నిరుద్యోగులకు శుభవార్త.. ఉన్నత విద్యాశాఖలో 3,295 పోస్టుల భర్తీ..!
నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉన్నత విద్యా శాఖలో పోస్టుల భర్తీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 295 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.. అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించింది ఉన్నత విద్యా మండలి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రా రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 18 యూనివర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీ జరుగుతుందని తెలిపారు. 2009 తర్వాత మొదటి సారి యూనివర్సిటీల్లో నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రొఫెసర్ హేమచంద్రా రెడ్డి.. 2018లో నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు కేసులు వల్ల ప్రక్రియ ముందుకు వెళ్లలేదన్న ఆయన.. 18 యూనివర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీ జరుగనుంది.. వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. ఈ డిసెంబర్ నాటికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తాం అని ప్రకటించారు.. ప్రస్తుతం అన్ని యూనివర్సిటీల్లో వెయ్యి మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారని. ప్రపంచానికి ఆదర్శం కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.. యూజీసీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని రెగ్యులర్ చేయలేమన్నారు. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి వారు పని చేసిన కాలానికి 10 శాతం వెయిటేజ్ ఇస్తున్నాం అని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రా రెడ్డి.
చంద్రబాబుకు ఐటీ నోటీసులు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్లు అయినషాపూర్జీ పల్లోంజీ (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల రూపాయాలు ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, ఈ క్రమంలో షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది.. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు.. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడిందని.. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవీపీ) ఒప్పుకున్నారని తెలుస్తోంది..
తిరుమలలో మరో చిరుత..
తిరుమలలో చిరుత సంచారం కొనసాగుతూనే ఉంది.. నడక మార్గంలో ఓ చిన్నారి చిరుత దాడిలో మృతిచెందిన తర్వాత.. పటిష్ట చర్యలకు దిగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతలు, ఇతర అడవి జంతువుల కదలికలను పసిగడుతోంది.. ఇక, శేషాచలం కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ సక్సెస్ అయ్యింది.. ఇప్పటి వరకు నాలుగు చిరితులను అటవీశాఖ అధికారులు బంధించారు.. అయితే, ఇంతటితో చిరుతల సంచారం ఆగిపోయినట్టు అంతా సంతోషపడ్డారు.. కానీ, తాజాగా మరో చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కిన్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడకమార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాలో మరో చిరుత సంచారం గుర్తించాం.. నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత సంచరించింది.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇక, నడకమార్గంలో భక్తులకు 5వ తేదీ నుంచి ఊతకర్రలను అందించే ఏర్పాట్లు చేస్తున్నామని.. అలిపిరి దగ్గర భక్తులకు ఊతకర్రలను అందజేసి.. నరసింహస్వామి ఆలయం వద్ద వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం అన్నారు.
టమాట ధర భారీగా పతనం.. అప్పుడు అలా.. ఇప్పుడిలా..
మొన్నటి వరకు టమాటాలు కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు కొనేవాడు లేడు కదా.. పంట పండించిన రైతుకు గుట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నాడు.. ఒకానొక సమయంలో కిలో టమాట రూ.300కు చేరువయ్యింది.. ఈ సమయంలో సామాన్యుడి వంటగదిలో టమాట కనిపించడమే మానేసింది.. రైతులకు లాభాలు చూపించింది.. అయితే ఊహించినట్లుగానే ఇప్పుడు భారీగా పతనం అయ్యింది.. పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ఇప్పటికే రూ.50కి దిగువకు వెళ్లిపోయింది.. హైదరాబాద్ లాంటి సిటీల్లో బహిరంగ మార్కెట్‌లో వంద రూపాయలకు నాలుగు కిలోల వరకు విక్రయిస్తున్నారు.. అదే హోల్‌సెల్ మార్కెట్‌లో అయితే రూ. 15, రూ. 20 దాకా దొరుకుతోంది కూడా. హైదరాబాద్‌లోనూ కేజీ రూ. 20 దాకా పలుకుతోంది. మరోవైపు.. ఈ రోజు హోల్‌సెల్ మార్కెట్‌లో టమాటా ధర భారీగా పడిపోయింది.. టమాటకు పెట్టిన పేరైన మదనపల్లె మార్కెట్ యార్డ్‌లో కేజీ టమాట రూ.8కి దిగివచ్చింది.. దీంతో, గిట్టుబాటు ధర కూడా రావడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొన్నటి వరకు టమాట పండిన రైతులు లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు.. ఇప్పుడు మాత్రం గిట్టుబాటు కూడా కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
PSLVC-57 రాకెట్ ప్రయోగాని కౌంట్ డౌన్ షురూ.. రేపే నింగిలోకి..
మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. చంద్రయాన్-3తో చందమామపై ఉన్న రహస్యాలను ఛేదించే పనిలోపడిపోయిన ఇస్రో.. మరోవైపు సూర్యుడిపై సైతం ఫోకస్ పెట్టింది.. దీనికోసం PSLVC-57 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.. ఇక, PSLVC-57 రాకెట్ ప్రయోగానికి ఈ రోజు కౌంట్‌డౌన్ ప్రారంభించింది. 24 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ అనంతరం రేపు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు.. మరోవైపు.. రాకెట్‌లో ఇంధనం నింపే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, PSLVC-57 ప్రయోగానికి లాంచ్ అథరైజేషన్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. శ్రీహరికోటకు చేరుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు.. రాకెట్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి పై పరిశోధనలకు ఆదిత్య- L1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు.. ఇక, నిన్న షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటన చేయడం.. ఇప్పుడు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు.
ఒకేసారి రెండు శుభవార్తలు.. బటన్ నొక్కిన సీఎం జగన్.. వారి ఖాతాల్లో సొమ్ము జమ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కౌలు రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు.. రైతు భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి.. రైతుల ఖాతాల్లో వర్చువల్ గా నగదు జమ చేశారు.. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థిక సాయం అందజేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ స్కీమ్ కింద మొత్తం 1,46,324 మందికి లబ్ది చేకూరినట్టు అయ్యింది.. ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.. మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలు బటన్ నొక్కి జమ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. అయితే, భూ యజమానులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం.. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తూ వస్తున్నారు.. ఇదే సమయంలో.. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది సర్కార్.
పన్నీర్ సెల్వంకు షాక్.. 11 ఏళ్ల తర్వాత ఆ కేసు పునర్విచారణ
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు షాక్ తగిలింది. 11 ఏళ్ల తర్వాత అక్రమ సంపాదన కేసు పునర్విచారణను సుమోటోగా స్వీకరించింది మద్రాస్ హైకోర్టు. వివరాల ప్రకారం.. 2001-06 మధ్య కాలంలో దివంగత జయలలిత ప్రభుత్వంలో పన్నీర్ సెల్వం రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. రూ. 1.77 కోట్ల మేర అక్రమంగా సంపాదించారంటూ 2006లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే 2011లో అన్నాడీఎంకే మళ్లీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. దీంతో అక్రమార్జన కేసుపై విచారణ జరిపేందుకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
వందేళ్లల్లో ఈ ఆగస్టులోనే తక్కువ వర్షపాతం
ఈ ఆగస్టు నెల చరిత్ర సృష్టించింది. దేశంలో గత వందేళ్లల్లో ఎప్పుడులేనంతగా తక్కువ వర్షపాతం నమోదయింది. వందేళ్ల చరిత్రలో ఇదే తక్కువ వర్షపాతం నమోదైన ఆగస్టు నెల అని అధికారులు ప్రకటించారు. భారతదేశంలో 1901 నుండి చూసినట్టయితే ఈ ఆగస్ట్‌లోనే అత్యల్ప వర్షపాతం నమోదైంది, ఇది బలహీనమైన పంట ఉత్పత్తి మరియు బియ్యంపై దేశం యొక్క ఆంక్షల తరువాత మరింత ఎగుమతి పరిమితులను విధించిన నేపథ్యంలో ఆందోళనలను పెంచింది. ఈ నెలలో దేశంలో 162.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది సాధారణం కంటే 36 శాతం తక్కువ అని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్-ఆగస్టులో మొత్తం వర్షపాతం సగటు కంటే 10 శాతం తక్కువగా నమోదైంది. రుతుపనాల ప్రభావంతో కురిసే వర్షాలతో భారతదేశంలోని సగానికి పైగా వ్యవసాయ భూములకు నీరందుతాయి.. చక్కెర మరియు సోయాబీన్స్ వంటి పంటలకు వర్షాలే కీలకం. గత సంవత్సరం నుండి నెలకొన్న అస్థిర వాతావరణం కొన్ని పంటలను దెబ్బతీసింది, జూలైలో 15 నెలల గరిష్ట స్థాయికి పెరిగిన దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని చల్లబరచడానికి దేశం గోధుమలు మరియు బియ్యం ఎగుమతులను నియంత్రించవలసి వచ్చింది. ప్రభుత్వం కొన్ని పంటలపై నిల్వ పరిమితులను కూడా విధించింది. 100 సంవత్సరాలలో భారతదేశం ఎదుర్కొన్న తక్కువ వర్షపాతం పొందిన ఈ ఆగస్టు తర్వాత.. మరింత ధాన్యం ఎగుమతి అడ్డుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పంటలపై నిల్వ పరిమితులను కూడా విధించింది.
సిమ్ కొనుగోలుదారులు జాగ్రత్త.. లేదంటే రూ.10 లక్షల జరిమానా
మొబైల్ వాడకం బాగా పెరిగింది. మొబైల్ ఉపయోగించడానికి సిమ్ కార్డ్ కూడా అవసరం. సిమ్ కార్డ్ లేకుండా ప్రజలు మొబైల్ నుండి కాల్ చేయలేరు. అయితే ఇప్పుడు ప్రభుత్వం సిమ్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను జారీ చేసింది. దీని కింద రూ.10 లక్షల జరిమానా కూడా విధించవచ్చు. 10 లక్షల జరిమానా విధిస్తుందంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వాస్తవానికి కొత్త నిబంధనల ప్రకారం.. రిజిస్టర్ కాని విక్రేతల ద్వారా సిమ్ కార్డులను విక్రయించినందుకు టెలికాం కంపెనీలకు రూ.10 లక్షల జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ విభాగం గురువారం ఒక సర్క్యులర్‌లో వెల్లడించింది. సిమ్ కార్డుల మోసపూరిత విక్రయాలను అరికట్టేందుకు రూపొందించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని టెలికమ్యూనికేషన్స్ విభాగం తెలిపింది. టెలికాం కంపెనీలు సెప్టెంబర్ 30లోపు తమ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్)లన్నింటినీ నమోదు చేసుకోవాలి.
లీటర్ పెట్రోల్ ధర రూ. 300.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దాయాది
దాయది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. విదేశీ మారకద్రవ్యం నిలువలు పడిపోవడం, అప్పులు, ద్రవ్యోల్భణం, రాజకీయ అస్థిరత ఇలా అన్ని సమస్యలు ఆ దేశాన్ని చుట్టుముట్టాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నుంచి అప్పు తీసుకున్న పాక్ నానా తిప్పలు పడుతోంది. ఐఎంఎఫ్ షరతులకు తలొంచుతోంది. ఇదిలా ఉంటే ఆ దేశంలో ఇప్పటికే కరెంట్ బిల్లుల పెరుగుదల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అవుతోంది. ప్రస్తుతం ఆ అక్కడ పెట్రోల్, డిజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాక్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లీటర్ పెట్రోల్, డిజిల్ రేట్లు రూ. 300ను దాటాయి. అక్కడి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిన్న సాయంత్రం పెట్రోల్ ధర రూ. 14.91, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధర రూ. 18.44 పెంచినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరుకుంది.
సూపర్ స్టార్ రెమ్యునరేషన్ 210 కోట్లు… 100 కోట్ల సింగల్ చెక్
ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో ఉంటాడు, సూపర్ స్టార్ ఇమేజ్ తో యావరేజ్ సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తూ ఉంటాడు. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోకి ఒకటి రెండు ఫ్లాప్స్ పడినా మార్కెట్ విషయంలో జరిగే నష్టమేమి ఉండదు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇలాంటి స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే ఏ ఇండస్ట్రీకి ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి కలిపి ఒకడే స్టార్ హీరో ఉన్నాడు, అతని పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీకాంత్ కన్నా బాగా నటించే వాళ్లు ఉన్నారు, ఆయన కన్నా అందమైన వాళ్లు ఉన్నారు, యంగ్ అండ్ చార్మింగ్ హీరోలు కూడా ఉన్నారు కానీ రజినీకాంత్ కి ఉన్న చరిష్మాని మ్యాచ్ చేసే హీరో, ఆయన ఆరాని మ్యాచ్ చేసే హీరో మాత్రం లేడు. 40-50 ఏళ్లకి స్టార్ హీరోలయ్యి 200-300-400 కోట్లు కలెక్ట్ చేసి పాన్ ఇండియా హీరోలుగా పేరు తెచ్చుకుంటున్న ఈ కాలంలో 78 ఏళ్ల వయసులో కూడా ఒక యావరేజ్ సినిమాతో 650 కోట్లు రాబట్టాడు అంటే రజినీ రేంజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అందరూ తమ ఫేవరెట్ హీరోల సినిమా రిలీజ్ అయితే కాలేజ్ కి, ఆఫీస్ కి సెలవు పెడతారు… రజినీ సినిమా వస్తుంది అంటే స్కూల్స్, కాలేజస్, ఆఫీసులు అనే తేడా లేకుండా కంపెనీలు కూడా స్వచ్ఛందంగా సెలవలు ప్రకటిస్తాయి. ఆ విషయంలో రజినీకాంత్ నిస్సందేహంగా ఇండియాస్ మోస్ట్ సెలబ్రెటెడ్ స్టార్ హీరో అనే చెప్పాలి. 80ల్లో పుట్టిన వాళ్ల దగ్గర నుంచి ఈ జనరేషన్ ఆడియన్స్ వరకూ ప్రతి ఒక్కరినీ తన మాయలో పడేస్తున్న రజినీకాంత్ ఒక సినిమా వంద కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటాడు.జైలర్ సినిమాకైతే దాదాపు 110 కోట్లు తీసుకున్నట్లు సమాచారం, లేటెస్ట్ గా జైలర్ సినిమా ప్రొడ్యూసర్ రజినీకాంత్ ని కలిసి 100 కోట్ల సింగల్ చెక్ ఇచ్చాడు. దీంతో కలిపితే జైలర్ సినిమాకి రజినీకాంత్ 210 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు. ఇండియాలో ఏ స్టార్ హీరోకి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అందుకే ఇండియాలో ఒకడు సూపర్ స్టార్… వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్.