ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన.. నేడు వెలిగొండ ప్రాజెక్టు 2 టన్నెల్ జాతికి అంకితం
నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పశ్చిమ ప్రాంతవాసుల వరప్రధాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్స్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.. 2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును 20 ఏళ్ల తర్వాత ఆయన తనయుడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభంకాబోతోంది. శ్రీశైలం జలాశయానికి ఏటా 45 రోజులు పాటు వచ్చే వరద ప్రవాహం అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. 43.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు నల్లమల సాగర్ జలాశయం నిర్మించారు.. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకువచ్చేందుకు రెండు టన్నెళ్ల నిర్మాణం జరిగింది. కమ్యూనిస్ట్ నేత పూల సుబ్బయ్య పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తరలించేందుకు ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు.. ఇక, ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్‌లోకి వెళ్తే.. ఉదయం 9.30 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం వద్ద నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10.30 కి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువచెర్లోపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. 10.30 నుంచి 10.40 వరకు స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తారు.. 10.40 నుంచి 10.50 వరకు ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శిస్తారు. 10.50 నుంచి 10.55 వరకు ప్రాజెక్టు వ్యూ పాయింట్ సందర్శన ఉంటుంది. 10.55 నుంచి 11.10 వరకు ప్రాజెక్టు లబ్దిదారులు, నిర్వాసితులతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రెండవ టన్నెల్ దగ్గరకు చేరుకుని 11.25 వరకు పనులను పరిశీలించనున్న సీఎం జగన్.. తిరిగి అక్కడ ఉదయం 11.30 కి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 12.30కి తన నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్.. ఇక, సీఎం పర్యటన నేపథ్యంలో.. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలతో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాదీలు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. ఐదుగురు తెలంగాణవాసులు ప్రాణాలు విడిచారు.. నంద్యాలలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని అల్వాల్ కు చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతిచెందారు.. రాజకీయ నాయకుడు రవీందర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్‌గా గుర్తించారు నంద్యాల పోలీసులు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.. లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద నేషనల్ హైవే పై ఘటన జరిగింది.. తిరుపతి వెళ్లిన ఆ కుటుంబం.. తిరుపతి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. తిరుమల వెంకన్నను దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయిన సమయంలో.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృత్యువాతపడ్డారు.. మృతులు మంత్రి రవీందర్(50), ఆయన భార్య లక్ష్మీ(45), కుమారుడు సాయి కిరణ్(28), ఉదయ్ కిరణ్(30), కోడలు కావ్యశ్రీ(24)గా గుర్తించారు. కారు అతివేగంగా దూసుకెళ్తగా.. లారీ హైవేలో నిలిపి ఉండడం.. దానికి కనీసం ఇండికేటర్ కూడా వేయకపోవడం ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చివరి నిమిషంలో నంద్యాల పర్యటన రద్దు.. ఢిల్లీకి పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.. ఈ తరుణంలో చివరి నిమిషంలో నంద్యాల పర్యటన రద్దు చేసుకున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఢిల్లీ బాట పట్టారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ రోజు నంద్యాలలో పర్యటించాల్సి ఉంది పురంధేశ్వరి.. బీజేపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యతానికి బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ ఇంఛార్జ్‌గా ఉన్న భూమా కిషోర్ రెడ్డి.. పార్టీకి రాజీనామాలు చేసి కాకరేపారు.. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి నంద్యాలకు వెళ్దాం అనుకున్నారు.. కానీ, చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు.. ఇక, ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించేందుకు పురంధేశ్వరి హస్తినకు వెళ్లినట్టు బీజేపీ ఏపీ శ్రేణులు చెబుతున్నాయి.. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ.. పార్టీ బలాబలాలపై వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పార్టీ పరిస్థితి.. ఏయే స్థానాల్లో పోటీ చేయగలమనే అంశంపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్. ఇక, బీజేపీ విడుదల చేసే రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలూ ఉంటాయని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. వీటి కోసం పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్టు చెబుతున్నారు. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు వ్యవహారం కూడా తేలాల్సిఉన్న విషయం విదితమే. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
బీఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప గుడ్‌బై
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పుడు మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్‌ఎస్ నుంచి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం.. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయడంపై కోనేరు కోనప్ప ఆగ్రహంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కోనప్పపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేశారు. కేసీఆర్‌కు తాను ఎంతో గౌరవం ఇచ్చినా.. తనకు మాట మాత్రం చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై ఆయన అభ్యంతరం చెబుతున్నారు.నన్ను వ్యక్తిగతంగా దూషించిన ప్రవీణ్ కుమార్‌తో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటారా.. అని ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. మంగళవారం కోనేరు కోనప్ప తన కార్యకర్తలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. నేడు కోనేరు కోనప్ప తాను తీసుకునే నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది.
దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న ప్రధాని
కోల్‌కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. కోల్‌కతాలో భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో విభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు దేశం పురోగతిని ప్రదర్శించే మైలురాయి ప్రాజెక్ట్‌గా భావించవచ్చు. అండర్ వాటర్ సర్వీస్ కోల్‌కతా మెట్రో తూర్పు-పశ్చిమ కారిడార్‌లోని హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగంలో భాగం, ఇది హుగ్లీ నది కింద 16.6 కి.మీ ఉంది. హుగ్లీ నది కింద కోల్‌కతా ఈస్ట్, వెస్ట్ మెట్రో కారిడార్ నుంచి దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ అండర్ రివర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. హౌరా మెట్రో స్టేషన్‌లో దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా, 520 మీటర్ల పొడవు కలిగిన ఈ టన్నెల్ నుంచి 45 సెకన్లలో మెట్రో రైలు దూసుకుపోనుంది. కోల్‌కతాకు వెళ్లే ప్రయాణికులకు నది కింది నుంచి ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉండనుంది. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్‌ను కలుపుతుంది. తూర్పు-పశ్చిమ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లలో, 10.8 కిలోమీటర్లు భూగర్భ కారిడార్‌ను కలిగి ఉంది. ఇందులో హూగ్లీ నది దిగువన గ్రౌండ్‌బ్రేకింగ్ సొరంగం కూడా ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉన్నతాధికారులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.”నేడు (బుధవారం) ప్రారంభోత్సవం జరిగినప్పటికీ, ప్రయాణీకుల సేవలు తరువాత తేదీలో ప్రారంభమవుతాయి” అని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కౌశిక్ మిత్రా తెలిపారు.
మా ఇంటి బోరుబావి కూడా ఎండిపోయింది.. బెంగళూరు నీటి సమస్యపై డిప్యూటీ సీఎం..
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందన్నారు. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నగరంలో నీటి సరఫరా జరిగేలా చూస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. అతి తక్కువ వర్షపాతం కారణంగా బోర్లు ఎండిపోవడంతో బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. రెసిడెన్షియల్ సొసైటీల్లో నివాసం ఉంటున్న వారు రోజువారీ అవసరాలకు నీటిని వినియోగించుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సంక్షోభం మధ్య, చాలా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు నీటికి బదులుగా నివాసితుల నుంచి ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కొన్ని ట్యాంకర్లు రూ.600లకు నీరు ఇస్తున్నారని, మరికొందరు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. నీటి ధరలను ప్రామాణికం చేసేందుకు, అన్ని నీటి ట్యాంకర్లను అధికారులతో నమోదు చేసుకోవాలని మేము కోరామన్నారు. ట్యాంకర్లు ప్రయాణించే దూరాన్ని బట్టి నీటి ధరలను నిర్ణయిస్తారు.
నైజీరియాలో 47 మంది మహిళలు అదృశ్యం… జిహాదీలు కిడ్నాప్ చేశారని ఆరోపణ
ఈశాన్య నైజీరియాలో జిహాదీలు కనీసం 47 మంది మహిళలను అపహరించినట్లు మిలీషియా నేతలు మంగళవారం తెలిపారు. జిహాదీ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్న బోర్నో రాష్ట్రంలో శుక్రవారం జరిగిన దాడికి ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ (ISWAP) కారణమని ఆయన ఆరోపించారు. 2009 నుండి ఈ దాడుల్లో 40,000 మందికి పైగా మరణించారు. రెండు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. కామెరూన్ సరిహద్దుకు సమీపంలోని న్గాలాలోని స్థానభ్రంశం శిబిరాల నుండి మహిళలు కలపను సేకరిస్తున్నప్పుడు ISWAP తిరుగుబాటుదారులు చుట్టుముట్టారని యాంటీ-జిహాదీ మిలీషియా నాయకుడు షెహు మాడా తెలిపారు. అయితే, మహిళలు తప్పించుకుని తిరిగి వచ్చారు. అయితే కలప సేకరించేందుకు వెళ్లిన 47 మంది మహిళల జాడ తెలియలేదని మాడా తెలిపారు. మరో జిహాదీ వ్యతిరేక మిలీషియా నాయకుడు ఉస్మాన్ హమ్జా ఈ సంఘటనను ధృవీకరించారు. 47 మంది మహిళల ఆచూకీ తెలియడం లేదు. బోర్నో రాష్ట్ర పోలీసు ప్రతినిధి నహుమ్ దాసో కెన్నెత్ మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు దాడి జరిగిందని, అయితే అపహరణకు గురైన వ్యక్తుల సంఖ్య లేదా ఇంకా నిర్బంధంలో ఉన్న వ్యక్తుల సంఖ్యపై పోలీసులు ఖచ్చితమైన సంఖ్యను ఇవ్వలేకపోయారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు నివేదికలు అందాయని న్గాలా స్థానిక ప్రభుత్వ సమాచార విభాగానికి చెందిన అధికారి అలీ బుకర్ తెలిపారు. నైజీరియా అంతటా కిడ్నాప్ అనేది ఒక ప్రధాన సమస్య. ఇది కూడా క్రిమినల్ మిలీషియాతో పోరాడుతోంది. వాయువ్య ప్రాంతంలో అంతర్-మత హింసను రేకెత్తిస్తోంది. గత నెలలో కిడ్నాపర్లు వాయువ్య కట్సినా రాష్ట్రంలో పెళ్లికి తిరిగి వస్తున్న కనీసం 35 మంది మహిళలను పట్టుకున్నారు. నైజీరియాలో అభద్రతను అంతం చేస్తానని వాగ్దానం చేస్తూ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు గత సంవత్సరం అధికారంలోకి వచ్చారు. అయితే విమర్శకులు హింస నియంత్రణలో లేదని చెప్పారు.
బజాజ్ ఆటో షేర్ హోల్డర్లకు గుడ్ న్యూస్.. 8రోజుల పాటు బంపర్ ఆఫర్
ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తన వాటాదారులకు గొప్ప అవకాశాన్ని అందించింది. దేశంలోని అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన బజాజ్ ఆటో, షేర్లను తిరిగి కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ షేర్ బైబ్యాక్ ఆఫర్ ఈ రోజు అనగా మార్చి 6 నుండి తెరవబడుతుంది. బజాజ్ ఆటో మార్చి 4 సోమవారం నాడు షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ షేర్ బైబ్యాక్ ఆఫర్ నేటి నుండి వచ్చే 8 రోజుల పాటు తెరవబడుతుంది. అంటే మార్చి 6 నుండి మార్చి 13 న వ్యాపారం ముగిసే వరకు కంపెనీ తన వాటాదారుల నుండి బైబ్యాక్ చేయబోతోంది. కంపెనీ ఈ ఆఫర్‌లో దాని వాటాదారులు భారీ ఆదాయాన్ని పొందబోతున్నారు. ఈ ఆఫర్‌కు ఫిబ్రవరి 29ని రికార్డ్ డేట్‌గా కంపెనీ ఫిక్స్ చేసింది. అంటే, ఫిబ్రవరి 29 వరకు బజాజ్ ఆటో షేర్లను కలిగి ఉన్న వాటాదారులు మాత్రమే ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందగలరు. బజాజ్ ఆటో ఈ షేర్ బైబ్యాక్ ఆఫర్ పరిమాణం చాలా పెద్దదిగా ఉండబోతోంది. ఈ ఆఫర్‌లో రూ.10 ముఖ విలువ కలిగిన 40 లక్షల షేర్లను కొనుగోలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది కంపెనీకి చెందిన 1.41 శాతం వాటాకు సమానం. ఒక్కో షేరును రూ.10,000గా తిరిగి కొనుగోలు చేసేందుకు కంపెనీ ధరను నిర్ణయించింది. ప్రస్తుతం బజాజ్ ఆటో ఒక షేరు ధర రూ.8,350. సోమవారం ఆఫర్ ప్రకటించిన తర్వాత, బజాజ్ ఆటో షేర్లు పెరిగాయి. నిన్న మంగళవారం ఈ షేరు 1.74 శాతం లాభంతో ముగిసింది. సోమవారం ఒక్క షేరు ధర రూ.8,042.75గా ఉంది. అంటే, ఈ ఆఫర్ కింద లబ్ధి పొందే షేర్ హోల్డర్లు ఏకంగా 24 శాతం లాభం పొందుతారు.
వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సీఎన్జీ ధర
దేశంలో లోక్‌సభ ఎన్నికల తేదీలను ఈ నెలలో ఎప్పుడైనా ఎన్నికల సంఘం ప్రకటించవచ్చు. ఇంతలో సాధారణ ప్రజలకు ఒక రిలీఫ్ న్యూస్ వచ్చింది. CNG ధర కిలోకు 2.5 రూపాయల వరకు తగ్గింది. ద్రవ్యోల్బణం యుగంలో CNG ధరలో ఈ తగ్గింపు మొత్తం నెలలో ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ప్రభుత్వ సంస్థ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజిఎల్) సిఎన్‌జి ధరను కిలోకు రూ.2.5 తగ్గించింది. దీని తర్వాత సీఎన్‌జీ ధర కిలో రూ.73.50కి తగ్గింది. MGL ప్రధానంగా దేశ ఆర్థిక రాజధానిలో CNGని సరఫరా చేస్తుంది. CNG ధరల తగ్గింపు గురించి MGL మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే గ్యాస్ ఉత్పత్తి వ్యయం తగ్గిందని, దాని కారణంగా సిఎన్‌జి ధర తగ్గిందని చెప్పారు. కొత్త ధరలు మార్చి 5 అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. ఉత్పత్తి వ్యయం తగ్గడం వల్ల రానున్న రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరలు తగ్గుతాయన్న అంచనాలు పెరిగాయి. ఈలోగా ఎన్నికలను కూడా ప్రకటించాల్సి ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సీఎన్‌జీ ధరలు తగ్గుముఖం పట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో (NCR) CNG ధరలు స్థిరంగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.76.59గా ఉంది. ఇది కాకుండా నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో ఈ ధర కిలో రూ.81.20గా ఉంది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ఈ ప్రాంతాలన్నింటికీ CNG, PNGలను సరఫరా చేస్తుంది.
రిటైర్మెంట్ ప్రకటించిన షాబాజ్ నదీమ్.. టీమిండియాలో చోటు దక్కదంటూ..!
టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియాకు ఆడే దారులు మూసుకుపోవడంతోనే తాను ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు నదీమ్ తెలిపాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. 34 ఏళ్ల నదీమ్ 2019-2021 మధ్యలో భారత్ తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ‘భారత జట్టులో ఇక నాకు చోటు దక్కదని అర్థమైంది. ఇప్పుడు నేను సెలక్టర్ల ప్రణాళికల్లో లేను. ఎంతో మంది యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. భారత్ తరఫున ఆడే అవకాశముంటే కచ్చితంగా కొనసాగేవాడిని. కానీ సమీప భవిష్యత్తులో ఆ అవకాశం లేదు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగుల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నా’ అని షాబాజ్ నదీమ్ పేర్కొన్నాడు.
రెండు ఓటీటీల్లో రాబోతున్న సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. అందులో వైవా హర్ష కూడా ఒకరు.. వచ్చిన అవకాశం ను వాడుకుంటూ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్.టీ. టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రమిది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇందులో దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా పాజిటివ్ టాక్ దూసుకుపోయింది.. అంతేకాదు కలెక్షన్స్ కూడా అలానే వచ్చాయి.. సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచానికి సంబంధం లేని ఓ ఊరికి ఇంగ్లీష్ మాస్టర్ గా వెళ్లి సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు, నేర్చుకున్న జీవిత పాఠాలతో ఈ సినిమా సాగుతుంది. హీరోగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కొట్టాడు వైవా హర్ష..ఈ సినిమా టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి.. ఓ చిన్న సినిమా, కమెడియన్ హీరోగా మారి చేసిన సినిమా మొదటి రోజే ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే విశేషమే. మొత్తానికి సుందరం మాస్టర్ సక్సెస్ కొట్టాడు. ఇక ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ రావడానికి రెడీ అవుతుంది..ఏకంగా రెండు ఓటీటీల్లోనూ వైవా హర్ష అందుబాటులోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహాతో పాటు ఈటీవీ విన్ లో ఈ లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ కానుంది.. అయితే ఈనెల 21 నుంచి లేదా 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే అధికారక ప్రకటన మాత్రం రాలేదు.. త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నట్లు సమాచారం..