మామునూరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి.. సీఎం దిగ్భ్రాంతి
వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ.. రెండు ఆటోలను ఢీ కొట్టింది. దీంతో.. భారీ ఐరన్ రాడ్లు ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఐనవోలు మండలం పంథిని వద్ద యూరియా బస్తాలు తీసుకెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. అనంతరం మామునూరు దగ్గర మరో ఆటోను ఢీకొట్టి లారీ బోల్తా పడింది.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డికి అభినందనలు!
వైసీపీ పార్టీలో ఉండలేకే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ఏ2 విజయసాయి రెడ్డి, ఏ1 జగన్ రెడ్డి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు, తప్పులు చేశారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఓ డైనోసార్ అని, జగన్ సార్ బేకార్ అని విమర్శించారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.
కడపలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘ఏ2 విజయసాయి రెడ్డి, ఏ1 జగన్ రెడ్డి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి. జగన్ పార్టీ అడుక్కు వెళ్లింది. వైసీపీ పార్టీ ఓ డైనోసార్, వైఎస్ జగన్ సార్ బేకార్. ఆయనను నమ్ముకున్న వాళ్లది అర్ధనాదం. గత నెల పులివెందుల పర్యటనలో డీఎస్పీ మురళి నాయకను జగన్ బెదిరించారు. రెండు, మూడు నెలల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ డీఎస్పీని బెదిరించారు. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇలాంటి పార్టీ ఉండకూడదు, అందరూ బయటికి రావాలి. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి విజయసాయి ఫోన్ చేశారట. వివేకాకు గుండెపోటు అని ఎవరో చెబితేనే తెలిసిందని విజయసాయి చెప్పారు’ అని అన్నారు.
బస్తర్ గ్రామాల్లో స్వాతంత్య్రం తర్వాత తొలిసారి ఎగిరిన భారత జెండా..
ఛత్తీస్‌గఢ్ బస్తర్ ఏరియా, నక్సలిజానికి కంచుకోట. ఇప్పటికీ దేశంలో మావోయిస్టులు చాలా యాక్టివ్‌గా ఉన్న ప్రాంతం. నిత్యం ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ పోరులో అనేక గిరిజన పల్లెలు గత కొన్ని దశాబ్ధాలుగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ అక్కడి గిరిజన గూడేల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే అనుమానపు చూపులే. నిజానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా కూడా, ఛత్తీస్‌గఢ్ అటవీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ పట్టు పూర్తిగా లేదని చెప్పొచ్చు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేసిన మంత్రి..
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో ప్రతిష్టాత్మక నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 98 మందికి 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఏ పాలకులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే మేము 20% పెంచి రైతు భరోసా ఇస్తున్నాం. వ్యవసాయానికి యోగ్యమైన భూమికే రైతు భరోసా ఇస్తున్నాం. బీఆర్ఎస్ పాలించిన పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉప ఎన్నికలు వచ్చిన చోటే కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. రాష్ట్రాల్లో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం. సంక్షేమ పథకాలు అందుకోవడానికి అర్హతలు ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు అన్ని పథకాలు అందజేస్తాం. రేషన్ బియ్యాన్ని సగం మంది వినియోగించుకోవడంలేదు.. బ్లాక్ మార్కెట్ కు అమ్ముకుంటున్నారు.” మంత్రి తెలిపారు.
“తెలంగాణకు అన్యాయం” పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం రియాక్షన్…
కేంద్ర ప్రకటించిన పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వానికి, ఆత్మగౌరానికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, సమాజం కోసం, కలల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఐదుగురు పేర్లను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. వీరిలో ఒక్కరికి కూడా అర్హత లేదా? అని ప్రశ్నించారు.
భట్టి గారు మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా..?
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. భట్టి విక్రమార్క rతన “రేషన్ కార్డు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి నాలుగు పథకాలను మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తాం” అనే ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఒక గ్రామానికే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పరిమితమా? అని ప్రశ్నించారు. ట్విట్టర్ (ఎక్స్ )లో కేటీఆర్.. ‘ భట్టి గారు మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా ? మండలానికి ఒక గ్రామంలోనే గ్యారెంటీ కార్డులు ఇచ్చారా ? మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా ? మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా ? మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా ? నాడు “అందరికీ అన్నీ..” అని.. నేడు “కొందరికే కొన్ని..” పేరిట మభ్యపెడితే నాలుగు కోట్ల తెలంగాణ మీ నయవంచనను క్షమించదు..’ అని ఆయన అన్నారు.
ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు.. వ్యవస్థాపక అధ్యక్షుడిగా..
ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటైంది. వ్యవస్థాపక ఛైర్మన్‌గా టీజీ వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కర్నూలులో ఏర్పాటు చేశాం. సినీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేది.మద్రాస్ లో రాయలసీమ వాళ్లు పెద్ద,పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారు. కళలకు పుట్టినిల్లు రాయలసీమ. సినిమాలకు ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నది మా రాయలసీమ వాసులు. కానీ సినిమా నిర్మాణం, చిత్రీకరణ ఇక్కడ జరగడం లేదు. ఎంతో ప్రాముఖ్యత ఉన్నా ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదు. రాష్ట్రం విడిపోయాక కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో ఉండిపోయింది. నిబద్ధతతో ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, అనుమతులు కావాలన్నా మేము వారికి సహకరిస్తాం…” అని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.
నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టా: డిప్యూటీ స్పీకర్
నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టా అని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. గతంలో తనకు న్యాయం జరగదు అనే భావం ఉండేదని.. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. “పీవీ సునీల్ కుమార్ వెనుక ఉన్న ఆర్మీని చూసి భయపడుతున్నారా? వాళ్ల దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతూ ఉంది.. లేదంటే , సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను ఎందుకు దర్యాప్తునకు పిలవడం లేదో అన్న అనుమానం ఉంది.. ఈ కేసులో ఇప్పటివరకు ఏ1, ఏ 2 లకు నోటీసులు ఇవ్వలేదు. సస్పెన్షన్ చేయలేదు.. సర్వీసు రూల్స్ ప్రకారం.. అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వాళ్ళనీ సస్పెన్షన్ చేయాలి.. కానీ ఎందుకు సస్పెండ్ చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు.. విజయ పాల్ కు గతం గుర్తుకు రావడం లేదంట, సడన్గా వయసు అయిపోయింది అని చెప్తున్నారు.. భవిష్యత్తులో, నిందితులకు శిక్ష పడుతుందని, నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను..” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవారికి ఇళ్లు
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవారికి ఇళ్లు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకు ముందు ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదన్నారు. మేము పేదల అందరికీ పథకాలు అందేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇందిరమ్మ పేరు ఉంటే డబ్బులు ఇవ్వం అంటున్నారని, మీ జేబులో నుండి ఇస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. అన్నీ దగ్గర పెట్టుకుని మాట్లాడండని, బడ్జెట్‌లో నిధులు పెట్టకపోతే ఎందుకు అడగడం లేదు బీజేపీ నేతలు అని ఆయన అన్నారు.
ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డి గూడ గ్రామంలో ప్రజా పాలన లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు కుసుమ కుమార్, శివసేనా రెడ్డి తదితరులు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లబ్దిదారులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లకు ఎన్నికైన వారికి ధృవీకారణ పత్రాలు అందజేశారు. మహేష్ కుమార్ గౌడమాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మహిళ్లకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మామ, అల్లుడు, బిడ్డ, కొడుకు కాదన్నారు. కుటుంబ పాలన కాదన్నారు.