వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు సహాయక చర్యలు.. సీఎం సమీక్ష
వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.. వరద ముంపుపై ఎన్యుమరేషన్ రేపు సాయంత్రానికి పూర్తి చేయాలి. ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా ఎమ్యునరేషన్ జాగ్రత్తగా చేయాలన్నారు చంద్రబాబు.. ఈ రోజు సాయంత్రానికి వీధుల్లో నీళ్లన్నీ క్లియర్ అయిపోతాయి. పారిశుధ్యం పనులు నిరంతరం కొనసాగాలన్న ఆయన.. నిత్యవసర సరుకులు పంపిణీ బాగా జరుగుతోంది. నేటి సాయంత్రానికి సరుకుల పంపిణీ కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలుగుతాం. మనది తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతం.. దానికి అనుగుణంగా సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలన్నారు..
సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు..
సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా చేపట్టిన విషయం తెలిసిందే. ఎఫ్టీఎల్,బఫర్ జోన్ లలో నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించింది. హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. పలువురు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై హైడ్రా సిబ్బంది మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు వెంకటేష్,లక్ష్మీ,సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
జనగామ మున్సిపల్ కమిసనర్ కు హైకోర్టు నోటీసులు..
జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణం,ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదుపై అలసత్వం ప్రదర్శించారనే అభియోగంపై ఈ నెల 12న కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. యశ్వంతాపూర్ రెవెన్యూ సర్వే నెంబరు కు చెందిన భూమిలో ఓ ఇంటి నిర్మాణం అక్రమమని,స్థల ఆక్రమణ జరిగిందని చర్యలు తీసుకోవాలని మధుసూధన్ అనే వ్యక్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు అందాయి. అయితే.. కమిషనర్ స్పందించకపోవడంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ సెక్రటరీ,స్థానిక మున్సిపల్ కమిషనర్ మరొకరిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు హాజరుకాని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 12 న కోర్టులో హాజరుకావాలని జనగామ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించింది. మున్సిపల్ చట్టం 2019ను అనుసరించి,కమిషనర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరివిగా విరాళాలు
ఏపీ వరదలు ముంచెత్తాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. వరదలతో అపార నష్టం జరిగింది.. అంచనా వేస్తుంటే.. నష్టం పెరిగిపోతూనే ఉంది.. ఓవైపు ప్రజల ఆస్తులు.. వాహనాలు.. పంటలు.. విద్యుత్ వ్యవస్థ.. రవాణా వ్యవస్థ.. మున్సిపల్ వ్యవస్థ.. పంచాయతీరాజ్ వ్యవస్థ.. ఇలా అనేక రకాలుగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన వచ్చింది.. అయితే, మేం ఉన్నామంటూ దాతలు ముందుకు వస్తున్నారు.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఉద్యోగులు.. సంఘాలు.. రాజకీయ పార్టీలు.. వ్యక్తులు.. సంస్థలు.. సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.. ఇక, ఈ రోజు కూడా సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి..
ప్రకాశం బ్యారేజీ కూల్చి వేతకు కుట్ర..! వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి..
కృష్ణానదిలో భారీ వరలు.. విజయవాడ అతలాకుతలం అవుతోన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం సంచలనంగా మారింది.. అయితే, దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు హోం మంత్రి అనిత.. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్‌రెడ్డి, అందుకు సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు.. క్రిమినల్ రాజకీయ నాయకుడు అయితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో అర్థం అవుతుందన్న ఆమె.. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇసుక లూటీ కోసం ఉపయోగించిన బోట్లు ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయడానికి వాడారు… కౌంటర్ వెయిట్స్ కు కాకుండా పిల్లర్స్ కూలిపోయి వుంటే నష్టం మాటలకు అందేది కాదన్నారు.. బోట్లు పోయాయి అని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు.. ఉద్దడంద రాయుడు పాలెం దగ్గర వుండాల్సిన బోట్లు బ్యారేజ్ ఎగువకు ఎలా వచ్చాయి..? అని నిలదీశారు.
పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై కోర్టు తీర్పు.. స్పందించిన ఎమ్మెల్యే
పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్ విడుదలకు హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
నివేదికలు సిద్దం చేయాలని కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశం
తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్&కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం (11 సెప్టెంబర్) నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా.. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. ఈ సందర్భంగా.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారు కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ గారితో ఫోన్లో మాట్లాడి.. ఆదివారం నాటి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లపై ఆరా తీశారు. నివేదికలు సిద్దం చేయాలని కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశించారు.
ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల తొలగింపు..
ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను తొలగించేందుకు ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నారు. రెండు భారీ క్రేన్లతో బోట్లను తొలగిస్తున్నారు. బ్యారేజీకి ప్రమాదం లేకుండా బోట్లను నది ప్రవాహం వైపు పంపే ప్రయత్నం చేస్తున్నారు. బోట్లను వైర్లతో లాక్ చేసి నదిలో వంగిపోయిన బోటును రివర్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత.. బోటును డైరెక్షన్ మార్చేందుకు చూస్తున్నారు. అలా అయితే.. ఆ బోటు నది ప్రవాహంలో వెళ్లిపోతుంది. ఈ క్రమంలో.. బోటు ఉన్న ప్రాంతంలో గేట్లను ఎత్తేసి ఈ చర్యను చేపట్టారు. దాదాపు 50 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. బోటను లిఫ్ట్ చేసేందుకు లిఫ్టింగ్ క్రేన్ చైన్ సాయంతో డైరెక్షన్ మార్చేలా ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత.. నది ప్రవాహానికి ఆ బోటు కొట్టుకుని పోయి ముందు ఎక్కడైనా ఆగిన తర్వాత రికవరీ చేసుకుంటారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ బోట్లను తొలగించేందుకు.. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు పనులు చేస్తున్నారు.
ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్.
గణేష్ ఉత్సవ కమిటీలకు తెలంగాణ హైకోర్ట్ శుభవార్త చెప్పింది. గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే వినాయకులు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తుంటారు. ఖైరతాబాద్ గణేశుడి నుంచి వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. కానీ.. ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఈసారి ఫుల్ స్టాప్ పడుతందని భావించిన వేళ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ సంవత్సరం కూడా హుస్సేన్ సాగర్‌లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడానికి అనుమతించింది. పిటిషనర్ కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపించలేకపోవడంతో ఈ మేరకు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తిరస్కరించింది తెలంగాణ హైకోర్టు. గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని హైకోర్టు సూచించింది. నిమజ్జనం చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఏలేరు వరద ముంపుపై అధికారులతో డిప్యూటీ సీఎం టెలికాన్ఫరెన్స్..
ఏలేరు వరద ముంపుపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కోరారు. రైతులకు భరోసా కల్పించండి.. వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని తెలిపారు. ఏలేరు వరద ముంపు ప్రభావితమైన 21 మండలాల్లోని 152 గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. దెబ్బ తిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు తెలిపారు. అలాగే.. ప్రాణ నష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు వివరించారు.