బలగం తర్వాత కొరియోగ్రాఫర్ ను ‘హీరో’ చేస్తున్న దిల్ రాజు
దిల్ సినిమాతో నిర్మాతగా మారి పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు వెంకట రమణారెడ్డి. మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకుని దిల్ రాజు అయిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ లో లీడింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అయితే ఈ మధ్యనే తన సొంత వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి దాని బాద్యతలు తన కుమార్తె హన్షిత రెడ్డికి అప్పగించారు. ఆమె నిర్మాతగా కమెడియన్ వేణు డైరెక్టర్ గా తెరకెక్కించిన బలగం సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు పదుల సంఖ్యలో విదేశీ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇక అలాంటి ప్రొడక్షన్ నుంచి రెండో సినిమా ఏం వస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్న క్రమంలో ఒక ఆసక్తికర అంశం అయితే టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమంటే ఈ ప్రొడక్షన్ లో రెండో సినిమా ఇప్పటికే ఫిక్స్ అయిందని ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ ను హీరోని చేస్తున్నారని ప్రచారం జరగగా దాన్నే నిజం చేశారు. తెలుగులో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న యష్ మాస్టర్ ఈ సినిమాతో హీరో అవుతున్నాడు. ఇక ఆయన సరసన హీరోయిన్ గా ఒకప్పటి హీరోయిన్ రాధ కుమార్తె జోష్ సినిమా హీరోయిన్ కార్తీక నాయర్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను శశి కుమార్ ఎం డైరెక్ట్ చేయబోతున్నారు. ఆకాశం దాటి వస్తావా అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఆ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అకాశం
3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా… కొన్ని జిల్లాల్లో నేడు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అకాశం ఉందని, ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు వాతావారణ శాఖ అధికారులు. 25, 26, 27 తేదీలలో భారీ వర్షాలు కొన్ని చోట్ల, భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.. ఈ రోజు భారీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే అవకాశం ఉంది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 26,27 తేదీల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే అవకాశం ఉంది.
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని న్యాయస్థానం తీర్పునిచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం లో ప్రభుత్వం వైఫల్యం పై మహా ధర్నా చేయనుంది బీజేపీ. అయితే.. ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ శ్రేణులు. దీంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. అయితే.. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ప్రభుత్వ తరుపు న్యాయ వాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు.
దీంతో.. కేంద్రం ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా ? అని ప్రశ్నించింది న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన న్యాయస్థానం… 5వేల మందికి మీరు భద్రత కల్పించలేక పోతే ఎలా అని ప్రశ్నించింది. దీంతో.. రేపటి బీజేపీ మహాధర్నాకు 500 మంది మాత్రమే ధర్నా లో పాల్గొనాలని, ఎలాంటి ర్యాలీ లు చెప్పటవద్దని సూచించింది హైకోర్టు. పోలీసులు అనుమతి నిరాకరించడంపై హై కోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వేరే కారణాల చూపుతూ ఎందుకు ధర్నా కు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించింది హైకోర్టు.. 1000 మంది వస్తారని, ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న కారణంగా అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వం తరుఫు న్యాయవాది వెల్లడించారు.
మణిపూర్‌లో ఆగని కాల్పుల మోత.. స్కూల్, ఇండ్లు దగ్ధం
మణిపూర్ లో హింసాకాండ ఆగడం లేదు. మరోసారి కాల్పులకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో ఒక పాఠశాల, పది ఇళ్లకు నిప్పు పెట్టడంతో దగ్ధమయ్యాయి. రాష్ట్రంలో జాతి ఘర్షణల మధ్య ఇద్దరు గిరిజన మహిళలను బహిరంగంగా అవమానించడం, దూషించడం వంటి ఆందోళనకరమైన వీడియోలు వైరల్ అయిన తర్వాత అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా ఈ ఘటన పట్ల ప్రతిపక్ష నాయకులు, ప్రజలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
మణిపూర్ లోని చురచంద్ పూర్ జిల్లాలో గత రెండ్రోజులుగా అనుమానిత ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదరుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడగా, 10 పాడుబడిన ఇళ్లు, ఒక పాఠశాల దగ్ధమయ్యాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో భద్రతా సిబ్బందిపై పలు రౌండ్లు, స్థానికంగా తయారైన బాంబులు విసిరినట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర జాతి ఘర్షణల మధ్య ఇద్దరు గిరిజన మహిళలను బహిరంగంగా అవమానించడం, దూషించడం వంటి ఆందోళనకరమైన వీడియోను చిత్రీకరించిన తరువాత చురాచంద్ పూర్ లో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖండించారు. ఈ ఘర్షణను ప్రధాని మోడీ సిగ్గుచేటుగా అభివర్ణించారు. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అనడంతో ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులను పట్టుకునేందుకు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ రకమైన చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలు కేసీఆర్ ఎందుకు నెరవేరుస్తలేరు
తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలు కేసీఆర్ ఎందుకు నెరవేరుస్తలేరని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం అబ్బుర పడే రీతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సాధ్యం కాదు…వారికి డబ్బులిస్తే వారే ఇండ్లు కట్టుకుంటారని ఆనాడే చెప్పాము…కానీ కేసీఆర్ మామాట వినలేదని ఆయన వ్యాఖ్యానించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కాయని, నేటి ధర్నా రాజకీయ కార్యక్రమం కాదు… పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన మండిపడ్డారు.
బాట సింగారం లో కట్టిన ఇండ్ల గోడలు పెచ్చులూరి పోయాయి…కానీ అర్హులకు అందలేదని, మేము సందర్శిద్దామని వెళ్తుంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించారని ఆయన ధ్వజమెత్తారు. 2023 తర్వాత మీ ప్రభుత్వం ఖతమే… మళ్ళీ కేసీఆర్ కు ఓటు వేయమని పేద ప్రజలు చర్చించుకుంటున్నారని, ఒక్కో ఇంటి నిర్మాణానికి హడ్కో ద్వారా 2 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ డబ్బులు తీసుకున్నావ్ కేసీఆర్ నీ అబ్బ జాగీరా …డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి చూపియ్యి అని ఆయన అన్నారు. ధనిక రాష్ర్టం అయితే ఇండ్లు ఎందుకు నిర్మిస్తలేరు.. హుజురాబాద్ ఎన్నికల్లో పాత్రికేయులకు ఇస్తానన్న ఇండ్లు ఏమయ్యాయి…? కూలి చేసుకున్న పైసలు బార్ షాపులకు వెళ్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తాం. ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్దులకు పెన్షన్ ఇస్తాము. అర్హులైన పేద రైతులకే రైతు బంధు,రైతు భీమా ఇస్తాం’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
గుజరాత్లో వర్ష బీభత్సం.. కూలిన రెండు అంతస్థుల భవనం..!
గుజరాత్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలుపుతోంది. గుజరాత్ ప్రాంతంలోని ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, నవ్‌సారి, సౌరాష్ట్ర-కచ్‌లోని జామ్‌నగర్, పోర్ బందర్, జునాగఢ్, అమ్రేలీ, గిర్ సోమనాథ్, కచ్‌తో పాటు డయ్యూలో రాబోయే 5 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గుజరాత్ తీరంలోని మత్స్యకారులు ఈనెల 26 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని భారత వాతావరణ విభాగం, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సూచించింది.
బీఆర్‌ఎస్ పార్టీ కండువ ఎసుకున్న వారికే కులవృత్తుల సహాయం
కామారెడ్డి జిల్లా డబుల్ బేడ్ రూం ఇండ్లని పేద ప్రజలకి ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని నిరుపేదలకి డబుల్ బేడ్ ఇస్తానాని చెప్పిన హామీ నిరాశగా మారిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకి అన్యాయం చేసిందని, ఓట్ల కోసం మాత్రమే కేసిఆర్ కి పథకాలు గుర్తుకొస్తాయని ఆయన మండిపడ్డారు. దళిత బంధు కామారెడ్డి జిల్లాలో ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కండువ ఎసుకున్న వారికే కులవృత్తుల సహాయం వస్తుందని, తీపి మాటలతో ప్రజలని కేసీఆర్ మభ్య పెడతున్నాడని ఆయన ఆరోపించారు.
ఐదు రోజులు అత్యంత భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఐఎండీ వార్నింగ్
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, చిరు జల్లులు పడుతున్నాయి.. అయితే, రానున్న ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ జిల్లాలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ).
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది.. ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారి ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్స్యకారులు వేటకు వెళ్లకూడదంటూ నిషేధం విధించింది.. మరోవైపు.. గత 24 గంటల్లో అత్యధికంగా అల్లూరి జిల్లా చింతూరులో 18 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
బేబీ మూవీ అనూహ్యమైన రికార్డు
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం బేబీ. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జులై 14న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 66 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. అయితే తాజాగా కలెక్షన్లలో దూసుకెళ్తున్న ‘బేబీ’ సినిమా మరో అరుదైన రికార్డు సృష్టించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో 10వ రోజు రూ.3.40 కోట్లు వసూలు చేసి మిడ్ రేంజ్ సినిమాల్లో అత్యధిక షేర్ సాధించిన మూవీగా ఈ సినిమా నిలిచింది.