శ్రీశైలంలో భక్తుల రద్దీ.. స్పర్శ దర్శనాలు రద్దు చేసిన అధికారులు
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భక్తుల రద్దీ పెరిగిపోయింది.. రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతోంది.. కాగా, రేపటి నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనుంది శ్రీశైలం దేవస్తానం.. భక్తుల రద్దీ దృష్ట్యా.. శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు కీలక సూచనలు చేశారు అధికారులు.. స్వామివారి ఆలయంలో నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు.. ఇక, శనివారం, ఆదివారం, సోమవారంతో పాటు సెలవురోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్ననేపథ్యంలో.. స్వామివారి స్పర్శ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అంటే.. వారాంతంలో భక్తుల రద్దీ ఉండే నేపథ్యంలో.. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేసింది దేవస్థానం.. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్ బుక్చేసుకోవాలని శ్రీశైలం ఆలయం ఈవో పెద్దిరాజు వెల్లడించారు.. కాగా, కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. కార్తీక స్నానాలు చేసేవారు, కార్తీక దీపాలు వెలిగించేవారు.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో శ్రీశైలంలో క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోన్న విషయం విదితమే.
రఘువీరారెడ్డి కుటుంబంలో విషాదం
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన సీడబ్ల్యూసీ మెంబర్ ఎస్. రఘువీరారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.. రఘువీరా రెడ్డి అన్న శ్రీరామప్ప అనారోగ్యంతో మృతిచెందారు.. శ్రీరామప్ప వయస్సు 85 ఏళ్లు.. అన్న శ్రీరామప్ప మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రఘువీరారెడ్డి.. ఇక, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ..
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులతో పాటు.. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు.. అరుణాచం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు ప్రకటించింది.. కార్తీక మాసంలో శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి ఉంటుంది.. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని.. ఒకే రోజు పంచారామ క్షేత్రాలను దర్శించేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.. వారి కోసం ఈ నెల 19, 26 తేదీలతో పాటు డిసెంబర్ 3, 10 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురంలో బస్సు బయల్దేరనుండగా.. సోమవారం ఉదయం అమరావతి- అమరేశ్వరుడు, భీమవరం- భీమేశ్వరుడు, పాలకొల్లు- క్షీర రామలింగేశ్వరుడు, ద్రాక్షారామం – భీమలింగేశ్వరుడు, సామర్లకోట- కుమార లింగేశ్వరుడిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్టు.. అల్ట్రా డీలక్స్‌లో ఒక్కొక్కరికి రూ.2,150 ఛార్జీగా నిర్ణయించినట్టు ప్రజా రవాణా అధికారి సుధాకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇసుక టెండర్ల ద్వారా మరో పెద్ద కుంభకోణం..!
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకు కుంభకోణంలో సీఎం వైఎస్ జగన్ వాటా 50 వేల కోట్లయితే.. వెంకటరామిరెడ్డి వాటా ఎంత ? అని ప్రశ్నించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
నక్కా ఆనంద్ బాబు.. దొంగ వే బిల్లుతో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారనే ఆధారాలున్నాయి. కలకత్తా నుంచి రహస్యంగా నడిపిన ఇసుక టెండర్ల విధానం మరో పెద్ద కుంభకోణం జరిగిందన్నారు.. భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి మరీ వేల కోట్లు ఇసుక ద్వారా దోచుకున్నారు. ఇసుక కుంభకోణం డబ్బుతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్ చూస్తున్నాడు.. ప్రతీ ఇసుక అక్రమ తవ్వకంలో ప్రధాన వాటాదారు ఏపీఎండీసీ వీసీ, డైరెక్టరుగా ఉన్న వెంకటరామిరెడ్డే అని.. డెప్యూటేషన్ మీద రాష్ట్రానికి వచ్చిన వెంకటరామిరెడ్డి, తెలుగుదేశం ఇచ్చిన ఉచిత ఇసుక విధానంలో అవినీతి అని ఫిర్యాదు చేశాడు. ఇసుక అక్రమాల్లో తనకు భవిష్యత్తులో శిక్ష తప్పదనే ముందుగా ఓ ఫిర్యాదు పడేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి.. బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే..!
రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. రాష్ట్రంలో నిజంగా సీరియస్ గా పోటీలో ఉంటున్నారు అనేది రెండ్రోజుల్లో తేలబోతోదన్న ఆయన.. మాకు పొత్తులో భాగంగా కాంగ్రెస్, సీపీఎం, జన సమితి, వైఎస్ఆర్టీపీ మద్దతు ప్రకటించాయి అని తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.. నియామకాల విషయంలో నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ.. దళిత బంధు పేరుతో అనేక ఇబ్బందులు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది నిజమే అయినప్పటికీ.. అనేక చోట్ల డ్యామేజ్ జరిగింది.. పిల్లర్లు డ్యామేజ్ అయ్యింది మొదటిసారి… గతంలో కట్టిన ప్రాజెక్ట్ ల్లో అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లర్లు దెబ్బ తినడం ఏంటీ అసలు? ఇసుకపై కట్టడం ఏమిటీ? అని ప్రశ్నించారు. ఇక, బీఆర్ఎస్కి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని విమర్శించారు.. ఆర్థిక వ్యవస్థ నీ కల్వకుంట్ల కుటుంబానికి అనుకూలంగా మలుచుకున్నాయి.. 17 మంది మంత్రివర్గం లో తెలంగాణ కోసం ఉద్యమించిన వారు ఎంతమంది…? అని ప్రశ్నించారు. మిగితా అంతా తెలంగాణ ద్రోహులేగా? రాజకీయంగా దివాలోకొరుగా మార్చింది బీఆర్ఎస్.. నంబర్ వన్ దొంగలు ఎంఐఎం.. వారితో బీఆర్ఎస్కు స్నేహం ఏమిటి? అని నిలదీశారు.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంకి ఓటు వేయొద్దు.. ఒక్కదెబ్బకు అంటే ఒక్క ఓటు కి మూడు పిట్టలు పడిపోవాలి.. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ కి ఓటు వెయ్యండి.. బీఆర్ఎస్ని గద్దె దింపండి అంటూ పిలుపునిచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
వరుస అగ్ని ప్రమాదాలు.. చర్యలు చేపట్టడంలో సర్కార్ విఫలం
నాంపల్లిలోని బజార్‌ఘాట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరస అగ్ని ప్రమాదలు జరుగుతున్న ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరస అగ్ని ప్రమాదలు జరుగుతున్న ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ రోజు ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ సెల్లర్ లో కారు మరమ్మతులు ఏంటి? అని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిలువ చేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి రేవంత్ రెడ్డి కోరారు.
అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు ఆగం ఆగం మాట్లాడుతున్నాడు..
అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు ఆగం ఆగం మాట్లాడుతున్నాడని ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను మంత్రిని అవుతా అని అనడం నాకళ అన్నారు. బడుగు బలహీనవర్గాలు మంత్రులు కావాద్దా? అని ప్రశ్నించారు. ఇంకా దొరల చేతిలో బందీలుగా బతుకుదామా? అన్నారు. దొరల తెలంగాణ కావాలా ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. మనకు ఇల్లు, పోడు భూములకు పట్టాలు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు మన ఇళ్లలోకి వస్తె తిరగపడండి తరిమి కొట్టండి అన్నారు. ఈ రోజు ములుగు మండలంలోని కాన్నాయి గూడెం గ్రామములో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతక్క మాట్లాడుతూ.. నేను ప్రజల మనిషిని.. ప్రజల కోసం పరితపించే వ్యక్తిని.. ప్రజల పక్షాన నిలబడి కోట్లాడే వ్యక్తిని అన్నారు. నన్ను ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ 100 కోట్లను తమ బంట్రోతులకు ఇచ్చి డబ్బు, మద్యంతో ములుగు నియోజకవర్గ ప్రజలను కొనడానికి పంపిచారని ఆరోపించారు. ఎందుకు నాపైన ప్రభుత్వాన్ని ఇంత కక్ష అన్నారు. నేను ప్రజలకు సేవ చేసినందుకా? ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుందాకా? అని ప్రశ్నించారు.
గడిచిన 8ఏళ్లలో దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం ఎలా ఉందంటే ?
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో బాణసంచా కాల్చడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రాజధానిలోని ప్రజలు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారు. సోమవారం ఉదయం, రాజధాని ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లో పొగమంచు వాతావరణాన్ని కప్పివేస్తోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఆదివారం దీపావళి రోజు సాయంత్రం ప్రారంభమైన పటాకుల సందడి రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఇంతలో వివిధ గాలి నాణ్యతను కొలిచే బృందాలు, రాజధాని గాలి నాణ్యతను వారి స్వంత మార్గాల్లో కొలుస్తూ ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించాయి. గాలి నాణ్యతను కొలిచే స్విస్ గ్రూప్ IQAir డేటా ప్రకారం.. ఢిల్లీ సోమవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అవతరించింది. ఇక్కడ ఉదయం 5:00 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయి 514 వద్ద ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది. ఈ సమూహం ప్రకారం AQI 320 ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరికలున్నాయి. ఈ బృందం ప్రకారం సోమవారం ఢిల్లీలో గాలి ఈ ప్రమాదకర స్థాయి కంటే దారుణమైన స్థాయికి చేరుకుంది. వాయు నాణ్యతను కొలిచే మరో వాతావరణ సంస్థ aqicn.org ప్రకారం.. వాయు కాలుష్యం ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో అత్యంత దారుణంగా నమోదైంది. ఇక్కడ ఉదయం 5:00 గంటలకు గాలి నాణ్యత సూచిక (AQI) 969, ఇది ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది సాధారణం కంటే 20 రెట్లు ఎక్కువ. ఈ ఏజెన్సీ ప్రకారం AQI 300 కంటే ఎక్కువ చేరుకోవడం చాలా ప్రమాదకరం.
ప్రముఖ మత గురువు మౌలానా రహీముల్లా తారిఖ్ దారుణ హత్య
పొరుగు దేశం పాకిస్థాన్‌లో గుర్తు తెలియని దుండగులు ప్రముఖ మత గురువు నాత్ ఖవాన్ మౌలానా రహీముల్లా అలియాస్ మౌలానా రహీముల్లా తారిఖ్‌ను హతమార్చారు. ఈ ఘటన కరాచీలో జరిగింది. మతపరమైన సమావేశానికి హాజరయ్యేందుకు మౌలానా వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. దాడి చేసిన వ్యక్తులు అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో అతను మరణించాడు. మౌలానాను చంపడం అతడి లక్ష్యం కాదని కరాచీ పోలీసులు చెబుతున్నారు. మౌలానా రహీముల్లా జైషే మహ్మద్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్‌కు సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది. అయితే, మౌలానాకు జైష్ సంబంధంపై స్థానిక మీడియా కథనాలలో ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ఇటీవల పాకిస్తాన్లో అనేక లక్ష్య హత్యలు జరిగాయి. అంతకుముందు ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని బజౌర్‌లో లష్క్-ఎ-తైబా సీనియర్ కమాండర్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ్ ఖాన్ ఘాజీని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతడు లష్కరే టెర్రరిస్టు ఆర్మీలో రిక్రూటర్‌గా పని చేసేవాడని పేర్కొన్నారు. దావా ప్రకారం అతను భారతదేశంలో ఛాందసవాదాన్ని ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉన్నాడు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100రోజుల్లో 6గ్యారంటీలు అమలు చేస్తాం
ఈ నెలాఖర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పార్టీ నేతలంతా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా మోటమర్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భట్టి ఎన్నికల ప్రచారానికి మద్దతుగా కమ్యూనిస్టులు, తెలుగుదేశం శ్రేణులు కదిలివచ్చారు. మహిళలు మంగళ హారతులతో భట్టి కి స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో పెద్ద పాల్గొన్న మహిళలు, యువత, రైతులు భట్టి జిందాబాద్…. భట్టి సీఎం అంటూ నినాదాలు చేశారు. నీ వెంటే మేమున్నామంటూ వృద్ధులు భట్టికి భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోటమర్రి అంకమ్మ దేవాలయంలో భట్టి విక్రమార్క పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన భట్టి విక్రమార్క హస్తం గుర్తుపై ఓటు వేయాలని సిపిఐ, తెలుగుదేశం నేతలు ఓటర్లకు పిలుపునిచ్చారు. అనంతరం ప్రచార సభలో భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని అనడానికి కేసీఆర్ కేటీఆర్ కు బుద్ధుండాలన్నారు. కాంగ్రెస్ హామీల అమలుకు నిధులు లేకుంటే.. బిఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు.
ఓటీటీ లోకి రాబోతున్న సంపూర్ణేష్ నటించిన మార్టిన్ లూథర్ కింగ్..?
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హృదయం కాలేయం, కొబ్బరి మట్ట అనే కామెడీ సినిమాల తో అద్భుత విజయం అందుకొని కామెడీ పాత్రలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్.. ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల అయింది.. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మంచి సినిమాగా ప్రశంసలు అందుకున్నా కూడా కమర్షియల్‌గా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.మార్టిన్ లూథర్‌కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు సీనియర్ నరేష్ మరియు డైరెక్టర్ వెంకటేష్ మహా ముఖ్య పాత్రలు పోషించారు.వెంకటేష్ మహా ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను అందించాడు. మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కు పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు.తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్‌గా మార్టిన్ లూథర్ కింగ్ రూపొందింది.మండేలా మూవీ లో తమిళ్ స్టార్ కమెడియన్ యోగి బాబు నటించారు. యోగి బాబు పాత్రను తెలుగులో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా లో సంపూర్ణేష్ బాబు నటించాడు.
థియేటర్లో బాణసంచా కాల్చుతూ.. సల్మాన్ ఫ్యాన్స్ రచ్చ! వీడియో వైరల్
బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ యాక్షన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేశాడు. సల్మాన్, కత్రినాల కాంబోలో 2017లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా ఆదివారం (నవంబర్ 12) టైగర్ 3 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. టైగర్ 3 సినిమా విడుదల కోసం ఎప్పటినుంచో ఎదురుచుసిన సల్మాన్ ఖాన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రిలీజ్ నేపథ్యంలో థియేటర్ల ముందు భారీ కటౌట్లు పెట్టి.. బాణసంచా కాల్చుతూ నానా హంగామా చేశారు. అక్కడితో ఆగకుండా.. కొందరు అత్యుత్సాహంతో ఏకంగా థియేటర్ లోపల కూడా టపాకాయలు పేల్చారు. మహారాష్ట్ర మాలేగావ్‌లోని మోహన్ సినిమా థియేటర్లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొహ్మద్ సిరాజ్‌కు గాయం.. భారత్-న్యూజీలాండ్ సెమీఫైనల్లో ఆడుతాడా?
వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు కీలక సెమీఫైనల్‌కు ముందు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మొహ్మద్ సిరాజ్‌కు గాయం అయింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరాజ్ గాయపడ్డాడు. క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించగా.. బంతి నేరుగా సిరాజ్ గొంతుపై పడింది. ఇదే ఇప్పుడు భారత అభిమానులను భయాందోళనకు గురిచేస్తోంది. భారత్-న్యూజీలాండ్ సెమీఫైనల్లో సిరాజ్ ఆడుతాడా? లేదా? అని చర్చిస్తున్నారు. 15వ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయగా.. మొహ్మద్ సిరాజ్ లాంగ్ ఆన్‌లో ఉన్నాడు. కుల్దీప్ వేసిన నాలుగో బంతిని నెదర్లాండ్స్ ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ భారీ షాట్ ఆడాడు. బాగా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని అందుకోవడానికి సిరాజ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. బంతిని సిరాజ్ సరిగా అంచనా వేయలేకపోయ్యాడు. చేతుల్లోంచి జారిన బంతి నేరుగా వచ్చి అతని గొంతుపై పడింది. దీంతో చాలా ఇబ్బంది పడిన సిరాజ్.. మైదానం వీడాడు. బౌండరీ లైన్ ఆవల చాలాసేపు ఫిజియోతో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చి సిరాజ్ బౌలింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.