హైదరాబాద్ కు పొంచి ఉన్న వరుణుడి ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వానలు కురుస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో హైదరాబాద్ తడిసిముద్దయింది. కొత్తపేట, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, వనస్థలిపురం, ఉప్పల్, నాగోల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
బల్కంపేట రోడ్డు మూసివేత.. మళ్లింపు ఇలా..
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఈ నెల 9న వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కల్యాణానికి సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సమీపంలోని రహదారున్నీ మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆంక్షలపై భక్తులు, ప్రయాణికులు గమనించాలన్నారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవం పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని సూచించారు.
కేరళను భయపెడుతున్న పీఏఎం వ్యాధి.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి
కేరళ రాష్ట్రాన్ని బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి భయపెడుతుంది. కోజికోడ్ లో మెదడుని తినే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పీఏఎం) వ్యాధితో 15 ఏళ్ల బాలుడు మరణించాడు. చెరువులో స్నానానికి దిగిన తర్వాత అతడికి ఈ వ్యాధి వచ్చింది. కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పీఏఎంతో ఐదేళ్ల బాలిక ట్రిట్మెంట్ తీసుకుంటుంది. దీంతో, కేరళలో పీపీఎంకి సంబంధించిన నాలుగో కేసు కూడా నమోదైంది. కోజికోడ్ లో గత రెండు నెలల్లోనే అరుదైన ఇన్ఫెక్షన్ తో ఇప్పటి వరకు మొత్తంగా ముగ్గురు చనిపోయారు. కాగా, పీఏఎం వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన శుక్రవారం ఉన్నత స్థాయి భేటీ జరిగింది. మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు ఎవరూ వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుంది…!
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్.. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆయన.. తిరుమలలో గత ఐదేళ్లుగా ఇచ్చిన బ్రేక్ దర్శనం వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. ఇక, జూ పార్క్ ను వడమాలపేటకు తరలించి ఇక్కడ టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం నేను ఎంపీగా ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. భూమి పూజ చేసి పునాది రాయి వేశాం.. క్రికెట్ స్టేడియం కోసం వేసిన పునాది రాయి అనాది రాయి కాకుండా నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు..
కాంగ్రెస్ లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. రేపు మరో నలుగురు..!
తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుస వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో కండువా కప్పి కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. రేపు చేరాల్సి ఉండే.. జిల్లా రాజకీయ పరిస్థితులు దృష్ట్యా ఇవాళ చేరడం గమనార్హం. కాంగ్రెస్ లో రేపు మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు చేరే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా ఇవాళ ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు శ్రీధర్ బాబును బీఆర్ఎస్ నేతలు కలవనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకుంది. ఈ కార్యక్రమంలో.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే. కేశవరావు..
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా వ్యవహారాల సలహాదారుగా కేశవరావు కొనసాగుతారు. కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేకే గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకడ్‌తో కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేకే పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉంది. దీంతో పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు, ఎంపీ ఎన్నికల్లో టిక్కెట్ రాని సీనియర్ నేతలు ఆ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. అయినా వారి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది, ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీకి సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. ప్రియురాలు లావణ్యపై హీరోయిన్ కేసు?
సినిమా రేంజ్ ట్విస్ట్‌లతో రాజ్‌తరుణ్ – లావణ్యల వ్యవహారం పూట పూటకు కొత్త అంశాలతో ఆసక్తి రేకెత్తిస్తోంది. తనను ప్రేమించి రాజ్‌తరుణ్ మోసం చేసాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడని, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో రాజ్‌తరుణ్‌కు సంబంధం ఉందని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని అప్పుడు రాజ్ తరుణ్ అండగా నిలబడలేదని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక ఈ కేసులో మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ ప్రమేయం ఉందని ఆమె తనను కాల్స్ చేసి కూడా బెదిరించిందని ఆమె ఆరోపంచింది. లావణ్యపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు చేశాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది, వద్దని వారించినందుకు తనతో గొడవ పడింది.
ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడు మాసాలు పూర్తి అవుతుందని, ఇది చాలా పెద్ద సమయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని, కానీ ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నం.. బీఆర్ఎస్ పని అయిపోయిందని విన్యాసాలు చేస్తున్నారన్నారు. భారత పార్లమెంటు లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం 20శాతం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతకు ముందు కేవలం పది శాతానికి పరిమితం అయిందని, కానీ అసెంబ్లీలో బీఆర్ఎస్ 33శాతం ప్రాతినిధ్యం కలిగివుందన్నారు నిరంజన్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ ఉన్నట్టా లేనట్టా? అని ఆయన ప్రశ్నించారు.
యూకే కొత్త ప్రధాని కైర్ స్టార్‌మన్‌కి అభినందనలు తెలిపిన మోడీ..
యునైటెడ్ కింగ్డమ్(యూకే) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ, అధికార రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీని చిత్తుగా ఓడించింది. యూకే ప్రజలు లేబర్ పార్టీకి గణనీయమైన అధికారాన్ని కట్టబెట్టారు. కొత్త ప్రధానిగా కైర్ స్టార్మన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, యూకేకి కాబోతున్న పీఎం కైర్ స్టార్మన్తో శనివారం మాట్లాడారు. విజయం పట్ల ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇరు దేశాలకు లాభదాయకమైన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకునేందుకు కృషి చేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చించాల్సిన అంశాలను సిద్ధం చేసుకున్న ఏపీ సీఎం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో అధికారులతో భేటీ ముగిసింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చించాల్సిన అంశాలను సీఎం చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం 5:30 గంటల తరువాత సీఎం చంద్రబాబు ప్రజాభవన్ బయలుదేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు.
సుదీర్ఘ కాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగనుంది. షెడ్యూల్ 9, 10 లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీ తరుఫున చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేశ్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు ఈ చర్చల్లో పాల్గొంటారు. ప్రజాభావన్లో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగనుంది. సీఎంల మీటింగ్ అనంతరం డిన్నర్ ఉండనుంది.