నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14.. ప్రయోగం దేనికోసమంటే..?
ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను తన ఖాతాలో వేసుకున్న ఇస్రో.. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది.. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలో కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. అది 27 గంటల 30 గంటల పాటు కొనసాగుతోంది. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం 5.35 గంటలకు 2 వేల 275 కిలోల బరువైన ఇన్‌శాట్-3DS ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లనుంది జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 రాకెట్.. ఈ ప్రయోగం ద్వారా 2 వేల 275 కిలోల బరువైన ఇన్‌శాట్-3DS ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ఇన్‌శాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు. వాతావరణం, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించనుంది.. మెరుగైన వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనా మరియు విపత్తు హెచ్చరికల కోసం భూమి మరియు సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన మిషన్ ఇది.. INSAT-3DS ఉపగ్రహం ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్‌సాట్-3D మరియు INSAT-3DR ఇన్-ఆర్బిట్ శాటిలైట్‌లతో పాటు వాతావరణ సేవలను పెంపొందిస్తుంది.
రెబల్ ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు.. 19న తుది విచారణ..!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన తుది విచారణకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనికోసం మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.. వైసీపీ రెబెల్స్ ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్.. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుంటే ఇప్పటి వరకు తాను విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు స్పీకర్.. దీంతో, తుది విచారణకు హాజరు కావాలా..? వద్దా..? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే పనిలో పడిపోయారట వైసీపీ రెబెల్స్.. మరోవైపు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ ఇచ్చిన చీఫ్ విప్ ప్రసాద రాజుకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కాగా, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఎలాంటి చర్యలకు దిగుతారు అనేది ఉత్కంఠ రేపుతోంది.. ఇప్పటికే పలు దఫాలుగా నోటీసులు జారీ చేశారు స్పీకర్.. కొన్నిసార్లు విచారణకు డుమ్మాకొట్టారు రెబల్స్.. మరికొన్నిసార్లు విచారణకు రాలేకపోతున్నామంటూ సమాచారం ఇచ్చారు.. తాము వివరణ ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వాలని కోరారు. మొత్తంగా రాజ్యసభ ఎన్నికల వేళ.. రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది.
నేడే తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల..
నీటిపారుదల రంగంపై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ వెలుగు చూసేలా శ్వేతపత్రం ఉండాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో 2014 నుంచి 2023 వరకు చేపట్టిన ప్రాజెక్టులన్నింటిని ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొననున్నారు. అయితే, వాస్తవానికి శుక్రవారం నాడు సాయంత్రమే అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం 5:51 నిమిషాలకు సభ ప్రారంభమైంది.. ఆ వెంటనే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య లేచి మాట్లాడుతూ.. సభలో సాగునీటిరంగంపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అసవరం ఉంది ఈ నేపథ్యంలో సభను శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. దీన్ని బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు తప్పుబట్టారు.
నేడు కేసీఆర్ బర్త్ డే.. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన రోజు వేడుకలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్.. మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.. తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు పని చేశారు. నేడు కేసీఆర్ 70వ బర్త్ డే నేడు.. ఈ సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు రెడీ అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం ఎప్పటిలాగే చేసేందుకు పార్టీ కార్యకర్తలు రెడీ అయ్యారు. మరో వైపు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 1000 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాను బహుమతిగా ఇవ్వాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఏడాదికి లక్ష రూపాయల బీమా కవరేజీని అందించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు శారీరక వికలాంగులకు బీఆర్ఎస్ వీల్‌చైర్‌లను అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే, కేసీఆర్ జీవితంపై “తానే ఒక చరిత్ర” (ఆయన చరిత్ర వ్యక్తి) అనే డాక్యుమెంటరీతో కేసీఆర్ చిన్ననాటి నుంచి ఇటీవల జరిగిన ‘ఛలో నల్గొండ’ సభ వరకు ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన జీవితంపై 30 నిమిషాల డాక్యుమెంటరీని ఇవాళ విడుదల చేయనున్నారు. ఇక, హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్యాడర్‌తో సహా సీనియర్ నేతలందరూ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించి ఈ రోజు ఉదయం 9:30 గంటలకు తెలంగాణ భవన్‌కు భారీగా చేరుకోనున్నారు.
మరోసారి విశ్వాస పరీక్ష సిద్ధమైన కేజ్రీవాల్.. కారణం అదేనా..?
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇవాళ (ఫిబ్రవరి 17న) అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ జరగనుంది. అయితే, కేజ్రీవాల్ ఆరు నెలల క్రితం కూడా ఒకసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఇక, తమ పార్టీ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తుందని ఆయన ఇటీవల ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్ లో ఉంది.. వారికి ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందన్నారు. దీంతో బీజేపీతో కలిస్తే తనపై కేసులు లేకుండా చేస్తామన్నారని ఇటీవల కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ అధికారులు ఆరు సార్లు నోటీసులు పింపింది. ఇటీవల జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ ఇలాగే నోటీసులిచ్చి అరెస్ట్ చేసింది.. దీంతో కేజ్రీవాల్ ను కూడా విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారని ఆప్ నేతలు ఆరోపలు చేస్తుంది. అయితే, 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేశారు. ఇక, శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారని చెప్పారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన మరోసారి బల పరీక్షకు దిగారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.
శ్రీలంకకు రెండు ఇరాన్ యుద్ధ నౌకలు
శ్రీలంక నేవీతో సహకారాన్ని బలోపేతం చేసేందుకు రెండు ఇరాన్ యుద్ధనౌకలు – IRINS బుషెహర్, టోన్బా – శుక్రవారం నాడు కొలంబో చేరుకున్నాయి. ఎర్ర సముద్రంలో వర్తక నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వాణిజ్యంలో చేరేందుకు కొలంబో సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ యుద్ధనౌకలు శ్రీలంకకు చేరుకున్నాయి. అయితే, హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అయితే, రెండు ఇరాన్ యుద్ధ నౌకలకు శ్రీలంక నేవీ స్వాగతం పలికింది. బుషెహర్ 107 మీటర్ల ఎత్తు.. ఇందులో 270 మంది సిబ్బంది ఉంటారు.. కాగా, టోన్బా దాదాపు 94 మీటర్లు పొడవు ఉంటుంది.. ఇందులో 250 మంది సిబ్బంది ఉంటారు. యుద్ధనౌకల కమాండింగ్ అధికారులు తమ దేశంలో ఉన్న సమయంలో పశ్చిమ నావికా ప్రాంత కమాండర్- శ్రీలంక నేవీ డైరెక్టర్ జనరల్‌ను కలవనున్నారు. ఇక, ఇరాన్ నౌకల సిబ్బంది శ్రీలంకలోని అనేక పర్యాటక కేంద్రాలను సందర్శించే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధనౌక ఫిబ్రవరి 19న శ్రీలంక నుంచి బయలుదేరుతుంది.
ఎల్ఐసీ కొత్త బీమా ప్లాన్.. అమృతబల్ లాంచ్
ప్రభుత్వ బీమా సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎల్‌ఐసీ) కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు ‘ఎల్‌ఐసి అమృత్‌బల్’. దీనిని ‘ప్లాన్ 874’ అని కూడా పిలుస్తారు. ఇది పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఒక విధంగా ఇది పిల్లల బీమా పాలసీ కూడా. సామాన్య ప్రజలు 17 ఫిబ్రవరి 2024 నుండి మాత్రమే ఈ పాలసీని కొనుగోలు చేయగలరు. ఈ పాలసీలో మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీకి చెందిన ‘LIC అమృత్‌బల్’ ప్లాన్ వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమా పథకం. పిల్లల ఉన్నత విద్యకు తగిన నిధులను సృష్టించే విధంగా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది పిల్లల ఇతర అవసరాలను కూడా తీరుస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతి రూ. 1000 సమ్ అష్యూర్డ్‌కు రూ. 80 నిష్పత్తిలో ఎల్‌ఐసి హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ రూ. 80 రిటర్న్ మొత్తం బీమా పాలసీకి అంటే బీమా చేసిన మొత్తానికి జోడించబడుతుంది. మీ పిల్లల పేరు మీద రూ.లక్ష బీమా వచ్చిందంటే LIC మీ బీమా మొత్తానికి రూ. 8000 హామీ మొత్తాన్ని జోడిస్తుంది. ఈ హామీతో కూడిన రాబడి ప్రతి సంవత్సరం పాలసీ సంవత్సరం చివరిలో జోడించబడుతుంది. మొత్తం పాలసీ వ్యవధి ముగిసే వరకు కొనసాగుతుంది.
ఐటీ రంగంలోకి అడుగుపెట్టనున్న యోగా గురు బాబా రామ్ దేవ్
ఐటీ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న యోగా గురు రామ్‌దేవ్‌కు శుభవార్త అందింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రోల్టా ఇండియా లిమిటెడ్‌కు రీ-బిడ్ చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ముంబై బెంచ్ అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేదకు మార్గం తెరిచింది. రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి.. రోల్టా ఇండియాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. ఇద్దరు న్యాయమూర్తులు ప్రభాత్ కుమార్, వీరేంద్ర సింగ్ బిష్త్‌లతో కూడిన ధర్మాసనం ఒక ఆర్డర్‌లో- పతంజలితో పాటు బిడ్‌లు సమర్పించిన ఇతర దరఖాస్తుదారులందరినీ తమ బిడ్‌లను సవరించడానికి అనుమతించాలి. ఈ బెంచ్ దరఖాస్తుదారు రిజల్యూషన్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (CoC)ని అనుమతిస్తుంది. ఆసక్తి చూపిన దరఖాస్తుదారులందరికీ అవకాశం కల్పించడం ఉత్తమమని కోర్టు పేర్కొంది. పూణేకు చెందిన అష్డాన్ ప్రాపర్టీస్ రూ. 760 కోట్ల ఆఫర్ బ్యాంకుల ద్వారా అత్యధిక బిడ్.. పతంజలి రూ. 830 కోట్ల ఆల్ క్యాష్ ఆఫర్‌ను ప్రకటించిన కొద్ది రోజులకే ఇది వచ్చింది. రోల్టా అనేది డిఫెన్స్ ఫోకస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఇది జనవరి 2023లో దివాలా కంపెనీల జాబితాలో చేర్చబడింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం రూ. 7,100 కోట్లు.. సిటీ గ్రూప్ నేతృత్వంలోని అన్‌సెక్యూర్డ్ విదేశీ బాండ్లను కలిగి ఉన్నవారు రూ. 6,699 కోట్లు బకాయిపడ్డారు. ఈ విధంగా చూస్తే కంపెనీ మొత్తం అప్పు దాదాపు రూ.14,000 కోట్ల అప్పుల్లో ఉంది.
షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
బంగారం కొనాలని అనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. శనివారం 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 10 పెరిగి.. రూ. 57,110కి చేరింది..24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 62,300కి చేరింది.. వెండి కూడా స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది.. కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 75,700కి చేరింది.ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,610గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,850గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,110గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,300గాను ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,260గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,450గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,110 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,300గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,110గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,300గా నమోదైంది.. ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి కూడా అదే దారిలో నడిచింది. ఈరోజు కేజీ వెండి పై రూ. 100 పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 77,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 75,700.. బెంగళూరులో రూ. 70,800గా ఉంది.. ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..