నాలుగేళ్లలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తెచ్చాం..
నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కురుపాంలో నాలుగో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇరవై ఆరువేల కోట్లు ఇప్పటి వరకు ఈ పథకానికి ఇవ్వడం జరిగింది అని వెల్లడించారు.. ఇదంతా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు నేరుగా అందింది.. పిల్లల భవిష్యత్తు కోసం.. బడికి పిల్లలను పంపించేందుకు ఆ తల్లులకు ఇచ్చే ప్రోత్సాహకం ఇది… దేశంలో మరెక్కడా జరగటం లేదు… ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది అన్నారు.. నాలుగేళ్లలో రాష్ట్రంలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని వెల్లడించారు.. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తాం అని తెలిపారు. ఇక, నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ తన ప్రసంగం ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. తల్లులు తమ పిల్లలను బడులకు పంపేందుకు అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో.. క్లాస్ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో చూశాం. ఇప్పుడు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా చేస్తున్నాం. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారు కావాలి అని సీఎం జగన్ వేదిక నుంచి ఆకాంక్షించారు. మూడో తరగతి నుంచే టోఫెల్ కరికులమ్ తీసుకొస్తున్నాం. ఆరో తరగతి నుంచే క్లాస్‌ను డిజిటలైజ్ చేస్తున్నాం అని తెలిపారాయన. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం, విద్యాకానుక కిట్లు అందించడం, మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు.. టోపేన్ కోసం మూడు నుంచే ప్రత్యేక తరగతులు ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు చేశాం అన్నారు.
రాకెట్ అనుసంధానం పూర్తి.. చంద్రయాన్-3 ప్రయోగం ఎప్పుడంటే..?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్ 3 ప్రయోగానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. జులై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో… ఇక, రాకెట్ అనుసంధానాన్ని పూర్తి చేశారు శాస్రవేత్తలు.. ప్రయోగంపై శాస్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డా.సోమ్‌నాథ్ సమీక్ష నిర్వహించారు.. అయితే, చంద్రయాన్-3 అనేది చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్ మరియు రోవింగ్‌లో ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి చంద్రయాన్-2కి ఫాలో-ఆన్ మిషన్.. ఇది ల్యాండర్ మరియు రోవర్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది శ్రీహరికోటలోని SDSC SHAR నుండి LVM3 ద్వారా ప్రారంభించబడుతుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మరియు రోవర్ కాన్ఫిగరేషన్‌ను 100 కిలోమీటర్ల చంద్ర కక్ష్య వరకు తీసుకెళ్తుంది.. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్ర కక్ష్య నుండి భూమి యొక్క స్పెక్ట్రల్ మరియు పోలారి మెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) పేలోడ్‌ను కలిగి ఉంటుంది.
దుర్గ గుడిలో మరో వివాదం.. వైరల్‌గా మారిన వీడియో
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. గుడిలో కొబ్బరికాయ కొట్టాలంటే ఇరవై రూపాయిలు చేతిలో పెట్టాల్సిందేనని తెగేసి చెబుతున్నారు అక్కడి సిబ్బంది.. కనకదుర్గమ్మ గుడిలో భక్తుల వద్ద నుండి కొబ్బరికాయ కొట్టడానికి 20 రూపాయిలు వసూలు చేస్తున్నారని కాంట్రాక్టర్‌పై మండిపడుతున్నారు భక్తులు.. కాంట్రాక్టర్.. వారానికి లక్షా ఎనిమిది వేల రూపాయలకు టెండర్ పాడుకున్నట్లు తెలుస్తుండగా.. ఆ డబ్బులను భక్తుల వద్ద నుండి దండుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఫిర్యాదు చేసినా.. దుర్గగుడి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు..
క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ మన పీవీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ భారత ప్రధాని పీవీ నరసింహరావు 102 వ జయంతి సందర్భంగా సీఎం కేసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. స్థిత స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు, తనదైన శైలిలో రాజనీతిని, పాలనా దక్షతను ప్రదర్శిస్తూ.. దేశానికి మౌనంగా మేలు చేసిన భారత ప్రధాని పీవీ నర్సింహారావు అని సీఎం కేసీఆర్ కొనియాడారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుకే దక్కుతుందని ఆయన వెల్లడించారు. పీవీ నర్సింహారావు సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నదని, వారి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఠీవి మన పీవీ’ అని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. వారి స్పూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రత గురించి మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈటల భద్రత విషయంలో సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని సూచించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆయన్ని చంపాలని చూస్తున్నారు అంటూ ఈటల రాజేందర్ భార్య జమున మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపించిన గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈటల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈటల రాజేందర్ కు వై-కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర సర్కార్ తరపున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో డీజీపీ ఈటలకు భద్రత పెంపు విషయంలో సమీక్ష చేశారు. దీని కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి ఈటల నివాసానికి వెళ్లారు.
చైనా కావాలనే కొవిడ్‌ను మనుషులకు ఎక్కించింది: వుహాన్ పరిశోధకుడు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికించిన సంగతి అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి ఎలా పుట్టిందనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మనుషులకు ఎందుకు సోకింది అనే మూడేళ్లుగా సమాధానం లేని ప్రశ్నపై.. చైనాలో వుహాన్ నగరంలోని… వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఓ పరిశోధకుడు… ఆశ్చర్యకరమైన విషయాన్ని తెరపైకి తెచ్చారు. కరోనా వైరస్‌ని చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మనుషులకు ఎక్కించిందని ఆరోపించారు. ఆ పరిశోధకుడి పేరు చావో షావో. తన తోటివారు కరోనా వైరస్‌కి సంబంధించిన 4 రకాల స్ట్రెయిన్లను మనుషులకు ఎక్కించారనీ.. ఏ స్ట్రెయిన్ బాగా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి అలా చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చావో షావో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో సైంటిస్ట్‌గా ఉన్నారు. ఆయన జెన్నీఫర్ జెంగ్ సంస్థకి ఇచ్చిన 26 నిమిషాల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. షాన్ చావో అనే మరో రీసెర్చర్‌కి తన పైఅధికారి 4 రకాల కరోనా స్ట్రెయిన్లను ఇచ్చి.. వాటిని పరిశోధించమని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ నాలుగు స్ట్రెయిన్లలో ఏది ఎక్కువ జాతులకు వేగంగా, తేలికగా వ్యాపించగలదు? అన్నది కనిపెట్టడమే దీని ఉద్దేశం అని తెలిపారు. చావో షావో ప్రకారం.. చైనా కరోనాను జీవ రసాయన ఆయుధంగా భావించింది.
వేలిముద్రలు సేకరించారు.. రూ.51 లక్షలు దోచేశారు..!
సైబర్ నేరగాలు చెలరేగి పోతున్నారు.. కొత్త కొత్త తరహాలో దోచేస్తున్నారు.. ఏదో రకంగా ఎరవేయడం.. దొరికినవారి నుంచి అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. చివరకు వేలి ముద్రలను సేకరించి.. వాటి ద్వారా కూడా దోపిడీకి పాల్పడుతోన్న ముఠా.. పోలీసులకు చిక్కింది.. వేలిముద్రలు సేకరించి, వాటితో సొమ్ము దోచుకుంటున్న పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి.. ఈ ముఠా రూ.51.25 లక్షలు దోచేసినట్లు గుర్తించారు పోలీసులు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు రూరల్‌కి చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఇటీవల కొంత నగదు విత్‌డ్రా అయ్యింది.. అయితే, ఆమె ఫోన్‌కు ఎలాంటి ఎస్‌ఎంఎస్ రాలేదు.. కానీ, బ్యాంకు ఖాతాను పరిశీలిస్తే అందులో ఉన్న నగదు మొత్తం మాయం అయ్యింది.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు.. ఇక, నెల్లూరు గ్రామీణం, సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు.. ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి చెందిన ఎన్.వెంకటేశ్వర్లు, టి.మధుసూదన్‌రెడ్డి, డి.ఆనంద్‌రావు, ఎం.సాయికుమార్‌రెడ్డి, ఆర్.శ్రీనివాసులు, ఎస్‌కే ఉమర్, సీహెచ్ సన్నీ, ఎం.యువరాజ్, ఎన్.సుధాకర్, పి.రవీంద్ర కలిసి.. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజల వేలిముద్రలు సేకరించినట్లు దర్యాప్తు తేలింది.. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఆధారంగా వేలిముద్రలతో ఆయా ఖాతాల్లో నగదు దోపిడీకి తెర లేపారు కేటుగాళ్లు.. ప్రత్యేక యాప్స్ ద్వారా వేలిముద్రల ఆధారంగా ఖాతాల్లో ఉన్న నగదు గుట్టుగా లేపేశారు.. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు. ఇక, ఈ ముఠాలో కర్నూలు జిల్లాకు చెందిన డాక్యుమెంటు రైటర్ కూడా ఒకరు ఉన్నట్టు తెలుస్తోంది..
ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్, భారత్ మ్యాచ్.. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌కు మరో మ్యాచ్!
వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న మెగా సమరం మొదలయి.. నవంబరు 19న ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లోని మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. చెన్నైలో అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభిస్తుంది. ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి వారం రోజుల ముందు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. వార్మప్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 29న మొదలై.. అక్టోబర్ 3న ముగుస్తాయి. మెగా టోర్నీలో భాగంగా భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో మొదటి వార్మప్ మ్యాచ్, అక్టోబర్ 3న త్రివేండ్రంలో క్వాలిఫయర్-1తో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక హైదరాబాద్‌లో దాయాది దేశం పాకిస్తాన్ ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో పాక్ తలపడనుంది.
విజయ్ ఆంటోనీ ‘హత్య’ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు
డాక్టర్ సలీం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైయ్యాడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత వచ్చిన బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బా బాగా దగ్గరయ్యాడు.. తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. బిచ్చగాడు మాదిరి బ్లాక్ బస్టర్ కాకపోయినా వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. అయితే విజయ్ ఆంటోనీ నుండి మరో కొత్త సినిమా వస్తోంది. ఆయన గత చిత్రాల మాదిరిగానే థ్రిల్లర్ జోనర్ లో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ‘హత్య’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు విజయ్ ఆంటోనీ. హత్య ఎలా జరిగిందీ? ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయాలనే తెలుసుకుని మర్డర్ మిస్టరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను విజయ్ ప్రకటించాడు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. ఈ హత్య సినిమాను జులై 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తమిళంలో కోలై అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందిస్తు్న్నారు. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, మురళీ శర్మ, జాన్ విజయ్, సంకిత్ బోహ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తమిళరసన్’. ఈ చిత్రాన్ని బాబు యోగేశ్వరన్ తెరకెక్కించారు. అపోలో ప్రొడక్షన్స్, ఎస్.ఎన్.ఎస్. మూవీస్ సంయుక్త సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్. కౌసల్య రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విక్రమ్ రాథోడ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ శివ గంగ ఎంటర్ ప్రైజెస్ సంస్థ అధినేత కె బాబు రావు తెలుగు ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
నిఖిల్ స్పై సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య…
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ”స్పై”. ఈ సినిమా పై మంచి అంచనాలు వున్నాయి.బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ముందుకు రాబోతుంది.. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో ఈ సినిమా అంచనాలు అమాంతం పెరిగాయి.ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాను బక్రీద్ సందర్బంగా ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య హాజరయ్యారు.. నాగచైతన్య స్పై సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నిఖిల్ అంటే తనకు ఎంతో ఇష్టం అని. చిన్న హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయి కి ఎదిగిన నిఖిల్ ను చూసి నేను ఎంతో గర్వపడుతున్న అని ఆయన తెలిపారు.. స్పై వంటి థ్రిల్లర్ సినిమా చేయడం ఎంతో కష్టం అని నాగచైతన్య తెలిపారు తనకు స్పై ట్రైలర్ ఎంతో బాగా నచ్చిందని చైతూ చెప్పుకొచ్చారు. తన తరపున స్పై సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ కూడా తెలిపారు నాగచైతన్య. నిఖిల్ స్పై సినిమా తర్వాత మరింత గొప్ప స్థాయికి చేరుకుంటారని తెలిపారు నాగచైతన్య.
భర్తతో విడాకులు.. ఒకే హోటల్‌లో ధోనీతో అసిన్.. అసలేం జరుగుతోంది
ప్రస్తుతం స్టార్ హీరోయిన్ విడాకులపై చర్చ నడుస్తోంది. ఆమె భర్త నుంచి విడిపోనుందనే చర్చలు మొదలయ్యాయి. ఈ నటి బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన చిత్రం ‘గజనీ’. ఈ సినిమాలో హిందీలో అమీర్‌ఖాన్‌తో, తమిళ్ లో సూర్యతో కలిసి ఆమె కథానాయికగా నటించింది. ‘గజని’ సినిమా నటిగా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత హిందీలో అక్షయ్ కుమార్ తో కలిసి కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే 2016లో మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. ఇప్పుడు అసిన్ వైవాహిక జీవితంలో తుఫాను వచ్చిందంటున్నారు. ఆమె భర్త నుంచి విడిపోబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు మారుమోగిపోయింది. నిజానికి అసిన్, ఎంఎస్ ధోనీ గతంలో ఒక వాణిజ్య ప్రకటనలో కలిసి పనిచేశారు. అక్కడ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం స్నేహంగా మారింది. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. చివరగా, ధోనీ సాక్షి రావత్‌ను వివాహం చేసుకున్న తర్వాత, ఈ చర్చలన్నీ ముగిశాయి.