ఏపీలో చెత్త పన్ను రద్దు.. గెజిట్ జారీ
ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్నును ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చాక… చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ జారీ అయింది. ఇక నుంచి ఏపీలో చెత్తపై పన్ను ఉండదు. గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను వేశారు. దీనిపై కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో ఇదే అస్త్రంగా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే.. చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల హామీల్లో భాగంగా చెత్త పన్ను రద్దు చేశారు.
పట్టాలు తప్పిన రైలు.. ప్రమాదంలో దెబ్బతిన్న మూడు బోగీలు
ఇటీవల చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రైళ్లు పట్టాలు తప్పడం, ఒకదానికి ఒకటి ఢీకొట్టడం, ట్రైన్లలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టెక్నికల్ సమస్యలతో, మానవ తప్పిదాల కారణంగా కూడా రైళ్లు ప్రమాదబారినపడుతున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.ఈ ప్రమాదంలో మూడు బోగీలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన నిన్న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో వేల మందిని మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ECIR) నమోదు చేయడంతో విచారణ మరింత వేగవంతమైంది. హైదరాబాద్ హైటెక్ సిటీ హుడా ఎన్‌క్లేవ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఈ సంస్థ, ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో అధిక లాభాలను వాగ్దానం చేసి, రూ.1,700 కోట్ల మేర నిధులను సమీకరించింది. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నివేదిక ప్రకారం, ఈ సంస్థ నిర్వాహకులు దుబాయ్, మలేషియా సహా 14 షెల్ కంపెనీలకు రూ.850 కోట్లను మళ్లించినట్లు నిర్ధారణ అయ్యింది.
నల్గొండలో బర్డ్‌ఫ్లూ..? 7 వేల కోళ్లు పాతిపెట్టిన వైనం..
నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫారంలో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురి చేసింది. గ్రామంలోని రైతులు తాము నష్టపోయిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. చెరుకుపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో గత కొన్ని రోజులుగా కోళ్లు అనారోగ్యానికి గురవుతుండగా, ఈ సమస్య మరింత తీవ్రమై సుమారు 7,000 కోళ్లు ఆకస్మికంగా మరణించాయి. ఈ ఘటనతో గ్రామస్తుల మధ్య భయాందోళనలు వ్యక్తమయ్యాయి. బర్డ్ ఫ్లూ సోకినట్టుగా అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రైతులు తక్షణమే స్పందించి, చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు.
కోళ్లు అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని గమనించిన వెంటనే రైతులు హైదరాబాద్ నుంచి నిపుణులైన వెటర్నరీ డాక్టర్లను రప్పించారు. అయితే, పలు మార్లు వైద్యం అందించినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. రైతులు తమ కోళ్లను రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ, అనారోగ్యం మరింత తీవ్రమై కోళ్ల మరణాన్ని తలపెట్టింది.
కృష్ణా జలాలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీకి క్షమాపణ చెప్పాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తుందని రేవంత్‌రెడ్డి అనడం దారుణం అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలను, రైతులను దోపిడీ దొంగలుగా చిత్రీకరించడం దారుణం అని.. ఒక సీఎంగా ఉండి ఇలా మాట్లాడడం సహేతుకమేనా? అని నిలదీశారు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం ఎవరి త్యాగాలతో నిర్మించారో రేవంత్ రెడ్డికి తెలియదా? అని అడిగారు. ‘‘ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఏపీ తన కాళ్ల మీద నిలబడుతుంది. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ నిధులు తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క స్కీమ్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఏపీ, తెలంగాణ మధ్య కావాలనే జల వివాదాలు సృష్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి బేషరతుగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపుతారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారా?, అయినా దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది. దేశంలో 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోతుంది.’’ అని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.
అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం.. ఎప్పటినుంచంటే..!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యం అయింది. అయితే తాజాగా టెండర్లు పిలుచుకోవచ్చని.. కానీ ఖరారు చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 62 పనులకు ఏపీ సీఆర్‌డీఏ, ఏడీసీ టెండర్లకు పిలిచింది. సుమారు రూ.42 వేల కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో మరో 11 పనులకు కూడా టెండర్లు పిలవనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30 వేల మంది కార్మికులు పనులు చేస్తారని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో సాగునీటి సంక్షోభంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
తెలంగాణలో సాగునీటి సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల గత ఏడాది కాలంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎండిపోయాయని, సాగునీటి крైసిస్ అన్నదాతలను ఆత్మహత్యలకు దారి తీస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకునేందుకు సరిపోతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లను తగిన విధంగా నిర్వహించకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షోభమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో రైతులను నీటి కోసం వర్షాలు కోసం ఎదురుచూడే పరిస్థితికి తెచ్చిందని విమర్శించారు.
గ్రూప్-2 పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
ఏపీలో ఫిబ్రవరి 23న (ఆదివారం) జరిగే గ్రూప్-2 మెయిన్ పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది. పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23న యథావిధిగా గ్రూప్-2 మెయిన్ పరీక్ష జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. రేపటి పరీక్ష వాయిదా పడిందంటూ హల్‌చల్ అవుతున్న ఫేక్ వార్తపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.
నిజామాబాద్ పసుపు యార్డులో.. రైతులు దారుణంగా మోసపోతున్నారు
నిజామాబాద్ పసుపు యార్డు ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు యార్డులో.. రైతులు దారుణంగా మోసపోతున్నారని, వారం రోజులుగా ధరలు పడిపోయాయన్నారు. కేంద్రం 15 వేలు మద్దతు ధర ఇస్తామని గొప్పలు చెప్పి రైతులను మోసం చేశారని, పసుపు బోర్డు కు చట్ట బద్దత లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ లో బిల్లు పెట్టీ .. బిల్లు పాస్ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని, పసుపు మార్కెట్ లో రైతులను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి అని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే ఈ పరిస్థితి అని, పసుపు కు 12 వేలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ చెప్పారన్నారు. పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలని, కేంద్రం పై పసుపు 15 వేలు ధర ఇవ్వాలని పోరాటం ఉంటుందన్నారు. పసుపు బోర్డుకు చట్ట బద్ధత కల్పించాలని బీఆర్‌ఎస్ తరపున పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత.
బీసీ రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వచ్చే మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, చట్టాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో 96.9% మంది పాల్గొన్నారని, కేవలం 3.1% మంది మాత్రమే అందులో పాల్గొనలేదని వివరించారు. ఈ క్రమంలో, రెండో విడత కులగణన సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ హక్కులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.