మోసాలతో యుద్ధం చేస్తున్నాం.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు గెలవాలి
మోసాలతో యుద్ధం చేస్తున్నాం.. వాలంటీర్లు ఇంటికే రావాలన్న, పెద్దవాళ్ల బతుకు మరాలన్నా, వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా.. ఫ్యాన్ గుర్తు ఉన్న రెండు బటన్లు నొక్కాలి.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చేశాము.. 99 శాతం మేనిఫెస్టో అమలు చేశాం.. 59 నెలల కాలంలో 2 లక్షల 70 వేల కోట్లు అక్క, చెల్లెమ్మలు ఖాతాలకు పంపించాం అని తెలిపారు. వివక్ష, లంచాలకు తావు లేదు.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ బోధన, ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ పుస్తకాలు.. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా చేశాం అన్నారు.. అమ్మ ఓడి, గోరుముద్ద, విద్య దీవెన, వసతి దీవెన.. గతంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. అక్క చెల్లెమ్మలకు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇల్లు.. గతంలో ఎపుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్.. ఇక, రైతులకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం.. వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, జగనన్న తోడు.. గతంలో ఎపుడైనా ఉన్నాయా…? అని ప్రశ్నించారు.. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష.. గతంలో ఎప్పుడైనా ఉందా..? అని సభికులను అడిగారు.. 600 సేవలు అందించే సచివాలయం, ఇంటి ముంగిటకే పౌర సేవలు, 3 వేల పెన్షన్.. గతంలో ఎప్పుడైనా ఉన్నాయా..? 14 ఏళ్లు 3 సార్లు సీఎం అని చెప్పే చంద్రబాబు చేసిన మేలు ఒక్కటైన గుర్తుకు వస్తుందా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
బొత్సకు పురంధేశ్వరి కౌంటర్..
మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం అన్నారు.. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది.. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని దుయ్యబట్టారు.. వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్న ఆమె.. విశాఖ రైల్వే జోన్ కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదు.. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపోయారు..? అని నిలదీశారు.. ఇక, పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించుకోవాలని బొత్సకు హితవు పలికారు దగ్గుబాటి పురంధేశ్వరి.
ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యేపై దాడి.. కిందపడిపోయిన ఆనం
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల చెదురుమదరు ఘటనలు జరుగుతున్నాయి.. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రచారంలో మాటల యుద్ధం, ఘర్షణకు దారి తీస్తోంది.. కొన్నిసార్లు సహనం కోల్పోయి దాడి, ప్రతి దాడులు చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.. ఇక, ఈ రోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది.. చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో టీడీపీ ప్రచారం ఉద్రిక్తతకు కారణం అయ్యింది.. ఎన్నికల ప్రచారం కోసం గ్రామానికి వెళ్లారు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీ నాయుడు.. అయితే, గ్రామంలో పాత టీడీపీ వర్గాన్ని పట్టించుకోకుండా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో కొత్తగా చేరిన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది.. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీ నాయుడుపై ఓ వర్గం దాడికి దిగింది.. అయితే, ఈ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.. ప్రచార వాహనం నుండి కింద పడిపోయారు.. ఈ ఘటన కలకలం సృష్టిచింది.. ఈ వ్యవహారంతో చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్లాన్..! ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తులో కీలకం
2024 ఎన్నికలు దేశ భవిష్యత్తులో కీలక పరిణామంగా ఉంటాయని తెలిపారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రణాళిక జరుగుతోందన్నారు. మేం ఇచ్చిన చాలా ఫిర్యాదులకు ఎకనాలెడ్జిమెంట్ కూడా లేదన్న ఆయన.. 42 శాతం గ్రాడ్యుయేట్లు మనదేశంలో నిరుద్యోగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చే శారు.. జీడీపీ దారుణంగా పడిపోయింది.. పేదరికం పెరుగుతోంది.. వినాశకాలే విపరీత బుద్ధి అన్న రీతిగా ఉంది.. దేశంలోని ప్రతీదీ అదానీకి ఇచ్చాడు ప్రధాని మోడీ అంటూ మండిపడ్డారు. సైనికులు అనే జైహింద్ కాస్తా జియో హింద్ అయిపోయిందని ఆరోపించారు ఏచూరి.. బ్లాక్ మనీ టెంపోలో వెళ్తుంటే.. ఈడీ ఏం చేస్తోంది..? అని నిలదీశారు. మతోన్మాద ఘర్షణలను రెచ్చగొట్టే వ్యాఖ్యానం ఎక్కువ జరుగుతోంది.. ఇండియలైన్స్ కాదు అండియలైన్స్ అని పిలవాలని ఎద్దేవా చేశారు. స్ధానిక పార్టీలతో పొత్తు పెట్టుకున్న చోట మాత్రమే బీజేపీ కొంత లాభపడే అవకాశాలున్నాయి.. స్ధానిక పార్టీల ఓట్లును బీజేపీ వినియోగించుకుంటుందని విమర్శించారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ఎలక్టోరల్ బాండ్స్ కొనకపోతే ఈడీ, సీబీఐను ప్రయోగించారని ఆరోపించారు.. మనీలాండరింగ్ ను ఎలెక్టోరల్ బాండ్స్ పేరుతో కుంభకోణాలను లీగలైజ్ చేశారు మోడీ అని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్, బుల్డోజర్ పాలిటిక్స్ యూపీ, మణిపూర్ లలో చూశాం ఏం జరుగుతోందో? అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాజ్యాంగం మతం గురించి మాట్లాడదు.. వెనుకబడిన తనం ఎవరికైనా ఉండచ్చు.. కానీ కులం, మతంలో ఉండదని స్పష్టం చే శారు. ఇక, బీజేపీ ఎన్నికలను తనంతట తాను నెగ్గలేదు అని జోస్యం చెప్పారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.
పోలింగ్ తేదీ తర్వాతే ఆ పథకాల సొమ్ము జమ చేయండి..!
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నిలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాతే.. సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని సూచించింది ఎన్నికల కమిషన్.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు పోలింగ్ తేదీ తర్వాత నగదు జమ చేసుకోవచ్చని ఏపీ హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే దీనిపై స్పందించిన ఈసీ.. పోలింగ్ తేదీ తర్వాత నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని కోర్టుకు తెలిపింది.. డిసెంబర్, జనవరి ఇలా పెండింగ్ లో ఉన్న వారికి ప్రభుత్వం నగదు జమ చేస్తూ వస్తోందని ఈ నెల 13న పోలింగ్ తర్వాత నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. ఇక, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలనే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది.
ధరణితో కేసీఆర్ ఓటమి..! భూ హక్కు చట్టంతో జగన్‌కి ఓటమి ఖాయం..!
తెలంగాణలో ధరణి చట్టంతో కేసీఆర్ ఓటమిపాలయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో భూ హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ఫొటో పెట్టడానికి మినహా రైతుల పాస్‌బుక్ ఎందుకు పనికి రాకుండా చేశాడు అని ఫైర్ అయ్యారు. పాస్‌బుక్‌లో సీఎం జగన్ ఫొటో చాలా బాగుందని సెటైర్లు వేసిన ఆయన.. పాస్‌బుక్ లోపల చదివా.. లాస్ట్ పేజీ చూస్తే.. ఇది తనఖాపెట్టడానికి ఉపయోగపడదు.. ఎలాంటి హామీకి ఇది ఉపయోగపడదు అని రాసిఉంది. దీనిపై రెవెన్యూ అధికారులను అడిగితే.. అవి వేటికి పనికిరావు సారు.. ! అని చెప్పారన్నారు. అంతదానికోసం.. కొత్త పాస్ బుక్కులు ఎందుకు? అని ప్రశ్నించారు.
గంట టైం ఇస్తాం ముస్లీంలను ఏం చేస్తారో చేయండి.. నవనీత్ కౌర్ కు ఒవైసీ కౌంటర్
పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో మరోసారి దుమారం రేపుతున్నాయి. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని అక్బరుద్దీన్ చెబుతున్నాడు. అక్బరుద్దీన్ కు నేను సవాల్ విసురుతున్నా 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు అన్నారు. ఆ 15 సెకన్లలోనే మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదంటూ నవనీత్ రాణా హైదరాబాద్‌లో ప్రచారం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నవనీత్ కౌర్ మాటలకు ఏఐఎంఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని ఎంఐఎం చీఫ్ సవాల్ విసిరారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతుంది. కాగా.. నవనీత్ రాణా ప్రకటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని AIMIM డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, నవనీత్ రాణా ఈ ప్రకటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు.
ఎక్కడ డిబేట్ పెట్టిన నేను రెడీ.. ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్..
కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి బీజేపీ అమేథీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఏ ఛానెల్ లో ఐనా, హోస్ట్ ఎవరైనా, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్‌లో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలకు స్మృతి ఇరానీ ఛాలెంజ్ చేసింది. ఒకవైపు.. సోదరుడు, సోదరీతో పాటు మరోవైపు, బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారని చెప్పుకొచ్చింది. మా పార్టీ నుంచి అయితే, సుధాంశు త్రివేది చాలు.. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారని ఆమె పేర్కొన్నారు. ఇక, దేశంలోని ముఖ్యమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణలపై స్మృతి ఇరానీ బుధవారం సవాల్ చేసింది. కాగా, 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై 55 వేల మేజార్టీతో విజయం సాధించింది. ఈసారి కూడా బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ నుంచి టికెట్ కేటాయించింది. అయితే, స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్‌కు కంచుకోటైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్‌ను ఎన్నికల బరిలోకి దించింది. అలాగే, అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ఎన్నికల ప్రచారం చేస్తుంది.
రైతులకు బ్యాడ్ న్యూస్.. అలా చేస్తే కనీస మద్దతు ధర కట్..!
2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని ఉటంకిస్తూ.. పొలాల్లో పంటలను కాల్చే రైతులకు ఈ ఏడాది నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కేంద్రం ఈ లేఖ రాసిన రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ఉన్నాయి. దీని అమలుపై త్వరలో స్టేటస్ రిపోర్టులను చీఫ్ సెక్రటరీలకు అందజేయాలని ఈ రాష్ట్రాలను మోడీ సర్కార్ కోరింది. కాగా, పొలల్లో పంట వ్యర్థాలను తగులబెట్టే రైతులపై జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే నిబంధనలు ఉండటంతో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే, ఏప్రిల్ 10న ప్రభుత్వ ముఖ్యకార్యదర్శుల కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యచరణకు సంబంధించిన అన్ని అంశాలను సిద్ధం చేసింది. ఇస్రో ప్రోటోకాల్ కింద రైతులు పొట్టును తగులబెట్టడాన్ని ఎంఎస్‌పీ నుంచి నిషేధించాలని నిర్ణయించారు. ఇక, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ నిబంధనను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి.. ఏడుగురు మృతి
పాకిస్థాన్‌లో ప్రతిరోజూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి బుధవారం రాత్రి గ్వాదర్‌లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు కార్మికులు మరణించారు. గ్వాదర్‌లోని సరబంద్‌లోని ఫిష్ హార్బర్ జెట్టీ సమీపంలోని నివాస గృహాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో నిద్రిస్తున్న ఏడుగురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పాకిస్థాన్‌లో తీవ్రవాద ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2023లో పాకిస్థాన్‌లో 789 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 1,524 మంది మరణించగా, 1,463 మంది గాయపడ్డారు. గత ఆరేళ్లలో ఇదే అత్యధిక రికార్డు. అంతకుముందు మార్చి 20న పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌పై ఉగ్రవాదుల దాడి వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది మంది సాయుధ ఉగ్రవాదులు గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌లోకి బలవంతంగా ప్రవేశించారని తెలిసింది. ఆ తర్వాత అక్కడికక్కడే కాల్పులు, బాంబు పేలుళ్లు జరిగాయి. నిషేధిత బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడిందని మక్రాన్ డివిజన్ కమిషనర్ సయీద్ అహ్మద్ ఉమ్రానీ తెలిపారు. ఈ దాడిలో స్థానికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు. దాదాపు ఎనిమిది మంది సాయుధ వ్యక్తులు గ్వాదర్ పోర్టులోకి బలవంతంగా ప్రవేశించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కాంప్లెక్స్‌లో పాకిస్తాన్ ఎన్నికల సంఘంతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. తొలుత కాల్పుల శబ్దాలు, ఆ తర్వాత బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని పోలీసు అధికారులు తెలిపారు. ఆ తర్వాత భద్రతా బలగాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ చర్యలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఎనిమిది మంది దాడికి పాల్పడ్డారని పాకిస్థాన్ వార్తాపత్రిక పేర్కొంది. గ్వాదర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జోహైబ్ మొహ్సిన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతీకారంగా ఏడుగురు దాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయని చెప్పారు.
ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులపై వేటు..
ప్రయాణికుల ఇబ్బందులకు కారణమైన సిబ్బందికి వేటు పడింది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ఎక్కువవుతోంది. సిబ్బంది ఉన్నపలంగా సెలవులు పెడుతున్నారు. దీంతో సుమారు 100 విమానాలను ఎయిరిండియా సంస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సెలవులు పెట్టి విమాన సేవలకు అంతరాయం కల్పించిన వారిపై సంస్థ తాజాగా చర్యలకు ఉపక్రమించింది. సుమారు 30 మంది సిబ్బందిని సంస్థ తొలగించింది. ఈ మేరకు బుధవారం రాత్రి 30 మంది సిబ్బందికి సంస్థ తొలగింపునకు సంబంధించి నోటీసులు పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నోటీసులలో పలు అంశాలు పేర్కొంది. అవేంటంటే.. విధులకు హాజరు కాని కారణంగా విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విధుల నియమ నిబంధనల ఉల్లంఘన కారణంగా తక్షణమే వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ నోటీసుల్లో పేర్కొంది. సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు పంపిన నోటీసుల్లో తెలిపింది. దీంతో సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది ఒకేసారి సెలవు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏకంగా 100కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. వేల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. షెడ్యూల్ ప్రకారం విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. ఈ ప్రభావం సుమారు 15 వేల మంది ప్రయాణికులపై పడినట్లు సదరు వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దుపై నివేదిక సమర్పించాలని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యాన్ని పౌరవిమానయాన శాఖ కోరింది. ఉద్యోగులు ముందస్తు పథకం ప్రకారమే చేశారా.. అనే అంశంపై చర్చ కొనసాగుతోంది. నోటీసులు తీసుకున్న ఉద్యోగుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
విక్రమ్ ‘అపరిచితుడు’ రీరిలీజ్ డేట్ ఫిక్స్…
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేస్తూ ఎంతో పండుగ చేసుకుంటారు .టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోల చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి .రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ ను తమ అభిమాన హీరో తరుపున మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తారు.ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో విక్రమ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ఈ సినిమాలో విక్రమ్ సరసన సదా హీరోయిన్ గా నటించింది .దర్శకుడు శంకర్ తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు..ఈ సినిమా అప్పట్లోనే భారీగా కలెక్షన్స్ సాధించింది.ఇదిలా ఉంటే ఈ సినిమాను 4k వెర్షన్ లో మే 17న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఈ సినిమాకి హ్యారిస్ జయరాజ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు..ఈ సినిమా పాటలు ఇప్పటికి ఎంతో పాపులర్ అని చెప్పవచ్చు.
కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ పని చేశా..
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.కాజల్ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.తెలుగుతో పాటు తమిళ్,హిందీ చిత్రాలలో కూడా నటించి ఎంతగానో మెప్పించింది.అయితే కెరీర్ పీక్స్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతం కిచ్లును ప్రేమించి ,పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కాజల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.తాజాగా కాజల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ”.ఈ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా “మే 17” న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో కాజల్ ఎంతో బిజీగా వుంది. తాజాగా సత్యభామ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ గెస్ట్‌గా వచ్చింది.తాజాగా ఆ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది.ఈ షో లో కాజల్ కొన్నిఆసక్తికర విషయాలు తెలియజేసింది.తనకు పవర్‌ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమని కాజల్ తెలిపారు .ప్రస్తుతం తాను చేసిన సత్యభామ సినిమా యాక్షన్ తరహాలో సాగే పాత్ర అని ఆమె తెలిపింది.ఎప్పటి నుంచో ఇలాంటి సినిమా చేద్దామని అనుకుంటున్నాను కానీ ఇప్పటికి కుదిరిందని కాజల్ తెలిపింది.ఇదిలా ఉంటే కాజల్ ఎన్టీఆర్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.జనతా గ్యారేజ్‌లో ఐటెంసాంగ్ చేయడానికి కారణం ఏంటని అలీ ప్రశ్నించగా కాజల్ ఆసక్తికరంగా జవాబు ఇచ్చింది.ఆ సాంగ్ చేయడానికి కారణం కేవలం పెద్ద బ్యానర్ అలాగే పెద్ద డైరెక్టర్ మంచి రెమ్యునరేషన్ అని కాదు నేను సాంగ్ చేయడానికి అస్సలు కారణం ఎన్టీఆర్.తన కోసమే ఆ పాటలో నటించడానికి తాను ఒప్పుకున్నట్లు కాజల్ తెలిపింది.
బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ పట్టేసిన రష్మిక..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. గత ఏడాది రణబీర్ కపూర్ కు జోడిగా యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టేసింది.. ఇప్పుడు అదే జోష్ తో మరో బంఫర్ ఆఫర్ పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా రష్మికకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన జోడి కట్టేందుకు ఛాన్స్ దొరికినట్టు సమాచారం.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సికందర్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు.. ఈ సినిమా లైన్ బాగుండటంతో ముందుగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు టీమ్ రెడీ అవుతున్నారు.. సల్మాన్ ఖాన్ కు జోడిగా రష్మిక మందన్నను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనని యూనిట్ టాక్.. సౌత్ లో వచ్చినట్లు నార్త్ లో సినిమా ఆఫర్స్ రావడం కష్టం.. కానీ ఈ అమ్మడు లక్ వల్లే మరో ఆఫర్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర అన్నీ హిందీలోనూ డబ్ కాబోతున్నాయి. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ VD14 సినిమాలో నటిస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..