చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్టే.. మన ప్రభుత్వంతో వచ్చిన మార్పును చూడండి..
చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్టేనని మరోసారి హెచ్చరించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవ్వా, తాతల మధ్య మీతో మమేకం కావటం సంతోషంగా ఉందన్నారు. మన ప్రభుత్వం రాకముందు మనకు ఎంత పెన్షన్ వచ్చిందో ఆలోచన చేయాలి.. గత ఎన్నికలకు రెండు నెలలకు ముందు వరకు పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే.. ఆ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పును గమనించాలని సూచించారు. పెన్షన్ ను ఇళ్ళ వద్దకు తీసుకువెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారిగా మొదలుపెట్టాం.. ప్రతీ గ్రామంలో ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేశాం.. ప్రతీ యాభై ఇళ్ళకు ఓ వాలంటీర్ ను పెట్టాం.. 56 నెలలుగా ఒకటవ తేదీ ఏ సెలవు రోజైనా పెన్షన్ ఇళ్ళ వద్దకు తీసుకువెళ్ళి ఇచ్చేలా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు సీఎం జగన్.
జనసేనకు బిగ్ షాక్.. పోతిన మహేష్ గుడ్ బై..
ఎన్నికల తరుణంలో జనసేన పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. పార్టీలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్.. జనసేనకు గుడ్‌బై చెప్పారు.. అయితే, బెజవాడ పశ్చిమ సీటు ఆశించారు పోతిన మహేష్.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదురిన తర్వాత.. ఆ సీటు బీజేపీకే కేటాయిస్తారనే ప్రచారం సాగింది.. ఊహించినట్టుగానే పొత్తులో భాగంగా పశ్చిమ సీటు బీజేపీ నుంచి సుజనా చౌదరికి కేటాయించింది ఎన్డీయే.. కానీ, ఆ సీటును తనకే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు పోతిన మేహష్.. తన అనుచరులతో కలిసి నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అధిష్టానం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో.. చివరకు పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.. కాగా, 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పోతిన మహేష్.. ఓటమి పాలయ్యారు.. ఈసారి మళ్లీ పోటీ చేసి.. ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు.. టీడీపీ నుంచి కూడా ఈ స్థానం కోసం గట్టిపోటే నడిచింది.. టీడీపీ నేతలు వెనక్కి తగ్గినా.. పోతిన మహేష్ మాత్రం.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు.. ”జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకు మరియు క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇప్పటి వరకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జనసైనికులకు మరియు పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదములు” అంటూ లేఖలో పేర్కొన్నారు పోతిన వెంకట మహేష్. అయితే, జనసేనకు గుడ్‌బై చెప్పిన పోతిన మహేష్.. రాజకీయ అడుగులు ఎటువైపు వేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది..
మైండ్ పని చేయడం లేదు..! కేశినేని నానిపై చిన్ని ఫైర్
బెజవాడ లోక్‌సభ స్థానంలో ఎంపీ, వైసీపీ అభ్యర్థి అయిన అన్న కేశినేని నాని, తమ్ముడు, టీడీపీ అభ్యర్థి అయిన కేశినేని చిన్ని మధ్య.. మాటల యుద్ధమే నడుస్తోంది.. కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడ్డారు చిన్ని.. నా మీద దొంగ కేసులు పెట్టాడు.. ఎంపీ స్టిక్కర్ వేసి తిరుగుతున్నానని చెప్పాడు.. పోలీసులు దీన్ని ఎక్కడా నిరూపించలేదన్నారు. నేను బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టలేదు, ప్రజలను మోసం చేయలేదని స్పష్టం చేశారు. కేశినేని నాని సొంత కార్మికులు జీతాలు ఇవ్వలేదని గుంటూరు లేబర్ కోర్ట్ లో కేసులు పెట్టారని గుర్తుచేసిన ఆయన.. కేశినేని నానికి మైండ్ పని చేయడం లేదని ఫైర్ అయ్యారు. నువ్వు అమరావతి కావాలంటావు..! నువ్వే వద్దు అంటావు.. నీకు మైండ్ పనిచేయడం లేదని మండిపడ్డారు కేశినేని చిన్ని.. మూడు సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నా.. నేను ఎక్కడా కేశినేని నాని తమ్ముడు అని చెప్పుకోలేదన్న ఆయన.. 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న కేశినేని నాని ఆఫీస్ కి నేను రాలేదన్నారు. నేను ఎప్పుడు మీడియా ముందు కేశినేని నాని తమ్ముడు నీ అని మాట్లాడలేదన్నారు. 33000 ఎకరాలు ఇచ్చిన రైతులకు లేని బాధ నీకెందుకు కేశినేని నాని అని దుయ్యబట్టారు.. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు కోరుకుంటున్నారని తెలిపారు విజయవాడ లోక్‌సభ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని.
అమాంతం పెరిగిన ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్.. ఆ రెండే కారణం..
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌కి క్రమంగా ఆర్డర్ల సంఖ్య పెరుగుతుందట.. దీంతో, డెలరీ బాయ్స్ సంఖ్యను పెంచుకునే పనిలో పడిపోతున్నాయట ఫుడ్ డెలవరీ యాప్స్.. అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బుకింగ్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే.. రెండు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.. ఒకటి ఎండలు మండిపోవడం అయితే.. మరొకటి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడం కూడా అంటున్నారు.. ఏప్రిల్ ఆదిలోనే ఎండలు దంచికొడుతున్నాయి.. ముఖ్యంగా మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.. ఎండ వేడిమి తాళలేక అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తికావడం.. సీబీఎస్‌ఈ లాంటి పరీక్షలు పూర్తి చేశారు.. మరోవైపు స్కూళ్లకు ఒంటిపూట బడులు జరుగుతున్నాయి.. కానీ, మధ్యాహ్నం తర్వాత కూడా జనం బయకు వెళ్లడానికి జంకుతున్నారట.. షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్లలో పెద్దగా రద్దీ కనిపించడంలేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ సమయంలో.. ఆన్‌లైన్ ఆర్డర్లు క్రమంగా పెరుగుతున్నాయని.. ఫుడ్ , ఇతర నిత్యావసరాలు డెలివరీ చేసేవారు చెబుతున్నమాట.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచికొడుతుంటే.. వీకెండ్‌లో సాయంత్రం నుంచే.. మిగతా రోజుల్లో రాత్రి ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.. నచ్చిన ఫుడ్‌ను మెచ్చిన రెస్టారెంట్‌ను ఆర్డర్ ఇవ్వడమే కాదు.. నిత్యావసరాల ఆర్డర్లు కూడా పెరిగిపోయాయి.. క్రమంగా డెలివరీ యాప్‌లు స్విగ్గీ, జొమాటోల వినియోగం పెరిగిపోయింది.. అయితే, ఆర్డర్లు పెరిగిపోవడంతో.. డెలివరీలో ఆలస్యమూ జరుగుతుందని.. కొన్ని ప్రముఖ హోటళ్లు ఫుడ్ అందించలేక తాత్కాలికంగా ఆన్‌లైన్ సర్వీసులను నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందట.. దీంతో.. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడంతో హైదరాబాద్‌లోని ప్రధాన సెంటర్లలోని ప్రముఖ రెస్టారెంట్ల ముందు డెలివరీ బాయ్‌లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తిందట.. తమకు సమీపంలోని రెస్టారెంట్‌కు ఆర్డర్ పెట్టినా.. ఆర్డర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. డెలివరీ చేయడానికి సమయం పడుతుందని చెబుతన్నారు..
మండుతోన్న ఎండలు.. కూల్‌గా బీర్లు లాగిస్తున్నారుగా..!
సినిమాల్లో బీర్ల గురించి చాలా సన్నివేశాలు వచ్చాయి.. ఈ టైంలో చల్లటి బీరు లాగిస్తే ఎలా ఉంటుంది..? అని తమకు తామే అనుకుని.. కూల్ బీర్లను సమ్మగా లాగిస్తుంటారు స్నేహితులు.. అయితే, ఇప్పుడు బయటక కూడా ఇలాంటి పరిస్థితి ఉంది.. క్రమంగా మద్యం ప్రియులు బీర్లు కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారట.. దీనికి ప్రధాన కారణం మాత్రం ఎండలు మండిపోవడం.. ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేయడమే నట.. ఉష్ణోగ్రతలు పెరగిపోవడం.. బీర్లకు భారీగా డిమాండ్ పెరిగిందని వైన్స్, బార్ల నిర్వహకులు చెబుతున్నారు. ప్రతీ వేసవిలో సాధారణంగానే బీర్‌లకు డిమాండ్ ఉంటుంది.. లిక్కర్‌కు బదులు చల్లటి బీర్‌ల వైపు మొగ్గు చూపుతుంటారు మద్యం ప్రియులు.. ఈ సారి కూడా అదే పరిస్థితి.. కాకపోతే.. డిమాండ్‌కు తగినట్టుగా సరఫరా లేక ఇబ్బందులు తప్పడంలేదట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజూ 60 వేల నుంచి 80 వేల కేస్‌లకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు ఓ అంచనా.. ఇక, వేసవి వచ్చిందంటే ఇది మరింత పెరిగిపోతోంది.. వేసవిలో అదనంగా మరో 20 వేల కేస్‌లకు డిమాండ్ ఉందట.. కానీ, అది కొరతగానే ఉందని చెబుతున్నారు.. ప్రతీ రోజూ వైన్ షాపుల నుంచి వంద కేస్‌ల కోసం ఆర్డర్లు వస్తుంటే.. 60 వేల నుంచి 80 వేల వరకు మాత్రమే వైన్ షాపులకు బీర్లు చేరుతున్నాయి.. ఏప్రిల్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో.. క్రమంగా బీర్ల సేల్స్ పెరుగుతున్నాయి.. వైన్ షాపులకు, బార్లకు వెళ్తున్న మద్యం ప్రియులు.. కూల్‌గా బీర్లు ఆర్డర్ చేస్తున్నారట.. అయితే, సాయంత్రం, రాత్రి సమయం వచ్చేసరికి బీర్లు స్టాక్ లేకుండా అయిపోతుందని చెబుతున్నారు. గ్రేటర్‌లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా బీర్లకు డిమాండ్ పెరుగుతోంది.. బీర్ కంపెనీల నుంచి ప్రస్తుతం రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేస్‌ల వరకు అందుతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.. అంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షన్నర నుంచి 2 లక్షల కేస్‌లు బీర్లు లాంగిచేస్తున్నారు.. దీనిలో మెజార్టీ వాటా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలదేనని గణాంకాలు చెబుతున్నాయి.. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగింది.. ఏప్రిల్ 2023లో గ్రేటర్‌లో దాదాపు 12 లక్షల కేస్‌లకుపైగా బీర్‌ల అమ్మకాలు జరిగితే.. ఇప్పుడు 15 లక్షల కేస్‌లకు పైగా డిమాండ్ ఉంటుందట.. కాగా, బీర్ కేసుల విషయానికొస్తే, మే 2023లో 64 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.. తెలంగాణలో ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు సాగించారు.. ఈ ఏడాది వీటి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
అప్పుడు బలిదేవత.. ఇప్పుడు దేవతా..? రేవంత్ పై మహేశ్వర్ రెడ్డి ఫైర్
సోనియా గాంధీనీ బలి దేవత అని ఇప్పుడు దేవత అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరువుతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయన్నారు. రుణమాఫీపై ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని ఆరోపించారు. రైతు బంధుకి ఇవ్వాల్సిన 7 వేల కోట్లు మళ్లించారని మండిపడ్డారు. అవి ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చాక 17 వేల కోట్లు అప్పులు తెచ్చారని తెలిపారు. నాలుగు నెలల్లో 40 వేల కోట్ల రెవెన్యూ వచ్చి ఉంటుందన్నారు. మొత్తం 57 వేల కోట్లు దేనికీ ఖర్చు చేశారన్నారు. ఒక్క పథకాన్ని అమలు చేయలేదన్నారు. ఈ డబ్బు అంతా R టాక్స్, B టాక్స్ కోసమే ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి పాలన పైన పట్టు రాలేదన్నారు. డిఫాక్టో సీఎం, శ్రీధర్ బాబు SRSP నుండి 8 టీఎంసీల నీళ్ళు అక్రమంగా తరలించుకుపోయారన్నారు. ఇదేనా మీ వాటర్ మేనేజ్మెంట్ అని ప్రశ్నించారు. పంట నష్ట సహాయం కింద 10 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీనీ బలి దేవత అని ఇప్పుడు దేవత అని అంటున్నారని తెలిపారు. మోడీ నీ బడే భాయ్ అని ఇప్పుడు నమ్మించి మోసం చేసే వ్యక్తి అని అంటున్నారని తెలిపారు. నీకు మోడీ నీ అనే హక్కు లేదని హెచ్చరించారు. ఎన్నికల టైమ్ లో ఏదో మాట ఇచ్చి ఓట్లు దండు కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. హామీలు అన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో రేవంత్ రెడ్డీ చెప్పించారని తెలిపారు. అవి నేను చెప్పలేదని తెలివిగా రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారని తెలిపారు. నాకు సంబంధం లేదని ఏదో ఒక రోజు బయట పడతారన్నారు.
ఈనెల 13న చేవెళ్లలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ..!
ఈ నెల 13 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. చేవెళ్ల బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యం మని భావించిన ఆయన చేవెళ్ల బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు. బస్సు యాత్రల ద్వారా కేసీఆర్ ప్రతి నియోజకవర్గంకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బస్సు యాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చనే నిర్ణయంతోనే ప్రచారానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. బహిరంగ సభలు లేకుంటే ఖర్చులు తగ్గించుకునే అవకాశంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నాట్లు పార్టీనేతలు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం టచ్ చేయాలనే యోచనలో కేసీఆర్ వున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఈ నెల 13న చేవెళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శ్రేణులకు సెరి లింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌లు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసిన అనుభవం ఉందని, తాను ఎంపీగా ఎన్నికైతే అన్ని వర్గాలకు అండగా ఉంటానన్నారు.
పక్షులు అంతరించిపోతున్నాయి.. వాతావరణ మార్పులపై తొలిసారిగా సుప్రీంకోర్టు ఆదేశం
వాతావరణ మార్పుల హెచ్చరికలను ప్రపంచం గుర్తించింది. 2070 నాటికి ‘జీరో ఎమిషన్స్’ సాధించాలనే భారత్ అంతర్జాతీయ నిబద్ధతకు మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. వాతావరణం, జీవావరణం మధ్య సమతుల్యతను పాటించాలని సుప్రీంకోర్టు మొదటిసారిగా ఆదేశాలు ఇచ్చింది. బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి మారడం, దాదాపు అంతరించిపోయిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (GIB) పక్షిని రక్షించడం వంటి వాటిని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు సమతుల్యతను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షిని గోదావన్ అని కూడా పిలుస్తారు, ఇది రాజస్థాన్‌లో కనిపిస్తుంది. 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తులు రద్దు చేశారు. ఆ ఉత్తర్వు.. రాజస్థాన్, గుజరాత్‌లలో 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విద్యుత్ ప్రసార మార్గాలను నిషేధించింది. సౌర విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుంది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 450 గిగావాట్లకు (GW) పెంచాలనే భారతదేశ లక్ష్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.
ఉద్ధవ్ ఠాక్రే మమ్మల్ని ‘‘ఇంటి పనివారి’’గా చూశాడు.. ఇదే శివసేన చీలికకు కారణం..
శివసేన పార్టీలో చీలిక తీసుకురావడంపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. బాలా సాహెబ్ థాకరే( ఉద్ధవ్ ఠాక్రే తండ్రి) మమ్మల్ని స్నేహితులుగా భావించేవారు, కానీ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం మమ్మల్ని ‘‘ఇంటి పనివారి’’గా భావించేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లోని రామ్‌టెక్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేనకు సైద్ధాంతిక మిత్రపక్షాలు కాని కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ..‘‘ పార్టీ సిద్ధాంతంతో రాజీపడినందుకు నేను విడిపోయాను’’ అని అన్నారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ-శివసేన మెజారిటీ సీట్లను దక్కించుకుంది. అయితే, గెలుపు తర్వాత సీఎం సీటుపై ఉద్ధవ్ ఠాక్రే పేచీ పెట్టడం, దానికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఆయన ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఈ ప్రభుత్వం పడిపోవడం, ఆ తర్వాత షిండే, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్సీపీలో చీలిక వర్షం అజిత్ పవార్ కూడా బీజేపీ-శివసేన(షిండే)తో ప్రభుత్వంలో చేరారు.
హిందూ వివాహానికి ఏడడుగులు తప్పనిసరి.. ‘కన్యాదానం’ అవసరం లేదు.. హైకోర్టు తీర్పు
ఒక కేసును విచారిస్తున్నప్పుడు, హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకోవడానికి ‘కన్యాదానం’ అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. అశుతోష్ యాదవ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. చట్టం ప్రకారం, కేవలం ‘సప్తపది’ (ఏడడుగులు) మాత్రమే హిందూ వివాహానికి అవసరమైన వేడుక అని పేర్కొంది. జస్టిస్ సుభాష్ విద్యార్థి సింగిల్ బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది. అశుతోష్ యాదవ్ తన అత్తమామలు దాఖలు చేసిన వివాహ వివాదానికి సంబంధించిన క్రిమినల్ కేసుపై పోరాడుతూ మార్చి 6న లక్నోలోని అదనపు సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇద్దరు సాక్షులకు మళ్లీ సమన్లు జారీచేయాలని ఆయన తన పిటిషన్ ద్వారా కోర్టును అభ్యర్థించారు. ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఈవీ బ్యాటరీల కోసం ఎక్సైడ్ ఎనర్జీతో హ్యుందాయ్-కియా భాగస్వామ్యం..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల వాడకం పెరుగుతోంది. టూవీలర్స్, కార్‌లతో ఈవీలను కొనుగోలు చేయడానికి భారత వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవీ కార్లను రూపొందిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈవీల వాడకం ఎక్కువగా పెరుగే నేపథ్యంలో కంపెనీలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా ఆటోమేకర్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ, కియా కార్పొరేషన్‌లు భారత బ్యాటరీ తయారీ దిగ్గజ సంస్థ అయిన ఎక్సైడ్ ఎనర్జీతో భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. తమ ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల విస్తరణ ప్రణాళికలో భాగంగా ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం( MOU) కుదుర్చుకున్నాయని హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ లోనే EV బ్యాటరీ ఉత్పత్తిని ఈ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రత్యేకంగా లిథియం-ఐరన్-ఫాస్పేట్(LFP) బ్యాటరీలపై దృష్టిసారించాయి. ఈ చర్య ద్వారా భారతీయ మార్కెట్లో తమ రాబోయే ఈవీ వాహనాలకు దేశీయంగా తయారు చేయబడిన బ్యాటరీలను వర్తింపచేయడంతో అగ్రగామిగా నిలుస్తామని హ్యుందాయ్-కియా సంస్థలు తెలిపాయి. భారత ప్రభుత్వ కార్బన్ న్యూట్రాలిటీ కారణంగా రాబోయే రోజుల్లో విద్యుదీకరణ వాహన రంగానికి భారత్ కీలకమైన మార్కెట్‌గా ఉందని, స్వదేశంలో బ్యాటరీల ఉత్పత్తి ద్వారా పోటీతత్వం పెరగడంతో పాటు ఖర్చులను తగ్గించవచ్చని హ్యుందాయ్ మోటార్ మరియు కియా యొక్క R&D విభాగం ప్రెసిడెంట్ మరియు హెడ్ హేయు వాన్ యాంగ్ అన్నారు.
కంగనా రనౌత్ గొడ్డుమాంసం తింటుందన్న కాంగ్రెస్ నేత.. ఆమె స్పందన ఇదే..
బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఆమె గొడ్డుమాంసం(బీఫ్) తింటుందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని ఆమె తోసిపుచ్చారు. తాను హిందువుగా గర్విస్తున్నానని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. ‘‘ నేను గొడ్డు మాంసం లేదా మరే ఇతర రకాల రెడ్ మీట్ తినను, నాపై నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం సిగ్గుచేటు’’ అని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తాను దశాబ్దాలుగా యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని సమర్థిస్తున్నానని, వాటిని ప్రచారం చేస్తున్నానని చెప్పారు. ఇలాంటి ఆరోపణలు నా ప్రతిష్టను దెబ్బతీయడానికి పనిచేయవని అన్నారు. నా గురించి ప్రజలకు తెలుసని, నేను హిందువునని, జైశ్రీరాం అంటూ నినదించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పక్ష నేత విజయ్ వాడేట్టివార్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్ తాను బీఫ్ తనడాన్ని ఇష్టపడ్డానని ట్వీట్ చేశారని, బీజేపీ పార్టీ ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చిందని ఆరోపించిన నేపథ్యంలో కంగనా రనౌత్ స్పందించారు.
చాలు, ఈ మాత్రం చాలు.. చొక్కాలు చించుకోవడానికి రెడీ అవ్వండి !
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప ది రూల్ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా పై అంచనాలు భారీ నెలకొన్నాయి..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన నాటి నుంచి షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు… కాగా, ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు.. బన్నీ పుట్టినరోజు సందర్బంగా రీలీజ్ చేసిన టీజర్ మాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.. మాస్ డైలాగులతో పాటు అదిరిపోయే యాక్షన్ సీన్స్, అల్లు అర్జున్ డైలాగులు తెగ ఆకర్షిస్తున్నాయి..తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో 66 సెకండ్ల టీజర్ కట్ చేశారు.. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ అందరిని ఆకట్టుకునేలా టీజర్ కట్ చేశారు.. సుక్కు మరోసారి ఊరమాస్ గా అల్లు అర్జున్ చూపించబోతున్నారని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.. చాలు, ఈ మాత్రం చాలు.. చొక్కాలు చించుకోవడానికి రెడీ అవండి అంటూ ఫ్యాన్స్ వీడియోను టేగ్ ట్రెండ్ చేస్తున్నారు.. ఈ టీజర్ విడుదలైన కొన్ని నిముషాలకె భారీగా వ్యూస్ ను సొంతం చేసుకుంది..
రాజమహేంద్రవరానికి రామ్ చరణ్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. మే నెలకు షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ఇటీవల వైజాగా లో కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న సినిమా ఇప్పుడు మరో షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.. ఈ మేరకు రామ్ చరణ్ రాజమహేంద్ర వరకు పయనమయినట్లు తెలుస్తుంది.. పొలిటికల్ డ్రామాగా తెరకేక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించునున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, ప్రియదర్శి, జయరాం, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ రాజమహేంద్రవరంలో జరగనుందని సమాచారం.. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులోప్రారంభం కానుందని తెలిసింది. కథరీత్యా సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట.. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక మరో షెడ్యూల్ షూటింగ్ కోసం వైజాగ్ కు వెళ్ళనున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. రీసెంట్ గా జరగండి సాంగ్ ను రిలీజ్ చేశారు.. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు..