ముగిసిన నీటిపారుదల శాఖ ఏఈ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
కరీంనగర్‌కు చెందిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీధర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం తెల్లవారుజామున భారీగా దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్‌పై నమోదైన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు, పెద్దఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి తీసుకొచ్చారు. కరీంనగర్, సిద్ధిపేట్, వరంగల్, హైదరాబాద్ సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న శ్రీధర్ నివాసంలో సోదాలు ప్రారంభమై తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగాయి.
లాస్ ఏంజిల్స్ లో ఉద్రిక్తత.. ఏకంగా 400 మంది అరెస్ట్
అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఓ వైపు కేంద్ర బలగాల మోహరింపు.. మరోవైపు ఆందోళనలతో పలు నగరాలు అట్టుడికి పోతున్నాయి. ఇక, నిరసనలకు కేంద్ర బిందువుగా మారిన లాస్ ఏంజెలెస్‌లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అలాగే, ఆస్టిన్, టెక్సాస్, చికాగో, న్యూయార్క్, డల్లాస్, డెన్వర్‌తో సహా అనేక ఇతర నగరాల్లో ఆందోనలు కొనసాగుతున్నాయి. వీకెండ్ సమయంలో నిరసనలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక, శనివారం నాడు అనేక గ్రూపులు ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉంది.
పాక్కి భారత్ మరో షాక్.. ఆ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుకు ప్లాన్..
పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై మోడీ సర్కార్ ప్రణాళికలు రెడీ చేస్తోందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. అయితే, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాక్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇక, సింధు, దాని ఉప నదులపై భారత్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం కష్టంగా మారడంతో.. పాటు నీటి నిల్వ సామర్థ్యం పెంచడం కూడా సమస్యగా ఉండేది. కానీ, ఇప్పుడు దాయాది దేశంతో ఒప్పందాన్ని నిలిపివేయడంతో.. కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వను కూడా పెంచే ఛాన్స్ దొరికింది. అయితే, నిర్మాణ ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో ఇప్పుడు ఎటువంటి మార్పులు చేయడం లేదన్నారు. ఎందుకంటే వీటికి సంబంధించిన సాంకేతిక అంశాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మరికొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉండటంతో.. వాటిల్లో విద్యుత్త్ ఉత్పత్తిని ఎక్కువగా చేసేందుకు నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్లాన్ చేస్తున్నామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పుకొచ్చారు.
అమరావతిలో సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీకి రంగం సిద్ధం..?!
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమకు సంబంధించి కీలక చర్చలకు రంగం సిద్ధమవుతోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా హాజరై నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వ వర్గాలు, ముఖ్యమంత్రి కార్యాలయం భేటీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సినిమాల్లో ఎదురవుతున్న సమస్యలు, ఏపీ రాష్ట్రంలో షూటింగ్‌లకు అనుమతులు, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, ఇతర తాజా అంశాలపై చర్చ జరగనుంది. అంతేకాకుండా, సినీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాలోచనలు జరిగే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం నేతృత్వంలో 22వ తేదీ తర్వాత సమావేశం జరుగనున్నట్లు సమాచారం.
నారీమణులకు కేంద్రం గుడ్‌న్యూస్..! వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో..!
ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవలే 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 11 ఏళ్ల పాలనలో మహిళలకు పెద్ద పీట వేశామని.. వారిని ఎంతగానో గౌరవించినట్లు బీజేపీ శ్రేణులు ప్రకటించారు. తాజాగా నారీమణులకు కేంద్రం మరో శుభవార్త చెప్పుబోతుంది. 2029లో జరిగి లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.ఇటీవలే 2027, మార్చి నాటికి జనాభా లెక్కలు, కుల గణన పూర్తి చేస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా డీలిమిటేషన్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే నియోజకవర్గాల పునర్విభజన చేయబోతున్నట్లు వెల్లడించారు. దీనిపై కూడా కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. వీటిన్నింటినీ చాలా వేగంగా పూర్తి చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇవన్నీ పూర్తైతే.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒక క్లారిటీ వస్తుందని భావిస్తోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు (నూట ఇరవై ఎనిమిదవ సవరణ)ను సెప్టెంబర్ 19, 2023న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2029 ఎన్నికల నాటికి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. అదే గనుక జరిగితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్ల రిజర్వేషన్ అమలులోకి వస్తుంది.
ఢిల్లీని హడలెత్తిస్తోన్న ఉష్ణోగ్రతలు.. 52 డిగ్రీలు నమోదు
దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైంది. అలాగే జూన్ మాసం కూడా సగం రోజులైపోతుంది. కానీ ఉష్ణోగ్రతల్లో మాత్రం మార్పు రాలేదు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుంటే.. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఢిల్లీలో ప్రస్తుతం 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఢిల్లీ, పంజాబ్‌లో కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పగలు ఎండలు ఎక్కువగా ఉంటాయని.. సాయంత్రం మాత్రం ఉపశమనం లభించొచ్చని ఐఎండీ తెలిపింది. అంతేకాకుండా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
పబ్ లో గబ్బు.. కల్పికపై కేసు
ప్రిజం పబ్ లో నానా హంగామా చేసిన నటి కల్పిక పైన పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న, రాత్రి సమయంలో పబ్‌కి వెళ్లిన కల్పిక అక్కడి సిబ్బంది పై అసభ్యంగా ప్రవర్తించింది. అర్ధరాత్రి సమయంలో పబ్బులో తనకు కాంప్లిమెంటరీ కావాలని హంగామా చేయడంతో, అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసుల పైన కూడా కల్పిక దురుసుగా వ్యవహరించారు. అంతేకాకుండా పబ్బులో ప్లేట్లు గ్లాసులుతో పాటు ఫర్నిచర్‌ని కూడా కల్పిక ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును విచారించిన అనంతరం కోర్టు అనుమతి తో పోలీసులు నటి కల్పికపై కేసు నమోదు చేశారు. దీంతో బి ఎన్ఎస్ సెక్షన్లు 324(4), 352, 351(2) ప్రకారం ఆమె పై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న కల్పికపై ఇటువంటి ఆరోపణలు రావడంతో సినీ వర్గాల్లో కలకలం రేగింది. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే.
నాకు ఎదురైన బాధ ఎవరికి రాకూడదు.. మాజీ మంత్రి ఆవేదన..!
ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదనతో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. జగన్ జెండా మోసిన కార్యకర్తల ఇంట్లో జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. అలాగే కార్యకర్తల ఇంట్లో పూల కుండీలను బద్దలు కొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం చేసారని ఆరోపించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడానికి మధ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులే ప్రధాన కారణమని నాని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారని.. కాకాణి గోవర్ధన్, కొడాలి నాని, తాను ఇలా చాలా మంది నేతలపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడప్
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తు మరింత వేగంగా సాగుతోంది. ఇప్పటికే అనేకమంది అధికారులను విచారించిన సిట్, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న మాజీ ఎస్‌ఆర్ఎస్ అధికారి ప్రణీతరావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావులను విచారణకు పిలిచింది. రేపు ప్రణీతరావు, ఎల్లుండి ప్రభాకర్ రావు హాజరుకావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అత్యంత సంచలనంగా మారిన అంశం.. రెండు టెరాబైట్ల హార్డ్ డిస్క్‌ల ధ్వంసం వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కీలకమైన డేటా ఉన్న ఈ హార్డ్ డిస్క్లను ప్రణీతరావే ధ్వంసం చేశారని సిట్ అనుమానిస్తోంది. ఆమె ఈ హార్డ్ డిస్క్లను నాశనం చేసి, వాటిని మూసీ నదిలో పడేసినట్లు ఆధారాలు లభించాయి. విచారణలో ఆమెకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఏదైనా జరిగితే అమెరికాదే బాధ్యత అన్న ఇరాన్
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్, ఇరాక్‌లో ఉన్న తమ వారంతా ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమాసియా అత్యంత ప్రమాదకరమని.. తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ఇరాన్‌లో ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెళ్లాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ పక్కా ప్రణాళిక రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని ప్రపంచ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ పూర్తిగా సన్నద్ధమైపోయినట్లుగా అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.