ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగరవేసిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్‌లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నవీన్‌రావు, సీఎంఓ అధికారులు, సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సీఎం కేసీఆర్ అమరజవాన్‌కు నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరికాసేపట్లో గోల్కొండ కోటపై కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్ కి వేసినట్టే.. మజ్లిస్ చేతికి స్టీరింగ్..!
కాంగ్రెస్ కు ఓటు వేసిన BRS కి వేసినట్టే అని, ఈ రెండు పార్టీ లకి ఓటు వేస్తే మజ్లిస్ కు వేసినట్టేనని.. స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర సమర యోధుల ఆకాంక్షలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రజాకార్లు, నిజాం వ్యతిరేకంగా వేలాది మంది పోరాటం చేశారని అన్నారు. ఈ ప్రాంతం భారత దేశంలో విలీనం కావాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చి వంద యేళ్లు అయ్యే లోపు దేశంలో పేదరికం, నిరుద్యోగం,కుటుంబ పాలన, అవినీతి ఉండకూడదని, దేశం విశ్వగురువు కావాలన్నారు. ఏ లక్ష్యం కోసం నిజాంకు వ్యతిరేకంగా, తెలంగాణ కోసం పోరాటం చేశామో ఆ లక్ష్యం నెరవేరుతుంద ఆలోచించుకోవాలని తెలిపారు. 9 సంవత్సరాల జరిగిన దోపిడీ, అవినీతి, అప్రజాస్వామిక పాలన మళ్ళీ తెలంగాణ ప్రజల మీద పడకుండా చూడాలని, ఆదమరచి ఉండకూడదన్నారు.
కేంద్రంలో రాజకీయ స్థానం అవసరం లేదు… అదొక్కటే లక్ష్యమంటున్న మమతా బెనర్జీ
బీజేపీని గద్దె దించడానికి I.N.D.I.A కూటమి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సర్వ శక్తులు ఒడ్డుతోంది. I.N.D.I.A కూటమి గెలుపొందాలంటే పదవుల కోసం కొట్టుకోకుండా ఐకమత్యంగా ఉండటం అవసరం. ఈ విషయాన్ని గ్రహించిన నేతలు తమకు కేంద్రంలో స్థానం కంటే I.N.D.I.A కూటమి గెలవడమే ముఖ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో తమకు రాజకీయ స్థానం అవసరం లేదని, ఎన్డీయే కూటమిని ఓడించడమే తమ ధ్యేయమని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో I.N.D.I.A కూటమి విజయాన్ని ఎవరు ఆపలేరని మమత ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈరోజు ఎర్రకోటపై ప్రధానిగా నరేంద్ర మోడీ చేసిన ప్రసంగమే ఆయనకు చివరిది కానుందని ఆమె జోస్యం చెప్పారు. ఇదిలా వుండగా వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశం సాధించిన విజయాలను ఎర్రకోట నుంచి వివరిస్తానని ప్రధాని మోడీ మరోవైపు ధీమా వ్యక్తం చేశారు.
ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియానికి చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్యా, వైద్య -ఆరోగ్య , మహిళా సాధికారత, సామాజిక వర్గాల అభ్యున్నతి, పారిశ్రామిక రంగాల్లో తన ప్రభుత్వం తీసుకుని వచ్చిన మార్పులను వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు తన ప్రసంగంలో ప్రకటించారు సీఎం జగన్.
ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకలకు మల్లికార్జున్ ఖర్గే దూరం .. ఎక్స్ లో సందేశం పోస్టు
ఎర్రకోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జన ఖర్గే గౌర్హాజరయ్యారు. ఎర్రకోటలోని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఖర్గే హాజరు కాకపోవడానికి కారణాలను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ.. ఆరోగ్యం బాగా లేక తాను హాజరు కాలేదని ఖర్గే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే హాజరుకాకపోవడంతో.. ఆయన కోసం వేసిన కుర్చీ ఖాళీగా కనిపించింది. ప్రధాని మోదీ ప్రసంగానికి ఆయన హాజరు కాకపోయినప్పటికీ ఖర్గే తన ట్విట్టర్ అకౌంట్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు.
యూపీలో దారుణం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కాల్చిన దుండగులు
దేశంలో వ్యక్తిగత కక్షలతో దాడులు పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో దుండగులకు తుపాకులు సైతం అందుబాటులో ఉండటంతో వారు రెచ్చిపోతున్నారు. తమకు నచ్చని వారిపై.. తమను ఎదిరించిన వారిపై దాడులు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే వివాదాల్లో సైతం ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ఘటనే సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణమైన ఘటన జరిగింది. తన చిన్నారి కూతురిని భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కొందరు దుండగులు దగ్గరి నుంచి కాల్చారు. అయితే ఈ దాడిలో చిన్నారి క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో సోమవారం తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని సమీపం నుండి కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.
తొమ్మిదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఆదా.. ప్రకటించిన ఆర్థికమంత్రి
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) ద్వారా గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.2.73 లక్షల కోట్లు ఆదా చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం డిబిటి ద్వారా వివిధ పథకాల కింద ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో నకిలీ లేదా బోగస్ ఖాతాల ఖాతాల్లోకి ప్రభుత్వ నిధులు వెళ్లకుండా అరికట్టగలిగినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది లీకేజీలను అరికట్టడంలో.. ప్రభుత్వ పథకం నిజమైన, అర్హులైన లబ్ధిదారులకు మెరుగైన ప్రయోజనం చేకూర్చడంలో సహాయపడిందని ఎన్జీవో దిశా భారత్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ఆర్థిక మంత్రి మాట్లాడారు. డిబిటిని స్వీకరించినప్పటి నుండి దాని ద్వారా ప్రభుత్వ పనితీరు మెరుగుపడిందని.. దాని సహాయంతో విద్య, ఆరోగ్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చని అన్నారు.
వారి పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలు విధ్వంసానికి గురయ్యాయి..!
సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలు విధ్వంసమైపోయాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. గత ఏడాది భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించు కుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.
75 ఏళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడంలేదు. అన్నీఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల జీవితాల్లో అలుముకొన్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్ర్యానికి సార్థకత అని సవినయంగా మనవి చేస్తున్నాను.
ఇక సూర్యూడి పైకి.. సెప్టెంబర్‌లో ఆదిత్య-ఎల్1 ప్రయోగం
ఇప్పటి వరకు చంద్రుడిపై రహస్యాలను శోధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. ఇకపై సూర్యుడి రహస్యాలను చేధించడం కోసం ప్రయత్నాలు మొదటి పెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలను చేయడానికి ఇస్రో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే 6 ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో.. అదే జోష్‌లో మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ తరువాత తదుపరి మిషన్‌కు సిద్ధమవుతోంది. తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రాకెట్‌ను పంపించనుంది. ఇందుకోసం ఆదిత్య L1 రాకెట్‌ను లాంచ్ చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే కానుంది. అంతరిక్ష నౌక భూమి నుంచి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లగారెంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్‌లో ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. ఆదిత్య ఎల్1 ప్రయోగంలో శాటిలైట్‌ను సెప్టెంబర్ మొదటివారంలో పీఎస్‌ఎల్వీ సీ57 వాహకనౌక ద్వారా నింగిలోకి పంపనున్నది. సూర్యుడి పుట్టుక, వాతావరణం గురించి లోతైన అధ్యయనం కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.
కడియం నర్సరీలో మువ్వన్నెలు రెపరెపలు
భారత కీర్తి పతాక మువ్వన్నెలు జెండా కడియం నర్సరీలో రెపరెపలాడాయి. గ్లోబల్ వార్మింగ్ ను అధిగమించేందుకు పచ్చదనాన్ని ప్రేమించాలని పిలుపునిస్తూ తూర్పుగోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం తీర్చిదిద్దిన ఈ ఆకృతి అధ్యంతం సందేశాత్మంగా నిలిచింది . పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలుపుతూనే పచ్చదనం ప్రాధాన్యతను వివరించింది. .ప్రముఖ ల్యాండ్ స్కేపింగ్ డిజైనర్ ,పల్ల వెంకన్న నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ చేసిన మొక్కల కూర్పు సందర్శకుల మనసును దోస్తోంది.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగంతో ఆంగ్లేయుల బానిసశృంఖలాల నుండి స్వేచ్ఛ భారత్ ను సాధించుకున్న మనం కాలుష్యం కోరల్లో చిక్కుకుపోతున్నామని ఆ మహమ్మారిని తరిమికొట్టాలంటే గ్రీన్ ఇండియా నినాదం ప్రతి ఒక్కరిలో ఉండాలని సందేశం ఇస్తూ ఈ ఆకృతి ఏర్పాటు చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న యువత విదేశీ కొలువులకు పరిగెడుతుందని గ్రీన్ ఇండియా సందేశం తో ఆ యువతకు తిరిగి మనదేశానికి ఆహ్వానించాలనే ఆకాంక్షను వెంకటేష్ వ్యక్తం చేశారు. మనం సాధించుకున్న స్వాతoత్ర్యం లోనే భారత ఔన్నత్యం ఇమిడి ఉందని అటువంటి పంద్రాగస్టు వేడుకను మా నూతన నర్సరీలో మొక్కలతో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అంటున్నారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు..
తెలంగాణలో గత 15 రోజులుగా సరైన వర్షాలు లేవు. జూలై చివరి వారంలో దాడికి గురైన వరుణుడు ఆగస్టులో కనిపించకుండా పోయాడు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతులకు ఆగస్టు చాలా ముఖ్యమైన నెల. కాయలు ఎదుగుదల దశలో ఉన్నందున వర్షాలు అవసరం కాగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కీలక ప్రకటన చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి-భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై కాలానుగుణంగా ప్రభావం ఉంటుందని, ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. సోమవారం సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ సాయంత్రం వర్షం కురిసింది. వాతావరణం మేఘావృతమై ఉండడంతో.. ఎల్బీనగర్, వనస్థలిపురం, చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలో ఈరోజు ఉదయం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
పంచాయతీ కార్మికులకు గుడ్‌న్యూస్.. బీమా సౌకర్యం కల్పించాలని సర్కార్ నిర్ణయం
తెలంగాణ సర్కార్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పారిశుధ్య కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీల్లో పనిచేస్తూ మరణించిన బహుళార్థసాధక కార్మికులు (ఎంపీడబ్ల్యూ) కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
ఈ బీమా సౌకర్యాన్ని ఎల్‌ఐసీ అందజేస్తుంది. కార్మికుల బీమా పాలసీ మొత్తాన్ని సంబంధిత గ్రామపంచాయతీ చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి పారిశుధ్య కార్మికునికి ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్వీసులో ఉన్న కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే సర్వీసులో ఉన్న కార్మికులు మరణిస్తే దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచారు. ఇప్పటి వరకు తమకు రూ. 5వేలు ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ. 10 వేలు. ఈ మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత గ్రామ పంచాయతీని ఆదేశించింది.
భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఆమె కార్యకర్తలను ఉద్దేశించి స్వతంత్ర దినోత్సవం గురించి మాట్లాడారు. స్వతంత్రం కోసం బలిదానం చేసిన వారికి నివాళులు, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం అని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల వారికి పెద్ద పీట వేస్తూ సంక్షేమం అభివృద్ధి చేసింది కేంద్రమని, సౌభ్రాతృత్వ భావనతో మనందరం ముందడుగు వేయాలన్నారు. మోడీ మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందన్నారని, ఇది ముమ్మటికి నిజమన్నారు.
మణిపూర్‌కు దేశం అండగా ఉంది.. భారత్ ప్రపంచ మిత్రుడుగా ఉద్భవించింది
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వరుసగా 10వసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియా వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. గత పదేళ్లలో ఇండియా ఎంతో అభివృద్ధి సాధించిందని… దేశం కోసం వేలాది మంది బలిదానం ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యమని మోడీ చెప్పారు. ప్రస్తుతం శాటిలైట్ రంగంలో ముందంజలో ఉన్న ఇండియా .. రానున్న కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీని శాసిస్తుందన్నారు. వ్యవసాయంలో సైతం దేశం ఇటీవలి కాలంలో చాలా అభివృద్ధి చెందిందని..సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయంలో అన్నదాతలు రాణిస్తున్నారని తెలిపారు. బారతదేశ డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయో డైవర్శిటీలు దేశానికి బలమని మోడీ చెప్పారు. గత పదేళ్లుగా దేశంలో ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం దేశాన్ని ముందుకు నడిపిస్తోందన్నారు. గతంలో అవినీతి కారణంగా దేశం చాలా నష్టపోయిందన్నారు. దేశంలో అత్యధికంగా ఉన్న మహిళా శక్తి, యువతతో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని మోడీ ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి ఎన్నో పాఠాలు నేర్పిందని..ఆ సంక్షోభం నుంచి అత్యంత త్వరగా కోలుకోవడం ద్వారా ప్రపంచదేశాలకు ఇండియా ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం స్టార్టప్ రంగంలో దేశం మూడవ స్థానంలో ఉండటం విశేషమన్నారు. గత పదేళ్లలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో అందరికీ న్యాయం చేస్తున్నామన్నారు.
స్వాతంత్ర్యదినోత్సం రోజున వారికి గుడ్ న్యూస్ చెప్పిన మోడీ
77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మణిపూర్ లో శాంతి స్థాపన, దేశాభివృద్ధిలో యువత పాత్ర, తమ ప్రభుత్వ ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు తదితర విషయాల గురించి మోడీ వివరించారు. 10 సంవత్సరాలుగా మోడీ దేశ ప్రధానిగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
మరోవైపు స్వాతంత్ర దినోత్సవం రోజు సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. వారికోసం ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణకారులు, కమ్మరులు, రజకలు, క్షురకులు, తాపీమేస్త్రీల కోసం వచ్చే కొన్ని రోజుల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మోడీ వివరించారు.