పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగానికి ప్రారంభమైన కౌంట్ డౌన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 6.30 గంటలకు PSLV C-56 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.. ఈరోజు ఉదయం 5 గంటల 1 నిముషానికి PSLV C-56 కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించింది ఇస్రో.. 25.30 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత రేపు ఉదయం అంటే ఆదివారం రోజు ఉదయం 6.30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది PSLV C-56 రాకెట్.. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ దేశానికీ చెందిన DS-SAR అనే ఉపగ్రహంతో పాటు అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనుంది పీఎస్‌ఎల్వీ- సీ56 రాకెట్. ఇది పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది..
నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ.. తరలివస్తున్న భక్తులు
మతసామరస్యానికి ప్రతీకగా నిలచే రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.. నెల్లూరులోని స్వర్ణాల చెరువు, బారాషహీద్ దర్గా వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండగా.. ప్రజాప్రతినిధులు… అధికారులు కూడా పనాల్గొననున్నారు.. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. పండుగలో భాగంగా నేడు సందన్ మాలి (సమాధుల శుభ్రం), రేపు గంధ మహోత్సవం, 31వ తేదీన రొట్టెల పండుగ, ఆగస్టు 1వ తేదీన తహలిల్ ఫాతేహా (గంధం పంపిణీ), 2వ తేదీన పండుగ ముగింపు ఉంటాయి. కోరిన కోర్కెలు తీర్చే పండుగగా రొట్టెల పండుగ ప్రసిద్ధి.. మొహరం పర్వదినాల్లో హిందూ, ముస్లింలు అని తేడా లేకుండా నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే పండుగనే రొట్టెల పండుగగా పిలుస్తారు.. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుండగా.. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే, ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం.. ఆ తర్వతే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెబుతుంటారు.. 1930లో మొదలైన ఈ రొట్టెల పండుగ క్రమం తప్పకుండా జరుగుతూ వస్తుందని చెబుతుంటారు..
సెమీకండక్టర్ పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సాయం: ప్రధాని మోడీ
సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు కేంద్రం 50 శాతం ఆర్థిక సాయం చేయనుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. స్థానికంగా సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తోందని అన్నారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాందీనగర్‌లో ‘సెమికాన్ ఇండియా–2023’ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచంలో వేర్వేరు కాలాల్లో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే ప్రతి పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారతీయుల ఆకాంక్షలే ముందుకు నడిపిస్తున్నాయని తాను నమ్ముతున్నానని ప్రధాని తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. ఇకపై దేశంలో సెమికండర్టక్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ఏకంగా 50 శాతం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఖనిజాల తవ్వకాలు ప్రైవేటుకు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం
ఖనిజాల తవ్వకాలను ప్రైవేటుకు అప్పగించనున్నారు. అరుదైన, ఖరీదైన పరమాణు ఖనిజాల (అటామిక్ మినరల్స్) అన్వేషణ, తవ్వకాల్లోకి సైతం ప్రైవేటు రంగం ప్రవేశించనుంది. దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ యాజమాన్య సంస్థలు మాత్రమే 12 పరమాణు ఖనిజాల మైనింగ్‌ను చేపట్టాడానికి వీలుండేది. ఇకపై వీటిలో ఆరు ఖనిజాల వెలికితీతను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన ‘గనులు, ఖనిజాల(అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు-2023ను శుక్రవారం లోక్‌సభ ఆమోదించింది. మణిపూర్‌లో శాంతిభద్రతల వైఫల్యంపై విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీకి వినియోగించే లిథియంతో పాటు బెరీలియం, నియోబియం, టైటానియం, టాంటలం, జిర్కోనియం ఖనిజాల వెలికితీతను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు ఈ బిల్లు వీలుకల్పిస్తుంది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, విద్యుత్ బ్యాటరీల తయారీ, అంతరిక్ష రంగ పరిశ్రమ అవసరాలను ఈ ఖనిజాలు తీరుస్తాయని బిల్లు లక్ష్యాల్లో ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ సంస్థలకు రిజర్వు చేసిన జాబితా నుంచి ఈ ఆరు ఖనిజాల తవ్వకాలను తొలగించి ప్రైవేటు రంగానికి అప్పగించడం ద్వారా దేశంలో వీటి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం బిల్లులో పేర్కొంది. భూమి పొరల్లో చాలా లోతుల్లో ఉండే బంగారం, వెండి, రాగి, జింక్, లెడ్, నికెల్, కొబాల్ట్, ప్లాటినం, వజ్రాలు తరహా ఖనిజాల వెలికితీత చాలా కష్టమైన, ఖరీదైన వ్యవహారంగా ఉంటోందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఖనిజాల కోసం కూడా విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని.. వీటి అన్వేషణ, వెలికితీయడంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాల్సి ఉందని అభిప్రాయపడింది. ఇందుకు అవసరమైన అనుమతుల మంజూరును కూడా ప్రభుత్వం ఈ బిల్లులో ప్రతిపాదించింది.
ఇన్సురెన్స్ కంపెనీలో ఉద్యోగాలు..450 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
ప్రభుత్వం సంస్థలో ఉద్యోగం చెయ్యాలని భావించే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం 450 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.ఆన్ లైన్ దరఖాస్తులు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ newindia.co.in సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 01 నుంచి ప్రారభం కానుంది. ఇక చివరి తేదీ 19 వరకు ఉందని తెలుస్తుంది.. అభ్యర్థులు యొక్క విద్యార్హత పోస్టును బట్టి మారుతుంది. బీటెక్, డిగ్రీ చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు పీజీ కూడా అర్హతగా పేర్కొన్నారు. ఇక వయస్సు 21 నుంచి 30 ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.850 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది..
క్షీణించిన విదేశీ మారక నిల్వలు.. 1.9 బిలియన్ డాలర్లు తగ్గి 607.03 బిలియన్ డాలర్లకు చేరిక
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూలై 21తో ముగిసిన వారంలో 1.9 బిలియన్ డాలర్లు తగ్గుముఖం పట్టాయని సెంట్రల్ బ్యాంక్ గణాంకాలను విడుదల చేసింది. ఈ క్షీణత తర్వాత దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 607.03 డాలర్లకు తగ్గాయి. అంతకుముందు జూలై 14న విదేశీ మారకద్రవ్య నిల్వలు 12.74 బిలియన్ డాలర్లు పెరిగాయి. నాలుగు నెలల్లో ఇదే అతిపెద్ద జంప్. ఆర్‌బిఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సిఎ) 2.41 బిలియన్ డాలర్లు తగ్గి 537.75 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే ఎఫ్‌సిఎలో విదేశీ మారక నిల్వల్లో యూరో, పౌండ్, యెన్ వంటి కరెన్సీలు ప్రభావం చూపాయి. అదేవిధంగా బంగారం నిల్వలు 417 మిలియన్ డాలర్లు పెరిగి 45.61 బిలియన్ డాలర్లకు చేరుకోగా SDR 11 మిలియన్ డాలర్లు తగ్గి 18.47 బిలియన్ డాలర్లకు చేరుకుంది. IMFలో రిజర్వ్ కరెన్సీ 21 మిలియన్ డాలర్లు పెరిగి 5.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. విశేషమేమిటంటే, అక్టోబర్ 2021లో దేశం విదేశీ మారకం US 645 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయిలో ఉంది. రూపాయి పతనాన్ని నిరోధించడానికి డాలర్‌ను విక్రయించినందున, ప్రపంచ అభివృద్ధి కారణంగా ఒత్తిళ్ల మధ్య రూపాయిని రక్షించడానికి సెంట్రల్ బ్యాంక్ నిధులు సేకరించడం వల్ల నిల్వలు తగ్గుతున్నాయి.
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
బులియన్ మార్కెట్‌లో ఇటీవల రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజలు పెరిగిన పసిడి ధరలు నేడు దిగొచ్చాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 350.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 380 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,260గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా కొనసాగుతోంది.
యూసఫ్ పఠాన్ విధ్వంసం.. 14 బంతుల్లోనే 61 రన్స్! చుక్కలు చూసిన పాక్ బ్యాటర్
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు పదుల వయసులోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఇంకా ఉందని చాటిచెప్పాడు. సిక్స్‌ల వర్షం కురిపిస్తూ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. యూఏఈ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న టీ10 లీగ్‌లో పఠాన్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం జోబర్గ్ బఫ్పాలోస్, డర్బన్ ఖలాండర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (39), ఆసిఫ్ అలీ (32 నాటౌట్) టాప్ స్కోరర్లు. ఇన్నింగ్స్ చివరలో వెల్చ్ నిక్ 9 బంతుల్లో 24 రన్స్ చేశాడు. జోబర్గ్ బౌలర్లు రవి బొపారా, సీజే డాల తలో రెండు వికెట్స్ పడగట్టారు. 141 పరుగుల లక్ష్య చేధనలో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టు 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో జోబర్గ్ టీమ్‌ను యూసఫ్ పఠాన్ ఆదుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్ (14 నాటౌట్) అండతో జట్టుకు ఊచించని విజయాన్ని అందించాడు. జోబర్గ్ విజయానికి చివరి 18 బంతుల్లో 64 పరుగులు అవసరం అయ్యాయి. దాంతో డర్బన్ ఖలాండర్స్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే యూసఫ్ పఠాన్ సిక్స్‌ల వర్షం కురిపిస్తూ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు.
దేవర అప్డేట్..తెగిన తలలతో పాటు సంద్రం సమరానికి ఆరంభం..
పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాల పై ఫోకస్ పెట్టారు.. ఒక సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నారాని సమాచారం.. ప్రస్తుతం యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ పెద్దగా బ్రేకులు ఏం లేకుండా సాగుతుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు. తరువాత వాటిని విఎఫ్ఎక్స్ కోసం పంపిస్తున్నారు.ఇక ఈవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇది కూడా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూలే. ఈగ,బాహుబలి,ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ సోలమాన్, దేవరకు కూడా ఫైట్స్ కంపోజ్ చేయనున్నాడు. ప్రస్తుతం షెడ్యూల్ లో సోలమాన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇక ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ తో చిత్ర బృందం చాలా హ్యాపీ గా ఉందట..ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.. కొరటాల శివ డైరెక్టన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.యువ సుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్ 5న తెలుగుతోపాటు హిందీ,తమిళ ,కన్నడ,మళయాళ భాషల్లో విడుదలకానుంది.. ఈ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య ఈ ఏడాది స్టార్ట్ అయ్యింది.. అయితే స్టార్ట్ అయ్యే ముందు ఎంత గ్యాప్ వచ్చిందో ఇప్పుడు అంత జెట్ స్పీడ్ తో మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. అసలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఏడో షెడ్యూల్ ను షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ నెల చివరి నుంచి షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. ఇక ముందుగా ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవరని థియేటర్స్ లో తీసుకు రావాలని భావిస్తున్నారు..