్లయ్ చేసిన ప్రతి అర్హుడికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… బ్రిటిషోడు ఈ దేశాన్ని మొత్తం ఊడ్సుకపొయిన తర్వాత… పేదోల్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని… గాంధీ, నెహ్రూ కుటుంబమే అని చెప్పారు. సంక్షోభం నుంచి సంక్షేమం కాంగ్రెస్‌తోనే దేశానికి దశా-దిశ దొరికిందని అన్నారు. తమ చేవెళ్ళ వైవిధ్యభరితమైందని చెప్పారు. ఎందుకంటే, తమ పార్లమెంట్ ప్రాంతం… హైదరాబాద్ నగరానికి కూరగాయలు, పూవ్వుల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా ఎగుమతి చేస్తందని చెప్పారు. హైదరాబాద్ మహానగర వంటింట్ల కూరగాయలు, కూరలు మనయేనని… దేవునింట్ల పూవ్వులు మనవేనని… కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్ కూడా మనవేనని నొక్కి చెప్పారు.
మెట్రోలో రెస్టారెంట్.. ఇకపై తినడం.. ప్రయాణం చేయడం..!
దేశంలోని అనేక ప్రముఖ నగరాలలో ఇప్పటికే మెట్రో రైలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకీ నగరాల్లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణలో భాగంగా వేగవంతమైన ప్రయాణాల కోసం నగరాలలో మెట్రో రైలు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. ఇదే క్రమంలోనే రోజురోజుకి కొత్త టెక్నాలజీ, అలాగే ఆకర్షణ ఏమైనా సదుపాయాలతో మెట్రో ట్రైన్స్ రూపొందుతున్నాయి. నగరాలలో ఇప్పటికే ఉన్న మార్గాలతో పాటు మరికొన్ని రైలు మార్గాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకువస్తూ ప్రజలకు మెట్రో రైళ్ల సేవలను దగ్గరకు చేరుస్తుంది. దీనివల్ల సుఖవంతమైన ప్రయాణాన్ని నగరవాసులు అనుభూతి చెందుతారు. ఇకపోతే తాజాగా మెట్రో రైలు అధికారులు మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రజల కోసం తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. నగరవాసులకు మెట్రో రైలులో ప్రయాణం చేసిన సమయంలోనే భోజనం చేసే సదుపాయాన్ని అధికారులు కల్పించబోతున్నారు. వీటికి సంబంధించి మెట్రో రైల్ లోనే రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇది మన హైదరాబాద్ నగరం మెట్రోలైతే కాదు. ఇది ఢిల్లీ దగ్గరలోని నోయిడా మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ప్రాజెక్ట్. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో దీన్ని ఏప్రిల్ 20వ తారీకున ప్రారంభిస్తున్నట్లు నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తాజాగా తెలిపారు.
“అక్కడికి వెళ్లి ఉగ్రవాదుల్ని హతమారుస్తాం”.. రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన పాకిస్తాన్..
ఉగ్రవాదులపై రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉగ్రవాదుల్ని వదలేది లేదని, ఉగ్రవాదులు పాకిస్తాన్ తిరిగి పారిపోతే, అక్కడికి వెల్లి వారిని చంపేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. ఈ వ్యాఖ్యలు ‘బాధ్యతారాహిత్యం’ అని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని శనివారం పాకిస్తాన్ ఖండించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో ‘‘ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి’’ అని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు దీర్ఘకాలిక నిర్మాణాత్మక అవకాశాలను అడ్డుకుంటాయి అని పేర్కొంది. పాకిస్తాన్ ఎల్లప్పుడు ఈ ప్రాంతంలో శాంతికి తన నిబద్ధతను ప్రదర్శిస్తోందని, పాకిస్తాన్ దృఢ సంకల్పం, తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని చరిత్ర ధృవీకరిస్తుందని పేర్కొంది.
ఏప్రిల్ 19న మైత్రీ డిస్ట్రిబ్యూషన్లో శశివదనే రిలీజ్
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శశివదనే’ సినిమాను ఏప్రిల్ 19న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. . గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్న ఈ సినిమా. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించగా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘శశివదనే’ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి సంస్థ దక్కించుకుంది. రీసెంట్ టైమ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ సంస్థ ఇప్పుడు ‘శశివదనే’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు. రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఫస్ట్ నైట్ రోజే గురకపెట్టిన ఐశ్వర్య.. పాపం ప్రకాష్!
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘డియర్’ తమిళ్ లో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. నాగ చైతన్య వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ పరిశీలిస్తే నూతన వధూవరుల పాత్రల్లో జివి ప్రకాష్ కుమార్ , ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో స్నీక్ పీక్ ను చూపించారు. భార్య గురక అలవాటు కారణంగా రిలేషన్ షిప్ కాంప్లికేటెడ్ గా మారిన కథాంశం యూనిక్ గా అనిపిస్తుంది. పెళ్ళైన మొదటి నైట్ నుంచే ఆమె గురక దెబ్బకు బిత్తర పోతాడు భర్త. నాగ చైతన్య వాయిస్ ఓవర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇక జగదీష్ సుందరమూర్తి కెమెరా బ్రిలియంట్ గా వుంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామిక్ కోణాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేయనుంది. డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలలో నటించారు. అయితే ఇదే గురక కాన్సెప్ట్ తో తెరెక్కిన గుడ్ నైట్ సినిమా తమిళంలో బాగా వర్కౌట్ అయింది. తెలుగులో ఓటీటీలో వచ్చాక ఇక్కడ కూడా ఆదరించారు. మరి ఈ సినిమాను ఏమి చేస్తారో చూడాలి.