తిరుమలలో మరో రెండు చిరుతలు.. వణికిపోతోన్న నడకదారి భక్తులు..!
కళియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన ఏడు కొండలపై చిరుతలు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి.. ఓ బాలుడు చిరుత దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడగా.. మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనల తర్వాత అప్రమత్తమైన టీటీడీ.. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఆపరేషన్ చిరుత కొనసాగిస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే ఐదు చిరుతలను బంధించినా.. ఇంకా భక్తుల్లో భయాందోళనలు తొలగడం లేదు.. ఎందుకంటే.. ఆపరేషన్ చిరుతలో భాగంగా తిరుమల నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు తాజాగా మరో రెండు చిరుతల కదలికలు చిక్కాయి.. ట్రాప్ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన అటవీశాఖ అధికారులు.. రెండు చిరుతల సంచారాన్ని గుర్తించారు. స్పెషల్ టైప్ క్వార్టర్స్ సమీపంలో ఒకటి.. నరశింహస్వామి ఆలయ సమీపంలో మరో చిరుత సంచరిస్తున్నరట్టు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. ఇక, రెండు చిరుతలను ట్రాప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ రెండు చిరుతలను కూడా బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఇప్పటికే ఐదు చిరుతలను ఫారెస్ట్ అధికారులు బంధించిన విషయం విదితమే. కాగా, జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28, సెప్టెంబర్ 6వ తేదీల్లో మొత్తం ఐదు చిరుతలను బంధించారు ఫారెస్ట్ అధికారులు.. ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని గురువారం టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి ప్రకటించిన మరుసటి రోజే మరో రెండు చిరుతల సంచారం కలకలం రేపుతోంది.
5,089 పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ లో ఎలక్షన్స్ హడావుడి మొదలు కావడంతో ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. పాఠశాల విద్యాశాఖ లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దానిలో భాగంగా ఆగస్టు 1 న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ పరీక్షను సెప్టెంబర్ 15 న నిర్వహించి అదే నెల 27 న ఫలితాలు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా తెలంగాణ ఆర్ధిక శాఖ 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చింది. దీనితో ఎప్పటినుంచో లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ (సీబీటీ) ను నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
నేడే డబ్ల్యూడబ్ల్యూఈ పోరు..! హైదరాబాద్‌లో స్టార్ రెజ్లర్ జాన్ సినా ఫైట్
నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం 17 సార్లు ప్రపంచ చాంపియన్, రెజ్లింగ్ ఆల్ టైమ్ గ్రేట్ జాన్ సెనా ఇక్కడ బరిలోకి దిగడమే. ఆయన పోరాటాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో, ‘బుక్ మై షో’లో టిక్కెట్లన్నీ చాలా ముందుగానే అమ్ముడయ్యాయి. భారత్‌లో జాన్ సెనా బరిలోకి దిగడం ఇదే తొలిసారి. చివరిగా 2017లో భారత్‌లో జరిగిన WWE ఈవెంట్.. ఆరేళ్ల తర్వాత మన దేశంలో జరుగుతోంది. ఈ పోరును చూసేందుకు హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా రెజ్లింగ్ అభిమానులు తరలివస్తున్నారు. ‘సూపర్ స్టార్ స్పెక్టాకిల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోరులో వైవిధ్యమైన ఆటతీరుతో ఇప్పటికే లెక్కలేనన్ని టైటిళ్లు సాధించిన జాన్ సెనా, ఫ్రీకిన్ రోలిన్స్ తో బరిలోకి దిగుతోంది. వీరిద్దరూ జియోవానీ విన్సీ, లుడ్విగ్ కైజర్‌లతో తలపడనున్నారు. సింధు షేర్ (సంగా, వీర్), కెవిన్ ఓవెన్స్ మరియు సమీ జైన్ WWE ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం పోరాడనున్నారు. మహిళల WWE వరల్డ్ టైటిల్ కోసం రియా రిప్లే నటల్యతో తలపడనుంది. వీరితో పాటు డ్రూ మెక్‌ఎల్ట్రీ, శాంకీ, రింగ్ జనరల్ గుంథర్, జియోనీ విన్సీలు బరిలోకి దిగనున్నారు.
స్టార్ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఇటీవల దొంగలు ఆచి తూచి సెలబ్రిటీల ఇళ్లకే కన్నాలు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన వారి ఇళ్లలో దొంగతనాల వార్తలను మనం వింటూనే ఉన్నాం. గతంలో ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ ఏసుదాస్ లాంటి వారు ఇళ్లలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగలించారంటూ నిరోష తేనంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో నగలు, డబ్బుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా మాయమయ్యాయి అంటూ ఫిర్యాదు చేశారు నిరోషా. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
కూరగాయలు నచ్చలేదని.. కొడ్నాప్ చేసి కొట్టి చంపాడు
ఛత్తీస్‌గఢ్‌లోని విలాస్‌పూర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. విలాస్‌పూర్‌లోని తఖ్త్‌పూర్ ప్రాంతంలోని జబల్‌పూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి సనమ్ అన్సారీకి రాజస్థాన్‌కు చెందిన కూరగాయల వ్యాపారి భగవాన్ రామ్ బిష్ణోయ్ తీసుకువచ్చిన కొన్ని కూరగాయలు నచ్చలేదు. కాబట్టి వారి మధ్య కొనుగోలు ఒప్పందం విఫలమైంది. దీంతో కోపోద్రిక్తుడైన రాముడు తన ఎదుటే వ్యాపారిని దుర్భాషలాడి కొట్టాడు. ఇది జబల్పూర్ వ్యాపారికి కోపం తెప్పించి, రాముడిని చంపాలని ప్లాన్ చేశాడు. జబల్పూర్ వ్యాపారులు విలాస్పూర్ చేరుకుని రాముడిని అపహరించారు. ఆ తర్వాత గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి మరీ కొట్టి ప్రాణాలు తీశారు. మృతదేహాన్ని పారవేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే భగవాన్ రామ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చివరకు అతని సోదరుడు శ్రవణ్ కుమార్ సెప్టెంబర్ 3న పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన సోదరుడు భగవాన్‌రామ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 2న ఆదిత్య కృషి ఫారం నుంచి ఇంటికి వచ్చేందుకు వెళ్లాడని, ఇంతవరకు ఇంటికి రాలేదని తెలిపారు.
ఆధార్ కార్డ్ హోల్డర్లకు గుడ్‌న్యూస్..
అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయిపోయింది.. కొన్నింటికి అవసరం లేదు అంటూనే ఆధార్ సేకరిస్తున్నారు.. అలా దానికి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటితే.. దానిని తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) స్పష్టం చేసిన నేపథ్యంలో.. మరోసారి అంతా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకుంటున్నారు.. ఇంకా చేసుకోవాల్సినవాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే వారికి ఇప్పుడు యూఐడీఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది.. ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో.. ఆధార్ కార్డ్ హోల్డర్లకు శుభవార్త చెబుతూ.. దీనిని మరో మూడు నెలలు పొడిగించింది.. అంటే డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.
జాబ్ కోసం దరఖాస్తు చేసుకుంది.. ఊహించని గిఫ్ట్ అందుకుంది..! కానీ..
సిలికాన్ వ్యాలీలోని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ‘సీక్రెట్ సుషీ’ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది ఓ మహిళ.. అయితే సర్వసాధారణంగా ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్న సమయంలో.. ఆ ఉద్యోగం ఇవ్వని పక్షంలో.. సారీ మిమ్మల్ని సెలక్ట్ చేయడం లేదని మెయిల్ పెడుతుంటారు.. ఇంకా కొన్ని కంపెనీలు అయితే.. ఎలాంటి సమాచారం కూడా ఇవ్వవు.. కానీ, సీక్రెట్ సుషీ మాత్రం.. మేనేజర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థికి తిరస్కరణ లేఖతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డును పంపించి ఆశ్చర్య పరిచింది.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న సదరు అభ్యర్థికి సీక్రెట్ సుషీ నుండి దరఖాస్తు చేసినందుకు ధన్యవాదాలు అని చెబుతూ.. మిమ్మల్ని సెలక్ట్ చేయడంలేదని స్పష్టం చేసింది.. దాంతో పాటు గిఫ్ట్ వోచర్‌ను కూడా పంపించింది. ఇందుకు సంబంధించి ఆమె మెయిల్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేవారు.. తనకు వచ్చిన 7 డాలర్ల గిఫ్ట్ వోచర్‌ను కూడా పొందుపరిచి, మరిచిపోలేని అత్యుత్తమ తిరస్కరణ అంటూ కామెంట్ పెట్టారు.. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
ఈ కొంగ ఏంటి పిల్లను అలా పడేసింది? కారణం అదే అయ్యింటుందా?
తల్లీ బిడ్డల బంధం కేవలం మనుషుల్లోనే కాదు ఏ జంతు జాతిలో అయినా ఓకేలా ఉంటుంది. తమ బిడ్డలను కాపాడుకోవడం కోసం తల్లి ఏమైనా చేస్తుంది. అఖరికి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను రక్షించుకుంటుంది. ఈ పోరాటంలో ఎంతటి వారిని ఎదిరించడానికైనా సిద్దపడుతుంది. ఇక అలాంటిది వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ కొంగ తన పిల్ల పట్ల దయలేకుండా ప్రవర్తించింది. దానిని చాలా ఎత్తులో ఉన్న గూడు నుంచి బయటకు తోసేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుంతుంది.
ఒకే ఏడాది రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన ఏకైక హీరో షారుఖ్
పదేళ్లుగా షారుక్ ఖాన్ కి హిట్ అనేదే తెలియదు… గత అయిదేళ్లుగా అయితే సినిమానే చేయలేదు. ఇలాంటి సమయంలో షారుఖ్ ఫ్లాప్స్ కి భయపడుతున్నాడు, షారుఖ్ ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు యంగ్ హీరోలని చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు, షారుఖ్ ఇక సినిమాలు చేయడు అనే మాట వినిపించడం మొదలయ్యాయి. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న షారుఖ్ ఖాన్ కి ఇవేమి పట్టలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు… సరిగ్గా అయిదేళ్ల విరామం తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల కంబ్యాక్ ఇచ్చాడు. షారుఖ్ కి మాత్రమే సాధ్యమైన కంబ్యాక్ ఇది. పఠాన్ సినిమా షారుఖ్ నే కాదు బాలీవుడ్ ని కూడా బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. పఠాన్ రాబట్టిన కలెక్షన్స్ దెబ్బకి షారుఖ్ పై కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కామెంట్స్ చేసిన వాళ్లని ఏకంగా అండర్ గ్రౌండ్ పంపించడానికి షారుఖ్ ‘జవాన్’ సినిమాతో కింగ్ సైజ్ ఎంట్రీ ఇచ్చాడు. అట్లీ సౌత్ టచ్ ఇచ్చి చేసిన జవాన్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇండియా నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో జవాన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందే భారీ హైప్ మైంటైన్ చేసిన జవాన్ సినిమా మొదటి రోజు 120 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు సమాచారం. దీంతో ఒకే ఏడాదిలో రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన హీరోగా షారుఖ్ హిస్టరీ క్రియేట్ చేసాడు. లాంగ్ వీకెండ్ ఉంది, తర్వాత వినాయక చవితి ఫెస్టివల్ కూడా కలిసి వస్తుంది కాబట్టి జవాన్ సినిమా లాంగ్ రన్ లో పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేయనుంది.