మాపై రాళ్ళతో దాడి చేసి తిరిగి కేసులు పెట్టారు..
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 14 మంది ఉంటే తెలుగు దేశం పార్టీకి కేవలం 6 మంది వార్డు సభ్యులతో ఉపసర్పంచ్ పదవీ కోసం పోటీ పడ్డారు.. ఉప సర్పంచ్ పదవి కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేశారని పేర్కొన్నారు. అలాగే, వైసీపీ వార్డు సభ్యులపై సైకిల్ పార్టీ నేతలు దాడి చేశారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. జాతికి అంకితం!
శ్రీరామ నవమి 2025 సందర్భంగా భారతదేశంలోని మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (పంబన్ బ్రిడ్జ్) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రిమోట్ పద్ధతిలో పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని.. వంతెనను జాతికి అంకితమిచ్చారు. అదే సమయంలో రామేశ్వరం-తాంబరం (చెన్నై) కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి రైలు బయలుదేరింది.
వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు..
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి. సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతతో కలిసి ఈ క్రతువుకు హాజరయ్యారు. స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మరోవైపు టీటీడీ తరఫున ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో సీఎం రేవంత్ సహపంక్తి భోజనం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం.. లబ్ధిదారు కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీశారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని తులసమ్మ సమాధానమిచ్చింది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. 200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని సీఎం రేవంత్ ఆరా తీశారు. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగపడుతుందని తులసమ్మ సంతోషం వ్యక్తం చేసింది.
దేశంలో గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్టులోకి దుసుకొచ్చిన ఏపీ
దేశంలో గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్ట్ లోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది.. 2024-25 సంవత్సరానికి గ్రోత్ రేట్ లో రెండవ స్ధానంలోకి ఏపీ.. కాన్ స్టెంట్ ప్రైసెస్ లో 8.21 శాతం గ్రోత్ రేట్ తో దేశంలో రెండో స్థానంలో ఏపీ.. 9.69 శాతం గ్రోత్ రేట్ తో దేశంలో మొదటి స్థానంలో తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ను నిర్థారిస్తూ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. ఇక, ఏడాది కాలంలో 2.02 శాతం పెరిగి 8.21 శాతంగా నమోదు అయింది. కరెంట్ ప్రైసెస్ విభాగంలో 12.02 శాతంగా ఎపి గ్రోత్ రేట్.. ఏపీ వృద్దిరేటు దేశంలో రెండో స్థానానికి చేరడంపై ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం గాడిన పడడంతో పాటు కాన్ఫిడెన్స్ పెంచేలా వృద్ది రేటు సాధించామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంథన రంగం సహా పలు రంగాల్లో తీసుకొచ్చిన పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. గ్రోత్ రేట్ వృద్ది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్ కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
పండగ పూట విషాదం.. కృష్ణా నదిలో స్నానానికి దిగి.. ముగ్గురు యువకులు గల్లంతు
పండగ పూట కృష్ణ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి దిగి మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు మత్తి వర్ధన్ (16), s/o బావన్నారాయన, మత్తి కిరణ్ (15) s/o రంగారావు, మత్తి దొరబాబు (15) s/o వరదరాజులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురిలో ఒకరు మృతిచెందగా నదిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం కృష్ణ నదిలో గాలింపు చేపట్టారు అధికారులు. కిరణ్ మృతదేహం లభ్యమవటంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ విషాద ఘటనతో మోదుమూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు కేటీఆర్ బహిరంగ లేఖ
తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు. ఇక ఇందులో తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొత్త సమస్యలు సంభవిస్తున్నాయని.. ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక లాభాలను పరిగణలోకి తీసుకుని పర్యావరణంపై దాడులు జరగడం చాలా దారుణ పరిస్థితిని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడడంతో పాటు 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు మరియు 10 క్షీరదాల జీవ ఆవాసంని నాశనం చేసే ప్రమాదం ఉందని.. ఈ నాశనం లేకుండా ఆపడానికి మనం చర్యలు తీసుకోవాలని అన్నారు.
HCU తరలింపు అనాలోచిత నిర్ణయం.. మాజీ మంత్రి హాట్ కామెంట్స్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) తరలింపు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన అనాలోచితమైనది అని వ్యాఖ్యానించారు. HCUని తరలించడం అనేది ప్రభుత్వానికి సరికొత్త సమస్యలను తెచ్చిపెట్టే నిర్ణయమని ఆయన తెలిపారు. HCUని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చేస్తే మంచిది అని చెప్పారు. గతంలో HCUని తరలించాలని అనుకున్న ముఖ్యమంత్రి లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు మరింత ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
HCU తరలింపును వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ పై చేసిన ఆరోపణలపై స్పందించారు. AI ద్వారా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆరోపించడం సరికాదు అని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఆలోచనలు లేకుండా ఆక్షేపణలు చేయడం సరైనది కాదని ఆయన సూచించారు. జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. ప్రభుత్వం కోర్టులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే కొందరు అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, ఈ పరిస్థితి సరిపోలేలా లేదు అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కొందరు అధికారి తప్పుదారి పట్టిస్తున్నారు, దీని మీద ప్రభుత్వం గమనించాలని ఆయన సూచించారు.
కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాజ్యసభ సభ్యుడు
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, అల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. 400 ఎకరాల భూమి వేలం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆయన ఆ తీర్పు ప్రభుత్వానికి “చెంపపెట్టు లాంటిది” అంటూ పేర్కొన్నారు.
జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయండి
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నదేమిటంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మరో 2,500 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించిందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుందని అన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం రూ. 12,619 కోట్ల వ్యయంతో 691.52 కిమీ పొడవున నిర్మించనున్న లేదా నిర్మించబడుతున్న 16 జాతీయ రహదారి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం 1,550.529 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 904.097 హెక్టార్ల భూమినే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్వాధీనం చేయిందని, ఇంకా 646.432 హెక్టార్లు మిగిలి ఉన్నాయని వివరించారు. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ మెరుగుపడి, పారిశ్రామిక అభివృద్ధి , ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధించిన ఘనత మోదీ ప్రభుత్వానిదని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ చూపి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనీ, నిర్మాణాలను గడువులోపే పూర్తి చేసేలా సహకరించాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు.