పవన్‌పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్‌యలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కాపు కులాన్ని మళ్లీ ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని కాపు సామాజిక వర్గం భావిస్తోందన్నారు. పవన్ కల్యాణ్ అందలం ఎక్కితే బాగుంటుందని కాపు కులంలోని యువత, పెద్దలు అభిప్రాయ పడుతున్నారు… కానీ, పొత్తు నిర్ణయాలతో పార్టీని అధః పాతాళంలోకి తొక్కేసారని అంతా భావిస్తున్నారని పేర్కొన్నారు.. గోదావరి జిల్లాలలో 14 తేదీ నుంచి వారాహి యాత్ర చేపట్టి పవన్ కల్యాణ్ ఏమని చెబుతారు..? అంటూ సవాల్ చేశారు. ఎవరైనా ఏ పార్టీతోననైనా పొత్తు పెట్టుకోవచ్చు.. కానీ, టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోడానికి కాపు సామాజిక వర్గం అభ్యంతరం చెబుతోందన్నారు. కాపు సామాజిక పెద్దగా నా వద్దకు వచ్చిన సూచనలే పత్రికా సమావేశంలో వ్యక్తం చేస్తున్నాను అని తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఇక, ఇప్పటికే వారాహి యాత్రకు మూడు సార్లు బ్రేకులు వేశారని ఎద్దేవా చేశారు.. మరోవైపు.. చంద్రబాబు.. బీజేపీ పెద్దలలో కలిసినా, పవన్ కల్యాణ్‌తో కలిసినా ఒరిగేది ఏమీ లేదని సెటైర్లు వేశారు.. 2014లో టీడీపీ నేతలు లేని పోని హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు.. రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు.. ఇచ్చిన హమీల్లో ఏం నెరవేర్చారని టీడీపీకి ఓటు వేయాలని నిలదీశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాగా, ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని.. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయని.. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నానంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్న విషయం విదితమే..
ఏపీలో స్కూళ్లు తెరుచుకునేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై క్లారిటీ ఇచ్చారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. జూన్ 12వ తేదీ నుంచి అంటే ఈ నెల 12వ తేదీ నుంచి స్కూళ్లలో తరగతులు పునర్ ప్రారంభం అవుతాయని వెల్లడించారు.. అంతేకాదు. పిల్లలకు కావల్సిన అన్ని వసతులు జూన్ 12వ తేదీనే ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు.. ఇక, పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కోసూరులో సీఎం చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.. మరోవైపు.. ఈ నెల 20న రాష్ట్ర స్ధాయి, 17న జిల్లా స్ధాయి, 15న నియోజకవర్గ స్ధాయి టాపర్లకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు వెల్లడించారు మంత్రి బొత్స. ఇక, జూన్ 28వ తేదీన అమ్మవడి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు మంత్రి బొత్స.. అన్ని స్కూళ్లలో 6వ తరగతి నుంచి 12వ క్లాస్ వరకూ డిజిటల్ విద్యను ప్రారంభించాలని నిర్ణయించామని వెల్లడించారు.. ఈనెల 12 నుంచీ ప్రతీ స్కూల్లో స్మార్ట్ టీవీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.. మరోవైపు.. జగనన్న గోరుముద్ద ఎంతో విజయవంతంగా జరుగుతోంది.. విద్యార్ధులపై ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్రానికి, దేశానికి ఉపయోగకరం అని సీఎం వైఎస్ జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
మోడీ చరిష్మా, హిందుత్వ మాత్రమే సరిపోవు.. బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు..
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్’ బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేసింది. గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ది ఆర్గనైజర్ బీజేపీ గెలుపోటముల గురించి ప్రస్తావిస్తూ సంపాదకీయం రాసింది. ఎన్నికల్లో గెలవడానికి మోడీ చరిష్మా, హిందుత్వ సరిపోదని స్పష్టం చేసింది. ప్రాంతీయ స్థాయిలో బలమైన నాయకత్వం, సమర్థవంతమైన పనితీరు లేకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిష్మా, హిందుత్వ ఎన్నికల్లో గెలవడానికి సరపోదని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ మ్యాగజైన్ ది ఆర్గనైజర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించింది. బీజేపీ పరిస్థితిని సమీక్షించడానికి ఇది సరైన సమయం అని చెప్పింది. రాష్ట్రస్థాయిలో పాలన ఉన్నప్పుడు సానుకూల అంశాలు, భావజాలం, నాయకత్వం బీజేపీకి నిజమైన ఆస్తులు అని ఆర్గనైజరన్ మే 23న ప్రఫుల్ల కేత్కర్ సంపాదకీయంలో పేర్కొంది. బొమ్మై ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను సూచిస్తూ, ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నా, దిగ్భ్రాంతిని కలిగించేవి కాదని పేర్కొంది. ప్రధాని మోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కర్ణాటక ఎన్నికల్లో మాత్రమే బీజేపీ అవినీతి ఆరోపణలను సమర్థించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తాయని సంపాదకీయం పేర్కొంది.
దళితుల ప్రవేశానికి నిరాకరణ.. ఒక గుడికి సీల్, మరో ఆలయం తాత్కాలికంగా మూసివేత
తమిళనాడు రాష్ట్రంలో ఒక గుడికి సీల్ వేశారు, మరో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కారణం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి ఆలయంలోకి రాకుండా కొందరు వ్యక్తులు ప్రవేశం నిరాకరించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సీల్ వేసిన గుడి తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మెల్పాడి సమీపంలోని ద్రౌపది అమ్మన్ ఆలయం కాగా.. వీరనంపట్టిలోని కాళియమ్మన్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ద్రౌపది అమ్మన్ ఆలయానికి సంబంధించి ఆధిపత్య కులాలకు, ఎస్సీలకు మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో దళితులకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించడంతో వివాదం చెలరేగింది. శాంతిభద్రతలు దెబ్బతింటాయిన భయపడ్డ జిల్లా అధికారులు బుధవారం ఆలయానికి సీలు వేశారు. వాస్తవానికి ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభనను తొలగించేందుకు జిల్లా యంత్రాంగం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సమస్యపై సామరస్యపూర్వక పరిష్కారం లభించలేదు. ద్రౌపది అమ్మన్ దేవాలయం హిందూ మత ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడని, దీనిపై ఆధిపత్య కులస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం దళితులను ఆలయంలోకి రానీయకుండా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ కారణంగా నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఆలయానికి జిల్లా అధికారులు సీల్ వేశారు. ఇదిలా ఉండగా.. కులమతాలకు అతీతంగా భక్తులను ఆలయంలోకి అనుమతించాలని కోరుతూ విల్లుపురం ఎంపీ డి.రవికుమార్, ఇతర పార్టీ నేతలు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు.
30-40 ఏళ్లలో గుండెపోటు.. యువతలో పెరుగుతున్న ముప్పు.. కారణాలు ఇవే..
ఇటీవల కాలంలో మూడు పదులు వయసులోపు యువత గుండెపోటు బారిన పడటం చూస్తున్నాం. అంతా ఫిట్ గా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా.. హఠాత్తుగా వచ్చే విపత్తును గుర్తించలేకపోతున్నారు. ఇటీవల ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ గుజరాత్ లోని జామ్ నగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. గుండె వ్యాధుల నిపుణుడైన డాక్టరే తనకు వచ్చే గుండెపోటును గుర్తించలేెపోయారు. మంగళవారం ఉదయం ఆయన మరణించారు. గతంలో 65 ఏళ్లు పైబడినవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అని మనం అంతా అనుకునేవాళ్లం. అయితే ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా 30-40 ఏళ్లలోనే గుండెపోటు బారిన పడుతున్నారు. విచిత్రం ఏంటంటే టీనేజ్ వయసులో కూడా గుండెపోటుతో మరణించిన ఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. హైబీపీ, స్మోకింగ్, కుటుంబంలో హార్ట్ ఎటాక్ కు సంబంధించిన చరిత్ర, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు, అనియంత్రిత ఒత్తడి, అనారోగ్యమై-అసంతులిత ఆహారం, తక్కువ శారీరక శ్రమ వంటివి యువతలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గుండె ఆరోగ్యాన్ని గమనించేందుకు తరుచుగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఒకవేళ ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా ఉంటే వాటికి సంబంధించిన నియమాలు, డైట్ పాటించాలి.
వడ్డీలు పెరిగేది లేదు.. రెపోరేటు యథాతథం
బెంచ్‌మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. రెపో రేటు మారకపోవడంతో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్ రేటు) 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. రెపో రేటు అనేది ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు.. దానిలో ఏదైనా మార్పు బ్యాంకు రుణాలు, ఈఎంఐలను ప్రభావితం చేస్తుంది. ఏప్రిల్‌లో జరిగిన మునుపటి సమావేశంలో పాజ్‌ని ఎంచుకునే ముందు, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి మే 2022 నుండి ఆర్బీఐ రెపో రేటును మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గించేందుకే రెపోరేటు పెంచలేదని తెలిపారు. మార్చి- ఏప్రిల్ 2023లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం తగ్గిందని.. 2022-23లో 6.7శాతం నుంచి క్షీణించిందని శక్తికాంత దాస్ చెప్పారు. అయితే తాజా డేటా ప్రకారం ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యానికి పైన ఉందన్నారు. తమ అంచనా ప్రకారం 2023-24లో ద్రవ్యోల్బణం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాలు స్థితిస్థాపకంగా ఉన్నాయని, మునుపటి అంచనాలను అధిగమించాయని శక్తికాంత దాస్ చెప్పారు. “భారతదేశం నిజమైన స్థూల దేశీయోత్పత్తి (GDP) 2022-23లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది మునుపటి అంచనా 7 శాతం కంటే బలంగా ఉంది. ఇది దాని ప్రీ-పాండమిక్ స్థాయిని 10.1 శాతం అధిగమించింది…అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, 2023-24 సంవత్సరానికి నిజమైన జీడీపీ వృద్ధి 6.5 శాతంగా అంచనా వేయబడింది.”అని ఆయన చెప్పారు. పెరిగిన ద్రవ్యోల్బణం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత, కఠినమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల వేగం క్షీణించవచ్చని ఆర్‌బీఐ గుర్తించిందని ఆయన తెలిపారు.
వాడు ఎంత వెధవో వర్ణించాలంటే దేవుడు వరం ఇవ్వాలి
టాలీవుడ్ కుర్ర హీరో నాగశౌర్య గత కొంతకాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఆ హిట్ కోసం మనోడికి అచ్చొచ్చిన ఛలో సినిమా లాంటి కథనే నమ్ముకున్నాడు. అదే రంగబలి. రంగస్థలంలో రంగ.. బాహుబలిలో బలి కలిపి రంగబలిగా కొత్త టైటిల్ ను తీసుకొచ్చేశారు మేకర్స్. పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నాగశౌర్య సరసన యుక్తి తరేజా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ఈ టీజర్ ను చూస్తుంటే ఖచ్చితంగా శౌర్య నటించిన ఛలో సినిమా గుర్తురాకమానదు. “కుర్రాళ్ళు అంటే ఈ వయస్సులో ఇలాగే ఉంటారురా.. నువ్వేం కంగారు పడకు” అని హీరో తండ్రికి.. అతడి ఫ్రెండ్ చెప్తున్న డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. ఇక దానికి కొడుకు వెధవ పనుల గురించి తండ్రి ఏకరువు పెట్టేయడం చూపించారు.. ” మా వాడు ఎంత వెధవ అనేది నేను చెప్పలేను.. వాడి వెధవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి” అని చెప్పే డైలాగ్ తోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని చూపించారు. ఇ తండ్రి పోరు పడలేక.. బి ఫార్మసీ.. చదివిన హీరో.. ఒక హాస్పిటల్ లో అప్రెంటీస్ గా చేరతాడు. అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్న హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమె దగ్గర గొడవలు అంటే గిట్టని వాడిగా నటిస్తూ ఉంటాడు. కానీ, ఆ ఊరి రాజకీయా నాయకుడితో ఒక గొడవపెట్టుకుంటాడు. అసలు ఆ గొడవ ఏంటి..? హీరో చివరికి మారతాడా..? డాక్టర్ తో ప్రేమ ఫలిస్తుందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శౌర్యను ఇలాంటి పాత్రలో ఆల్రెడీ ఛలోలో చూసేశాం.. కానీ, ఈసారి అంతకుమించిన కథతో వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శౌర్య- సత్యల మధ్య కామెడీ హైలైట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతోనైనా శౌర్య హిట్ కొడతాడేమో చూడాలి.
ఆమెను చూసి స్టేజిమీదనే కళ్లనీళ్లు పెట్టుకొని.. కాళ్లు పట్టుకున్న సిద్దార్థ్.. ఎవరామె ..?
బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్ ఎలా మొదలయ్యిందో కూడా అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం సిద్దు టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టక్కర్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు. తెలుగు, తమిళ్ అని లేకుండా వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. చాలా గ్యాప్ తరువాత సిద్దు మీడియాకు కనిపించడంతో ఎక్కడలేని ప్రశ్నలు అన్ని అడిగేస్తున్నారు. ఇక వాటికి తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చి షాకులు ఇస్తున్నాడు సిద్దు. ఇక తాజాగా ఒక తమిళ్ ఇంటర్వ్యూలో సిద్ధుకే ఒక షాక్ ఇచ్చారు ఆ ఛానెల్ వారు. తనను బాయ్స్ సినిమాకు హీరోగా రికమండ్ చేసిన ఆమెను తీసుకొచ్చి సిద్దూను ఏడిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సిద్దార్థ్ కెరీర్ గురించి అందరికి తెరిచిన పుస్తకమే. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారినట్టు తెలిసిందే. అసలు అసిస్టెంట్ డైరెక్టర్ ను హీరోగా తీసుకోమని శంకర్ కు చెప్పిందెవరు అంటే.. డైరెక్టర్ మణిరత్నం దగ్గర సిద్దు అసోసియేట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టాడు.. ఇక మణిరత్నం దగ్గర చేస్తున్న సమయంలోనే సిద్ధు మంచి యాక్టివ్ గా ఉండడం, చెప్పిన పని తొందరగా చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ గుర్తింపు శంకర్ వరకు వ్యాపించింది. ఒకరోజు శంకర్ ఆఫీస్ నుంచి సిద్ధుకు కాల్ వస్తే.. ఆయన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పిలుస్తున్నారని అనుకోని సిద్దు వెళ్ళాడట. కానీ, అక్కడకు వెళ్ళాకా.. అసిస్టెంట్ గా కాదు నా సినిమాకు హీరోగా చెయ్ అని చెప్పడంతో సిద్దు ఒక్కసారిగా షాక్ అయ్యాడట. అయితే సిద్దార్థ్ ను బాయ్స్ సినిమాకు హీరోగా రికమండ్ చేసింది సుజాత. మణిరత్నం వద్ద ఒక కుర్రాడు అసిస్టెంట్ గా చేస్తున్నాడు. బాయ్స్ సినిమాకు కుర్రాళ్లను వెతుకుతున్నారుగా.. అతడు బాగా చేస్తాడు.. తీసుకోండి అని శంకర్ కు సుజాత చెప్పడంతోనే శంకర్, సిద్దును ఓకే చేశారట. ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఇన్నేళ్ల తరువాత స్టేజీమీద సుజాతను చూసిన సిద్దు.. ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. ఆమెకు పాదాభివందనం చేస్తూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఆమెను గట్టిగా హత్తుకొని థాంక్స్ చెప్పాడు. ఆ సమయంలో ఆమె కనుక శంకర్ కు సిద్దును రికమండ్ చేయకపోతే ఈరోజు ఈ హీరో ఎక్కడ.. ఎలా ఉండేవాడో అనేది దేవుడికే ఎరుక. మరి టక్కర్ తో మనోడు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.