రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు.. సీఎంను చంపాలనే ఉద్దేశ్యంతోనే దాడి..!
విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.. అయితే, సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. సతీష్ రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలను పేర్కొన్నారు పోలీసులు.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న LW 8, LW9 సమాచారంతో సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించాం.. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా నిందితుడి కదలికలు స్పాట్ లో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. మాకు వచ్చిన సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశాం.. 17వ తేదీన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి మొబైల్ ఫోన్ సీజ్ చేశామని వెల్లడించారు.. నిందితుడు కేసులో A2 ప్రోద్బలంతో కుట్ర చేసి దాడికి పాల్పడినట్టు గుర్తించాం.. వైఎస్ జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇక, దాడి వెనుక సీఎం జగన్‌ను చంపాలని ఉద్దేశ్యం ఉందని నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.. సీఎం జగన్ ను అంతం చేయాలని సున్నితమైన తల భాగంలో దాడి చేశారు.. రాత్రి 8 గంటల 4 నిమిషాలకు బస్సు యాత్రలో వివేకానంద స్కూల్ దగ్గరకు జనంతో కలిసి నిందితుడు చేరారు.. దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయిని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ మీద నుంచి తీసుకొని వచ్చాడు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని హత్యా చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు పోలీసులు.
వైఎస్ వివేకా కేసులో మధ్యంతర ఉత్తర్వులు.. విపక్ష నేతలకు కోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు.. సార్వత్రిక ఎన్నికల వేళ చర్చగా మారింది.. అధికార, విపక్షాలకు చెందిన నేతలు అందరూ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనే ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.. ముఖ్యంగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని.. విపక్షాలు అన్నీ ఈ విషయంలో టార్గెట్ చేసిన ఆరోపణలు గుప్పిస్తున్నాయి.. ఈ తరుణంలో.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. వైఎస్ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దన్న కడప కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, దగ్గుబాటి పురంధేశ్వరి.. వైఎస్ వివేకా హత్యపై ప్రస్తావించవద్దన పేర్కొంది కోర్టు.. కాగా, సార్వత్రిక ఎన్నికల వేళ.. వైఎస్ వివేకా హత్యపై ఆరోపణలు, విమర్శలు గుప్పింజుకుంటుండగా.. వైఎస్ వివేకా హత్య ప్రస్తావనపై కడప కోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సురేష్‌బాబు.. ప్రతివాదులుగా వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, రవీంద్రనాథ్‌రెడ్డిని చేర్చారు.. పిటిషనర్ తరుపున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించగా.. వైఎస్ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దన్న ఆదేశించింది కోర్టు.. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, దగ్గుబాటి పురంధేశ్వరి ఇలా ఎవరూ వైఎస్ వివేకా హత్యపై ప్రస్తావించవద్దన ఆదేశాలు జారీ చేసింది.
సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు.. ఇంత జరిగిందా..?
విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు బెజవాడ పోలీసులు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఇక, రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు.. సీఎంను హత్య చేశాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలను బయటపెట్టారు.. సీఎం జగన్ పై దాడి ఒకసారి మిస్ కావటంతో రెండో సారి మిస్ కాకుండా సతీష్ దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. డాబా కోట్ల సెంటర్ లో దాడికి సిద్ధమై రాయి తీసినా.. ఫ్రెండ్ ఆపడంతో పాటు పోలీసులు, తోపులాట ఉండటంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట సతీష్.. ఆ తర్వాత 100 మీటర్ల దూరంలో ఉన్న వివేకానంద స్కూల్ ప్రహరీ పక్కన రోడ్ పై ఉన్న బెంచీ పక్కకు వెళ్లి రాయితో సతీష్ దాడి చేశారని చెబుతున్నారు. ఇక, దాడి చేసిన వెంటనే వెనుక నుంచి ఒకరు సతీష్ ను పట్టుకోగా వదిలించుకుని అక్కడి నుంచి పారిపోయాడట.. సీఎం జగన్ పై దాడి చేయాలని అందుకు డబ్బు ఇస్తానని దుర్గారావు అనే వ్యక్తి చెప్పటంతో సతీష్ దాడికి పాల్పడ్డాడట.. దుర్గారావు ప్రస్తుతం టీడీపీ బీసీ సెల్ కార్యదర్శిగా ఉన్నారు.. మరోవైపు.. దాడి చేసిన తర్వాత డబ్బుల కోసం దుర్గారావుకు ఫోన్ చేశాడట సతీష్.. ఫోన్ ఒకసారి మాట్లాడి రెండోసారి ఫోన్ కట్ చేసిన దుర్గారావు.. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడని పేర్కొన్నారు.. దాడి అనంతరం 5 నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోయాడు సతీష్.. కాగా, రెండేళ్ల క్రితం సెల్ ఫోన్ దొంగతనం కేసులో సతీష్ అరెస్ట్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు.. ఇక, 2018 వరకు జనసేన పార్టీలో ఉండి.. 2 నెలల క్రితం బోండా ఉమా అధ్వర్యంలో టీడీపీలో చేరారట దుర్గారావు.. మరోవైపు.. డాబా కోట్ల సెంటర్ దగ్గర సీఎం జగన్‌పై దాడి చేయవద్దని సతీష్‌ను అతడి స్నేహితుడు చిన దుర్గారావు వారించాడట.. ఈలోపు ర్యాలీ దగ్గరగా రావడంతో.. పోలీసులు తోసేయటంతో వివేకానంద స్కూల్ దగ్గరకు వెళ్లి సతీష్ దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు పోలీసులు.
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్.. అలా అయితేనే ఉపసంహరణపై ఆలోచన చేస్తా..!
ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు స్వామి పరిపూర్ణానంద.. శ్రీ సత్యసాయిలోని హిందూపురం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి.. విస్తృతంగా పర్యటిస్తున్నారు.. హిందూపురం లోక్‌సభతో పాటు హిందూపురం అసెంబ్లీ స్థానంలోనూ పోటీ చేస్తాను అంటున్నారు. ఈ నెల 21వ తేదీన హిందూపూర్ అసెంబ్లీకి, 25వ తేదీన పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. హిందూపూర్‌లో ఉన్న మైనారిటీలు స్వామీజీకి అభ్యర్థిగా కేటాయిస్తే ఓటు వేయ బోరన్న ఒక కారణంతోనే నాకు సీటు కేటాయించలేదని కొంతమంది అంటున్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నా.. అయితే, కేంద్ర పెద్దల నుండి హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై స్పష్టమైన హామీ వస్తే నా నామినేషన్ ఉపసంహరణపై ఆలోచిస్తాను అన్నారు. ఇక, గత 75 సంవత్సరాలుగా హిందూపురం పార్లమెంట్ అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. మరోవైపు.. నేను పొత్తు ధర్మాన్ని విస్మరించలేదు, టికెట్ కేటాయించిన సమయంలో కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా గడ్డి పరికను విసిరేసిన విధంగా ప్రవర్తించారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు స్వామి పరిపూర్ణానంద.
నాపై విషం చిమ్ముతున్నారు.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు..
మచిలీపట్నం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. చంద్రబాబు పెద్ద బొంకు మాటల నాయుడులా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ఇక, శిరోముండనం ఘటన 1995లో తోట త్రిమూర్తులు టీడీపీలో ఉన్నప్పుడు జరిగింది.. 25 ఏళ్లు త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు.. చాలా ఎన్నికల్లో చంద్రబాబు సీటు కూడా ఇచ్చారు.. ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పై బురద జల్లుతున్నాడని మండిపడ్డారు. ఇక, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను నేనెప్పుడూ బూతులు తిట్టానో చెప్పాలి..? అని డిమాండ్ చేశారు. మీ తీరును ప్రశ్నిస్తే బూతులు తిట్టినట్టా..?సీఎం వైఎస్ జగన్ ను మీరంతా కలిసి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు అని ఫైర్ అయ్యారు. నా కొడుకును దిగజారి మాట్లాడుతున్నారు.. గంజాయి అమ్ముతున్నాడు అంటూ నీచంగా మాట్లాడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. నా కొడుకు కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చెయ్యకుండా ప్రజలకు సేవ చేశాడని.. నా కొడుకు విషయంలో చంద్రబాబు పాపపు మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, బందర్ కి చంద్రబాబు చేసింది శూన్యం.. 2014లో చెప్పిన హామీలే మళ్లీ ఇప్పుడు చెప్తున్నాడు.. చంద్రబాబు మాయ మాటలు నమ్మడానికి బందర్ ప్రజలు అమాయకులు కాదని హెచ్చరించారు.. మరోవైపు.. తన హయాంలో బందర్‌లో చేసిన అభివృద్ధి పనులను మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.
మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ సంచలన వ్యాఖ్యలు.. బహిరంగ సవాల్..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. అన్నమయ్య జిల్లాలో కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ అనంతరం ర్యాలీలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉండగా రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వచ్చి నా కాళ్లు పట్టుకుని బతిమిలాడి నన్ను డీసీసీ అధ్యక్షుడిని చేయాలని కోరారని తెలిపారు.. అంతేకాదు.. మరుసటి ఉదయాన్నే మళ్లీ వచ్చి నేను తాగేసి రాత్రి మీ కాళ్లు పట్టుకొలేదంటూ రెండోసారి మళ్లీ కాళ్లు పట్టుకున్నాడు ఈ పెద్దిరెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, నా కాళ్లు పట్టుకుని అడిగావని నేను కాణిపాకం, తరిగొండ గుడిలో ప్రమాణానికి సిద్ధం..? నువ్వు సిద్ధమా..? అని బహిరంగ సవాల్ విసిరారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్.. మరోవైపు.. పీలేరు అభివృద్ధికి నల్లారి ఫ్యామిలీ వుంటుంది, నన్ను మా తమ్ముడిని ఆదరించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. కాగా, ఈ ఇద్దరు నేతలు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విషయం విదితమే కాగా.. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.. ఇక, పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు పెద్దిరెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
కవిత అరెస్ట్పై స్పందించిన కేసీఆర్..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం తొలిసారి స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనన్నారు. లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు. బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీంతో తాము బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామని తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.. తాము గతంలో బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేశాం.. పోలీసులు బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే దుర్మార్గుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టారు అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి కేసు లేదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో ఇరికించారన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలేక పోయారన్నారు.
కర్ణాటకలో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు
చాలా రోజులు తర్వాత కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తాగు నీటితో ప్రజలు సతమతం అవుతున్నారు. బెంగళూరు పట్టణంలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. కనీస అవసరాలకు నీళ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వర్షం కురవడంతో కన్నడియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రంలోని శివమొగ్గ, తీర్థహళ్లి, సాగరలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గత కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వాన కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆశ్వాదించారు. మరోవైపు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షపునీరు భూమిలోకి ఇంకి.. బోరుల్లో నుంచి నీళ్లు అందుకునే అవకాశం ఉంటుంది.
తెలంగాణ సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రేపే ఎన్నికలు..
తెలంగాణ సరిహద్దు, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ ఎంపీ స్థానాల్లో తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టులకు షెల్టర్లుగా ఉన్న గడ్చిరోలి, బస్తర్ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. విస్తృతంగా భద్రతా ఏర్పాట్లను చేశారు. గడ్చిరోలి-చిమూర్, చంద్రపూర్ ఎంపీ స్థానాలు మంచిర్యాల, కుమ్రంభీం, భూపాలపల్లి సిరిహద్దుల్లో గోదావరి, ప్రాణహిత నదులకు అటువైపుగా ఉన్నాయి. గడ్చిరోలి నుంచి అశోక్ నేతే బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి నుంచి డా. నామ్‌దేవ్ దసరమ్ కిర్సన్ పోటీలో ఉన్నారు. ఇక చంద్రపూర్ నుంచి బీజేపీ కీలక నేత సుధీర్ మునిగంటి వార్ పోటీ చేస్తుండగా..ఇండియా కూటమి నుంచి ప్రతిభా ధనోర్కర్ పోటీలో ఉన్నారు.
రా & రస్టిక్ కంటెంట్ తో ‘పొట్టేల్’.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్!
అనన్య నాగళ్ళ ఎంచుకునే కథాంశాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకప్పుడు పద్ధతి అయిన పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు ఎంచుకుంటున్న సబ్జక్ట్స్ మాత్రం షాక్ కలిగిస్తున్నాయి. అనన్య నాగళ్ళ హీరోయిన్గా, యువచంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పొట్టేల్. గతంలో నందుతో సవారి లాంటి సినిమా చేసిన సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సాంగ్స్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టి ఆకర్షించిన ఈ సినిమా టీజర్ ని ఈరోజు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వల్ల లాంచ్ చేశాడు. ఇక ఈ టీజర్ మాత్రం రా అండ్ రస్టిక్ కంటెంట్తో అలరిస్తోంది. ఒక పల్లెటూరులో జరిగే కథలాగా అనిపిస్తోంది. ఒక పేద కుటుంబాన్ని టార్గెట్ చేసిన ఒక ధనిక వ్యక్తి కథగా ఇది అనిపిస్తోంది. ఇక సినిమాలో పొట్టేలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడంతో సినిమాకి పొట్టేలు అనే టైటిల్ పెట్టినట్టు టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ నేపథ్యంలో సాగబోతున్న ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మరో రా అండ్ రస్టిక్ మూవీగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ టీజర్ లాంచ్ చేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ఇలాంటివి సాధారణంగా మలయాళ సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, కానీ తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయని చెప్పుకొచ్చాడు. ఇలాంటివి చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తే మరిన్ని సినిమాలు వస్తాయని ఆయన అన్నారు.. .
లచ్చిమక్క అంటున్న మంగ్లీ.. మరో మాసీ నెంబర్ తో వచ్చేసింది!
ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గానే విడుదల అయిన అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందగా ఇప్పుడు విడుదలైన ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంది. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు, ఇక హ్యాపెనింగ్ సింగర్ మంగ్లీ ఈ పాటని చాలా బాగా పాడారు. జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే ఒక పాటలా ఉంది. 1980′ లో లొకేషన్స్ అన్ని కూడా చాలా నాచురల్ గా అనిపిస్తున్నాయి. ఈ పాట వింటుంటే కథలో అనేక ట్విస్టులు ఉన్నట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతం వస్తున్న కథలకి పూర్తి భిన్నంగా ఈ జితేందర్ రెడ్డి ఉంటుందని చెబుతున్న మేకర్స్ ఈ సినిమాను మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.