అభివృద్ధి చేస్తూ చెప్పుకోవడం లేదు.. అంతే-సజ్జల
కళ్ల ముందే అభివృద్ధి కనిపిస్తున్నా.. ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. 11 మెడికల్ కాలేజీలతో స్పెషలిస్టులను తయారు చేసుకునేలా ఎదగడం అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ చెప్పుకోవడం లేదు.. అంతే అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు హిమాలయమంత విగ్రహం పెట్టినా సరిపోదన్న ఆయన.. విజయవాడ రాజకీయ చైతన్యం కలిగిన నగరం.. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాం అని తెలిపారు. విజయవాడలో జరిగిన ఏపీ ఎస్సీ, ఎస్టీ గజిటెడ్ అధికారుల వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం.. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సారి నేను పోటీ చేయాలా..? వద్దా..? చెయ్యి ఎత్తి చెప్పండి..!
వచ్చే ఎన్నికల్లో నన్ను పోటీ చేయమంటారా? వద్దా..? మీరు చెప్పినట్టే చేస్తాను.. చేతులు ఎత్తి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని కోరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో పాత్రునివలస, పెద్దపాడు ప్రజలకు మంచినీటిని అందించడానికి రూ.24 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. అక్కడికి వచ్చిన ప్రజలకు ఓ ప్రశ్న వేశారు.. ఈ సారి నేను పోటీ చేయాలా ? వద్దా? మీరు వద్దు అంటే పోటీ మానేస్తాను అంటూ ప్రజల్ని ప్రశ్నించారు మంత్రి ధర్మాన.. అంతేకాదు.. నేను పోటీ చేయొద్దు అనేవాళ్లు చెయ్యి ఎత్తాలని సభికులను కోరారు.. దీంతో, మీరు పోటీ చేయాలని ప్రజలు కోరారు. ఇక, ఓటు వేసిన తరువాత అయ్యోరామ అంటే కుదరదు.. మీరు అంతా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన.. ఇప్పుడు టీడీపీ దొంగలు మీ ఇళ్లకు వస్తున్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటున్నారు.. నమ్మొద్దని కోరారు. మరి 14 సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు.. ఇదంతా డ్రామా.. ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరో ఏదో చెప్పింది వినకండి.. ఎవరికి ఓటు వేయాలో మేం చెప్పాలా..? అని ప్రశ్నించారు. అన్నీ జగనే ఇస్తా ఉన్నరంటున్న ముసలామే జగన్ కే ఓటు అన్నారు.. గుర్తు అడిగితే సైకిల్ అంటుంది.. మన గుర్తు ఫ్యాన్ గుర్తుగా అందరికీ చెప్పండి అని కోరారు.. మరోవైపు.. వాలంటీర్లను తీసేద్దామా ? ఉంచుదామా..? అని ప్రశ్నించారు.. వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా మీకు పనిచేస్తుందని గుర్తుచేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
మోడీతో కలిసి నడవడానికి పోటా..? ఏపీకి అన్యాయం చేసినా బాబు, జగన్, పవన్ మాట్లాడరా..?
ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ అన్యాయం చేసినా.. చంద్రబాబు, సీఎం వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ మాట్లాడరా? అని నిలదీశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో మత ఘర్షణలు, రెచ్చ గొట్టేలా బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. దేశ ఐక్యత గురించి కాకుండా మతం గురించి ఆలోచన చేసేలా మోడీ విధానాలు ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రధాని హోదాలో మోడీ ఒక మతానికి ఎలా కొమ్ము కాస్తారు? అని నిలదీశారు. ఇక, ఏపీకి మోడీ అన్యాయం చేసినా బాబు, జగన్, పవన్ లు మాట్లాడరా? మోడీతో కలిసి నడవడానికి వీరు పోటీ పడుతున్నారా? అని మండిపడ్డారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబును అవమానించారని వ్యాఖ్యానించారు శ్రీనివాసరావు.. పోలీసులు కూడా చట్ట ప్రకారం పని చేయాలని సూచించిన ఆయన.. ప్రజలే నా స్టార్లు అంటున్న సీఎం వైఎస్ జగన్ కు ఆ ప్రజలే బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు. ఈ రెండు నెలలు ఎన్నికల సంఘం ఏపీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఆసరా పేరుతో మళ్లీ మహిళలని మాయ చేస్తున్నారు అని విమర్శించారు. అంగన్వాడీ మహిళలపై ఇచ్చిన జీవో నంబర్ 2 ని రద్దు చేయాలి డిమాండ్ చేశారు. ఇక, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంపై స్పందించిన ఆయన.. మూడేళ్లు స్పీకర్ తమ్మినేని సీతారాం నిద్ర పోయారా..? ప్రజాస్వామ్య విలువ ఉందా..? గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించారు.. విలువలు లేని, రూల్స్ పాటించని స్పీకర్ ను ముందుగా తొలగించాలి డిమాండ్ చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. లేఖలో ‘మాజీ ఉపప్రధాని, నాటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 17 సెప్టెంబర్, 1948 న నాటి నిజాంల నియంతృత్వ పాలన నుండి విముక్తిని పొంది భారతదేశంలో విలీనమైన నాటినుండి 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు దాదాపు 66 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అదే 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలోనే మరో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. ఇవే కాకుండా, రాష్ట్రంలో మరో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. అందులో ₹32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో (మంజూరు చేయబడినవి/బిడ్డింగ్ దశలో ఉన్నవి/మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నవి) ఉన్నాయి. ఈ 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి 4,332 హెక్టార్ల భూమి (రీజనల్ రింగ్ రోడ్ ఉత్తరభాగంతో సహా) అవసరం ఉంది. ఈ భూమి సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు అనేకసార్లు లేఖలు వ్రాయడం జరిగింది.
“రామ్ లల్లాను చూసేందుకు హనుమంతుడు వచ్చాడు”.. కోతి సందర్శనపై ఆలయ ట్రస్ట్..
అయోధ్య రామ మందిరంలో ఆశ్చర్యకరమైన ఘటన ఎదురైంది. కొత్తగా ప్రారంభమైన రామ మందిరంలోకి కోతి ప్రవేశించింది. గర్భగుడిలోని రామ్ లల్లా విగ్రహం వరకు వెళ్లింది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 5:50 గంటల ప్రాంతంలో ఒక కోతి దక్షిణ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించింది. సమీపంలోని భద్రతా సిబ్బంది, విగ్రహం భద్రత గురించి ఆందోళన చెంది కోతి వైపు పరిగెత్తారు. కొంత సమయం తర్వాత కోతి ఉత్తర ద్వారం గుండి బయటకు వెళ్లాలని ప్రయత్నించింది, అయితే అది మూసివేసి ఉంది. తర్వాత భక్తలకు ఎలాంటి హాని కలిగించకుండా తూర్పు ద్వారం గుండా బయటకు వెళ్లింది. ఈ పరిణామాన్ని చూసిన భక్తులు, ఆలయ సిబ్బంది స్వయంగా హనుమంతుడే కోతి రూపంలో వచ్చి రాముడి దర్శనం చేసుకున్నాడని చెబుతున్నారు. కోతి సందర్శనను దైవానుగ్రహంగా భావిస్తు్న్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. కోతులను హనుమాన్ అవతారంగా భావిస్తారు. అక్టోబర్ 30, 1990లో కరసేవకులు బాబ్రీ మసీదు గోడపై కాషాయ జెండాను పెట్టిన సమయంలో ఒక కోతి జెండాకు రక్షణ నిలవడాన్ని పలువరు గుర్తు చేసుకుంటున్నారు.
“పులి పిల్లల్ని” చంపి తింటున్న పెద్ద పులి.. తాడోబా అభయారణ్యంలో అసాధారణ ప్రవర్తన..
సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే తన జాతి జంతువులను చంపి తింటుంటాయి. అయితే, పులుల వంటి జంతువులు పులి పిల్లల్ని చంపి తినడం చాలా అరుదు. అయితే మహారాష్ట్రలోని తాడోబా-అంధేరీ అభయారణ్యంలో మాత్రం ఓ పులి మాత్రం చిన్న పులి పిల్లల్ని చంపి తింటున్నట్లు తెలిసింది. రెండు పులుల నిర్వహించిన శవపరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. మరణించిన పులులను ఆరేళ్ల టీ-142, రెండేళ్ల టీ-92గా గుర్తించారు. రెండేళ్ల పులి పిల్ల వెనక భాగాన్ని టీ -192 అనే మగపులి తిన్నట్లుగా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాదేశిక పోరాటం(టెరిటోరియల్ ఫైట్)లో టీ-192 పెద్ద పులి, రెండు పులులను చంపేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత పిల్లల మాంసాన్ని తిన్నదని భావిస్తున్నారు. జనవరి 22న పులుల శవాలు లభించిన ప్రాంతాల్లో రెండు రోజులుగా పులుల మధ్య భీకర పోరాటాలు జరిగాయి. ఇది ‘కానిబాలిజం’గా అనుమానిస్తున్నారు. దీనిపై మరింతగా విచారించాల్సి ఉందని రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్(కోర్) నందకిషోర్ కాలే పేర్కొన్నారు.
ఎల్‌ఐసీ సూపర్ పాలసీ..జీవితాంతం ఖచ్చితమైన ఆదాయం…
ప్రముఖ బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ప్రజలకు అధిక రాబడి ఇచ్చే పెన్షన్ పథకాలను అందిస్తుంది. పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు.. ఇందులో కూడా అదిరిపోయే ప్లాన్ ఒకటి ఉంది.. అదే ఎల్ఐసీ జీవన్ ధార . ఇది యాన్యుటీ ప్లాన్. దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. జీవిత కాలం మొత్తంలో వాయిదాల పద్ధతిలో తిరిగి పొందొచ్చు.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈ ఎల్‌ఐసీ పాలసీకి కనీసం 20ఏళ్ల వయస్సు ఉండాలి.. . ఇది ఎలాంటి రిస్క్ కవర్‌ను అందించదు. అయినప్పటికీ దాని ప్రయోజనాలు చాలా ఆసక్తిని కలుగజేస్తాయి. ఈ ఎల్ఐసీ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ అందించిన రెండు ఎంపికలు ఉన్నాయి. మొదటి ఎంపిక సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ, రెండవది జాయింట్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ.. ఈ ప్లాన్ ను మీ కోసం తీసుకోవచ్చు.. అలాగే మీ కుటుంబంలో మరొకరికి కూడా తీసుకోవచ్చు.. ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్ను బట్టి గరిష్ట వయస్సును నిర్ణయిస్తారు. ఈ గరిష్ట వయో పరిమితి… 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు మైనస్ వేచివుండే కాలం.ప్రీమియం చెల్లింపు కాలం, వేచి ఉండాల్సిన వ్యవధి యాన్యుటీ ఆప్షన్, యాన్యుటీ చెల్లింపు విధానాన్ని ఎంచుకునే అవకాశం పాలసీదారుకు ఉంటుంది.. నెలనెలా, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 12 నెలలకు ఒకేసారి చొప్పున యాన్యుటీ పేమెంట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్ను ఇక మార్చలేరు..ఈ ప్లాన్లో 11 యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్ఐసీ వెబ్సైట్లోకి వెళ్లి మీకు అనువైన ఆప్షన్ ఎంచుకోవచ్చు.. మీరు మొదటి ప్రీమీయం చెల్లించిన తర్వాత భీమా రక్షణ ప్రారంభం అవుతుంది.. ప్రీమియంలు కడుతున్న సమయంలోనైనా, ఆ తర్వాతైనా ఈ పాలసీ మీద లోన్ తీసుకోవచ్చు..
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును రెండుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. 2023లో అద్భుతమైన ప్రదర్శనకు గాను ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సూర్యకు ఐసీసీ అందించింది. 2023లో 18 గేమ్‌లలో రెండు సెంచరీలతో సహా 733 పరుగులు చేశాడు. 2022లో కూడా ఈ అవార్డును సూర్యకుమార్ గెలుచుకున్నాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తుంది. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును అందుకున్నాడు. మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, ఉగాండా సంచలనం అల్పేష్ రంజానీ, న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్‌లతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ, గ్లోబల్ మీడియా ప్రతినిధులతో కూడిన ప్యానెల్ మరియు ప్రపంచ క్రికెట్ అభిమానుల ఓటింగ్ తర్వాత సూర్య విజేతగా ఎంపికయ్యాడు. అంతకుముందు 2023 సంవత్సరానికి టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఐసీసీ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడిన సూర్య టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకుంటున్న సూర్యకు మరో సమస్య ఉందని తెలిసింది. జనవరి 17న స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం సూర్య కోలుకుంటున్నాడు. సూర్యకుమార్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందమీ సమాచారం. ఐపీఎల్ 2024 ప్రారంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవచ్చు. అయితే టీ20 ప్రపంచకప్ 2024 సమయానికి అతడు అందుబాటులో ఉంటాడు.
డిజాస్టర్ కొట్టిన డైరెక్టర్ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్?
వినయ విధేయ రామ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ఎంచుకుంటున్న కథలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా పూర్తి స్థాయి స్పోర్ట్స్ బాక్ డ్రాప్ సినిమా అని చెబుతున్నారు. పిరియాడిక్ మూవీ గా చెబుతున్న ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రాంచరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయం మీద అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పటివరకు రామ్ చరణ్ ఎలాంటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అనేక సినిమాలకు ఆయన పనిచేస్తున్నట్లు ప్రచారాలు అయితే జరిగాయి ఇప్పుడు అలాంటిదే ఒక ప్రచారం బాలీవుడ్ మీడియా వర్గాల్లో జరుగుతోంది. ఆ ప్రచారం ఏమిటంటే ఈ మధ్యనే రామ్ చరణ్ తేజ ఒక బాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసి చివరిగా డుంకి అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న బాలీవుడ్ బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ కుమార్ హిరాణీతో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడట. ఈ మధ్యనే హిరాణీ రామ్ చరణ్ కి కథ చెప్పగా అది ఆయనకు బాగా నచ్చిందని దీంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. డుంకి ఒక్కటే ఆయన కెరీర్లో కాస్త నిరాశపరిచింది కానీ మిగతా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడమే కాదు భారీ కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టాయి. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకి కూడా అలాంటి సీన్ రిపీట్ అవ్వాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
ఆ ముగ్గురు హీరోలపై త్రివిక్రమ్ ఫోకస్.. నెక్స్ట్ సినిమా అతనితోనా ?
టాలివుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉందని, కుటుంబం మొత్తం అల్లుకు పోయే కథలతో కొత్త సినిమాలను తెరకేక్కిస్తున్నాడు.. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలు అన్ని ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి.. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడితో పేరు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ నుంచి ఇటీవల వచ్చిన సినిమా గుంటూరు కారం.. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.. ఈ సినిమా కొందరికి బాగా నచ్చింది.. కొంతమందికి పెద్దగా నచ్చలేదు.. పర్ఫామెన్స్ పరంగా, డ్యాన్సుల పరంగా మహేష్ బాబు ఇరగదీసేవాడు. కానీ, త్రివిక్రమ్ మ్యాజిక్ మాత్రం మిస్ అయింది. అయితే ఫెస్టివల్ అడ్వాంటేజ్ ఉండటం వల్ల గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది.. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న. గతంలో ఎన్టీఆర్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు.. ఆ తర్వాత ఆ సినిమాను చెయ్యలేదు.. కానీ, ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చే పరిస్థితే లేదు.. అయితే ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని లపై ఫోకస్ పెట్టాడు…కోలీవుడ్ స్టార్ సూర్య సైతం త్రివిక్రమ్ లైనప్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఎవరితో ప్రకటిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి..
ఓటీటీ లో దుమ్మురేపుతున్న ప్రభాస్ సలార్ మూవీ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22న విడుదల అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చింది.జనవరి 20 న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ లో రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్‌ను దక్కించుకున్నది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ మూవీ ఓటీటీ లో కూడా దుమ్మురేపుతుంది.ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఐదు మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి పదకొండు మిలియన్ల వరకు వ్యూస్ వచ్చినట్లు ఓటీటీ వర్గాలు చెబుతోన్నాయి.తక్కువ టైమ్‌లోనే హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న మూవీగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు సమాచారం… సలార్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సలార్ మూవీ ఓటీటీలో రిలీజైన కూడా థియేటర్లలో సలార్ మూవీ కలెక్షన్స్ తగ్గలేదు. 32వ రోజు సలార్ మూవీకి 59 లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మొత్తంగా ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా 723.50 కోట్ల వసూళ్లను సలార్ రాబట్టింది. ఫస్ట్ డేనే 176 కోట్ల కలెక్షన్స్‌తో సలార్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.