పాక్ అధికారి కవ్వింపు.. పీక కోస్తామంటూ ప్రవాస భారతీయులకు బెదిరింపు.. వీడియో వైరల్
యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. పహల్గామ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల నిరసన ప్రదర్శన చేపట్టారు. కల్నల్ తైమూర్ రహత్ అందరూ చూస్తుండగా.. భారతీయుల పీక కోస్తామంటూ సైగలు చేసి చూపించాడు. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ చిత్రం ఉన్న ప్లకార్డును చేతిలో పట్టుకుని ప్రవాస భారయుతీలను ఉద్దేశించి ఈ సంజ్ఞ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
డిగ్రీ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులపై ఎలుకల దాడి..
అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ ఘటనలో పది మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు రాకుండా ప్రిన్సిపాల్ గోప్యంగా ఉంచారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు గోప్యంగా వ్యాక్సిన్ వేయించారు. విద్యార్థినులు నిద్రిస్తున్నప్పుడు ఎలుకలు కొరికాయి. హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణ వల్ల రూమ్ లోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థినులు వాపోతున్నారు. నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనంలో ఎలుకల బెడద ఉందని చెబుతున్నారు. ఎలుకలు విద్యార్థులను కొరికిన తర్వాత… హాస్టల్ రూములు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించామని కాలేజీ యాజమాన్యం తెలిపింది. విద్యార్థినులు కూడా బయట నుంచి రూమ్ లోకి స్నాక్స్ తీసుకొని రావడం వల్ల ఎలుకలు వస్తున్నాయని వార్డెన్ సాకులు చెబుతున్నారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సేవలు అస్తవ్యస్తం..
రాష్ట్ర స్థాయిలో పేరొందిన వరంగల్ KMC సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెల రోజులుగా తీవ్ర అసౌకర్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలోని సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం నిలిచిపోయింది. ముఖ్యంగా చిల్లర్స్ మోటార్ రిపేర్‌లో ఉండటంతో మొత్తం ఆసుపత్రి అంతటా ఏసీలు పనిచేయకపోవడం, తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఆసుపత్రిలో రోజూ నిర్వహించాల్సిన సర్జరీలు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణ చికిత్సలకే కాదు, అత్యవసర శస్త్రచికిత్సలకూ అవకాశం లేకుండా పోయింది. దీని వల్ల వైద్యులు రోగులను హైదరాబాద్‌కి రిఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. సూపర్ స్పెషాలిటీ స్టేటస్ ఉన్న ఈ ఆసుపత్రిలో అందాల్సిన సేవలు కలగజేసుకోవాలంటే నిజంగా తీవ్ర నిరాశే!
పహల్గామ్‌పై స్పందించిన ట్రంప్.. కీలక వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం శుక్రవారం రోమ్‌కు వెళ్తుండగా ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ విలేకర్లతో మాట్లాడారు. పాకిస్థాన్-భారత్‌కు సంబంధించిన నేతలు చాలా దగ్గరగా తెలుసన్నారు. ఇక కాశ్మీర్ సమస్య 1,000 సంవత్సరాలకు పైగా ఉందని.. దానికోసం పోరాటం జరుగుతోందన్నారు. అయితే పహల్గామ్‌లో జరిగిన దాడి మాత్రం చాలా చెడ్డదన్నారు. ముష్కరుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని.. అయితే ఏళ్ల తరబడి నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 28 మంది మావోల హతం
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అడవి ప్రాంతంలో గత ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. అయితే చర్చలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీనిపై భద్రతా దళాల నుంచి స్పందన రాలేదు. దాదాపు వెయ్యి మంది మావోలు ఉన్నట్లుగా సమాచారం. మూడు రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా దళాలు మోహరించి కూంబింగ్ నిర్వహించారు. శనివారం జరిగిన దాడిలో దాదాపు 28 మంది మావోలు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్సుంది.
ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురింపించిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలోనే కనిపించే గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఆయనను స్వాగతించాల్సిందే… ఎందుకంటే మళ్లీ కనిపించేది ఎన్నికలపూటే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కవిత తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితంగా నిలిచాయని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఏ ఒక్క హామీను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పిన వాగ్దానం కేవలం అర్థాంతరంగా నిలిచిందని, మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500 ఇస్తామన్న హామీలు కనిపించకుండా పోయాయని కవిత ఆరోపించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను ట్రాప్ చేసి.. డబ్బు, బంగారం కాజేసిన కిలాడీ అరెస్ట్..
ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బులు బంగారం కాజేస్తున్న కిలాడీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన కీలారు నాగ తేజగా గుర్తించారు. నిందితుడు నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విజయవాడకు చెందిన యువతని ఏకాంతంగా మాట్లాడాలని హోటల్‌కి తీసుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక యువతి కాళ్లు చేతులు కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న 20 గ్రాముల బంగారం దోచుకున్నాడు. గుంటూరులో బంగారం అమ్మి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. బంగారం అమ్మగా వచ్చిన డబ్బులు బెట్టింగ్‌లో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇదే విధంగా మరో ఇద్దరు అమ్మాయిలని మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నాగతేజాపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎంత మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
చిక్కుల్లో రన్యా రావు.. ఏడాదంతా జైల్లోనే..!
కన్నడ నటి, బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు మరింత చిక్కుల్లో పడ్డారు. ఆమెపై నమోదైన కేసుల నేపథ్యంలో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితులు లేవు. దీంతో సంవత్సరం పాటు కారాగారంలోనే బందీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రన్యా రావుపై అక్రమ రవాణా నిరోధక చట్టం కింద అభియోగాలు మోపబడ్డాయి. దీంతో ఒక సంవత్సరం పాటు నిర్బంధంలో ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి. కోఫెపోసా చట్టం కారణంగా ఒక సంవత్సరం పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం రన్యారావు బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉంది. రన్యారావుపై విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం, 1947 (COFEPOSA) కింద కేసు నమోదు చేసినట్లు శుక్రవారం వర్గాలు ధృవీకరించాయి.
కుదేలవుతున్న కశ్మీర్ ట్రావెల్స్.. అమర్‌నాథ్ యాత్రికులు సైతం వెనకడుగు..
కశ్మీర్ ట్రావెల్స్ కుదేలవుతుంది. పహల్గావ్ ఘటనతో టూరిస్టులు వెనక్కి తగ్గుతున్నారు. చావు కంటే వేసవి తాపం బెటర్ అంటున్నారు పర్యటకులు. కశ్మీర్ హోటళ్ళ నుంచి ఫ్యూచర్ క్రెడిట్ అవకాశాలు ఇచ్చాయి. ఇప్పుడు బుక్ చేసుకున్నవి వచ్చే సీజన్ వరకూ రిజర్వులో ఉంచుకునే అవకాశం కల్పించాయి. విమాన టికెట్లు రద్దు చేసుకుంటే మొత్తం సొమ్ము తిరిగి ఇచ్చేస్తున్నాయి విమానయాన సంస్థలు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన ఏర్పాటుతో టూరిస్టులకు ఊరట లభించింది. ప్రత్యేక ఆఫర్లు ఇచ్చినా నై అంటున్నారు పర్యటకులు. మరో మూడు నెలల వరకూ కశ్మీర్ టూర్ లు డౌటే అంటున్నారు. అమర్‌నాథ్ యాత్రికులు సైతం వెనకడుగు వేస్తున్నారు.
కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవు
బీఆర్ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నదుల అభివృద్ధి , సంరక్షణ సంస్థ (NDSA) నివేదికలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన డొల్లతనం పూర్తిగా బహిర్గతమైందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు అబద్ధాలు చెప్పడం తప్ప మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. నివేదిక ఆధారంగా తప్పిదాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ఎనిమిదో వింతే అని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి.. మూడు సంవత్సరాల్లో నిర్మించి, రెండు సంవత్సరాల్లో కూలిపోయే ప్రాజెక్టు నిజంగానే ఎనిమిదో వింత అంటూ తీవ్రంగా విమర్శించారు. NDSA నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణాలు మన్నికలేకపోయాయని స్పష్టం అయ్యిందని అన్నారు.