చంద్రబాబుకి దేవుడు కూడా శిక్ష వేస్తాడు..!
చంద్రబాబు ఐటీ నోటీసుల అంశాన్ని చిన్నదిగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని.. అయితే, ఇది భవిష్యత్తులో చాలా పెద్ద విషయంగా భయటపడుతుందన్న ఆయన.. ఇప్పటికే చంద్రబాబుకి ప్రజలు శిక్ష వేసారు.. రానున్న రోజుల్లో దేవుడు కూడా చంద్రబాబుకు శిక్ష వేస్తాడు అని వ్యాఖ్యానించారు. మరోవైపు, తిరుమలలో మీడియాతో మాట్లాడిన మంత్రి గుమ్మనూరు జయరాం.. అసలు చంద్రబాబుకి నోటీసులు కొత్త కాదని వ్యాఖ్యానించారు. వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా చంద్రబాబుకి తెలుసు అంటూ సెటైర్లు వేశారు. అయితే, భవిష్యత్తులో చంద్రబాబు ఐటీ నోటీసుల నుంచి తప్పించుకోలేడు అని జోస్యం చెప్పారు మంత్రి గుమ్మనూరు జయరాం.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపు..
విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది.. అప్రమత్తమైన ఎయిర్ పార్ట్ సిబ్బంది.. తనిఖీలు చేపట్టారు.. విమానాల రాకపోకలు సైతం నిలిపివేసినట్టు తెలుస్తోంది.. అయితే, అది ఆకతాయిల పనిగా తెలుస్తోంది.. ఎందుకంటే ఆకతాయి మళ్లీ ఫోన్ చేసి అలాంటిది ఏమీ లేదని చెప్పినట్టు సమాచారం.. ఏమైనా తనిఖీలు చేశారు అధికారులు. ఇక, ఢిల్లీ వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది.. ఆకతాయి తణుకు ప్రాంతం నుంచి ఫోన్ చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలసులు.. గన్నవరం ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు ఫేక్ కాల్ పై కేసు నమోదు చేశారు.. ఎయిరిండియా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు.. నిన్న రాత్రి ఎయిర్ పోర్టులో బాంబు ఉందనే ఆకతాయి ఫోన్ తో అలజడి నెలకొందని తెలిపారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఢిల్లీకి విమానాన్ని పంపించారు ఎయిర్ పోర్ట్ అధికారులు.. తణుకు ప్రాంతం నుంచి ఆకతాయి కాల్ వచ్చినట్టు ప్రాథమిక నిర్దారణ వచ్చిన గన్నవరం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా బాంబు బెదిరింపు ఫోన్ కాలం.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర కలకలం రేపింది.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్.. సోనియా, రాహుల్ క్షమాపణ చెప్పాలి..!
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. విశాఖపట్నంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఉదయనిధి కామెంట్స్‌ను తప్పుబట్టారు.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు ఇండియా కూటమికి బాధ్యత వహిస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ బచ్చాగాళ్లు సనాతన ధర్మాన్ని కరోనాతో పోలిస్తే దాని ఖ్యాతి ఎక్కడ తగ్గదన్న ఆయన.. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు వ్యాఖ్యలు చేసి ఆత్మాభిమానం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలు దురుద్దేశంతో చేసినవి అని దుయ్యట్టారు. యాంటీ ఇండియా అలయన్స్ దురుద్దేశం, అజెండాలో భాగమే ఈ వ్యాఖ్యలు వెనుక అంతరార్ధం అన్నారు. గెలిచే సత్తా లేమని తెలిసి ఓటు బ్యాంకు పెంచుకునే దుర్భిద్ధిలో భాగమే నంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
ఐటీ నోటీసులపై చంద్రబాబు వివరణ ఏంటి? పవన్‌కు కూడా వాటా ఉందా..?
ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్… చంద్రబాబుకు ఐటీ నాలుగో నోటీసు ఇచ్చిందన్న ఆయన.. ఒక ఏడాది అసెస్‌మెంట్ కు సంబంధించి రూ.118 కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారం ఇది. మనోజ్ వాసుదేవ్ ను తనిఖీలు చేస్తుంటే తీగ లాగితే డొంక కదిలినట్లు చంద్రబాబు వ్యవహారాలు బయటకు వచ్చాయి.. షాపూర్జీ పల్లోంజీలో మనోజ్ వాసుదేవ్ కీలక వ్యక్తి అన్నారు. ఇక, 2020లోనే రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి సమకూర్చుకున్నాడని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఆరోపణలు ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్ని వ్యవహారాలు బయటకు తీస్తే వేల కోట్ల రూపాయల దోపిడీ విషయాలు బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు కప్పను మింగిన పాములాగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్, ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయితే.. చంద్రబాబు మీడియా ప్యాంట్లు తడుస్తున్నాయా? ఎందుకు ఈ వార్తల రాయటం లేదు? అని ప్రశ్నించారు.
దోచుకోవడంలో కలెక్షన్ కింగ్‌గా చంద్రబాబు.. సీబీఐ, ఈడీ విచారణ జరపాలి..
రాష్ట్రంలో దొంగలు, డెకాయిట్స్ లకు గురువు చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఎలా దొచుకోవాలో నేర్పించడంలో చంద్రబాబు దిట్టా అని అభివర్ణించారు. సినిమాల్లో కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబుకు పేరు ఉంటే.. దోచుకోవడంలో కలెక్షన్ కింగ్ గా చంద్రబాబు ఉన్నాడని దుయ్యబట్టారు. అయితే, చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై టీడీపీ నేతలు ఎందుకు నోరువిప్పరు? అని నిలదీశారు. చంద్రబాబు, లోకెష్ అవినీతి అక్రమాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో వేల కోట్ల అక్రమ ఆస్తులు భయపడ్డాయని విమర్శించారు. ఇక, త్వరలో తెలంగాణ నుండి కేసీఆర్ కూడా చంద్రబాబు తరిమెస్తాడని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.
ఉదయనిధి స్టాలిన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి..!
సనాతన ధర్మంపై కామెంట్లు చేసి ఒక్కసారి హిందూ సంఘాలు, వీహెచ్‌పీ నేతలు, బీజేపీకి టార్గెట్ అయిపోయారు తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్.. ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే.. సనాతన ధర్మంపై భయానక వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉదయనిధి స్టాలిన్‌ను పదవి నుంచి తొలగించాలన్న ఆయన.. తమిళనాడు ప్రభుత్వం విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నారు. ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు మలింద్ పరాండే..
మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్ లు.. భయాందోళనలో విద్యార్థులు
మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ లో సుమారు 15 హాస్టల్ లు నీట మునిగాయి. విద్యార్థులు బయటకు వచ్చేందుకు వీలులేకుండా పోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే 30 అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు కూడా చేరింది. ఒక్కో అపార్ట్‌మెంట్‌లో ఒక్కో అంతస్తు వరకు వరద నీరు చేరింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఈ అపార్ట్ మెంట్లలోనే ఉంటున్నారు. అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోకి వరద నీరు చేరడంతో ఆయా అపార్ట్‌మెంట్లలో ఉంటున్న విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు జేసీబీలను పిలిపించి అపార్ట్‌మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. కాగా, మైసమ్మగూడలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షానికి అపార్ట్‌మెంట్‌లు ముంపునకు గురయ్యాయి. దీంతో ఈ అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులు ఉదయం నుంచి భయంతో గడుపుతున్నారు.
“భారత్”గా మారనున్న”ఇండియా”.
ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్ర సిద్ధమవుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ‘‘రిపబ్లిక్ ఆఫ్ భారత్- మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా మరియు గర్వంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. ఇటీవల ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, శివసేన ఉద్ధవ్, ఎన్సీపీ (శరద్ పవార్), ఆర్జేడీ, జేడీయూ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి జట్టు కట్టాయి. ఈ నేపథ్యంలో ఇండియా పేరును భారత్ గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
యాపిల్ లవర్స్‌కు శుభవార్త.. ప్రపంచంతో పాటే భారత్‌లో ఐఫోన్ 15 విక్రయాలు!
యాపిల్ కంపెనీ నుంచే వచ్చే ‘ఐఫోన్ 15’ రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 12న ఉదయం ఐఫోన్ 15 ఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యావత్ ప్రపంచంతో పాటే.. భారత్ కూడా కొత్త ఐఫోన్‌ను అన్‌బాక్స్ చేయనుంది. లాంఛ్ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్‌లోనూ ఐఫోన్ 15 అమ్మకానికి అందుబాటులో ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది. ఐఫోన్ 15 తయారీ కోసం ఇప్పటికే చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. సెప్టెంబరులో తయారీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దాదాపు నెల తర్వాత భారత్‌కు వస్తుంటుంది. అయితే ఈసారి ఆ గ్యాప్‌ను పూర్తిగా తగ్గించే ప్రయత్నాల్లో యాపిల్ కంపెనీ ఉందని తెలుస్తోంది. 2022లో చెన్నైలోని ప్లాంట్‌లో ఐఫోన్ 14 తయారీ గ్లోబల్ లాంఛ్ తర్వాత 10 రోజులకు ప్రారంభమైంది. ఇక ఫోన్ మార్కెట్‌లోకి రావడానికి నెల రోజుల పైనే పట్టింది. ఐఫోన్ 15కు గ్యాప్ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండేలా యాపిల్ ప్లాన్ చేస్తోందట.
పన్ను జాబితాలో 2047 నాటికి 41 కోట్ల మంది : ఆర్థిక మంత్రి
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023 నేటి నుండి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రారంభ ప్రసంగంలో దేశంలోని ఫిన్‌టెక్ నుండి స్టార్టప్‌లు, టెక్నాలజీ వరకు భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని గురించి ప్రస్తావించారు. అయితే, దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కారణంగా భారతదేశ ఆర్థిక వృద్ధిపై అది పెద్దగా ప్రభావితం కాబోదని ఆమె హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం భారతదేశంలోని అన్ని పన్ను స్లాబ్‌లలో కనీసం మూడు రెట్లు ఎక్కువ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్‌లు జరిగాయని ఆమె తెలిపారు. అదనంగా, కొన్ని విభాగాలలో దాని వృద్ధి నాలుగు రెట్లు కనిపించిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆగస్టు 2023లో భారతదేశం ఐటీఆర్ ఫైలింగ్ డేటా, దేశ ఆర్థిక వ్యవస్థ అధికారిక రూపం వేగంగా విస్తరిస్తున్నదనడానికి ఇది రుజువుగా పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు, 2047 నాటికి 41 కోట్ల మంది భారతీయులు దేశ పన్ను వ్యవస్థలో చేరాలని అంచనా వేయబడింది.
రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన.. క్షణాల్లో యూపీఐ ద్వారా లోన్
ఇప్పుడు రుణం తీసుకోవడానికి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ స్వంత UPI ద్వారా లోన్ సౌకర్యం పొందుతారు. ఇందుకోసం ఆర్‌బీఐ బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ అంటే యూపీఐపై కస్టమర్‌లకు ఇన్ స్టాంట్ లోన్స్ ఇవ్వాలని దేశంలోని అన్ని బ్యాంకులను ఆర్బీఐ కోరింది. రిజర్వ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం యూపీఐ చెల్లింపు వ్యవస్థ పరిధిని పెంచడం. ప్రస్తుతం సేవింగ్ ఖాతా, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతా, ప్రీపెయిడ్ వాలెట్, క్రెడిట్ కార్డ్‌లను యూపీఐకి లింక్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు దీని పరిధిని మరింతగా విస్తరిస్తున్నారు. యూపీఐ ఇప్పుడు క్రెడిట్ లైన్‌లను ఫండింగ్ ఖాతాలుగా చేర్చడానికి విస్తరించబడుతోంది. ఈ సదుపాయం కింద వ్యక్తిగత కస్టమర్లకు ముందస్తు అనుమతితో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు జారీ చేసిన ముందస్తు మంజూరు చేసిన రుణాల ద్వారా చెల్లింపు, యూపీఐ వ్యవస్థను ఉపయోగించి లావాదేవీలు ప్రారంభించబడతాయని ఆర్బీఐ తెలిపింది.
కోహ్లీ అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన బీజేపీ ఎంపీ.. అది తట్టుకోలేకపోయానంటూ..!
పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గౌతీ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఓ సమయంలో గంభీర్ స్టేడియంలో నడుచుకుంటూ బయటికి వెళుతూ.. అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించారు . ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్, నేపాల్ మ్యాచ్ సందర్భంగా మైదానం నుంచి వెళ్లిపోతున్న గౌతమ్ గంభీర్‌ను చూసి.. ఫాన్స్ కోహ్లీ కోహ్లీ అంటూ గట్టిగా అరిచారు. ఇది చూసిన గౌతీ.. అభిమానుల వైపు మిడిల్ ఫింగర్ చూపించడం వీడియోలో కన్పించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెద్ద దుమారం రేగింది. గంభీర్‌పై కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఎంపీ అయిన గంభీర్ ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. దీనిపై తాజాగా గౌతీ స్పందిస్తూ.. కోహ్లీ కోహ్లీ అని అరిచినందుకు తాను మిడిల్ ఫింగర్ చూపించలేదని, భారత్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కారణంగానే రియాక్ట్ అయ్యానని తెలిపారు.
స్కేటింగ్ చేస్తున్న కుక్క .. మధ్యలో టాయిలెట్ వస్తే ఏం చేసిందంటే?
ఓ కుక్క అచ్చం మనిషి లాగానే స్కేటింగ్ బోర్డుపై ఎక్కి స్కేటింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను Buitengebieden అనే ఎక్స్( ట్విటర్) పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూస్తున్న వారు ఆ కుక్క చేస్తున్న పనులు చూసి వావ్ అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క స్కేటింగ్ చేస్తూ ఉంటుంది. మధ్యలో దానికి టాయిలెట్ వస్తుంది. అది వెంటనే స్కేటింగ్ బోర్డు నుంచి దిగి రోడ్డు దగ్గర ఓ మూలకు వెళ్లి టాయిలెట్ పోస్తుంది. మళ్లీ వచ్చి స్కేటింగ్ బోర్డుపై ఎక్కి వెళ్లిపోతుంది. అది స్కేటింగ్ బోర్డు ఎక్కేటప్పుడు అచ్చం మనిషి లాగానే మొదటి దాని ముందర కళ్లు పెట్టి కొద్దిగా ముందుకు నెట్టి తరువాత దాని పైకి ఎక్కుతుంది. చాలా ప్రొఫెషనల్ స్కేటర్ చేసినట్లు అది స్కేటింగ్ చేస్తుంది. ఇక అది అలా వెళుతున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్ కూడా వస్తుంది. అయినా ఆ కుక్క తొనక్కుండా, బెనక్కుండా చక్కగా వెళ్లిపోతుంది. అది రోడ్డుపై అలవోకగా స్కేటింగ్ చేస్తోంది. అంతేకాకుండా ఆ కుక్కకు స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండే విషయం కూడా బాగా తెలిసినట్టు ఉంది. అది స్కేటింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద వాటర్ ఉంటాయి. అది వెంటనే స్కేటింగ్ బోర్డు దిగి నెమ్మదిగా దానిని ముందు తోసి మళ్లీ దాని మీద ఎక్కుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పటికే ఆరు మిలియన్ల మందికి పైగా చూశారు. లక్ష వరకు లైక్ చేశారు. మరో వైపు ఈ వీడియో చూసిన వారు కుక్కలు ఏవైనా నేర్చుకోగలవు అంటూ కామెంట్ పెడుతున్నారు.
వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న స్టార్ హీరో..
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.రీసెంట్ గా హీరో ధనుష్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన ‘సార్’ సినిమా లో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సార్ సినిమా దాదాపు 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం తెలుగు మరియు తమిళ్ లో ధనుష్ వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు.ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయడమే కష్టం అవుతున్న తరుణంలో ధనుష్ ఏకంగా 10 సినిమాలు లైన్లో పెట్టినట్టు సమాచారం.. వచ్చే రెండేళ్లలో ధనుష్ సినిమాలు వరుస గా విడుదల కానున్నాయి…
ఈ సాంగ్ ఉంది బాసూ… ఒక్కసారి వింటే రిపీట్ మోడ్ గ్యారెంటీ
‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సాయి మోహన్ ఉబ్బన డైరెక్ట్ చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రీసెంట్ గా శశివదనే టైటిల్ సాంగ్ ని లాంచ్ చేసి అట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్… లేటెస్ట్ గా ‘డీజే పిల్లా’ అనే క్యాచీ నంబర్ ని రిలీజ్ చేసారు. ఈ సెకండ్ లిరికల్ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లాంచ్ చేసాడు. శరవణ వాసుదేవన్ ఇచ్చిన జోష్ ఫుల్ ట్యూన్ కి కిట్టు విస్సాప్రగడ అందరూ హమ్ చేయగలిగేలాంటి లిరిక్స్ ని రాసాడు. సింగర్ వైశాగ్ ‘డీజే పిల్లా’ సాంగ్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్ అయ్యాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లీడ్ పెయిర్ పైన డిజైన్ చేసిన ఈ సాంగ్ లిరికల్ వీడియో చేసిన వాళ్లు ఎవరో కానీ టెక్నీషియన్స్ అందరి కార్డ్స్ వేసిన వాళ్లు, ఖోరియోగ్రాఫర్ టైటిల్ కార్డ్ ను వేయడం మర్చిపోయినట్లు ఉన్నారు.