నేడు పులివెందులకు వైఎస్ జగన్.. నామినేషన్ దాఖలు
మేమంతా సిద్ధం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టే.. బుధవారం రోజు బస్సు యాత్రను ముగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేశారు జగన్. మూడో విడత ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ లోపు తన నియోజకవర్గం పులివెందులలో నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఇప్పటికే జగన్ తరపున పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేశారు. ఈరోజు మరో సెట్‌ని జగన్ స్వయంగా దాఖలు చేయనున్నారు. ఇక, పులివెందుల పర్యటన కోసం ఈ రోజు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటి నుంచి జగన్ బయల్దేరతారు. ఉదయం 8 గంటల 5 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో బయల్దేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కడప నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల వెళ్తారు. అక్కడ సీఎస్‌ఐ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభలో జగన్ పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత బైరోడ్ పులివెందుల మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోని రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్‌కు చేరుకుంటారు. 11 గంటల 25 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల మధ్య నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. మరోవైపు.. నామినేషన్ పూర్తయ్యాక పులివెందుల భాకరాపురంలోని తన ఇంటికి వెళ్తారు జగన్. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా కడప ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కడప ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ.. 3 గంటల వరకే డెడ్‌లైన్
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.. ఈ రోజు మధ్యాహ్నం లోపు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటి వరకు మొత్తం 478 మంది అభ్యర్థులు, 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.. ఇక, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా జరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆ స్థానంలో 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు డెడ్‌లైన్ ఉండగా.. రేపు నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది.. ఇక, మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవాళ్టితో ముగియనుంది నామినేషన్ల స్వీకరణ.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటివరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలు అయ్యాయి.. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు కావడం విశేషం.. ఇక, ఇవాళ్టితో నామినేషన్ల స్వీకరణ ముగియనుండడంతో.. ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. సీఎం వైఎస్ జగన్‌తో పాటు.. మరికొందరు కీలక అభ్యర్థులు ఈ రోజు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
ఎల్లుండి వైసీపీ గూటికి యనమల.. టీడీపీకి షాక్..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 27న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు యనమల కృష్ణుడు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.. మరోవైపు ఈ రోజు వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ నామినేషన్ కార్యక్రమంలో యనమల కృష్ణుడు పాల్గొంటారని తెలుస్తోంది.. ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు పూర్తి చేశారు.. అయితే, గత కొంతకాలంగా యనమల సోదరుల మధ్య విబేధాలు తలెత్తాయి.. తుని నుంచి టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేస్తుండగా.. ఆ సీటును ఆశించిన యనమల కృష్ణుడు.. టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే.. టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక అన్న యనమల రామకృష్ణుడు తనను పిలిచి మాట్లాడక పోవడం, తనను పట్టించుకోకపోవడంతో తుని కూటమి అభ్యర్థి యనమల దివ్యకు సహకరించకుండా యనమల కృష్ణుడు ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే యనమల కృష్ణుడు రాకపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించగా.. ఎటువంటి షరతులు లేకుండా వైసీపీలోకి రావాలని అధిష్టానం సూచించినట్టు ప్రచారం సాగుతోంది..
నేడు తెలంగాణ బీజేపీ నేతలు నామినేషన్..
తెలంగాణ రాష్ట్రంలో నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొంటారు. ఇక.. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కు పోతుగంటి భరత్ నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. టవర్ సర్కిల్ వద్ద సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రసంగించనున్నారు. అనంతరం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు జరగనున్నాయి. మరోవైపు.. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా గోమా శ్రీనివాస్‌ను ప్రకటించింది. ఇవాళ శ్రీనివాస్ కే పెద్దపల్లి ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఆగివున్న లారీని ఢీ కొట్టిన కారు.. ఆరుగురు స్పాట్ డెడ్
ఇటీవల తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కొందరు లారీ డ్రైవర్లు కూడా రెడ్ లైట్లు, సైడ్ ఇండికేటర్లు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేస్తున్నారు. అతివేగంగా వెళ్లేవారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షణికావేశంలో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే సూర్యాపేటలో చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు హైవే 65పై కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు హైవేని ట్రాఫిక్ జామ్ నుండి క్లియర్ చేస్తున్నారు.
నేడు రాష్ట్రానికి అమిత్ షా.. షెడ్యూల్ ఇదీ..
బీజేపీ అగ్రనేత అమిత్ షా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేటకు చేరుకుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది. ఆ తర్వాత 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతారు. ఇక మరోవైపు రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది. ఇక.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపేలా ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని సమాచారం.
బీహార్‌లో జేడీయూ నేత దారుణ హత్య.. మరో యువకుడికి గాయాలు
బీహార్ రాజధాని పాట్నాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజధాని పాట్నాలోని పున్‌పున్‌లో జేడీయూ యువనేత సౌరభ్‌కుమార్‌పై కాల్పులు జరిగాయి. అదే సమయంలో ఈ కాల్పుల్లో మరో యువకుడు గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతి చెందిన జేడీయూ నేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు, ఈ ఘటన తర్వాత ఆగ్రహించిన ప్రజలు పాట్నా-గయా రహదారిని దిగ్బంధించారు. పున్‌పున్‌లో ఏర్పాటు చేసిన వివాహ వేడుక నుండి అర్థరాత్రి తిరిగి వస్తుండగా, బధియాకోల్‌లో కొంతమంది గుర్తు తెలియని దుండగులు జేడీయూ నాయకుడు, అతని సహచరులలో ఒకరిపై కాల్పులు జరిపారు. దీంతో యువకులిద్దరూ కిందపడిపోయారు. దీంతో జేడీయూ నేత అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, గాయపడిన అతడి స్నేహితుడు మున్‌మున్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాజకీయ వైరంతోనే ఈ హత్య జరిగిందా? ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, అర్థరాత్రి మృతుడి మద్దతుదారులు పాట్నా-గయ రహదారిని దిగ్బంధించి హంగామా సృష్టించారు. పోలీసులు చాలా ఒప్పించిన తర్వాత, వారు అంగీకరించారు. తర్వాత విషయం కాస్త సద్దుమణిగింది. ఘటన సమాచారం అందిన వెంటనే పాట్లీపుత్ర ఆర్జేడీ అభ్యర్థి, లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతి పున్‌పున్‌కు చేరుకుని సౌరభ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిశారు. పాట్నా పోలీసుల ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
యువతలో పెరిగిన ఆల్కహాల్, ఈ-సిగరెట్ల వాడకం.. ఆందోళనలో డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యూరోపియన్ శాఖ ఇవాళ (గురువారం) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కౌమారదశలో ఉన్నవారిలో ఆల్కహాల్, ఈ-సిగరెట్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపింది. యూరప్, మధ్య ఆసియా, కెనడాలో 11, 13, 15 ఏళ్ల వయస్సు గల 2, 80,000 మంది యువకుల నుంచి సేకరించిన సర్వేలో వెల్లడైంది. ఈ పోకడల వల్ల యొక్క దీర్ఘకాలిక పరిణామాలు ఎదుర్కోనే ప్రమాదం ఉందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులో 15 ఏళ్లలోపు వారిలో 57 శాతం మంది కనీసం ఒక్కసారైనా మద్యం సేవించారని.. ఇక, అబ్బాయిలతో పోలిస్తే బాలికల సంఖ్య 59 శాతంగా ఉందని నివేదికలో పేర్కొంది. ఇక, డబ్ల్యుహెచ్‌ఓ మొత్తం మద్యపానం అబ్బాయిలలో తగ్గింది.. కానీ, బాలికలలో అది పెరిగిందని పేర్కొంది. ప్రస్తుత వినియోగం విషయానికి వస్తే.. గత 30 రోజులలో కనీసం ఒక్కసారైనా తాగుతునట్లు వెల్లడైంది. 5 శాతం మంది బాలికలతో పోలిస్తే, 11 ఏళ్ల అబ్బాయిలలో ఎనిమిది శాతం మంది అలా చేసినట్లు నివేదించారు. కానీ, 15 సంవత్సరాల వయస్సులోని 38 శాతం మంది అమ్మాయిలు గత 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా మద్యం తాగినట్లు డబ్ల్యూహెచ్ఓ చెప్పుకొచ్చింది.
జోరు మీదున్న సన్‌రైజర్స్‌ను బెంగళూరు ఆపగలదా?.. 300 స్కోరుతో ఎస్‌ఆర్‌హెచ్ చరిత్ర సృష్టిస్తుందా?
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 7 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లలో గెలిచింది. ఆర్‌సీబీపై గెలిచి ప్లే ఆఫ్‌కు మరింత చేరువ కావాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది. మరోవైపు ఆర్‌సీబీ ఆడిన 8 మ్యాచ్‌లలో ఒకటే గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. వరుస ఓటములతో సతమతం అవుతున్న ఆర్‌సీబీ.. జోరుమీద సన్‌రైజర్స్‌ను ఆపగలదా? అన్నది చూడాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ భీకరంగా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దంచుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. పవర్ ప్లేలో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని కొనసాగిస్తూ మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలెరేగుతున్నారు. ఐడెన్ మార్‌క్రమ్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. మరోవైపు పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు.
ఓటీటీలపై ఫహాద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో మంచి గుర్తింపును పొందాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక రీసెంట్ గా ఫహాద్ నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. రెండు వారాల్లోనే ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టింది.. ఇప్పటికి సినిమా జోరు తగ్గలేదు.. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్బంగా ఈ హీరో ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఇందులో భాగంగా ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు.. తన సినీ జీవితం గురించి మాత్రమే కాదు ప్రస్తుతం సినిమాల పరిస్థితుల గురించి వివరించాడు.. సినిమానే జీవితం కాదు.. జీవితంలో ఎన్నో నేర్చుకోవాలి.. ఎన్నో చెయ్యాల్సినవి ఉన్నాయి అని ఆయన చెప్పాడు.. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మమ్మల్ని పట్టించుకోకండి. ఇక సినిమాని కూడా ఓ హద్దులో ఉంచాలి. సినిమాలు చూడటమే మన లైఫ్ కాదు కదా అని సంచలన వ్యాఖ్యలు చేసారు.. అంతేకాదు.. మలయాళ సినిమాలకు వాణిజ్య పరంగా డిమాండ్ పెరిగింది.. కానీ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి మాకు ఇంకా గట్టి మద్దతు లేదు. దాదాపు 80% ఫిలింలు ముందుగా పటిష్టంగా ఉన్న భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా, మాకు విషయాలు భిన్నంగా ఉంటాయి. ఏదైనా ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కాస్త ఎక్కువగా ప్రమోట్ చెయ్యడం వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
షూటింగ్ ఆలస్యం..అసలు ఏమైంది మావ..?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”..ఈ సినిమాను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్నారు .గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది .ఈ మూవీ కోసం హీరో రామ్ డిఫరెంట్ లుక్ లో కమీపించబోతున్నాడు .డబుల్ ఇస్మార్ట్ మూవీ సక్సెస్ హీరో రామ్ కు మరియు దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఎంతో ముఖ్యం .ప్రస్తుతం వీరిద్దరూ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు .ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి ,రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..కానీ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ వీరిద్దరికి ఎక్కువ కాలం నిలవలేదు . ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత రామ్ చేసిన ప్రతి సినిమా అంతగా ఆకట్టుకోలేదు .అలాగే దర్శకుడు పూరీజగన్నాధ్ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు .దీనితో వీరిద్దరి కెరీర్ కు డబుల్ ఇస్మార్ట్ మూవీ కీలకంగా మారింది.అయితే డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం .హీరో రామ్ అధిక రెమ్యూనరేషన్ అడగడం వలనే షూటింగ్ ఆగిందని కొన్ని పుకార్లు ప్రచారం జరిగాయి.అయితే అందులో నిజం లేదని తెలిసింది .ఈ సినిమా కోసం హీరో రామ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోనున్నట్లు సమాచారం .ఈ సినిమాను ఛార్మి కౌర్ తో కలిసి దర్శకుడు పూరి నిర్మిస్తున్నాడు .ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కు ఇప్పుడు కాస్త ఆర్ధిక ఇబ్బందులు రావడంతో షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తుంది .త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.