టికెట్ రాకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ముందే ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య
తనకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. ఇవాళ (మంగళవారం) క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యాడు. ఈ క్రమంలో వారితో మాట్లాడుతూ.. ఒక్కసారిగా భోరున విలపించారు. ఆతర్వాత కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని వెక్కివెక్కి ఏడ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఈసారి బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నియోజకవర్గం నుంచి రాజయ్య 2014, 2018లో నుంచి గెలిచారు. అయితే ఈసారి ఈ టిక్కెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఇవ్వడంతో.. తనకు టిక్కెట్ రాకపోవడంతో రాజయ్య కన్నీటిపర్యంతమయ్యారు.
పవన్ కల్యాణ్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుంది.. అది స్పష్టం..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుంది అని జోస్యం చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. కలిసి పోటీ చేయటం అంటే ఒంటరిగా పోటీ చేయలేం అనే కదా? అని వ్యాఖ్యానించారు. ఇక, నారా లోకేష్ ది యువగళమా? గందరగోళమా? బౌన్సర్లతో, రాజకీయ కూలీలతో చేసేది పాదయాత్ర ఎలా అవుతుంది? దీనికి రూ.250 కోట్ల ఖర్చు అయ్యిందని టీడీపీ వాళ్లే చెబుతున్నారని దుయ్యబట్టారు.. మాలోకం వంద పుస్తకాలు పూర్తి అయ్యాయని అంటున్నాడు.. రాష్ట్రంలో ఉన్న అందరి పేర్లు రాసుకుంటున్నాడా? అందరినీ జైలుకు పంపిస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు కొట్టు సత్యనారాయణ.
ఏపీ విభజన బిల్లు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఏపీ విభజన బిల్లు చట్టబద్దంగా పార్లమెంట్ లో ఆమోదం పొందలేదన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్ ఈ కేసును విచారణ జరిపారు.. అయితే, ఇది రాజకీయ సమస్య కదా..? మేమెందుకు జోక్యం చేసుకోవాలి ? అని ప్రశ్నించారు. ఈ కేసులో ఇంకేముంది విషయం..? అని ప్రశ్నించిన సుప్రీం.. ఇది పార్లమెంటుకు సంబంధించిన విషయంఅని పేర్కొంది.. ఇక, ఇలాంటి రాజ్యాంగ పరమైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. అందుకే ఈ కేసులోపలికి వెళ్లడం లేదని తెలిపింది. కేసు విచారణ వాయిదా వేస్తున్నాం.. అప్పటివరకు వేచి చూడండి అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. మరోవైపు.. ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వాదనలు వినిపించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందన్న ఆయన.. పార్లమెంటు తలుపులు మూశారు.. లోక్‌సభ లైవ్ కట్ చేశారు.. ఎలాంటి ఓట్ల లెక్కింపు జరగలేదన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ఎంపీని అయిన నన్ను కూడా సభ నుంచి బయటికి పంపారని తెలిపారు.. ఎనిమిది గంటల పాటు చర్చించాల్సిన బిల్లును అరగంటలోనే తేల్చేశారని సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు అంటూ వాపోయారు ఉండవల్లి అరుణ్ కుమార్.
నన్ను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర.. నేనే చచ్చిపోతే ఆయనదే బాధ్యత..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. నన్ను హత్య చేయటానికి లోకేష్ కుట్ర పన్నుతున్నాడన్న ఆయన.. కోర్టుకు హాజరయ్యేటప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు.. నేను చచ్చిపోతే నారా లోకేష్ దే బాధ్యత అంటూ ఆరోపించారు. లోకేష్ కంటే క్రెడిబులిటీ ఉన్న వాడిని.. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వం నచ్చే జగన్ ను అభిమానిస్తున్నాను అని తెలిపారు.. నేను కేసు పెడతాను.. నిజం కావాలా? సాక్ష్యం కావాలా? అని ప్రశ్నించారు. బూతుల వల్ల సమాజం పాడవదా? అని ప్రశ్నించారు. బూతు పనుల వల్ల సమాజం పాడవుతుందన్నారు. అమరావతి ప్రాంతంలో రాజధాని భూముల కుట్రలు పన్నారన్న ఆయన.. నన్ను కూడా ఇక్కడ భూములు కొనమని అప్పుడు చెప్పారని గుర్తుచేసుకున్నారు. అమరావతి ప్రాంతంలో భూములు ఇవ్వటం వెనుక త్యాగాలు లేవు.. భూముల రేట్లు పెంచుకోవాలనే తాపత్రయం అంటూ విమర్శలు గుప్పించారు పోసాని. ఇక, మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడిన బూతుల వీడియోను ప్రదర్శించారు పోసాని కృష్ణమురళి.. నారా లోకేష్ నాపై పరువు నష్టం కేసు వేశారు.. లోకేష్ 18 ఎకరాలు కొన్నారని నేను అన్నానట.. తాను ఒక ఎకరం కూడా కొనలేదట.. నాలుగు కోట్ల నష్టపరిహారం, రెండు ఏళ్లు జైలు శిక్ష కూడా నాకు పడే అవకాశం ఉందట అని చెప్పుకొచ్చిన ఆయన.. లోకేష్ మృదు స్వభావి.. కారులో బైనాక్యులర్స్ పెట్టుకుని చీమలకు కూడా హాని కలగకుండా వెళతారట అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ అమ్మనా బూతులు తిడితే పరువు నష్టం దావా వేయకూడదా? అని ప్రశ్నించారు. కంతేరులో భూమి కొన్నాడని అనటం పరువు నష్టం అయ్యిందట.. లోకేష్ పీఏ చైతన్య నాకు ఫోన్ చేశాడు.. నాకు అనారోగ్యంగా ఉందని తెలిసి పరామర్శించటానికి వస్తాను అన్నాడు.. తర్వాత పది రోజులకు ఫోన్ చేసి టీడీపీలో చేరాలని మళ్లీ ఫోన్ చేశాడని గుర్తు చేసుకున్నారు.
తల్లి బిడ్డల హత్య, మైనర్ కూతురిపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
కామాంధులు రెచ్చిపోతున్నారు.. కన్నుమిన్ను కానకుండా.. చిన్నాపెద్ద తేడా లేకుండా.. తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు.. తల్లి బిడ్డలతో అక్రమ సంబంధమే కాదు.. వారిని హత్య చేసిన ఉన్మాది ఆ తర్వాత మైనర్ బాలికపై సైతం అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. వాడి పాపం పండింది.. తల్లి బిడ్డలను హత్య చేసి ఆపై వారి మైనర్ కూతురిని అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది చిత్తూరు ఏడీజే కోర్టు.. ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలో తల్లి బిడ్డను హత్య చేసిన నిందితుడు మౌలాలికి ఉరి శిక్ష విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు వచ్చింది.. గంగిరెడ్డిపల్లికి చెందిన తల్లి బిడ్డలు సరళమ్మ, గంగులమ్మలను అదే ఊరికి చెందిన సయ్యద్ మౌలాలి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. అయితే, ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లీ బిడ్డలను దారుణంగా హత్య చేసి చంపేశాడు. అంతటితో ఆగకుండా వారి మైనర్ కూతురిపై కన్నేసిన ఉన్మాది.. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ కేసును చిత్తూరు ఏడిజెక్టివ్ న్యాయమూర్తి రమేష్ మంగళవారం నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు.. ఈ కేసును గవర్నమెంట్ తరఫున ఏపీపీ లోకనాథరెడ్డి వాదించారు. కాగా, కన్నుతూరిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన కేసులో నిన్న విశాఖ పోక్సో కోర్టు దోషికి జీవిత ఖైదు విధించి.. రూ.10 లక్షలు జరిమానా విధించగా.. ఈ రోజు చిత్తూరు కోర్టు మరోకేసులో ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
పాఠశాలల్లో విద్యార్థులకు చంద్రయాన్-3 లైవ్.. యూపీ సీఎం కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘చంద్రయాన్-3’ ద్వారా చంద్రుని ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఆ లైవ్ ను చూసేందుకు పాఠశాలలు సాయంత్రం ఒక గంట పాటు ప్రత్యేకంగా తెరిచి ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సూచనలను ఉటంకిస్తూ.. “ఆగస్టు 23న సాయంత్రం 5.27 గంటలకు, చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ ప్రక్రియ ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ మరియు డిడి నేషనల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలని సర్కార్ ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ హుల్గి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చారిత్రాత్మక సందర్భంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సాయంత్రం వేళల్లో పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇదే తొలిసారి’’ అని అన్నారు. చంద్రయాన్-3 చంద్రుని ల్యాండింగ్ ఒక ముఖ్యమైన సందర్భమని, ఇది యువతలో ఉత్సుకతను పెంచడమే కాకుండా అన్వేషణ పట్ల మక్కువను రేకెత్తిస్తుందని తెలిపారు. పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా విద్యా మరియు శిక్షణ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది.
జాబిల్లి ఫోటోలు తీసిన చంద్రయాన్ 3… షేర్ చేసిన ఇస్రో
చంద్రయాన్ 3 తీసిన జాబిల్లి ఫోటోలను ఇస్రో ఎక్స్( ట్విటర్) వేదికగా పంచుకుంది. ఆగస్ట్ 20న ట్విటర్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకున్న ఇస్రో నేడు తాజాగా తీసిన మరిన్ని ఫోటోలను షేర్ చేసింది. ల్యాండర్ పొజిషన్ డిటెక్టర్ తీసిన ఫోటోలను ఇస్రో షేర్ చేసింది. ఆగస్టు 20న షేర్ చేసిన ఫోటోలను ఇమేజర్ కెమెరా 4 తో తీసింది చంద్రయాన్ 3. దీని బట్టి చూస్తుంటే చంద్రునిపై ల్యాండ్ అవడానికి అనుకూలమైన ప్రదేశాల కోసం విక్రమ్ ల్యాండర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రునిపై ఉన్న బండరాళ్లు, గుంతల ఫోటోలను తీసింది విక్రమ్ ల్యాండర్. ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ఆగస్టు 23 సాయంత్రం 6.04గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లి పైకి చేరుకోవాలి. అయితే ఇది జాబిల్లి పైకి వెళ్లడానికి రెండు గంటల ముందు పరిస్థితులన్నీ చూసుకొని అప్పుడు అనుకూలంగా ఉంటేనే విక్రమ్ ను ల్యాండ్ చేస్తామని లేదండే ల్యాండింగ్ తేదీ మారవచ్చని ఇస్రో ప్రకటించింది. అయితే భారత్ కంటే ముందే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకోవాలని ప్రయత్నించి రష్యా విఫలమైన సంగతి తెలిసిందే. రష్యా పంపిన లూనా 25 ల్యాండింగ్ సమయంలో జాబిల్లికి తగిలి క్రాష్ అయినట్లు ఆ దేశ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ఇక చంద్రయాన్ 3 కనుక జాబిల్లి పై సేఫ్ గా ల్యాండ్ అయితే అంతరిక్ష పరిశోధనలో భారత్ ఎలైట్ లిస్ట్ లోకి చేరుతుంది.
అంత కోపం ఏందయ్యా నీకు…బారియర్ గేట్ తెరుచుకోలేదని గొడ్డలితో విరగొట్టిన పైలెట్
ఎయిర్ పోర్ట్ ఎంప్లాయ్ పార్కింగ్ స్థలంలో మూడు ఎగ్జిట్ పాయింట్ ల వద్ద కొన్ని కార్లు వేచి ఉన్నాయి. అయితే ఆ సమయంలో బారిగేట్లు తెరుచుకోలేదు. అక్కడ లైన్ లో ఆరు కారులు వేచి ఉండగా దానిలో ఉన్న ఒక కారులో నుంచి ఓ వ్యక్తి గొడ్డలి పట్టుకొని వచ్చాడు. ఆ బారిగేట్లను హీరోలాగా గొడ్డలితో ఇరకొట్టాడు. ఈ ఘటన అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.బ్యారీ గేట్లు తెరుచుకోకపోవడంతో కోపంలో ఉన్న కెన్నెత్ హెండర్సన్ జోన్స్ అనే 63 ఏళ్ల పైలట్ తన వద్ద ఉన్న గొడ్డలితో గేటును విరగ్గొట్టాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతను వెళ్లిపోకుండా అడ్డుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది. ఇక మరో వ్యక్తి దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డుకావడంతో వైరల్ గా మారింది.
వార్నీ..ఇది ఫోటో షూటా.. కుస్తీ పోటీనా..
పెళ్లిళ్లకు ఫోటోలను దిగాలను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. వింతలు, విశేషాలు, విన్యాసాలు చోటు చేసుకుంటుంటాయో.. ప్రస్తుతం నిజ జీవితంలో జరిగే వివాహ కార్యక్రమాల్లో అంత కంటే ఎక్కువే వింతలు జరుగుతుంటాయి.. కొన్ని ఫోటోలు మాత్రం జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.. తాజాగా ఓ పెళ్లి జంట ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వరుడి మెడకు కాలును చుట్టి.. వధువు చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ”బాబాయ్.. ఇవేం స్టంట్స్”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వినూత్నం విన్యాసం చేశారు. అందరు చేసినట్లుగా కాకుండా కొత్తగా ట్రై చేశారు.. నిలబడి ఉన్న వరుడి కాలు మీద ఓ కాలు పెట్టిన వధువు.. మరో కాలును అతడి మెడకు చుట్టేసి.. బ్యాలెన్స్ మీద చేతులు వదిలేసి ఏటవాలుగా వంగి చేతులు అటూ, ఇటూ చాపుతూ ఫోజులు ఇచ్చింది..వరుడు కూడా వధువును కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ సినిమా స్టైల్లో ఫోజులు ఇచ్చాడు. స్టంట్ విజయవంతంగా పూర్తవడంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి అభినందించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
‘ఆర్ఎక్స్ 100’ సీక్వెల్ ప్లాన్ బయటపెట్టిన కార్తికేయ
హీరో కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురు లంక 2012’ రిలీజ్ కి రెడీ అయింది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో కార్తికేయ ముచ్చటిస్తూ పలు కీలక మైన వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఎక్స్ 100’లో మీ క్యారెక్టర్ శివ, గోదావరి నేపథ్యంలో కథ! ‘బెదురులంక 2012’లోనూ మీ పేరు శివ, ఇదీ గోదావరి నేపథ్యంలో తీసిన సినిమానే ఇది ఒక సెంటిమెంట్ అనుకోవచ్చా? అని అడిగితే ఇదంతా యాదృశ్చికంగా జరిగిందని అన్నారు. కథ నచ్చి రెండు సినిమాలు చేశానని, క్యారెక్టర్ పేరు శివ అని కథ చెప్పినప్పుడు క్లాక్స్ నాతో అనలేదని అన్నారు. చాలా రోజుల తర్వాత అతనికి ఈ విషయం గుర్తు చేశానని తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు గుర్తు లేదన్నాడు కానీ ఆ క్యారెక్టర్, మైండ్ సెట్ కు శివ పేరు సెట్ అవుతుంది కాబట్టే పెట్టానని చెప్పాడు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ, హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నామని కార్తికేయ అన్నారు. ఇక ఈ క్రమంలో ‘ఆర్ఎక్స్ 100’కు సీక్వెల్ ఆశించవచ్చా? అని అడిగితే ‘ఆర్ఎక్స్ 100 – 2’ అని కాదు కానీ అజయ్ భూపతి, నేను కలిసి ఓ సినిమా చేయాలని ప్లాన్ ఉందని అన్నారు. దానికి సరైన కథ కుదరాలి, కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం అన్నీ కుదిరినప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేస్తామని అన్నారు.
ఇదిరా.. ఒకప్పుడు టాలీవుడ్
ఇప్పుడంటే.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు కొట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఇలాంటి బేధాలు ఏవి ఉండేవి కావు. స్టార్ హీరోలందరు ఎప్పుడు కలిసే ఉండేవారు. ఒక హీరో సెట్ కు మరో హీరో వెళ్ళేవాడు.. ఫంక్షన్స్ కు, పార్టీలకు, ఈవెంట్స్ కు.. అవార్డ్స్ ఫంక్షన్స్ కు అందరు కలిసికట్టుగా వెళ్లేవాళ్లు. కేవలం టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు.. మిగతా భాషల హీరోలను కూడా కలిపేసుకొనేవారు. ఒక విధంగా చెప్పాలంటే.. టాలీవుడ్ మొత్తం ఒక తాటిమీదనే నడిచేది. అయితే జనరేషన్ మారేకొద్దీ.. హీరోల్లో మార్పులు వచ్చాయో లేదో తెలియదు కానీ.. అభిమానుల్లో మాత్రం మార్పులు వచ్చాయి. ఒక్కో హీరోకు వేళా సంఖ్యలో అభిమానులు అంటూ ఫ్యాన్స్ క్లబ్స్ మొదలయ్యాయి. మరొక హీరో ఫ్యాన్స్ తో గొడవలు.. మా హీరోను తక్కువ చేసి మాట్లాడితే గొడవలే అంటూ బెదిరించడాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాకా ఆ ఫ్యాన్ వార్స్ మరింత పెరిగాయి. అప్పట్లో స్టార్ హీరోలు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు కనిపిస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ ఇలా ఉండేదా.. ? అని నేటి యువతరం ఆశ్చర్యపోతున్నారు. తాజాగా నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన రేర్ పిక్స్ ను సంపాదించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో ఒక ఫోటోనే మీరు చూస్తున్నది. సింగిల్ ఫ్రేమ్ లో నలుగురు లెజెండ్స్. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్, నందమూరి బాలకృష్ణ కలిసి దిగిన ఫోటో ఇది. అయితే అకేషన్ ఏంటి ..? అనేది తెలియదు కానీ.. ఈ నలుగురు లెజెండ్స్ యుక్తవయస్సులో ఉన్నప్పుడు దిగిన ఫోటో అని మాత్రం తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య – చిరుల బాండింగ్ మాత్రం వేరే లెవెల్ అని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. ఇదిరా.. ఒకప్పుడు టాలీవుడ్. ఇలా ఉండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.