అమిత్‌షాను కలిసిన నారా లోకేష్.. మా నాన్న ప్రాణాలకు హాని ఉందని ఆందోళన..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి.. ఫైబర్ నెట్, ఐఆర్‌ఆర్ కేసుల్లో కూడా సీఐడీ.. చంద్రబాబు పేరును చేర్చింది.. మరోవైపు నారా లోకేష్‌కి ఇన్నర్ రింగ్ రోడు కేసులో నోటిసులు.. రెండు రోజుల పాటు సీఐడీ విచారణ కూడా సాగింది.. అయితే, రాష్ట్రంలో తాజా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వివరించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం వైఎస్ జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు నారా లోకేష్ వెల్లడించారు.. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్ ని అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకి వివరించారు లోకేష్. అంతే కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశాడు.. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అమిత్‌షా అభిప్రాయపడ్డారట.. ఇక, చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్న అమిత్ షా.. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేష్ తో చెప్పారట అన్న అమిత్ షా. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
నేడు సీఎం జగన్ సామర్లకోట పర్యటన.. వారికి శుభవార్త..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. దీని కోసం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్… ఉదయం 10 గంటలకు పెద్దాపురం చేరుకుంటారు.. అక్కడ 10 నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న ఆయన.. అనంతరం సామర్లకోటకు చేరుకోనున్నారు. జగనన్న కాలనీలో లబ్ధిదారుల ఇళ్ల పరిశీలన, వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకోనున్నారు. 40 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. ఇక, సామర్లకోటలో వైయస్సార్ జగనన్న కాలనీని ప్రారంభిస్తారు సీఎం వైఎస్ జగన్.. 57 ఎకరాలలో 2,412 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. దశలవారీగా లబ్ధిదారులకు సర్కార్ ఇళ్లను అందజేస్తోంది. రెండు ప్రాంతాలలో జగనన్న లేఅవుట్లను ఏర్పాటు చేశారు. సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇళ్ల నిర్మాణం కోసం లక్షా 80 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసింది ప్రభుత్వం. ఇక, సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కాకినాడ జిల్లాలో గురువారం ఉదయం 7 గంటల నుండి ట్రాఫిక్ ను వేరే మార్గాల గుండా మల్లిస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి తెలిపారు. కాకినాడ వైపు నుండి సామర్లకోట వైపునకు వచ్చే భారీ వాహనాలన్నీ అచ్చంపేట జంక్షన్ నుండి తిమ్మాపురం, పిఠాపురం బైపాస్ మీదుగా కత్తిపూడి హైవేకు దారి మళ్ళించడం జరిగిందని.. కాకినాడ, మాధవపట్నం వైపు నుండి వచ్చే హెవీ వెహికల్స్ ఉండూరు బ్రిడ్జి డౌన్ జంక్షన్ నుండి అచ్చంపేట బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించామన్నారు.. ఇక, సామర్లకోట అయిదు తూముల సెంటర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర కటాఫ్ పెట్టుకుని ఉండూరు వైపు నుండి వచ్చే వాహనాలను మాధవపట్నం వైపునకు దారి మళ్ళిస్తున్నట్టు తెలిపారు. ఇంకా బిక్కవోలు, అనపర్తి వైపు నుండి సామర్లకోట వైపుకు వచ్చే భారీ వాహనాలన్నీ బిక్కవోలు, భలభద్రపురం మీదుగా దారి మళ్ళింపు చేశామని, రాజానగరం వైపు నుండి వచ్చే భారీ వాహనాలు పెద్దాపురం పాండవుల మెట్ట వద్దనుండి గుర్రాల సెంటర్ మీదుగా జగ్గంపేట హైవేకు దారి మళ్లింపు జరిగిందని వివరించారు.. వీటితో పాటు మరికొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అమిత్‌షాను కలిసిన లోకేష్.. ఇప్పుడు సమాధానం చెప్పండి..!
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను నారా లోకేష్ కలిసి విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందని ఆరోపణలు చేస్తున్నవారు ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్‌షా.. లోకేష్‌కి ఎలా అపాయింట్‌మెంట్ ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం, ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులు చేస్తున్న కక్షసాధింపు రాజకీయాల గురించి లోకేష్ అమిత్‌షాకు వివరించారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు పురంధేశ్వరి. కాగా, అమిత్‌షాతో జరిగిన నారా లోకేష్ భేటీలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్న విషయం విదితమే.
విశాఖకు ఎలక్ట్రిక్ బస్సులు.. తొలివిడతలో 100 బస్సులు
ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే.. త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా పాలన సాగించేందుకు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏర్పాట్లలో అధికార యంత్రం నిమగ్నమై ఉంది.. విపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నా.. మూడు రాజధానుల వైపు ముందుకు సాగిన సీఎం వైఎస్ జగన్.. దసరా నుంచి వైజాగ్ కేంద్రంగా పాలన ప్రారంభించనున్నారు.. ఇదే సమయంలో.. విశాఖ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అందులో భాగంగా త్వరలో విశాఖ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.. మూడు నెలల్లో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి వస్తాయని చెబుతున్నారు అధికారులు.. తొలివిడతలో 100 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోన్న ఏపీఎస్ఆర్టీసీ.. మలి విడతలో మరో 100 బస్సులు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.. అయితే, సిటీ సర్వీసులుగానే ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. వీటికోసం సింహపురి, గాజువాక డిపోలు ఎంపిక చేసింది ఏపీఎస్ ఆర్టీసీ.
ఆపరేషన్ అజయ్ షురూ.. నేడు ఇజ్రాయిల్ నుంచి భారతీయులకు తరలింపు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. రెండు దేశాల్లోనూ వందలాది మంది చనిపోతున్నారు. వేలమంది గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఇజ్రాయెల్ నుండి భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి డా. జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. పౌరులను తిరిగి తీసుకురావడానికి చార్టర్డ్ విమానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆపరేషన్ అజయ్ ద్వారా నేడు ఇజ్రాయిల్ నుంచి భారతీయులకు తరలింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం చేరుకున్న తరువాత వారి వారి ఇళ్లకు చేరుకునే విధంగా ప్లాన్ వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తరలించేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రత ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య వరుసగా ఐదు రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. గాజా నుంచి ఇజ్రాయెల్ పై హమాస్ ఫైటర్లు భారీ దాడులు చేస్తున్నారు. అదే సమయంలో, పాలస్తీనాపై ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటుంది. గాజాపై వైమానిక దాడితో పాటు, ఇజ్రాయెల్ సైన్యం కూడా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైనికులు గాజా సరిహద్దులోకి ప్రవేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చాలా రోజులు కొనసాగే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇజ్రాయెల్ నుండి తిరిగి రావాలనుకునే భారతీయులు మన దేశానికి తిరిగి రావడానికి వీలుగా ఆపరేషన్ అజయ్ ప్రారంభించబడుతుంది. ఇందుకోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జై శంకర్ మాట్లాడుతూ విదేశాలలో ఉన్న మన జాతీయుల భద్రత, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఆపరేషన్ అజాయిని ప్రకటించే ముందు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యుఎఇ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా సంక్షోభంపై ఇరుదేశాల నేతలు చర్చించారు. జైశంకర్ తన యుఎఇ కౌంటర్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం తర్వాత భారతదేశంతో చర్చలు జరిపిన మొదటి అరబ్ దేశం UAE కావడం గమనార్హం. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయ పౌరులు ఉన్నారు. చాలా మంది అక్కడ పనిచేస్తున్నారు.. అదే సమయంలో ఇజ్రాయెల్‌లో భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భారతదేశం ఇజ్రాయెల్ నుండి తన పౌరులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుందని మరియు చార్టర్డ్ విమానాల ద్వారా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తామని విదేశాంగ మంత్రి ప్రకటించారు.
విరాట్ కోహ్లీ సరికొత్త.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
టీమిండియా మాజీ కెప్టెన్, ఛేజింగ్ మాస్టర్ ‘విరాట్ కోహ్లీ’ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఐసీసీ క్రికెట్ టోర్నీల్లో (వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కింగ్ కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు 67 మ్యాచ్‌లు ఆడి.. 2311 పరుగులు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో సచిన్ టెండూల్కర్ 61 మ్యాచ్‌లు ఆడి.. 2278 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (2193) మూడో స్థానంలో స్థానాల్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 2011 ప్రపంచకప్‌లో మొదటిసారి ఆడాడు. 9 ఇన్నింగ్స్‌లలో 282 పరుగులు చేశాడు. మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ (100 నాటౌట్) చేశాడు.
ప్లీజ్.. ట్రోల్ చేయొద్దు! కోహ్లీ స్పెషల్ రిక్వెస్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య గతంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా నవీన్, కోహ్లీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడమే ఈ గొడవకు కారణమైంది. అది కాస్త పెను దుమారంగా మారింది. ఇందులో మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ కూడా తలదూర్చాడు. దాంతో గొడవ మరింత పెద్దదైంది. అసలు ఏమైందంటే.. విరాట్ కోహ్లీ పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్ అంపైర్లకు ఫిర్యాదు చేసాడు. తాను పిచ్‌పైకి వెళ్లలేదని, తన షూస్‌కు ఎలాంటి మట్టి లేదని కోహ్లీ కాలిని పైకెత్తాడు. ఈ క్రమంలోనే నవీన్‌కు కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో నవీన్‌కు విరాట్ కాలు చూపించాడని అందరూ పొరబడ్డారు. గౌతమ్ గంభీర్ కూడా ఇలానే పొరపడి.. కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో కోహ్లీ ఏదో సూచనలు చేయబోగా.. నవీన్ ఘాటుగా స్పందించాడు. దాంతో గొడవ పెద్దదైంది. ఈ గొడవను కోహ్లీ విడిచిపెట్టినా.. నవీన్ వదిలేయలేదు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లీ ఔటవ్వగా.. ‘స్వీట్ మ్యాంగోస్’ అని ట్వీట్ చేశాడు. అది కోహ్లీ అభిమానులకు నచ్చలేదు. అప్పటినుంచి నవీన్‌ను అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లీ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు.
ఫస్ట్ టైం రూ.16000కోట్లు దాటిన.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టిమెంట్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు సెప్టెంబర్ నెలలో 30 శాతం తగ్గాయి. సెప్టెంబర్ 2023లో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.14091.26 కోట్ల పెట్టుబడి నమోదైంది. ఇది ఆగస్టు 2023లో రూ.20,245.26 కోట్లు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇ ఇండియా (AMFI) ఈ డేటాను విడుదల చేసింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చారిత్రాత్మక రికార్డును సృష్టించింది. ఫస్ట్ టైం రూ.16,000 కోట్లను దాటింది. AMFI (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) ప్రకారం.. మార్చి 2021 నుండి వరుసగా 31 నెలల పాటు ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర ఇన్‌ఫ్లోలు పెరిగాయి. సెప్టెంబర్ నెలలో లార్జ్ క్యాప్ ఫండ్స్, ఈఎల్‌ఎస్‌ఎస్ మినహా చాలా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెరిగింది. సెక్టోరల్ లేదా థీమాటిక్ కేటగిరీకి చెందిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గరిష్టంగా రూ. 3146 కోట్ల పెట్టుబడి వచ్చింది. రెండవ స్థానంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. వీటిలో పెట్టుబడి నిరంతరం పెరిగింది. స్మాల్ క్యాప్ ఫండ్లలో రూ.2678.47 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే ఇది ఆగస్టులో వచ్చిన రూ.4264.82 కోట్ల కంటే తక్కువ. AMFI ప్రకారం, మల్టీక్యాప్ ఫండ్స్‌లో రూ. 2234.52 కోట్లు, మిడ్ క్యాప్ ఫండ్లలో రూ. 2000.88 కోట్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలో రూ. 1353.91 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
‘భగవంత్ కేసరి’ టీమ్‌తో బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్..?
నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. మరోవైపు వ్యాఖ్యాతగా చేశారు.. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ షో చేశారు.. ఈ షోలో సినీ, రాజకీయ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు.. బాలయ్యను ఎప్పుడు కోపంగా చూసే జనాలకు ఈ షోలో కొత్త బాలయ్య ను దాంతో షోకు మంచి రేటింగ్ వచ్చింది.. భారీ సక్సెస్ ను అందుకోవడంతో రెండు సీజన్ లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు మూడో సీజన్ కోసం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా ఇక మూడో సీజన్ మొదటి ఎపిసోడ్ గెస్ట్ లు గా భగవంత్ కేసరి మూవీ టీంతో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి బుధవారం షూటింగ్ జరిగింది. తాజాగా అధికారికంగా దసరా నుంచి ఈ సీజన్ ప్రారంభం కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మూడో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో భగవంత్ కేసరి టీమ్ మెంబర్స్‌లో హీరోయిన్స్, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చారు. ఈ ఎపిసోడ్ దసరా కానుకగా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తుంది..
ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ ధర ఎంత ఉంటుందో తెలుసా?
ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర విని అభిమానులతో పాటు, జనాలు కూడా షాక్ అవుతున్నారు.. అందులో తారక్ ధరించిన వాచ్ పైనే అందరి దృష్టి పడింది. ఆ వాచ్ స్విస్ లగ్జరీ బ్రాండ్ MB&F కు చెందినది. ఈ గడియారం అత్యద్భుతమైన ధర ట్యాగ్, దృష్టిని ఆకర్షించడం, ఆకర్షణీయంగా ఉండటం వల్ల స్పాట్‌లైట్‌గా ఉంది.. ఈ వాచ్ ధర అక్షరాల రూ.1.66 కోట్లు.. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ దేవరలో కనిపించనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అలాగే ఇందులో సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ను రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు ఇటీవలే డైరెక్టర్ కొరటాల శివ అనౌన్స్ చేశారు. ఇందులో తారక్ మరోసారి ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..
బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ.. దర్శకుడు ఎవరంటే..?
ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 2019 లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా మరియు మెహ్రీన్ పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు.ఎఫ్2 సినిమా మంచి కామెడీ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ఫన్‍టాస్టిక్ గా తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి సీక్వెల్‍గా 2022లో ఎఫ్3 మూవీ కూడా తెరకెక్కింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎఫ్2 సినిమాను బాలీవుడ్‍లో తెరకెక్కించాలని నిర్మాత దిల్‍రాజు నిర్ణయించినట్లు సమాచారం.బాలీవుడ్ లో ఈ సినిమాను ఓ సీనియర్ స్టార్ హీరో తో అలాగే ఓ యంగ్ హీరో తో కలిపి అక్కడ నేటివిటీ కి తగ్గట్టుగా సినిమాను కొద్దిగా మార్పులు చేసి బాలీవుడ్‍లో నిర్మించాలని దిల్‍రాజు డిసైడ్ అయినట్టు సమాచారం.. ఎఫ్2 సినిమా సబ్జెక్ట్ బాలీవుడ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుందని దిల్‍రాజు భావిస్తున్నారట. ఎఫ్2 హిందీ రీమేక్‍కు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వస్తుందని బాలీవుడ్ వర్గాల నుంచి టాక్ బయటికి వచ్చింది.