జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దు:
మాజీ సీఎం వైఎస్ జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దని వైసీపీ మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను తుంగలో తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. రేషన్ వ్యాన్ల ద్వారా సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్స్ వ్యవస్థను నిలిపివేశారని, ఇతర రాష్ట్రాల్లో సైతం ఫాలో అవ్వాలనుకున్న ఇలాంటి ప్రోగ్రాంను నిలిపి వేయాలనుకోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి.. రెండున్నర లక్షల మందిని తొలగించి మోసం చేశారని కారుమూరి చెప్పుకొచ్చారు.
రావివలసలో మన ఊరి కోసం మాటామంతీ కార్యక్రమం:
సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ పరపతి బాగానే పెరిగింది. అంతేకాదు వినూత్న కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పల్లె పండగ, అడవి తల్లిబాట కార్యక్రమాలు నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్.. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరి కోసం మాటామంతీ’ పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, సరాసరి కలిసేందుకు సమయం కుదరని పరిస్ధితుల్లో డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఊరితో ఒకరోజు మాట్లాడేలా ఈ కార్యక్రమం డిజైన్ చేసారు. ఈ కార్యక్రమంలో సమస్యలకు దాదాపు అక్కడే పరిష్కారం దొరికేలా చేస్తారు. రేపు మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని రావివలసలో మన ఊరి కోసం మాటామంతీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంగళగిరి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యుటీ సీఎం పవన్ పాల్గొంటారు.
అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం:
హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో చోటుచేసుకున్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం పట్ల అధికార యంత్రాంగం సీరియస్‌గా స్పందిస్తోంది. భారీగా ప్రాణనష్టం చోటుచేసుకున్న ఈ ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక శాఖలు తమవంతుగా ఆధారాలను సేకరించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని నాగ్‌పూర్‌కు చెందిన ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ బృందం పరిశీలిస్తోంది. నీలేష్ అఖండ నేతృత్వంలోని ఈ బృందం టెక్నికల్ విశ్లేషణల ద్వారా ప్రమాదానికి కారణాలపై దృష్టిసారించింది. ఈ బృందం నివేదిక కీలకంగా మారనుంది. అంతేగాక, చార్మినార్ పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపై వారు ఇప్పటికే పలు శాఖలకు అధికారికంగా లేఖలు పంపారు. వాటిలో ONGC, ఫైర్ డిపార్ట్‌మెంట్, GHMC, విద్యుత్ శాఖ, ఫోరెన్సిక్ విభాగంతో పాటు పలు గ్యాస్ కంపెనీలు ఉన్నాయి. వీరందరూ తమ పరిశీలనలు పూర్తి చేసి నివేదికలను పోలీసులకు అందించనున్నారు. చివరిగా, ఈ ప్రమాదంలో భవనం నష్టాన్ని పరిశీలించిన GHMCకు కూడా పోలీసులు లేఖ రాసినట్టు సమాచారం. భవనాన్ని కూల్చివేయాల్సిన అవసరంపై ఆ విభాగం అభిప్రాయాన్ని ఇవ్వాల్సి ఉంది. అన్ని శాఖల నివేదికలు అందిన తర్వాతే చార్మినార్ పోలీసులు తుది నివేదికను విచారణ కమిటీకి సమర్పించనున్నారు.
వర్షలు పడుతున్నాయి, అప్రమత్తంగా ఉండండి:
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. ఇక వాతావరణశాఖ ప్రకారం మరో రెండు రోజులు వర్షాలు పడతాయన్న కారణం చేత సీఎం అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ నక్సల్ నాయకుడు మృతి:
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ నక్సల్ నాయకుడు బసవరాజు సహా 27 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఈ అంశంపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా స్పందించిన అమిత్ షా భద్రతా దళాలను ప్రశంసించారు. “నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం. ఈరోజు, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. వారిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రధాన పురోగతికి మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను నేను అభినందిస్తున్నాను. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత.. 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ వార్తను పంచుకోవడం సంతోషంగా ఉంది.” అని అమిత్ షా రాసుకొచ్చారు.
ప్రముఖ ప్రాంతాలపై ఎగిరిన డ్రోన్ లాంటి వస్తువులు:
ఆపరేషన్ సిందూర్ తర్వాత కోల్‌కతాలోని ప్రముఖ ప్రదేశాలపై రాత్రిపూట అనేక డ్రోన్ లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించాయి. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్రమత్త మయ్యాయి. సోమవారం హేస్టింగ్స్ ప్రాంతం, పార్క్ సర్కస్, విద్యాసాగర్ సేతు, మైదాన్ మీదుగా కనీసం 8-10 మానవరహిత డ్రోన్‌లు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. డ్రోన్ లాంటి వస్తువులను మొదట హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు చూశారు. “సోమవారం రాత్రి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మహేశ్తల దిశ నుంచి ఈ డ్రోన్ లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించాయి. అవి హేస్టింగ్స్ ప్రాంతం, రెండవ హుగ్లీ వంతెన (విద్యాసాగర్ సేతు), ఫోర్ట్ విలియం (సైన్యం యొక్క తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం) మీదుగా సంచరించాయి.” అని ఒక పోలీసు అధికారి పీటీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. గూఢచర్యంతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంతలో ఈ అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ ఘటనపై కీలక ప్రకటన చేసింది. “ఆకాశంలో డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయని మీడియా నుంచి మాకు సమాచారం అందింది. సమాచారం ప్రామాణికతను మేము పరిశీలిస్తున్నాం. ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దు. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండండి.” అని రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ పేర్కొంది.
వందేళ్ల నాటి టీ స్టాల్.. కస్టమర్లే ఛాయ్ చేసుకుని:
ఈ 100 ఏళ్ల నాటి టీ స్టాల్ ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణంగా ఎక్కడైనా షాపు యజమానులు టీ తయారు చేసి విక్రయిస్తుంటారు. వారే డబ్బులు తీసుకుంటుంటారు. కానీ.. ఈ టీ దుకాణం మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ టీ షాప్ ఓనర్ కేవలం ఉదయాన్నే వచ్చి షాప్ ఓపెన్ చేసి వెళ్లి.. చివరికి రాత్రి వచ్చి దాన్ని మూసివేసి డబ్బులు తీసుకుని వెళ్తాడు. అయితే.. ఒవరినైనా పని వాళ్లని పెట్టి నడుపుతున్నాడని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఈ షాపులో కస్టమర్లలోనే ఎవరో ఒకరు ఛాయ్ చేస్తారు. తాగి డబ్బులు అక్కడ పెట్టి వెళ్తారు. వందేళ్లుగా ఎంతో నమ్మకంతో సాగుతోంది ఈ టీ స్టాల్. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది? అని అనుకుంటున్నారా?. పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్‌లో ఛత్రా కాళీ బాబు శ్మశానవాటిక ఎదురుగా ఈ 100 ఏళ్ల నమ్మకంతో కూడిన టీ స్టాల్ నడుస్తోంది. వంద ఏళ్ల కిందట నరేష్ చంద్ర షోమ్ అనే స్వాతంత్ర్య సమరయోధుడు దీన్ని ప్రారంభించాడట. కస్టమర్లే టీని తయారు చేస్తారు. ఇలా తయారు చేసుకున్న టీని ఇతరులకు కూడా సర్వ్ చేసుకుంటారు. వాళ్లు తాగిన టీ తాలూకు డబ్బులను ఆ దుకాణంలో పెట్టి వెళ్లి పోతారు. కస్టమర్లే నడుపుతున్న ఈ టీ స్టాల్ ఓనర్ అశోక్ చక్రవర్తి.. ఉదయాన్నే వచ్చి టీ స్టాల్‌ను ఓపెన్ చేసి వెళ్లి పోతారు. తిరిగి రాత్రి 7 గంటలకు వచ్చి మూసేసి డబ్బులు తీసుకుని వెళ్తారు. ఛాయ్ తాగిన కస్టమర్లు ఎంతో నమ్మకంతో డబ్బులు గల్లాపెట్టెలో వేసే వెళ్తారు. ఈ స్టాల్‌లో ఇంత వరకు దొంగతనం జరగలేదని.. టీ తాగిన కస్టమర్లు డబ్బులు అక్కడ పెట్టకుండా వెళ్లిన దాఖలాలు లేవని చెబుతున్నారు.
మరోసారి బయటపడ్డ పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధం:
పాకిస్థాన్ లో సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య లోతైన సంబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇటీవల, సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. సైఫుల్లా మరణం పట్ల పాకిస్థాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) సింధ్ యూనిట్ సంతాప సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వక్తలు ఒకవైపు.. ఉగ్రవాది సైఫుల్లా మరణంపై విచారం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు భారతదేశంపై విషం చిమ్మారు. ఇది మాత్రమే కాదు.. ఈ సమావేశంలో పాకిస్థాన్ సైన్యం, పాక్ చీఫ్ జనరల్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను బహిరంగంగా ప్రశంసించారు. ‘మర్కా-ఎ-హక్’ పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సాన్నిహిత్యం మరోసారి బహిరంగంగా ప్రదర్శించారు.
పాకిస్థాన్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి:
పాకిస్థాన్‌లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌లోని కుజ్‌దార్ ప్రావిన్స్‌లో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహుతి కోసం ఓ కారును వాడినట్లు చెబుతున్నారు. కాగా.. ఈ దాడికి ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. కానీ జాతి బలూచ్ వేర్పాటువాద సంస్థలపై, ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థలు ఈ ప్రావిన్స్‌లో పౌరులు, భద్రతా దళాలపై తరచుగా దాడి చేస్తున్నాయి. ఈ దాడిపై పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రి మొహసీన్ నఖ్వీ స్పందించారు. “పిల్లలపై దాడి చేసినవారు రాక్షసులు. “శత్రువు.. అమాయక పిల్లలను లక్ష్యంగా చేసుకుని అతి క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. అలాంటి మృగాలపై దయ చూపాల్సిన అవసరం లేదు” అని అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్ర పదజాలంతో ఈ దాడిని ఖండించారు.
పికిల్‌బాల్ భాగస్వాములుగా మారిన విరాట్, అనుష్క:
టెస్ట్‌కు వీడ్కోలు చెప్పిన అనంతరం విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి శ్రీకృష్ణ బాల్యం గడిపిన బృందవనాన్ని సందర్శించారు. అక్కడ వారు ప్రముఖ సంత్ ప్రీమనంద్ గోవింద్ శరణ్ మహారాజ్ ఆశీర్వాదం పొందారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం విరాట్ ఇప్పుడు IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి పికిల్‌బాల్ ఆటను ఆస్వాదించాడు. RCB శిబిరంలో దినేష్ కార్తిక్, దీపికా పల్లికల్ జంట కూడా ఈ ఆటలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన RCB “పికిల్‌బాల్ ఫీవర్ మా టీమ్‌ను కుదిపేసింది” అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కేతిక లక్ బాగుంది.. వరుసగా ఆఫర్లు:
హాట్ బ్యూటీ కేతిక శర్మ సుడి తిరిగింది. ఇన్నేళ్లుగా నానా తంటాలు పడుతున్న ఆమెకు ఇప్పుడు జోష్ వచ్చింది. రాబిన్ హుడ్ మూవీ ప్లాప్ అయినా.. పాట మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా ఇందులో కేతిక డ్యాన్స్ పై కొంత కాంట్రవర్సీ నడవడంతో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. ఆమె అందాలు కూడా ఇందులో హైలెట్ అయ్యాయి. దీంతో మళ్లీ సినిమా అవకాశాలు పెరిగాయి. దీనికి తోడు మొన్న శ్రీ విష్ణుతో చేసిన సింగిల్ మూవీ మంచి హిట్ అయింది. ఇలా కలిసొచ్చిన క్రేజ్ తో వరుసగా సినిమాలు ఆఫర్లు పట్టేస్తోంది. ఇప్పుడు రవితేజ-కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారంట. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో మూవీ ఆఫర్ ఇచ్చారంట అల్లు అరవింద్. సాయిధరమ్ తేజ్ చేయబోయే ఓ మూవీ కోసం కూడా తీసుకుంటున్నారంట. ఇలా ఒక్క ఐటెం సాంగ్ తో మళ్లీ ఛాన్సులు కొట్టేస్తోంది ఈ బ్యూటీ.
నెలకి 40 లక్షల భరణం:
2009లో వివాహబంధంతో ఒక్కటైన రవి మోహన్, ఆర్తి దంపతులు, 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2024లో విడిపోతున్నట్లు రవి ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన తన సమ్మతి లేకుండా జరిగిందని ఆర్తి ఆరోపించారు. అప్పటి నుంచి ఇరు వర్గాల నుంచి సోషల్ మీడియాలో ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో ఈ వివాదం మరింత ఉధృతమైంది. రవి మోహన్ తన భార్య ఆర్తిని ఆర్థికంగా, భావోద్వేగపరంగా ఇబ్బంది పెట్టారని, తన పిల్లల బాధ్యతలను విస్మరించారని ఆర్తి ఆరోపిస్తే, ఆర్తి తనను ఇంటి నుంచి గెంటేసి, పిల్లలతో కలవనీయకుండా చేశారని రవి ఆరోపించారు. మే 21, 2025న చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో జరిగిన విచారణలో ఆర్తి నెలవారీ భరణంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ డిమాండ్‌ను ఎద్దేవా చేస్తూ రవి మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఫోన్‌లో మాట్లాడుతున్న ఫోటోతో “సమాచారం వచ్చింది” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను ఆర్తి డిమాండ్‌కు స్పందనగా భావిస్తూ నెటిజన్లు, అభిమానులు దీన్ని ఎగతాళిగా చూస్తున్నారు. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో, రవి-ఆర్తి వివాదం మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. రవి మోహన్, ఆర్తి మధ్య విడాకుల వివాదం సినీ పరిశ్రమలోనే కాక, సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.
పవన్ కళ్యాణ్ కార్చిచ్చు:
‘హరి హర వీరమల్లు’ సినిమా గీతావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, “ఈ సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం క్రిష్తో మొదలై, ఇప్పుడు జ్యోతికృష్ణతో సఫలమైంది. నేను ఎందరో దర్శకులతో పనిచేశాను, కానీ జ్యోతికృష్ణలో అరుదైన లక్షణం కనిపించింది. వేగంగా నిర్ణయాలు తీసుకుని, వాటికి కట్టుబడి, ఎడిటింగ్, గ్రాఫిక్స్, సంగీతం అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ, నిద్రాహారాలు మాని ఈ చిత్రం కోసం అమితంగా శ్రమించాడు. పవన్ కళ్యాణ్ గారిని మీరు పవర్ స్టార్ అంటారు, నేను మాత్రం ధర్మాగ్రహంగా చూస్తాను. సమాజం కోసం ఆయనలో ఉండే ఆ ఆగ్రహం అరుదైనది. ‘హరి హర వీరమల్లు’ సినిమాను ఆయనకు సరిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కార్చిచ్చులా దూసుకుపోయే పవన్ గారితో నా తొలి సినిమా కావడంతో ఎంతో శ్రద్ధతో పనిచేశాను. జూన్ 12న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను,” అని హృదయస్పర్శిగా చెప్పారు.