*ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు షురూ..
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లన స్వీకరణ ప్రారంభం కానుంది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లల్లో, అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు చేశారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 10 రాష్ట్రాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదిలా ఉండగా ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నాలుగోదశ నోటిఫికేషన్‌లో ఏపీ, తెలంగాణ, బీహార్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఏపీ బీహార్‌లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. వీటికి 25వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో నామినేషన్ల ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ప్రారంభ కానుంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వే లు నిలుపుదల చేయాల్సి ఉంది. ఎలాంటి సర్వేలు నేటి నుంచి వెల్లడించడానికి వీలులేదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముహూర్తాలు చూసుకుని నామినేషన్లను దాఖలు చేయడానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఇక నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది.
*నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం..
నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. ఒక్కో అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కోసం రూ. 95 లక్షల చెక్కులను కేసీఆర్ ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. చేవెళ్ల బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ స్థానానికి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించగా.. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరికి ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగే పార్టీ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ-ఫామ్‌ను అందజేయనున్నారు. ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
*17వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్.. నేడు(గురువారం) మళ్లీ యాత్రను ప్రారంభించనున్నారు.. విజయవాడలో తనపై రాయి దాడి జరిగినా.. నుదిటిపై గాయం మానకపోయినా.. బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు ఏపీ సీఎం.. ఇక, 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. ఇవాళ ఉదయం 9 గంటలకు తేతలిలో రాత్రి బస చేసిన కేంద్రం నుంచి బయల్దేరతారు సీఎం జగన్. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బస్సు యాత్ర సాగనుంది. నేడు 85 కిలోమీటర్లు సీఎం జగన్ రోడ్‌షో నిర్వహించనున్నారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకోనున్నారు. సాయంత్రం రాజమండ్రి సిటీలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక, ఆ తర్వాత కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురంలో రాత్రి బస శిబిరానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. బస్సు యాత్రలు, రోడ్‌షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే.. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోన్న విషయం విదితమే.. సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత పోలీసులు మరింత భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డులో సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కాగా, ఎన్నికల ప్రచారంలో ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్.. ఇచ్చాపురం వరకు చేరుకోనున్న విషయం విదితమే. మరోవైపు ఇప్పటికే మేమంతా సిద్ధం యాత్రతో 16 జిల్లాలు, 49 నియోజకవర్గాలను చుట్టేశారు సీఎం జగన్.. 1636 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు.
*నేటి నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు.. రాష్ట్రానికి కేంద్రమంత్రులు..
నేటి నుంచి తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభకానుంది. ఇవాళ బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు వివరాలను బీజేపీ విడుదల చేయనుంది. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నట్లు పేర్కొంది. నేడు మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ వేయనున్నట్లు బీజేపీ తెలిపింది. మెదక్ రఘునందన్ రావు నామినేషన్ కు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హజరు కానున్నారు. మల్కాజ్ గిరి ఈటెల రాజేందర్ నామినేషన్ కుకేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ హాజరు కానున్నారు. మహబూబ్ నగర్ డికే అరుణ నామినేషన్ కు పీయూష్ గోయల్ రానున్నట్లు తెలంగాణ బీజేపీ శ్రేణులు తెలిపారు. రేపు (19)న సికింద్రాబాద్, ఖమ్మం నామినేషన్ లు, కిషన్ రెడ్డి, వినోద్ రావు ల నామినేషన్ కు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల , నల్గొండ, మహబూబ్ బాద్ కాండిడేట్ ల నామినేషన్ లు వేయనున్నట్లు, జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్ కు దేవేంద్ర ఫడ్నవీస్, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్ కు పీయూష్ గోయల్, మహబూబ్ బాద్ సీతారాం నాయక్ నామినేషన్ కు కిరణ్ రిజిజు రానున్నారు. అలాగే.. 23న భువనగిరి, 24 న పెద్దపల్లి అదిలాబాద్ హైదారాబాద్ వరంగల్ ల నామినేషన్ లు వేయనున్నట్లు, పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్ కు అశ్విని వైష్ణవ్, అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్ కు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, హైదారాబాద్ మాధవి లత నామినేషన్ కు అనురాగ్ సింగ్ ఠాకూర్, వరంగల్ అరూర్ రమేష్ నామినేషన్ కు అశ్వినీ వైష్ణవ్, 25 న కరీం నగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్, కరీంనగర్ బండి సంజయ్, నాగర్ కర్నూల్ భరత్ లా నామినేషన్ కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి లు, నిజమాబాద్ అరవింద్ నామినేషన్ కు అశ్విని వైష్ణవ్ లు హాజరు కానున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు.
*తొలి విడత పోలింగ్ రేపే..
భారతదేశం వ్యాప్తంగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల హడావిడి కోలాహాలంగా జరుగుతోంది. ఇప్పటికే దేశంలోని అన్ని పార్టీలు జరగబోయే ఎన్నికల్లో గెలవడానికి పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలను మమేకం చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలకు మొత్తం 7 దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం నాడు ఎన్నికల ప్రచారం కు చెక్ పడింది. శుక్రవారంనాడు జరగబోయే ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. ఇక ఇందులో తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలలో, రాజస్థాన్‌లో 12, యూపీలో 8, మధ్యప్రదేశ్ లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సామ్ రాష్ట్రాల్లో 5 స్థానాలలో.. బిహార్, పశ్చిమ బెంగాల్ లో 3 స్థానాల చొప్పున.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ లలో 2 లోక్ సభ స్థానలతో పాటు ఛత్తీస్ ఘడ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర , జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్క లోక్ సభ సీట్లకు ఏప్రిల్ 19 శుక్రవారం నాడు ఎన్నికల జరగనున్నాయి. ఇక ఈ మొదటి విడతలో జెరిగే ఎన్నికలలో అభ్యర్థులను చూస్తే.. 8 మంది కేంద్ర మంత్రులు., ఇద్దరు మాజీ సీఎంలు., తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై సహా పలువురు రాజకీయ హేమాహేమీలు బరిలో ఉన్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ స్థానం నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి మూడోసారి బరిలో దిగనుండడంతో.. ఈసారి విజయంతో ఎలాగైనా హాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక తమిళనాడు లోని చెన్పై సెంట్రల్ నుంచి తమిళ సై సౌందరరాజన్, ఉత్తరాఖండ్ నుంచి మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ లు పోటీలో ఉన్నారు.
*ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్.. ఓపెన్ చేశారో కఠిన చర్యలే..
సండే అంటేనే ఫన్ డే అని. లేటుగా లేచి మనకు ఇష్టమైన వంటకాలు వండుకుని తిని సరదాగా గడుపుతాం. అయితే.. ఆదివారం అంటేనే ఆహారంలో నాన్ వెజ్ ఉండాల్సిందే. చికెన్, మటన్, చేపల దుకాణాల ముందు మాంసాహార ప్రియులు క్యూ కడతారు. ఆదివారాల్లో చాలా ఇళ్లలో నాన్ వెజ్ వంటకాలు వండుకోవడం.. వివిధ రకాల నాన్ వెజ్ వంటకాలు చేస్తూ సండేను ఆస్వాదిస్తారు. చాలా మంది ప్రతి ఆదివారాన్ని నాన్ వెజ్ డేగా ప్రకటించి ఎంతో ఆనందిస్తారు కూడా. కానీ ఈ ఆదివారం హైదరాబాద్ ప్రజలకు మాంసం దొరకదు. ఈ నెల 21న నగరంలోని మటన్ దుకాణాలతో పాటు కబేళాలు, మాంసం, బీఫ్ మార్కెట్లను మూసివేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం మూసివేయాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. జైనులు మహావీర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. జైనులు జరుపుకునే పండుగలలో, మహావీరుడు అత్యంత ముఖమైనవాడు. ఈ నేపథ్యంలోనే మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నాన్ వెజ్ షాపులను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర్వుల అమలులో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం యథావిధిగా మటన్, చికెన్, షాపులు తెరవవచ్చని కమిషనర్ తెలిపారు. ప్రజలు సహకరిపంచాలని కోరారు. మాంసం షాపుల యజమానులు దీనిని గమనించి షాపులను బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఒక వేళ కాదని తెరిచిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు.