మంత్రి మల్లారెడ్డికి ఏపీ మంత్రి కౌంటర్.. ఇక్కడికి వచ్చి చూడండి..!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏపీ వచ్చి చూడాలని సూచించారు.. పోలవరం ప్రాజెక్టు గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడకపోవడం బెటర్ అని హితవుపలికిన ఆయన.. ఏపీలో సామాజిక న్యాయం అమలు అవుతుందన్నారు.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్నది వారి నాయకత్వమే అని గుర్తించాలన్నారు.. మరోవైపు.. అశ్వనీదత్ ఎవరి మెప్పు కోసమో మాట్లాడుతున్నట్లు ఉంది.. అంటూ నిర్మాత అశ్వనీదత్ కామెంట్లపై కౌంటర్ ఎటాక్ చేశారు.. సినిమా పరిశ్రమలోని పెద్దలు తెలుగు సినిమాకి ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఏంటి? అంటూ సవాల్ చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ..
ప్రగతి నిరోధకులు అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారు
నూతన సచివాయం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాకపోవడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన సూర్యపేట జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నిరోధకులు అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. అందుకే సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ దూరంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన జరిగే నష్టం శూన్యమని, రావడం రాక పోవడం గవర్నర్ విజ్ఞత మీద ఆధార పడి ఉంటుందన్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గైర్హాజరుతో వారీ నిజ స్వరూపం బయట పడిందని ఆయన మండిపడ్డారు. అభివృద్ధిని అభినందించే గుణం ప్రతిపక్షాలకు లేదని, తెలంగాణా అభివృద్ధిని విపక్షాలు ఇష్టపడడంలేదన్నారు. జరుగుతున్న అభివృద్ధితో అడ్రస్ గల్లంతు అవుతుందన్న బెంగ వారిని వెంటాడుతుందని, ప్రజాక్షేత్రంలో వారికి భంగపాటు తప్పదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి నూతన సచివాలయం ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిని ఆయన కొనియాడారు.
రజనీకాంత్ ఏపీకి వచ్చి మాట్లాడారు.. ఆయనపై మీరు తమిళనాడుకు వెళ్లి కామెంట్ చేయగలరా..?
ఎన్టీఆర్ శతజయంతి వేడుక వేదికగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. అయితే, వైసీపీ కామెంట్లకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.. తాజాగా, మంత్రులు, వైసీపీ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏపీకి వచ్చి మాట్లాడారు.. ఇక్కడ రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేసిన కామెంట్లు తమిళనాడు వెళ్లి చేయగలరా..? అని సవాల్.. అవసరమైతే తమిళనాడు వెళ్లేందుకు నేను వైసీపీ నేతలకు కార్లు పెడతాను.. తమిళనాడులో రజనీపై కామెంట్లు చేసి తిరిగి రాగలరేమో చూద్దాం అంటూ కామెంట్ చేశారు. ఇక, పొత్తులు ఇంకా ఖరారు కాలేదన్నారు బోండా ఉమ.. పొత్తులు ఖరారు కాకముందే వైసీపీ నేతలకు ఎందుకంత ఉలుకు..? చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ జరిగితేనే వైసీపీ నేతలకు ఎందుకంత భయం..? అని ఎద్దేవా చేశారు. తలైవా రజనీకాంత్‌పై వైసీపీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయమే అన్నారు. రజనీకాంత్ కు టీ కప్పులు అందించిన చరిత్రను కొడాలి నాని మరిచినట్టున్నారు అంటూ సెటైర్లు వేశారు బోండా ఉమ. మరోవైపు.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. రజనీకాంత్.. సీఎం జగన్‌ను, వైసీపీని పల్లెత్తుమాట అనలేదు… కానీ, వైసీపీ ఫ్రస్టేషన్ తో రజనీపై దాడి చేయడం సరైందికాదన్నారు.. వైసీపీ నేతలు, మంత్రుల మాటలతో రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రేకెత్తే ప్రమాదముందన్న ఆయన.. రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ తక్షణమే అటు తమిళ ప్రజలకు, ఇటు తెలుగు వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన కోర్టు.. వారిపై చర్యలకు ఆదేశాలు
తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసింది బెజవాడ రైల్వే కోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన రైలు దగ్ధం ఘటనను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది కోర్టు.. అయితే, రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. దర్యాప్తు చేపట్టలేదని విజయవాడ రైల్వే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.. ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదన్న న్యాయస్థానం.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.. అయితే, సున్నితమైన అంశాన్ని ఐదేళ్లపాటు ఎందుకు సాగదీశారని ప్రశ్నించింది కోర్టు.. ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.. ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసు అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని పేర్కొన్న న్యాయస్థానం.. తునిలో దగ్ధం చేసిన రైలులో అంతమంది ప్రయాణిస్తే ఒకరిని మాత్రమే విచారణ చేయటం ఏంటని అసహనం వ్యక్తం చేసింది.. ఈ కేసుకు సంబంధించి మొత్తం 41 మందిని రైల్వే పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా సహా 41మంది నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు. మొత్తం 24 మంది సాక్షుల్లో 20మంది విచారణకు హాజరయ్యరు. 20మందిలో ఐదుగురు తమకు ఏమీ తెలియదని సాక్ష్యం చెప్పారు. విచారణ పూర్తి కావడంతో విజయవాడ రైల్వే కోర్టు తుది తీర్పు వెల్లడించింది. కాగా, కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో.. 2016 జనవరిలో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రైలుకు నిప్పుపెట్టడంతో హింసాత్మకంగా మారిపోయింది.. ఈ ఘటనపై అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ కేసులు నమోదు చేసింది. ఇక, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కేసులన్నింటినీ ఉపసంహరించుకున్న విషయం విదితమే.
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష.. అదనంగా 2,100 ఎంబీబీఎస్ సీట్లు
వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పలు అంశాలపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే మాట రాకూడదన్న ఆయన.. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిట్ చేయాలన్నారు.. మౌలిక సదుపాయాలు, మందులు కూడా సరిపడా ఉండేలా చూసుకోవాలని.. ప్రతి సమీక్షా సమావేశంలో కూడా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలంటూ ఆదేశించారు.. ఇక, కోవిడ్ తాజా పరిస్థితులపై సీఎంకు వివరాలను అందించారు అధికారులు.. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని.. గత వారంరోజుల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో రాష్ట్రం 23 స్థానంలో ఉందన్నారు.. ఇక, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 24 మందిగా ఉందని వెల్లడించారు. ఇక, రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా నివారించాలని పేర్కొన్నారు సీఎం జగన్.. విలేజ్ క్లినిక్స్ ద్వారా వీటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. రక్తహీనతతో బాధపడుతున్న గర్భవతులకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. మరోవైపు.. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు.. కొత్త మెడికల్ కాలేజీల వల్ల రాష్ట్రంలో అదనంగా 2,100 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయన్నారు.. ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్ సీట్లకు ఇవి అదనంగా వెల్లడించారు.. ఈ విద్యాసంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయని.. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు, యూనిఫాం సివిల్ కోడ్.. బీజేపీ హామీల వర్షం
బీజేపీ అధినేత జేపీ నడ్డా సోమవారం బెంగళూరులోని పార్టీ ప్రధాని కార్యాలయంలో మే 10న కర్ణాటక ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో ‘ప్రజాధ్వని’ని విడుదల చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప సమక్షంలో నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. పార్టీ మేనిఫెస్టో యువతకు సంక్షేమ చర్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారతపై దృష్టి పెడుతుందని జేపీ నడ్డా తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్, సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, అన్ని నిరుపేద కుటుంబాలకు ప్రతిరోజూ 0.5 లీటర్ నందిని పాలు, ప్రతి వార్డులో అటల్ ఆహార్ కేంద్రం వంటివి పార్టీ తరఫుల కొన్ని కీలక వాగ్దానాలను కర్ణాటక ప్రజల కోసం ప్రకటించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ విజన్‌ను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను రూపొందించినట్లు బసవరాజ్ బొమ్మై తెలిపారు. బీజేపీ చీఫ్ నడ్డా డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయోజనాలను వివరించారు. పార్టీ విజయాలు, ఆశయాల గురించి మాట్లాడారు.
న్యూయార్క్‌లో బైబ్యాక్ కార్యక్రమం.. గిఫ్ట్‌కార్డుల కోసం తుపాకులను వదిలేశారు..
అమెరికా గన్‌కల్చర్ గురించి అందరికి తెలిసిన విషయమే. అగ్రరాజ్యంలో ఎక్కడో ఓ చోట గన్ సౌండ్ వినబడుతూనే ఉంటుంది. ఆ గన్‌కల్చర్‌కు అడ్డుకట్టు వేయడానికి న్యూయార్క్ ఓ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించింది. తుపాకులను వెనక్కి ఇచ్చిన వారికి గిఫ్ట్ కార్డులు అందిస్తామని ప్రకటించింది. న్యూయార్క్ బైబ్యాక్ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత న్యూయార్క్‌లో వేల సంఖ్యలో తుపాకులను వెనక్కి ఇచ్చారు. ప్రమాదకరమైన ఆయుధాలను వదిలిపెట్టిన తుపాకీ యజమానులకు బదులుగా 500 డాలర్ల విలువైన బహుమతి కార్డులను అందించినట్లు ది గార్డియన్ తెలిపింది. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ కార్యాలయం ఈ బైబ్యాక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 3,000 కంటే ఎక్కువ తుపాకులు వదులుకున్నట్లు తెలిసింది. వీటిలో అస్సాల్ట్-స్టైల్ రైఫిల్స్, ఘోస్ట్ గన్‌లు ఉన్నాయి. ఈ తుపాకులు అసెంబ్లింగ్ చేయకుండా విక్రయించిన తుపాకీ భాగాల నుంచి నిర్మించబడ్డాయని అవుట్‌లెట్ తన నివేదికలో పేర్కొంది. తాము ఈ రోజు 3,076 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ తెలిపారు. ఇందులో 185 దాడి ఆయుధాలు ఉన్నాయన్నారు.
పాకిస్తాన్‌కి బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఆసియా కప్ రద్దు?
ఆసియా కప్-2023 నిర్వహణ అంశం మీద బీసీసీఐ, పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులను పీసీబీ దక్కించుకోవడంతో.. బీసీసీఐ గతంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాక్‌లో ఈ ఈవెంట్ నిర్వహిస్తే.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా క్రికెటర్లను పాక్‌కు పంపించే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షా అప్పట్లో కుండబద్దలు కొట్టారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇరు క్రికెటర్ల మాజీల మధ్య మాటల యుద్ధం సైతం కొనసాగింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అందుకు పీసీబీ అదే తరహాలో బదులిచ్చింది. దీంతో.. తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. ఈ ఆసియా కప్ టోర్నీ సజావుగా సాగాలంటే.. భారత్‌కు చెందిన మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను ఇతర వేదికలపై నిర్వహించేందుకు వీలుగా ఒక హైబ్రీడ్ మోడల్‌ని రూపొందించగా, అందుకు పీసీబీ సానుకూలంగానే ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే.. ఈ కథలో ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగుచూసింది. హైబ్రీడ్ మోడల్ ప్రతిపాదనకు మొదట సానుకూలత తెలిపిన బీసీసీఐ.. ఇప్పుడు దాన్ని తిరస్కరించిందని సమాచారం. ఈ ఆసియా కప్ టోర్నీ వేదికను పాక్ నుంచి వేరే దేశానికి తరలించాలని బీసీసీఐ పట్టుబట్టినట్లు తెలిసింది.
చరిత్ర సృష్టించిన యశస్వీ.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు
ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ సాధించిన చారిత్రాత్మక విజయం కంటే.. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ చేసిన సెంచరీనే టాప్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడిన యశస్వీ.. కేవలం 53 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. ఓవరాల్‌గా 62 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతగాడు మూడు రికార్డుల్ని నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా యశస్వీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అతగాడు.. 120 (నాటౌట్) పరుగులు చేశాడు. ఇప్పుడు 4 పరుగుల తేడాతో వాల్తాటి రికార్డ్‌ని యశస్వీ బద్దలుకొట్టాడు. ఇప్పటివరకూ రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ ఉండేవాడు. 2021 సీజన్‌లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 124 పరుగులు చేశాడు. ఇప్పుడు యశస్వీ ముంబైపై 124 పరుగులు చేసి, జోస్‌బట్లర్ రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ నమోదు చేసిన యంగెస్ట్ ప్లేయర్ల జాబితాలో యశస్వీ నాలుగో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో మనీష్ పాండే (2009లో ఆర్సీబీ తరఫున 19 ఏళ్ల 253 రోజులు), రెండో స్థానంలో రిషబ్ పంత్( 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 20 ఏళ్ల 218 రోజులు), మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ (2021లో ఆర్‌సీబీ తరపున 20 ఏళ్ల 289 రోజులు) ఉండగా.. 21 ఏళ్ల 123 రోజుల వయసులో యశస్వీ సెంచరీ సాధించి, నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
తప్పు చేశాం.. క్షమించండి.. ‘ఏజెంట్’ ఫెయిల్యూర్ ను ఒప్పుకున్న నిర్మాత
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి విజయాలు, అపజయాలు సాధారణం. అన్నిసార్లు విజయాలను అందుకోవాలని లేదు. కొన్నిసార్లు పరాజయాలను కూడా నిజాయితీగా ఒప్పుకున్నవారే.. పైకి ఎదగగలుగుతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ ఏంటంటే.. హిట్ అయితే హీరోను ఎత్తేస్తున్నారు.. అదే ప్లాప్ అయితే డైరెక్టర్ ను ఏకిపారేస్తున్నారు. ఎప్పటి నుంచో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఇది ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. గతేడాది ఆచార్య రిలీజ్ అయ్యి ప్లాప్ అందుకుంటే.. డైరెక్టర్ కొరటాల శివను ఏకిపారేశారు. కథ ఎలా ఉంటుందో తెలియదా ..? డైరెక్షన్ చేసేది ఇలాగేనా అంటూ ట్రోల్ చేశారు. అంతకుముందు ఒక్క పరాజయం కూడా అందుకొని దర్శకుడు.. ఒక్కసారి ప్లాప్ అందుకుంటే.. అతడి డైరెక్షన్ మొత్తాన్ని తప్పు పట్టారు. ఇక ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు సురేందర్ రెడ్డి. కిక్, రేసు గుర్రం లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన సురేందర్ రెడ్డి.. రెండేళ్లుగా ఏజెంట్ ను చెక్కుతూ వచ్చాడు. అఖిల్ అక్కినేనిని ఏజెంట్ గా మార్చడానికి అతడెంత కష్టపడ్డాడో అందరికి తెల్సిందే. అయితే ఏజెంట్.. ఏప్రిల్ 28 న రిలీజ్ అయ్యి.. భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఇక ఈ సినిమా పరాజయం పాలవ్వడంతో సురేందర్ రెడ్డిని అక్కినేని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏజెంట్ ప్లాప్ నిందను మేము భరిస్తున్నామని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్వీట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది.
రాజమౌళికి పాకిస్థాన్ వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదట…
ఇండియన్ సినిమా గ్లోరిని ప్రపంచవ్యాప్త సిని అభిమానులకి తెలిసేలా చేసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి. ఈరోజు వరల్డ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా జేమ్స్ కెమరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి దర్శకులు కూడా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే రాజమౌళి వల్లే సాధ్యం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా వెళ్లలేదు అనుకున్న ప్రతి చోటుకి మన సినిమాని తీసుకోని వెళ్లి, ఆస్కార్ ని కూడా ఇండియాకి తీసుకోని వచ్చిన రాజమౌళికి పాకిస్థాన్ లో చెడు అనుభవం ఎదురయ్యిందట. అసలు రాజమౌళి పాకిస్థాన్ ఎందుకు వెళ్లాడు? తనకి ఎదురైన చెడు అనుభవం ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే… సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో చూసే విషయాలని, షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. అలానే ‘దేశి థగ్’ అనే ట్విట్టర్ హ్యాండిల్ ‘ఇండస్ వ్యాలీ సివిలైజేషన్’ గురించి కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసాడు. హరప్పా, మొహంజోదారో లాంటి ప్రాంతాల్లో సివిలైజేసన్ ఎలా ఉండేది అని ఊహించి డిజైన్ చేసిన ఫొటోస్ ని ‘దేశి థగ్’ హ్యాండిల్ ట్వీట్ చేసింది. వీటిని చూడగానే ఆనంద్ మహీంద్రా, “ఈ ఇల్లస్ట్రేషన్స్ మన చరిత్రని, మన ఊహాశక్తిని ప్రేరేపించేలా ఉన్నాయి” అని ట్వీట్ చేస్తూ రాజమౌళిని టాగ్ చేసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన రాజమౌళి ఒక సినిమా చేస్తే బాగుంటుందని, అది మన సివిలైజేషన్ గురించి గ్లోబల్ అవేర్నెస్ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసాడు. తనని ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చెయ్యడంతో రాజమౌళి రెస్పాండ్ అయ్యారు. “అవును సర్… నేను మగధీర షూటింగ్ సమయంలో ‘ధోలావీరా’కి వెళ్లాము. అక్కడ ఒక పురాతనమైన చెట్టును చూశాను. అది శిలాజంగా మారిపోయి ఉంది. ఆ చెట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో సింధు నాగరికత ఎలా మొదలయ్యింది, ఎలా పతనం అయ్యింది అనే సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను పాకిస్థాన్ వెళ్లాను కానీ మొహంజోదారోకి ఎంత ప్రయత్నించినా పర్మిషన్ ఇవ్వలేదు” అంటూ రిప్లై ఇచ్చాడు. రాజమౌళి రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడు మీరు వేరు, ఇప్పుడు మీ రేంజ్ వేరు రాజమౌళి సర్, ఇప్పుడు ట్రై చెయ్యండి అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే సింధు నాగరికత బ్యాక్ డ్రాప్ లో హృతిక్ రోషన్ ఇప్పటికే ఒక సినిమా చేసాడు. మొహంజోదారో అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.