రెండు రోజుల ఏపీ పర్యటనకు సీజేఐ డీవై చంద్రచూడ్..
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డీవై చంద్రచూడ్ ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఈ రోజు ఉదయం తిరుపతికి చేరుకోనున్న సీజేఐ డీవై చంద్రయూడ్.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శ్రీనివాస ఆడిటోరియంలో జరగనున్న బీఏ ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు 10వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం చేయస్తారు.. సీజేఐ పర్యటన ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, యూనివర్సిటీ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.. ఇక, ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి తిరుమల చేరుకోనున్నారు సీజేఐ చంద్రచూడ్ దంపతులు.. రాత్రికి తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహంలో బస చేస్తారు.. రేపు ఉదయం అనగా బుధవారం రోజు తెల్లవారుజామున తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు సీజేఐ.. ఆ తర్వాత రేపు ఉదయం 9 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.. రేపు ఉదయం 11 గంటలకు తిరుపతి, తిరుమల పర్యటన ముగించుకోని హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు సీజేఐ డీవై చంద్రచూడ్. కాగా, గతంలోనూ తిరుమలలో పర్యటించిన సీజేఐ చంద్రచూడ్.. శ్రీవారిని దర్శించుకున్న విషయం విదితమే.
తిరుపతిలో అనూహ్య పరిణామాలు.. జనసేన పోటీపోటీ సమావేశాలు.. టీడీపీ రహస్య భేటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో.. అనూహ్య పరిణామాలు కొనసాగుతున్నాయి.. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. జనసేనకు కేటాయించిన తిరుపతిలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తిరుపతిలో పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు జనసేన నేతలు.. అధినేత ఆదేశాలు ధిక్కరించి మరి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసేందుకు జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ప్రయత్నిస్తున్నారు.. హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్ లో స్థానిక జనశ్రేణులతో కిరణ్ రాయల్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.. మరోవైపు.. ఇదే సమయంలో జనసేన అభ్యర్థి ఆరిణి శ్రీనివాసులు ఎన్ జీవో ఆఫీస్ లో ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు.. పార్టీ అభ్యర్థివైపే మెజారిటీ నేతలు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. పార్టీ ఆదేశాలు ప్రకారం తాము నడుస్తామంటున్నారు తిరుపతి జనసేన కేడర్.. ఆరిణి శ్రీనివాసులు మాతో కలవలేదని అందుకే సమావేశం అంటున్నారు కిరణ్ రాయల్.. మరోవైపు.. పలుమార్లు ఆరిణి కలవడానికి ప్రయత్నించినా కిరణ్ రాయల్.. సహా పలుపురు నేతలు స్పందించడంలేదని విమర్శలు వినిపించాయి.. ఈ తరుణంలో.. అసంతృప్తితో ఉన్న జనసేన పార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటికి వెళ్లి కలిశారు జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు.. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.. ఇరువురు నేతల కలయికతో సమస్య పరిష్కారం అవుతుందనే ఆశలో జనసైనికులు ఉన్నారు.. ఈ పరిణామాలు ఇలా ఉండగానే.. మరో పక్క నగరంలో టీడీపీలు రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది.. టీడీపీ నేత జెబీ శ్రీనివాస్ ఇంట్లో ఈ సమావేశం జరుగుతోంది.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సహా పలుపురు నేతలు సమావేశంలో పాల్గొనట్టుగా సమాచారం.. జసనేనలో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు టీడీపీ నేతలు.. ఇక, ఆరిణికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.. కన్నీటి పర్యంతమైన విషయం విదితమే కాగా.. ఈ రోజు సమావేశంలో జనసేనకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అని చర్చిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరం, త్రివేణి సంగమం.
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. బీజేపీలో చేరారు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన పలువురు వ్యక్తులు. వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు.. మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరం.. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమంగా అభివర్ణించారు. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారన్న ఆమె.. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. కానీ, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని పార్టీ హైకమాండ్ భావించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు పురంధేశ్వరి. భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారు. అప్పులు భారీ ఎత్తున చేసేసింది ఈ ప్రభుత్వం. సెక్రటేరీయేట్టును, మద్యాన్ని, గనులను, ప్రభుత్వ భవనాలను, భూములను తనఖా పెట్టేశారని.. సెక్రటేరీయేట్టును తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారా? అని ఓ వైసీపీ నేత కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? అంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే అని ఆరోపించారు.. మహిళల పుస్తెలు తెగినా నాసిరకం మద్యం తాగిస్తామనే రీతిలోనే జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాలంటీర్లపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన.. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం..
వాలంటీర్లపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.. ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక, అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని గతంలోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారని గుర్తించారు. కానీ, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను మాత్రం సమర్థించేది లేదన్నారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి.. చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నర ఆయన.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు.. వారి భవిష్యత్‌ను వారే పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూనే.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకైన వాలంటీర్లపైనే సుధీర్ ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.. వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ సమర్ధించదని స్పష్టం చేశారు. ఇక, సీఎం వైఎస్ జగన్ రెడ్డికి అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే జైలుకు వెళ్లినా పట్టించుకోలేదన్నారు. వాలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఈ సందర్భంగా కోరారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
నేను అప్రూవర్ గా మారేది లేదు.. కడిగిన ముత్యంలా బయటికి వస్తా..!
ఎమ్మెల్సీ కవిత ఇవాళ రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కవిత లోపలికి వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. నేను అప్రూవర్ గా మారేది లేదు.. కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. మూడో నిందితుడు రూ.50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని తెలిపారు. క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవ్ వర్ గా మారేది లేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత పిల్లలకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. దయచేసి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది, ఇరువైపులా వాదనలు ముగిసాయి. అయితే ఈ తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు. వచ్చే నెల 16 వరకు చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని.. అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత. కాగా.. కవిత అభ్యర్థనపై జడ్జి కావేరి బవేజ ఆర్డర్ రిజర్వ్ చేశారు. నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడి కస్టడీ ముగియనుంది. ఇవాళ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఈడి అధికారులు కవితను హాజరు పర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 15న హైదరాబాదులో లిక్కర్ కేసులో కవితను ఈడి అరెస్ట్ చేశారు. ఈడి కస్టడీలో లిక్కర్ స్కాంలో అధికారులు కవిత పాత్రపై ఇంటరాగేషన్ చేశారు. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు నిందితులు అరెస్టై వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల వాంగ్మూలాలపై ఈడి అధికారులు కవిత నుంచి క్లారిటీ తీసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తో కలిపి విచారించేందుకు మరో రెండు రోజుల కస్టడీ పొడగించాలని కోర్టును ఈడి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రెండు వాదనలను రోస్ అవెన్యూ కోర్టు ఇవాళ వినే అవకాశం ఉంది. మరోసారి కవితను ఈడీ కస్టడీకి ఇస్తారా? లేక జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు ఇస్తుందా? రెండూ లేకుండా బెయిల్ మంజూరు చేస్తుందా? అనే అంశాలపై ఇవాళ స్పష్టత వస్తుందని అంటున్నారు.
ఏపీలో ఏప్రిల్ నెల పింఛన్లు రెండు రోజులు ఆలస్యం.. కారణం అదే..?
ఆంధ్రప్రదేశ్‌లోని పింఛనుదారులకు ఏప్రిల్ లో రెండు రోజులు ఆలస్యంగా చెల్లింపులు జరుగుతాయని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా “మేము నెల మొదటి తేదీన పెన్షన్ లను పంపిణీ చేస్తున్నామని, ఇక వచ్చే నెల మొదటి రోజు ఏప్రిల్ 1 న, ఆర్బిఐ కి సెలవుదినం, ఆ తరువాత ఆదివారం రావడం వల్ల ఈ మేరకు మూడో తేదీన (ఏప్రిల్ 3) పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం’’ అని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి తెలిపారు. ఇక ఇతర క్యాబినెట్ నిర్ణయాలను ఆయన వివరిస్తూ, షెడ్యూల్డ్ కులాల సబ్‌ప్లాన్ ను మరో దశాబ్దానికి పొడిగించడంతో సహా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చట్టం 2019కి సవరణ ముసాయిదా బిల్లు ఆమోదించబడినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పర్యవేక్షణ, సౌకర్యాలను మరింత పెంచడానికి., గతంలో మాదిరిగా కాకుండా మూడు మండలాలకు కలిపి సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం మరియు బీసీ సంక్షేమ శాఖల కోసం ఒక క్లస్టర్ ను రూపొందించడం ద్వారా మండల స్థాయి వరకు బాధ్యతలను పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏడాదిలోగా సహాయ సంక్షేమ అధికారిని నియమించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు.
2026 నాటికి కాంగ్రెస్ కనుమరుగు..
ఇండియా కూటమి కలిసి ఉన్నట్లు మనకు కనిపించడం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భవిష్యత్ అంధకారం కాబోతుందన్నారు. అలాగే, 2026 నాటికి ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండబోదన్నారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడనున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ క్షీణతకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కూడా హస్తం పార్టీ నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ఇక, అస్సాం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా 25025లో బీజేపీలో చేరతారని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ జోస్యం చెప్పుకొచ్చారు. అలాగే, భూపేన్ కోసం నేను రెండు సీట్లు రెడీ చేసి పెడతాను అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లోని తృణమూల్ సభ్యులందరూ మాతో చేరనున్నారు.. నేను సోనిత్ పూర్ అభ్యర్థికి ఫోన్ చేస్తే.. తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేరుతాడు.. కానీ అలా చేయను. ఇప్పుడు అస్సాంలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ లాంటిది.. అవసరమైనప్పుడు తీసుకోవచ్చని సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.
ఒకేఒక్క ఫోన్ కాల్ తో 400 మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక కంపెనీలు వారి ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఇటాలియన్ – అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ కంపెనీ ఒకేఒక్క ఫోన్ కాల్ తో అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ భాగాలలోని 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది సదరు సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన ఫార్చ్యూన్ మేగజైన్ కథనం ప్రకారం.. మర్చి 22న కంపెనీ వారు రిమోట్ కాల్ చేసి ఉద్యోగులకు లేఆఫ్ లు ఇస్తున్నట్టు తెలిపింది. స్టెల్లాంటిస్ కంపెనీకి భారత్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల నుండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తుండగా.. వారు తక్కువ వేతనాలకే సమర్థవంతంగా పనిచేస్తుండడంతో వారిని ప్రోత్సహిస్తూ, రెగ్యులర్ ఉద్యోగులను తొలగించింది కంపెనీ. ఇక తొలగించిన ఉద్యోగులను ఉత్త చేతులతో అసలు పంపడం లేదని., సదరు తమ ఉద్యోగులకి పరిహార ప్యాకేజీ చెల్లిస్తున్నట్టు తెలిపింది కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ఆటో ఇండస్ట్రీ ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ట్విట్టర్ కంపెనీలో లేఆఫ్ లతో ప్రారంభమైన తీసివేతల పర్వం.. ఆపై ప్రముఖ టెక్ కంపెనీలకు పాకింది. దీంతో ఇప్పుడు వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడినట్లైయింది. అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే మళ్లీ సద్దుమణుగుతున్న తరుణంలో ఈ ఏడాది మొదటి నుంచి మళ్లీ లేఆఫ్ లపై కంపెనీలు దృష్టిసారించాయి.
ప్రీతి జింటా చేసిన పొరపాటు.. పంజాబ్ కింగ్స్‌కు వరంలా మారింది!
డిసెంబర్ 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో.. పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా పొరపడ్డారు. 19 ఏళ్ల బ్యాటర్‌కు బదులుగా.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 32 ఏళ్ల శశాంక్ సింగ్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేశారు. శశాంక్‌ను సొంతం చేసుకున్న అనంతరం పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తమ పొరపాటును గ్రహించింది. అయితే పరువు పోకుండా శశాంక్ సింగ్ తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నాడని కవర్ చేసింది. వేలం సమయంలో ప్రీతి జింటా పొరపాటు చేసినా.. ఇప్పుడు అదే వరంలా మారింది. వద్దనుకున్న శశాంక్ సింగే.. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసేందుకు సాయపడ్డాడు. 19 ఓవర్లకు పంజాబ్ 6 వికెట్స్ కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. అయితే 20వ ఓవర్‌లో శశాంక్ సింగ్ చెలరేగాడు. ఆర్‌సీబీ పేసర్ అల్జారీ జోసెఫ్ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. దాంతో ఆ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. శశాంక్ హిట్టింగ్‌తో పంజాబ్ పోరాడే స్కోర్ చేసింది. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తొలి పరాజయం ఖాతాలో వేసుకుంది. ఆర్‌సీబీతో చివరివరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45; 37 బంతుల్లో 5×4, 1×6) టాప్ స్కోరర్. లక్ష్యాన్ని ఆర్‌సీబీ మరో నాలుగు బంతులు ఉండగానే 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్ ప్రధాన పేసర్లు అర్ష్‌దీప్ (3.2 ఓవర్లలో 40), హర్షల్ పటేల్ (1/45) ధారాళంగా పరుగులిచ్చారు.
వెంకీ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల..!
టాలీవుడ్ లో ఎంటర్టైనర్ పరంగా ఉన్న ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటి శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన వెంకీ సినిమా ఒకటి. రవితేజ, స్నేహ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికి రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఇకపోతే ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ రావచ్చన్న వార్త బయటకు వచ్చింది. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో వెంకీ సీక్వెల్ గురించి మాట్లాడారు. వెంకీ సినిమా రీ-రిలీజ్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. వెంకీ – 2 చేయడానికి తాను ప్రేరణ పొందినట్లు తెలిపారు. అయితే ఇందుకు తగ్గటే ప్రస్తుతం ఆయన వెంకీ సీక్వెల్ కొరకు స్క్రిప్ట్ రాస్తున్నారట. ఇప్పటికైతే తనకు వెంకీ సినిమా సీక్వెల్ ఆలోచన ఉన్నా కానీ.. అది ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదని శ్రీను వైట్ల అన్నారు. ఇదివరకు మంచి కథలకు కామెడీ జోడించి సినిమాలు తీయడంలో శ్రీను వైట్ల ఒక దశలో వరుసగా విజయాలు అందుకున్నారు. ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్ షా లాంటి ఎన్నో కామెడీ – యాక్షన్ ఎంటర్టైనర్లు అందించి ప్రేక్షకులని అలరించారు. ఇక ఇప్పటికీ ఈయన తీసిన సినిమాలను మళ్ళీ మళ్ళీ చూసి ప్రేక్షకులు ఆనందిస్తూ ఉంటారు. ముఖ్యంగా 2004లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన ‘వెంకీ’ చిత్రానికి 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికి అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలోని అనేక కామెడీ సన్నివేశాల మీద ఎన్నో సోషల్ మీడియాలో వేల సంఖ్యలో మీమ్స్ తయారయ్యాయి. పరిస్థితి ఏదైనా సరే.. అసలు వెంకీ సినిమాలోని సీన్ సంబంధించి మీమ్ లేకుండా సోషల్ మీడియాలో మూవీ నెటిజన్లు పోస్ట్ చేయరు అంటే అది అతిశయోక్తి కాదేమో. దీని బట్టి చూస్తే ఆ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో చెప్పనక్కరలేదు. ఇక ఈ సినిమాని కొద్దీ రోజుల క్రితం థియేటర్లలో రీ రిలీజ్ చేయగా ప్రతిచోటా హౌజ్ ఫుల్స్ ను నమోదు చేసింది. దింతో ఇప్పుడు వెంకీ సీక్వెల్ పై ఫోకస్ పెట్టిన శ్రీను వైట్ల ప్రయత్నం ఫలించి ప్రేక్షకులకి మరో క్లాసిక్ ఎంటర్టైనర్ అందివ్వాలని కోరుకుందాము.
పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం లేదా?
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత మూడేళ్ళగా షూటింగ్ జరుపుకుంటున్న మూవీ నుంచి పోస్టర్, టైటిల్ తప్ప మరో అప్డేట్ లేదు. ఆమధ్య ‘జరగండి’ సాంగ్ రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేసి.. పోస్ట్ పోన్ చేసి అభిమానులను నిరాశపరిచారు. అయితే ఆ పాటని చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులను ఖుషీ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ‘ జరగండి’ సాంగ్ బుధవారం ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ శంకర్ తన ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే జరగండి పాటను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. కన్నడ, మలయాళం భాషలలో ఈ సాంగ్ రిలీజ్ అవ్వడం లేదు. కొత్త పోస్టర్‌తో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్నడ, మలయాళం భాషలలో సినిమా విడుదల అవుతుందో లేదో అని నెటిజెన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ముందు నుంచి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.