*తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..
తెలంగాణలో ఉష్ణోగ్రత మరోసారి పెరుగుతోంది. తెలంగాణ ఈ నెల ప్రారంభంలో వేడిగాలులను చవిచూసింది. ఆ తర్వాత వర్షం పడుతోంది. ఇది పెరుగుతున్న వేడి నుండి ఉపశమనం కలిగించింది. అయితే ఉష్ణోగ్రతలు మరోసారి పెరిగాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ప్రకారం శుక్రవారం 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, జగిత్యాలలోని నేరెళ్లలో 45.6 డిగ్రీలు, మంచిర్యాలలోని కొండాపూర్‌లో 44.9 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ కూడా 44 డిగ్రీల మార్కును తాకింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో శుక్రవారం 43 సి, అంబర్‌పేట్, ఖైరతాబాద్‌లో 42.9సి నమోదైంది. ఇవాళ భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో మే 26 నుంచి 30 వరకు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. గురువారం మధ్యాహ్నం వరకు జిల్లావ్యాప్తంగా గరిష్టంగా ఎండలు నమోదవగా, సాయంత్రం నుంచి ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావం పలు ప్రాంతాల్లో ఉండగా.. రాత్రి కూడా వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈదురు గాలులు, అకాల వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉద్యోగులు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడగా, ఖమ్మం, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది.
*నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్..
తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో చేదు వార్త అందించింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా లేదని, కొన్ని జిల్లాల్లో మాత్రమేనని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27వ తేదీ సోమవారం జరగనుంది.ఈ ఎన్నికల పోలింగ్‌కు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాలకు చెందిన పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో సైలెంట్ పర్వం ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మే 27వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయాలని అధికారులు ప్రకటించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మాత్రమే మద్యం దుకాణాలు, బార్లు బంద్ ఉంటాయని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లపై మద్యం ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఆ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్టపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని పార్టీల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. మళ్లీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత వైన్ షాపులు, బార్లు తెరుచుకోనున్నాయి.
*ఏపీలో తిరిగి ప్రారంభమైన ఆరోగ్యశ్రీ సేవలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించామని.. శుక్రవారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి మా వినతిని తెలిపామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే వారంలో రూ. 300 కోట్లు బకాయిల సొమ్ము విడుదల చేస్తామని సీఎస్ మాటిచ్చారని వారు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన సీఎస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు యధాతధంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలందిస్తామన్నారు. గతంలో ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల నుంచి ఉన్న రూ.1500 కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పెండింగ్ బిల్లుల్ని చెల్లించకపోతే సేవల్ని నిలిపివేస్తామని అసోసియేషన్ తెలిపింది. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు స్ట్రైక్ కంటిన్యూ చేయడంతో మూడో రోజూ సేవలు నిలిచిపోగా.. దీంతో నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలిశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడదల చేయాలని కోరారు. ఆస్పత్రుల నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎస్‌కు వివరించారు. పెండింగ్ నిధుల విడుదలపై సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు డాక్టర్ రమేష్.
*బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మంత్రి కారు స్టిక్కర్ వాడింది అతనే!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మంత్రి వాహనంపై సీసీబీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రేవ్ పార్టీ సమయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనాన్ని ఉపయోగించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పూర్ణారెడ్డి అనే వ్యక్తి మంత్రి కారు స్టిక్కర్‌ను ఉపయోగించినట్లు గుర్తించారు. రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో ఫామ్ హౌస్ నుంచి పూర్ణారెడ్డి పారిపోయారు. పూర్ణారెడ్డిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఏ2 అరుణ్ కుమార్, ఏ4 రణధీర్ బాబు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. చిత్తూరు వాసి రణధీర్ డెంటిస్ట్‌గా పని చేస్తున్నారు. తవణంపల్లి మండలం మడవనేరికి చెందిన అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ నిరోధక చట్టం కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో జీఆర్ ఫామ్‌హౌస్ యజమాని గోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. గోపాల్ రెడ్డి విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని సీసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గోపాల్ రెడ్డి ఏ6 గా ఉన్నారు.
*పుణె కారు యాక్సిడెంట్.. డ్రైవర్‌ను బెదిరించిన నిందితుడి తాత అరెస్ట్
పూణె పోర్షే కారు ప్రమాదంలో మహారాష్ట్ర పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. మైనర్ నిందితుడి తాత సురేంద్ర అగర్వాల్‌పై డ్రైవర్‌ను బెదిరించిన ఆరోపణ ఉంది. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఆయన ఎరవాడ పోలీసుల నుంచి క్రైం బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. కాగా, ఎరవాడ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ప్రమాదంపై సమన్వయంతో వ్యవహరించేందుకు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. యువకుడి తండ్రి, మద్యం అందించే రెండు సంస్థల యజమాని.. ఉద్యోగులపై నమోదైన నేరంపై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని ఆయన చెప్పారు. పూణేలోని కళ్యాణి నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున, పోర్షే కారు డ్రైవర్ మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఢీకొట్టాడు. ఫలితంగా వారిద్దరూ మరణించారు. మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ నిందితుడు రియల్ ఎస్టేట్ డెవలపర్ విశాల్ అగర్వాల్ (50) కుమారుడు. కాగా, పోర్షే యాక్సిడెంట్ కేసులో నిందితుడితో పాటు అతడి తండ్రి విశాల్ అగర్వాల్‌తో సహా ఆరుగురిని పూణే కోర్టు శుక్రవారం జూన్ 7 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. తదుపరి విచారణ కోసం అతని పోలీసు కస్టడీని పొడిగించాలని ప్రాసిక్యూషన్ అభ్యర్థించింది. అయితే, రెండు మద్యం సరఫరా చేసే సంస్థల యజమాని.. ఉద్యోగులతో సహా అగర్వాల్, ఇతరులను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మే 19న ప్రమాదం జరిగిన సమయంలో మైనర్ కారు నడపడం లేదని, పెద్దలు కారు నడుపుతున్నట్లు చూపించే ప్రయత్నం జరిగిందని పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ అంతకుముందు రోజు తెలిపారు. పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత అగర్వాల్‌తో పాటు మరో ఐదుగురు నిందితులను అదనపు సెషన్స్ జడ్జి ఎస్‌పి కస్టడీకి పంపారు. పోర్షే ముందు సమర్పించారు. ఇతర నిందితుల్లో కోసి రెస్టారెంట్ యజమాని నమన్ భుతాడ.. దాని మేనేజర్ సచిన్ కట్కర్, బ్లాక్ క్లబ్ మేనేజర్ సందీప్ సంగలే, దాని ఉద్యోగులు జయేష్ గావ్కర్, నితేష్ షెవానీ ఉన్నారు.
*జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో రిగ్గింగ్.. మెహబూబా ముఫ్తీ ఆందోళన..!
ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతంలోని 58 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే, జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్- రాజౌరీ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన పీడీపీ (పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ) అధినేత మెహబూబా ముఫ్తీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగింది. తన పార్టీ కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లను కారణం లేకుండా అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా తన సెల్ ఫోన్‌లో అవుట్ గోయింగ్ కాల్స్ బంద్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అనంత్ నాగ్-రాజౌరీ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. కాగా, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. అంతకు ముందు పీడీపీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను పోలీసులు స్టేషన్ కు తీసుకున్నారని ముఫ్తీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. మరోవైపు, నేటి ఉదయం 9 గంటల వరకు 10.82 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 16.54 శాతం, అత్యల్పంగా ఒడిశాలో 7.43 శాతం పోలింగ్ నమోదు అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
*గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందినట్లు సమాచారం. గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో చాలా మంది గాయపడ్డారని, శిథిలాల మధ్య సమాధి అయి ఉండవచ్చని చెబుతున్నారు. గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జిల్లాలోని బెర్లా బ్లాక్‌కు చెందిన బోర్సీలో నమోదవుతోంది. పేలుడు సంభవించినప్పుడు చుట్టూ ప్రజలు గుమిగూడారు. ఈ ఘటనలో గాయపడిన పలువురిని రాయ్‌పూర్‌లోని మెకహరా ఆసుపత్రికి తరలించారు. ఇది కాకుండా, చాలా మంది ప్రజలు సమీపంలోని ఆసుపత్రులలో కూడా చేరారు. గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. జిల్లా యంత్రాంగం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో పాటు అగ్నిమాపక దళం, అంబులెన్స్ బృందాలను ఘటనా స్థలానికి తరలించారు. సమాచారం ప్రకారం పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు చాలా శక్తివంతమైనదని, దాని వల్ల వందల అడుగుల ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన సమాచారం గురించి బెమెతర కలెక్టర్ రణబీర్ శర్మ మాట్లాడుతూ, SDRF బృందం వచ్చిన వెంటనే, శిధిలాలను తొలగించే పనిని ప్రారంభిస్తామన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణమేమిటనే విషయమై కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఘటన జరగడానికి గల కారణాలను చెప్పడం కష్టమని అన్నారు. అది గన్‌పౌడర్ ఫ్యాక్టరీ కావడంతో రసాయనాలు కూడా ఉండేవి. అయితే ఇలా ఎందుకు జరిగిందో చెప్పడం కొంచెం కష్టమే. అలాగే ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడుతున్నామని, ప్రస్తుత కార్మికుల సంఖ్య సమాచారం అందిన తర్వాత అప్‌డేట్ చేస్తామని చెప్పారు.
*కెనడాలో బస్సును ఢీకొట్టిన భారతీయ సంతతి ట్రక్ డ్రైవర్.. 16 మంది మృతి
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన జసికిరత్ సింగ్ సిధ్దూని భారత్ కు పంపించి వేయాలని ఆ దేశం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అతడు ఆరు సంవత్సరాల క్రితం కెనడాలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.. సిధ్దూ సాధారణ ట్రక్కు డ్రైవర్ గా అక్కడ పని చేస్తున్నాడు.. ఇక, 2014లో సిధ్దూ కెనడాకు వలస వెళ్లాడు.. సస్కట్చేవాన్ ప్రావిన్స్‌లోని టిస్‌డేల్ సమీపంలోని ఓ జంక్షన్ దగ్గర హంబోల్ట్ బ్రోంకోస్ జూనియర్ హాకీ జట్టు బస్సు మార్గంలోకి వెళ్లింది.. అదే సమయంలో సిధ్దూ నడుపుతున్న ట్రక్కు హాకీ జట్టు బస్సును ఢీ కొట్టడంతో 16 మంది అక్కడికక్కడే మృత్యు వాత పడ్డారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, ఈ ఘటనపై విచారించిన తర్వాత ట్రక్ డ్రైవర్ సిద్ధూని భారత్ కు తిరిగి పంపేయాలని ఫెడరల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ బోర్డు శుక్రవారం ఆమోద ముద్ర కూడా వేసింది. అయితే, 2018లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు అతడు ఎనిమిదేళ్ల శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. ఇదిలా వుంటే శాశ్వత నివాస హోదా కోసం సిద్ధూ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది సంవత్సరాలు పట్టవచ్చని ఆయన తరపు న్యాయవాది గ్రీన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు సిద్ధూను భారత్ కు పంపాలని కోరడంతో ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని సిద్ధూ తరపు లాయర్ వెల్లడించారు.
*స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
మగువలకు గుడ్‌న్యూస్. బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులు భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. శనివారం (మే 25) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,550గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,550.. 24 క్యారెట్ల ధర రూ.72,600గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా నమోదైంది. నేడు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండిపై రూ.500 తగ్గి.. రూ.91,500గా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,500 కాగా.. ముంబైలో రూ.91,500గా ఉంది. చెన్నైలో రూ.96,000లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.92,500గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.96,000లుగా ఉంది.