అప్పుడే విశాఖకు.. షిఫ్టింగ్‌పై సీఎం జగన్ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు తెరపైకి వచ్చిన తర్వాత.. విశాఖ కేంద్రంగా పాలన సాగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ముందుగా దసరా నాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశాఖకు షిఫ్ట్ అవుతారనే ప్రచారం సాగింది.. కానీ, కొన్ని కారణాల రీత్యా అది సాధ్యం కాలేదు.. అయితే, తాను ఎప్పుడు విశాఖకు షిఫ్ట్ అవుతాను అనేదానిపై సీఎం వైఎస్ జగనే క్లారిటీ ఇచ్చారు.. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. రుషికొండలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించనున్నట్టు స్పష్టం చేశారు సీఎం జగన్.. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక, డిసెంబర్ లోపు తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని క్లారిటీ ఇచ్చారు. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుందన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖపట్నం అని వెల్లడించారు.. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్‌గా విశాఖ మారింది.. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక, హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా విశాఖపట్నంలోనూ విస్తారమైన అవకాశాలు ఉంటాయని తెలిపారు సీఎం.. వైజాగ్ కూడా ఐటీ హబ్‌గా మారుతుందన్నారు.. ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తారమైన తీర ప్రాంతం విశాఖ సొంతం.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.. ఇక పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఒక్క ఫోన్ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తాం అని ప్రకటించారు.. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ సీఐడీ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.. అమరావతి రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూముల వ్యవహారం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్లపై గతంలో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.. అయితే, ఈ కేసులపై విచారణ రీ ఓపెన్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది ఏపీ సీఐడీ.. అయితే, అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు తెలిపారు చంద్రబాబు, నారాయణ తరఫు న్యాయవాదులు.. మరోవైపు ఈ రోజు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిట్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.. అలాగే చంద్రబాబును అరెస్ట్ చేయవద్దు అంటూ సీఐడీ పీటీ వారెంట్‌పై హైకోర్టు ఇచ్చిన స్టే నేటితో ముగియనుంది.. దీంతో… దానిపై కూడా ఈ రోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబశివరావు, ఆ సంస్థ ఉద్యోగి ప్రమీల వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. దీంతో.. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
పురంధరేశ్వరి ఏ పార్టీయో..? అర్థం కావడం లేదు.. లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణకు రెడీ..!
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పురంధరేశ్వరిలో తన మరిది చంద్రబాబును కాపాడుకునే తపన తప్ప వేరే కనపడటం లేదని దుయ్యబట్టారు.. ఎన్టీఆర్ కూతురు అని చెప్పుకునే అర్హత ఈమెకు లేదని ఫైర్ అయ్యారు. ఇక, పురంధరేశ్వరి ఏ పార్టీ యో.. నాకు అర్థం కావడం లేదని సెటైర్లు వేసిన ఆయన.. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే.. ఈమె చంద్రబాబును వెనకేసుకు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పాలసీపై కీలక వ్యాఖ్యలు చేశారు నారాయణ స్వామి.. లిక్కర్ పాలసీ పై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారు.. మద్యపానం పెడితే తప్పా.. అంటూ ఆనాడు కొన్ని పత్రికలు రాశాయని దుయ్యబట్టారు. మద్యపానం నిర్మూలించినది ఎన్టీఆరే.. కానీ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కొని, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. 1998లో మద్యపాననిషేధం ఎత్తివేయక పోతే ప్రభుత్వం నడపలేమని చంద్రబాబు ప్రకటించి ఎత్తివేశారని గుర్తు చేశారు. ఇక, గుడి బడి అని చూడకుండా 4378 ప్రవేట్ వైన్ షాప్ లు, 43 వేల బెల్ట్ షాప్ లు పెట్టారని మండిపడ్డారు. ప్రెసిడెంట్ మోడల్, డీలక్స్ విస్కీ, గవర్నర్ విస్కీ, బూమ్ బూమ్ బీర్‌కు 2017లో చంద్రబాబు పాలనలో అనుమతి ఇచ్చారని తెలిపారు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీరికి ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆయనను గృహనిర్బంధం చేశారు పోలీసులు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం పర్యటన సందర్భంగా వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి కోరాం.. నాకు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.. ప్రతిపక్షాలతో ముఖ్యమంత్రి మాట్లాడి సమస్యల కోసం చర్చించే ఆనవాయితీ ఉండేది.. ఈ ముఖ్యమంత్రి ఆ ఆనవాయితీని పక్కన పెట్టారని ఫైర్ అయ్యారు.. ఇక, రేపు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది.. టీడీపీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఋషికొండలో జరుగుతున్న నిర్మాణం ముఖ్యమంత్రి కార్యాలయం అని చెబితే తప్పేముంది? అని ప్రశ్నించారు గంటా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో దొడ్డి దారిన వస్తున్నారు.. ఇన్ని రోజులు గుర్తు రాని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఇప్పుడు గుర్తొచ్చిందా..? అని నిలదీశారు. ముఖ్యమంత్రిని కలవాలని కోరుకున్నందుకు మా నాయకులు అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు.. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసుకునేందుకు హక్కు ఉందన్నారు. రేపు చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుంది.. త్వరలోనే మేనిఫెస్టో: కాసాని
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని తాను కలిశానని, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి వివరించానని కాసాని తెలిపారు. మంగళవారం చంద్రబాబు బయటకు వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం బాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… ‘టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో శనివారం ములాఖత్ అయ్యాం. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఆయనకు వివరించాం. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై దేశం వ్యాప్తంగా గా ఆందోళన ఉంది. బాబు ఆరోగ్యం గురుంచి అరా తీసి బాగోగులు అడగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయంలో, రాజకీయ పరంగా బుధవారం క్లారిటీ వస్తుంది. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాటిని మేం ఖండిస్తున్నాం’ అని అన్నారు.
పనికి వద్దన్నాడని.. కక్ష్య పెట్టుకొని హత్య చేశాడు!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ‘హర్ష లుక్స్’ సెలూన్ యజమాని అశోక్‌ను హత్య చేశారు. అశోక్ ఇంటికి రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సెలూన్ తెరిచి చూడగా అతడు శవమై కనిపించాడు. సెలూన్ యజమాని అశోక్ భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన సెలూన్ నిర్వాహకుడు అశోక్ భార్య నీరజ ఎన్టీవీతో మాట్లాడారు. ‘రోజు మాదిరిగానే నిన్న మధ్యాహ్నం లంచ్ చేసిన నా భర్త సెలూన్‌కు వెళ్లాడు. మా ఇంటి నుండి చూస్తే సెలూన్ కనబడుతుంది. నిన్న సాయంత్రం సెలూన్ క్లోజ్ చేసి ఉంది. దాంతో నేను ఫోన్ చేస్తే.. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నా కొడుకును సెలూన్ దగ్గరికి పంపించా. సెలూన్ దగ్గరికి వెళ్లేసరికి సెటర్ క్లోజ్ చేసి ఉన్నా.. నా భర్త బైక్ అక్కడే ఉన్నట్లు మా అబ్బాయి చెప్పాడు’ అని నీరజ తెలిపారు.’సెలూన్ షట్టర్ ఓపెన్ చేసి చూసే వరకే న భర్త అశోక్ రక్తపు మడుగులో ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. గత కొద్ది రోజులుగా బీహార్‌కు చెందిన పంకజ్ మా సెలూన్‌లో పని చేశాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడిని పనికి రావొద్దని అశోక్ చెప్పాడు. దీంతో నా భర్తపై కక్ష్య పెట్టుకొని పంకజే హత్య చేశాడు. అశోక్‌కు ఎవరితో గొడవలు, ఆర్థిక లావాదేవీల తగాదాలు లేవు. పంకజే ఈ దారుణానికి ఒడిగట్టాడు’ అని అశోక్ భార్య నీరజ చెప్పారు
విద్యార్థుల కోసం ‘వన్ నేషన్, వన్ ఐడి’ని రూపొందించాలనే యోచిస్తున్న ప్రభుత్వం..
పాఠశాల విద్యార్థులు త్వరలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటారు, వారి తల్లిదండ్రులు సమ్మతి ఇస్తే ఈ ప్రాసెస్ ను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తుంది.. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా, ప్రీ-ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి కోసం ‘ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR)’ అని పిలిచే ‘ఒక దేశం, ఒక విద్యార్థి ID’ని రూపొందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్రతి విద్యార్థి వద్ద ఉన్న 12 అంకెల ఆధార్ ఐడీకి ఇది అదనం. APAAR ID, ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ రిజిస్ట్రీ లేదా ఎడ్యులాకర్, జీవితకాల ID నంబర్‌గా పరిగణించబడుతుంది.. విద్యార్థుల విద్యా ప్రయాణం మరియు విజయాలను ట్రాక్ చేస్తుంది..విద్యార్థుల కోసం APAAR IDలను రూపొందించే ప్రక్రియను ప్రారంభించాలని విద్యా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు UTలను ఆదేశించింది. “APAAR మరియు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ భారతదేశం అంతటా అభ్యాసకుల కోసం QR కోడ్‌గా ఉంటాయి. వారు ఎంచుకునే ప్రతి నైపుణ్యం ఇక్కడ క్రెడిట్ చేయబడుతుంది” అని AICTE చైర్మన్ T G సీతారామన్ అన్నారు..
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. వెలుగులోకి మరో దేశంలోని దిగ్భ్రాంతికర విషయాలు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ముస్లిం దేశం సూడాన్ నుండి ఓ భయానక నివేదిక వెలువడింది. సూడాన్‌లో అత్యాచారం, లైంగిక హింస కేసులు విపరీతంగా పెరిగాయి. ఆందోళనకరమైన గణాంకాలు అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తోంది. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ నుండి అత్యాచారంతో సహా సంఘర్షణ- లైంగిక హింసకు సంబంధించిన 21 సంఘటనల గురించి విశ్వసనీయ నివేదికలు వస్తున్నాయి. ఈ సంఘటనల్లో 10 మంది మైనర్‌లతో సహా 57 మంది మహిళలు, బాలికలను బాధితులు అయ్యారు. ఈ క్రూరమైన నేరాలకు ప్రధాన నిందితులు సూడాన్‌లో పనిచేస్తున్న పారామిలిటరీ దళం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) యోధులుగా గుర్తించారు. మహిళలు, బాలికలు యుద్ధం మధ్య సురక్షితమైన ప్రదేశాలను వెతుకుతున్నందున లైంగిక హింసకు గురయ్యారు. ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు ప్రజలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సూడాన్‌లో అత్యాచారం, లైంగిక హింస స్థాయిపై అంచనా వేయలేం. ఈ యుద్ధం అస్థిరత, అరాచక వాతావరణాన్ని సృష్టించింది, ఇది అటువంటి క్రూరమైన నేరాల పెరుగుదలను చూసింది. వలసలు, సాయుధ సమూహాలు, సామాజిక నిర్మాణాల విచ్ఛిన్నం మహిళలు, బాలికలకు సమస్యలను తెచ్చిపెట్టాయి.
మూతపడిన బియ్యం మార్కెట్లు.. నిలిచిపోయిన కొనుగోళ్లు
దేశంలోని పలు రాష్ట్రాల్లో బియ్యం వ్యాపారులు నిరసనకు దిగారు. ఇది హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరసన కారణంగా దాదాపు 300 హోల్‌సేల్ మార్కెట్లలో బాస్మతి కొనుగోలు నిలిచిపోయింది. దీంతో రైతులు నష్టపోతున్నారు. బాస్మతి ఎగుమతిదారులు, మిల్లర్ల నిరసన కారణంగా మూడు రాష్ట్రాల్లోని దాదాపు 300 హోల్‌సేల్ మార్కెట్లలో రైతుల నుంచి బాస్మతి కొనుగోళ్లు నిలిచిపోయాయి. శనివారం నుంచి బియ్యం కొనుగోళ్లను వ్యాపారులు నిలిపివేశారు. బాస్మతి బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర (ఎంఈపీ)పై వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. బాస్మతి ఎగుమతి కోసం కేంద్ర ప్రభుత్వం కనీస ఎగుమతి ధర టన్నుకు 1,200 డాలర్లుగా నిర్ణయించింది. అక్రమ ఎగుమతులను అరికట్టేందుకు, టన్నుకు 1,200డాలర్ల కంటే తక్కువ ధరకు బాస్మతి ఎగుమతిని నిలిపివేయాలని ప్రభుత్వం మాట్లాడింది. అదే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఈపీ చాలా ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇది ప్రపంచ మార్కెట్లలో భారతీయ బాస్మతి వ్యాపారులకు పోటీని తగ్గిస్తుంది. ఎంఈపీని తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో హోల్‌సేల్ మార్కెట్‌లో రైతుల నుంచి బాస్మతి, వరి బియ్యాన్ని కొనుగోలు చేయడం మానేశారు. ఎంఈపీ తగ్గుతుందని ప్రభుత్వం వ్యాపారులకు హామీ ఇచ్చింది. ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు విజయ్ సెటియా ప్రభుత్వం సెప్టెంబర్ 25న వ్యాపారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించిందని… బాస్మతిపై ఎంఈపీని టన్నుకు 900 డాలర్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే, ఇది ఇంకా పూర్తి కాలేదు. దీంతో వ్యాపారులు తమ నిరసనను తెలియజేసి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. రియల్ గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న ‘బాస్’ హీరోయిన్!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా గత శనివారం (అక్టోబర్ 14) అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు పలువురు సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కూడా ఇండో-పాక్ మ్యాచ్‌కు వచ్చారు. ఎప్పటిలానే ఊర్వశీ మ్యాచ్ ఆసాంతం భారత జట్టును సపోర్టు చేశారు. స్టేడియంలో అభిమానులతో కలిసి తెగ సందడి చేశారు. అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో ఊర్వశీ తన ఖరీదైన ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ద్వారా తెలిపారు. ‘అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నా 24 క్యారెట్ల బంగారు ఐ ఫోన్ పోయింది. ప్లీజ్ నాకు సహాయం చేయండి. ఎవరికైనా దొరికితే వెంటనే నన్ను సంప్రదించండి’ అని బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సాయం చేయాలని కోరుతూ అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేశారు. ఊర్వశీ పోస్ట్‌కు స్పందించిన పోలీసులు ఫోన్ వివరాలు చెప్పాలని రిప్లై ఇచ్చారు. మరోవైపు తన ఐ ఫోన్ పోయినట్టు పోలీస్ స్టేషన్‌లోనూ ఊర్వశీ ఫిర్యాదు కూడా చేశారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఊర్వశీ రౌతేలా తన ఐ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత చాలా మంది ప్రేక్షకులు ఆమెతో సెల్ఫీలు దిగడం కోసం ఎగబడ్డారు. ఆ సమయంలోనే ఆ ఐ ఫోన్ పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఊర్వశీ తెలుగు సినిమాల్లో వరుసగా ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నారు. తాజాగా ‘స్కంద’ సినిమాలో ‘కల్ట్ మామా’ అనే పాటకు ప్రేక్షకులను అలరించారు. అంతకుముందు ఏజెంట్, వాల్తేరు వీరయ్య, బ్రో సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేశారు.
‘ఎక్స్’కు భారీ ఫైన్.. ఎలాన్ మస్క్‌కు షాక్..
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (ట్విట్టర్)కు భారీ ఫైన్ విధించింది ఆస్ట్రేలియన్ ఈ-సేఫ్టీ కమిషన్.. దీంతో ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్‌కు షాక్ తగిలినట్టు అయ్యింది.. యాంటీ చైల్డ్ అబ్యూస్ దర్యాప్తుకు నిరాకరించడం వల్ల ఆస్ట్రేలియన్ రెగ్యులేటర్ $3,86,000 జరిమానా విధించింది.. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 3.21 కోట్లు. కంటెంట్ నియంత్రణలో బలహీనంగా మారుతున్నారనే వాదనల కారణంగా స్పాన్సర్‌లను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ట్విట్టర్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. అక్టోబరు 2022లో వెబ్‌సైట్ కోసం చెల్లించిన 44 బిలియన్ డాలర్తో పోలిస్తే ఇది మస్క్‌కు చిన్నది అయినప్పటికీ, చాలా కంటెంట్ నియంత్రణను నిలిపివేసిన ప్లాట్‌ఫారమ్‌పై ప్రకటనకర్తలు ఖర్చు తగ్గించిన తరుణంలో.. స్పాన్సర్‌లను నిలుపుకోవడం.. తిరిగి ప్రకటనల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇది పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి సంబంధించి ప్లాట్‌ఫారమ్ తప్పుడు సమాచారాన్ని నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించిన తర్వాత, EU తన కొత్త సాంకేతిక నిబంధనలను ఉల్లంఘించినందుకు Xపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. నిజానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. సోషల్ మీడియా సంస్థలకు ‘చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్’ ప్లాట్‌ఫామ్స్ నుంచి వెంటనే తీసివేయాలని హెచ్చరిస్తూ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.
హౌస్ నుంచి శివాజీని బయటకు పంపించేసిన బిగ్ బాస్..ఎందుకో తెలుసా..?
బిగ్ బాస్ 7 సీజన్ లో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు మాములుగా లేవు.. అర్థం కాకుండా కన్ఫ్యుజన్ చేస్తున్నాడు.. నిన్న నయని పావని ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా హౌస్ లోని పెద్ద మనిషి శివాజీని బయటకు పంపించేశారు.. హీరో శివాజీ హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి పెద్దమనిషి తరహాలో ప్రవర్తిస్తున్నారు..మొదటి ఎపిసోడ్ నుంచి స్ట్రాంగ్ హౌస్ మెట్ గా గేమ్ ఆడుతూ దూసుకుపోతున్నారు. శివాజీ తన స్ట్రాటజీ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. శివాజీ టాప్5లో ఖచ్చితంగా ఉంటాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుందని ముందునుంచి చెప్తూ వస్తున్నారు.. నిన్నటి ఎపిసోడ్ లో చివరగా చెప్పినట్లే ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్..అందరు శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. దాంతో ఆమె బోరున ఏడ్చింది. అయితే నయని పావని హౌస్ లో ఉన్నవారితో బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా శివాజితో తనకు మంచి స్నేహం ఏర్పడిందని చెప్పింది.. ఇక తనను తండ్రిలాగ ఫీల్ అయ్యిందని చెప్పి ఎమోషనల్ అయ్యింది.. ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను నయని పావనిని హౌస్ లోకి తిరిగి పంపించండి అని కూడా శివాజీ రిక్వెస్ట్ చేశాడు. టాస్క్ లో భాగంగా అతడి చేతికి గాయం అయిన విషయం తెలిసిందే.. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం గాయం తగ్గేవరకు హౌస్ లో ఉండటానికి వీలు లేదు.. అయితే నేటి ఎపిసోడ్ లో శివాజీని హౌస్ నుంచి పంపించేశారని తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ చివరిలో శివాజీ హెల్త్ కారణంగా ఆయనను బయటకు పంపించేశారు బిగ్ బాస్. శివాజీ హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అని చెప్పడంతో హౌస్ లో ఉన్నవారు వద్దు అన్న అంటూ ఆయనను ఆపే ప్రయత్నం చేశారు. అయితే శివాజీని తిరిగి హౌస్ లోకి తీసుకువచ్చారని తెలుస్తోంది. ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేయడానికే ఇలా చేశారని తెలుస్తోంది.. అసలు ఎందుకు తీసుకెళ్లారు.. మళ్లీ ఎందుకు తీసుకొచ్చారో తెలియాలంటే ఈరోజు బిగ్ బాస్ ను చూడాల్సిందే..