ఫైబర్‌నెట్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. సీజేఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించిన విషయం విదితమే కాగా.. నేడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. దీంతో.. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు.. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు.. ఈ రోజు చంద్రబాబు పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలాఎం త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే, 17ఏపై స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయం విదితమే.
నేడు అయోధ్యకు మండపేట ‘కల్యాణ’ కొబ్బరి బోండాలు
ఇప్పుడు ఎక్కడ విన్నా అయోధ్యపై చర్చ సాగుతోంది.. అయోధ్యలో శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి జరుగుతున్నాయి. కోట్లాదిమంది భక్తులు ఆ కోదండ రాముడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22వ తేదీన రాములవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఆయోధ్యకు ఏది వెళ్లినా భక్తులు ఆసక్తిగా గమనిస్తున్నారు.. ఇప్పుడు మన కోనసీమ కొబ్బరి బోండాలు కూడా అయోధ్యకు వెళ్తున్నాయి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి ఈ నెల 22వ తేదీన జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కొబ్బరి బోండాలను తరలించారు. అయోధ్యలోని సీతమ్మ ఆశ్రమం కోరిక మేరకు శంకు చక్ర నామ కొబ్బరి బోండాలను భక్తిశ్రద్ధలతో తయారుచేసి.. రాముడికి కానుకగా పంపారు మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు. అయోధ్య రాములవారి విగ్రహప్రతిష్టాపన కార్యక్రమానికి శంకు చక్ర నామ కొబ్బరి బోండాలు తయారుచేసి పంపడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నరామని వారు ఆనందం వ్యక్తం చేయగా.. ఈ రోజు ఆ కొబ్బరి బోండాలు అయోధ్య చేరుకోనున్నాయి.. అక్కడ ఉత్సవ నిర్వహణ కమిటీకి ఈ బోండాలు సమర్పించనున్నారు మండపేట వాసి.. అయోధ్య రామమందిరంలో శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలో మన మండపేటకు చెందిన కళ్యాణ కొబ్బరి బోండాలను వినియోగించనున్నారు. మొత్తంగా భారత్‌తో పాటు ప్రపంచంలోని ప్రతీ హిందువు ఆసక్తిగా ఎదరుచూస్తోన్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన కోనసీమ కొబ్బరి బోండాలు కూడా భాగస్వామ్యం కానున్నాయి.
నాల్గో జాబితాపై వైసీపీ కసరత్తు.. సిట్టింగ్‌లలో టెన్షన్..! రేసులో ఉంది వీరే..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు ఆసక్తికరంగా మారాయి.. అయితే, ఈ పరిణామాలు సిట్టింగ్‌లను టెన్షన్ పెడుతున్నాయి.. ఇప్పటికే మూడు జాబితాలో విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాల్గో లిస్ట్‌పై కసరత్తుకు మూడు రోజులు బ్రేక్ ఇచ్చింది. ఇక, ఇవాళ వైసీపీ నాల్గవ జాబితాపై కసరత్తు కొనసాగనుంది.. ఇప్పటికే 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన వైసీపీ అధిష్టానం.. మరో ఐదారు నియోజకవర్గాల్లో మార్పులపై స్పష్టతకు వచ్చింది.. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉంటే.. ఇప్పటికే 9 స్థానాల్లో మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం.. మరో మూడు స్థానాల్లో క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.. బాపట్లలో నందిగం సురేష్, రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కడప నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఈ ముగ్గురిని ఈ సారి కూడా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మరో 13 లోక్‌సభ స్థానాలకు సంబంధించి మార్పులు జరిగే అవకాశం ఉంది.. అందులో విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, నంద్యాల, నెల్లూరు లోక్‌సభ స్థానాల్లో మార్పులు జరగనున్నాయి.. ఇప్పటికే ఈ స్థానాల్లో కొందరు నేతల పేర్లు పరిశీలిస్తున్నారు..
వైసీపీని వీడేది లేదు.. మరోసారి స్పష్టం చేసిన ఎంపీ
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీలు మత వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. అయితే, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు సిట్టింగ్‌లను టెన్షన్ పెడుతున్నాయి.. ఈ సారి టికెట్ రాదని తేలిపోవడంతో.. కొందరు నేతలు పక్క పార్టీల వైపు చేస్తున్నారు.. మరికొందరు ఏది ఏమైనా పార్టీని వీడేది లేదు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంటే మా ప్రయాణం అని ప్రకటిస్తున్నారు.. ఇక, నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై కూడా ఇలాంటి ప్రచారమే సాగుతూ వస్తోంది.. ఎంపీగా ఉన్న ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టంలేదని.. ఆయన టీడీపీతో టచ్‌లోకి వెళ్లాడని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.. దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆదాల.. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేగానీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.. తాను టీడీపీ పెద్దలను కలిసినట్లు, ఆ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు.. తనకు వైసీపీలో ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆయన.. వైఎస్ జగన్.. తనకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించాను.. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించి పార్టీ తనకు తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైసీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు ఏంటి? అని నిలదీశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక.. కొందరు కిరాయి మూకలను నియమించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉండటంతో.. ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారే ప్రసక్తే లేదు.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.
నిలకడగా తమ్మినేని ఆరోగ్యం… నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభరం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయన్నారు. లంగ్స్ లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ICU లో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్ కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఇవ్వాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం అంటుంది తెలిపారు. ఖమ్మంలో తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, వెంటిలేటర్ సపోర్టుతో ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు మరియు పల్మోనాలజిస్టులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స సాగుతోంది. తమ్మినేని పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చికిత్స కొనసాగుతోందని తెలిపారు.
హైదరాబాద్ లో విద్యుత్ కోతలు.. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు..!
హైదరాబాద్ వాసులకు విద్యుత్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నగరంలో నేటి నుంచి కరెంట్ కోతలు అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. వార్షిక నిర్వహణ, మరమ్మత్తు పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నట్లు TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ఈ కరెంటు కోతల వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. నేటి (17) నుంచి ఫిబ్రవరి 10 వరకు కరెంటు కోతలు ఉంటాయని తెలిపారు. వేసవి/రబీ సీజన్‌లో అధిక విద్యుత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ లైన్లను పరిశీలించి అవసరమైతే కొత్తవి వేస్తామని ముషారఫ్ తెలిపారు. కరెంటు కోతలు ఉంటాయని, రోజూ కాదని, ఒక్కో ఫీడర్‌కు ఒక రోజు మాత్రమేనని తెలిపారు.
త్వరగా బంగ్లా ఖాళీ చేయండి.. టీఎంసీ నేత మహువా మొయిత్రాకు అల్టిమేటం
టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇటీవల పార్లమెంట్ నుంచి బహిష్కరించబడిన సంగతి తెలిసిందే. ఇప్పడు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనందుకు అల్టిమేటం అందుకున్నారు. ఈ మేరకు ఆమె మరో నోటీసు అందుకుంది. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయకుంటే తనను బలవంతంగా బంగ్లాను ఖాళీ చేయిస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటు నుండి సస్పెన్షన్ తర్వాత, మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయమని అనేక నోటీసులు అందుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆమె ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయడం లేదు. నోటీసు ప్రకారం, ఆమె పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన తర్వాత, ఈ బంగ్లాకు అర్హురాలు కాదు. అందువల్ల ఆమె 9B టెలిగ్రాఫ్ లేన్‌లోని టైప్ 5 బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం బంగ్లాను ఖాళీ చేసేందుకు నెల రోజుల గడువు ఇచ్చారు. అయితే ఈలోగా కోర్టును కూడా ఆశ్రయించినా అక్కడి నుంచి కూడా ఉపశమనం లభించలేదు.
ప్రధాని మోడీ ఊరిలో లభించిన 2800 ఏళ్ల నాటి నివాస అవశేషాలు
గుజరాత్‌లోని ప్రధాని నరేంద్ర మోడీ గ్రామంలో 2800ఏళ్ల క్రితం అంటే దాదాపు 800 ఏడీ నాటి నివాసానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఖరగ్‌పూర్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU), డెక్కన్ కాలేజీ పరిశోధకులు 800 BC నాటి (క్రిస్టియన్లకు పూర్వం) పురాతన ప్రదేశాలను కనుగొన్నారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు కనుగొనబడ్డాయి. గుజరాత్‌లోని వాద్‌నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పూర్వీకుల గ్రామం. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన డాక్టర్ అనింద్యా సర్కార్ మాట్లాడుతూ 2016 నుంచి తవ్వకం పనులు కొనసాగుతున్నాయని, బృందం 20 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపిందని చెప్పారు. మానవ నివాసం 800 BC నాటిదని అధికారులు తెలిపారు. ఏడు సాంస్కృతిక కాలాల ఉనికిని ఇందులో ఆవిష్కరించారు. లోతైన త్రవ్వకాల్లో మౌయ, ఇండో-గ్రీక్, షక-క్షత్రప, హిందూ-సోలంకి, సుల్తానేట్-మొఘల్ (ఇస్లామిక్) నుండి గైక్వాడ్-బ్రిటీష్ వలస పాలన వరకు ఏడు సాంస్కృతిక కాలాలు ఉన్నట్లు వెల్లడైంది,” అని ASI పురావస్తు శాస్త్రవేత్త అభిజీత్ అంబేకర్ తెలిపారు. మా త్రవ్వకాల్లో పురాతన బౌద్ధ విహారం కూడా కనుగొనబడింది. మేము ప్రత్యేకమైన పురావస్తు కళాఖండాలు, కుండలు, రాగి, బంగారం, వెండి, ఇనుప వస్తువులు, గాజులను కనుగొన్నాము. వాడ్‌నగర్‌లో ఇండో-గ్రీక్ పాలనలో గ్రీకు రాజు అపోలోడాటస్ నాణేల అచ్చులను కూడా మేము కనుగొన్నాము.” అని అంబేకర్ అన్నారు.
ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పొగమంచు కారణంగా 53 విమానాలు రద్దు..
దేశంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి.. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు.. ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా అక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం బయటికి వచ్చేవాళ్లే లేరు.. కొన్ని పరిస్థితుల కారణంగా బయటకు వచ్చిన జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఎముకలు కొరికే చలికి తాళలేక పలు ప్రాంతాల్లో జనం చలిమంటలు వేసుకుంటున్నారు. ఇళ్లు కూడా లేని నిస్సహాయులకు ఢిల్లీలోని నైట్ షెల్టర్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి.. ఈ చలి కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్ముతోంది. పొగ మంచు దట్టంగా ఉండటం వల్ల రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.. ఉదయం పూట వెళ్ళాల్సిన కొన్ని రైళ్లు పూర్తిగా రద్దయినట్లు తెలుస్తుంది.. దట్టమైన పొగమంచు కారణంగా దాదాపు 120 విమానాలు (దేశీయ మరియు అంతర్జాతీయ) రాకపోకలు మరియు నిష్క్రమణలను ప్రభావితం చేసే విమాన కార్యకలాపాలలో ఆలస్యం అవుతుందని అధికారులు ప్రకటించారు.. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తుంది..
వీళ్లు మన సినిమా సత్తా తెలిసేలా చేసారు…
యాక్షన్, డ్రామా, హారర్, కామెడీ, లవ్… ఇలా ఏ జానర్ లో అయినా సినిమాలు చెయ్యొచ్చు కానీ సూపర్ హీరో జానర్ లో సినిమాలు చెయ్యాలి అంటే మాత్రం అంత ఈజీ కాదు. ఇలాంటి సినిమాలు చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, ఏళ్ల తరబడి సమయం కేటాయించాలి… ఇన్ని చేసిన తర్వాత కూడా సరైన ఔట్పుట్ వస్తుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్ సూపర్ హీరో సినిమాల వైపు అడుగులు వేయరు. హాలీవుడ్ లో బడ్జట్స్ ఉంటాయి, టైమ్ ఉంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు అందుకే అక్కడి నుంచి సూపర్ హీరో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇండియన్ మూవీ లవర్స్ కూడా హాలీవుడ్ సూపర్ హీరోస్ ని బాగా ఆదరిస్తూ ఉంటారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఇండియాలో మన స్టార్ హీరోల సినిమాల రేంజులో కలెక్షన్స్ ని రాబట్టింది. ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మాన్, కెప్టెన్ అమెరికా… లాంటి సూపర్ హీరోలకి ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఇండియా నుంచి కూడా సూపర్ హీరోలు వస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఇద్దరు సూపర్ హీరోలు వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ కి ఇంప్రెస్ చేసారు. గతంలో మలయాళంలో రిలీజైన మిన్నల్ మురళి, ఇటీవలే తెలుగు నుంచి వచ్చిన హనుమాన్… ఈ రెండు సినిమాలు లో బడ్జట్ లో సాలిడ్ కంటెంట్ తో తెరకెక్కినవే. ఓవర్సీస్ ఆడియన్స్ ని కూడా ఈ ఇద్దరు సూపర్ హీరోలు ఆకట్టుకున్నారు. ఫ్యూచర్ లో ఈ సూపర్ హీరోలు ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకోవడం కోసం సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు మాత్రమే కాదు శివ కార్తికేయన్ నటించిన “మహావీరుడు”, రజినీకాంత్ “రోబో”, షారుఖ్ ఖాన్ నటించిన “రా.వన్” సినిమాలు సూపర్ హీరోల మోడ్ లోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాయి. ఈ చిత్రాలు ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి తెలిసేలా చేసాయి.
అనౌన్స్మెంట్ లుక్ లోకి వచ్చేసాడు… పార్ట్ 2 మొదలుపెడుతున్నారా?
ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు… ది రాజాసాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్, కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్, సలార్ సక్సస్ సెలబ్రేషన్స్… ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వచ్చి రెబల్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అయితే సలార్ సక్సస్ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ కనిపించిన విధానం ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ప్రభాస్ స్టైలిష్ గా కనిపించి సక్సస్ పార్టీకి కొత్త వైబ్ తెచ్చాడు. ఈ పార్టీ నుంచి వచ్చిన ప్రభాస్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కొత్త ఆలోచనలు మొదలయ్యేలా చేసాయి. ప్రభాస్ 2023 డిసెంబర్ నెలలో ఖాన్సార్ ని మాత్రమే కాదు పాన్ ఇండియాని ఎరుపెక్కించాడు. సలార్ సినిమాతో దాదాపు 750 కోట్ల వరకూ కలెక్షన్స్ ని రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. దీంతో సలార్ సినిమా నుంచి పార్ట్ 2 ఎప్పుడు బయటకి వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎండ్ లోనే పార్ట్ 2కి లీడ్ ఇస్తూ ‘శౌర్యంగ పర్వం’ సినిమాకి లీడ్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.