నేటితో ముగియనున్న కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ.. విజయవాడ ఆంధ్ర భవన్‌లో దరఖాస్తులను స్వీకరిచింది. నేటితో కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన ముగియనుంది. బుధవారం అర్ధరాత్రి వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే అభ్యర్ధులు వేచి ఉన్నారు. ఈరోజు సాయంత్రం తుది జాబితా ఏఐసీసీకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పంపనున్నారు. అభ్యర్థులపై ఏపీ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇక తిరుపతిలో సభ నాటికి అభ్యర్థులను ఏఐసీసీ నిర్ణయించనుంది. కమ్యూనిష్టులతో పొత్తులో భాగంగా గన్నవరం లాంటి కీలక స్ధానాలు ఆ పార్టీలు (కమ్యూనిష్టులు) కోరినట్టు సమాచారం తెలుస్తోంది.
కర్నూలు ఎంపీ వైసీపీ అభ్యర్థిపై నేడు తుది నిర్ణయం:
కర్నూలు ఎంపీ అభ్యర్థిపై ఈరోజు వైసీపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. కర్నూలు మేయర్ బీవై రామయ్యను ఇప్పటికే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకు వైసీపీ అధిష్టానం పిలిపించింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పేరును ఇప్పటికే ఖరారు చేసింది. మంత్రి జయరాంను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా.. ఆయన నిరాకరించడంతో బీవై రామయ్య పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్‌ను కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన ఇంతియాజ్ అహ్మద్ కలవనున్నారు. ఇంతియాజ్ అహ్మద్‌తో పాటు బీవై రామయ్య కూడా సీఎంను కలవనున్నారు. బీవై రామయ్య, ఇంతియాజ్ అహ్మద్‌కు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేయనున్నారు. చాలా ఉత్కంఠ తర్వాత కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.
యార్లగడ్డ ఉదారస్వభావం:
గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రూరల్ టైలర్స్ అసోసియేషన్ వారికి 20 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. యార్లగడ్డ సొంత ఖర్చుతో రూ.2 లక్షల విలువైన 20 కుట్టు మిషన్లను నిరుపేదలకు అందజేసి తన ఉదారస్వభావాన్ని చాటుకున్నారు. ప్రజలకు టీడీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని వివేకానంద స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బొప్పన హరికృష్ణ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీను, వి.శ్రీనివాసరావు, ఎనికెపాడు రాజు, ఎనికెపాడు శ్రీనివాసరావు, రూరల్ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్:
పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా 11,062 టీచర్ పోస్టులతో ఇవాల కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. కాగా.. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బుధవారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది.
సాధారణంగా కంటే మూడు డిగ్రీల అధికం:
తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఇక మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. కాగా.. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. పగటిపూట వాతావరణం పొడిగా ఉంటుందని, ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మార్చి ప్రారంభం కాకుండానే ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని పేర్కొంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మధ్యప్రదేశ్ లో భారీ రోడ్డు ప్రమాదం:
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ పికప్ బోల్తా పడి 14 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం షాపురా ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. వీరంతా షాపురా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం నుంచి తమ గ్రామమైన అమ్హై డియోరీకి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. షాపురా పోలీస్ స్టేషన్, బిచియా పోలీస్ పోస్ట్ ఏరియా పరిధిలోని బద్జార్ ఘాట్‌లో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్’ రన్‌టైమ్ ఎంతో తెలుసా?:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో నటిస్తున్నారు. మానుషి చిల్లార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేశారు. ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తెలుగు, హిందీలో రాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా యు /ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 4 నిమిషాలు ఉన్నట్లు తెలిపారు. దీన్ని బట్టే సినిమా ఎంత షార్ప్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాను జరుగుతున్న యాదార్థ సంఘటనల ఆధారంగా తెరాకెక్కించారు.