ఏజెన్సీలో హృదయవిదారక ఘటన.. కొడుకు మృతదేహంతో 8 కిలోమీటర్ల నడక..
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రోంపిల్లి పంచాయితీ చినకొనేల నుండి గుంటూరు వద్ద కొల్లూరులో ఇటుకల పనికి కుదిరింది ఓ గిరిజన కుటుంబం.. అయితే, సోమవారం సాయంత్రం ఆ గిరిజన దంపతులకు చెందిన మూడేళ్ల బాలుడు మృతిచెందాడు.. ఇక, మృతదేహంతో పాటు ఆ కుటుంబాన్ని వారి బంధువులను విజయనగరం జిల్లా వనిజ వరకు వదిలేశాడు ఇటుక బట్టీల యజమాని.. ఆ తర్వాత సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆ యజమాని వెనుదిరిగి వెళ్లిపోయాడు.. ఇక, అక్కడి నుండి సరైన రహదారి లేక ఎనిమిది కిలోమీటర్ల దూరం మృతదేహంతో నడుచుకుంటూ గ్రామానికి చేరుకుంది ఆ కుటుంబం.. అయితే, మృతిచెందిన బాలుడికి వరసకు మామయ్యే ఓ యువకుడు.. పనికెళ్లిన దగ్గరా గిరిజనులకు అన్యాయం జరుగుతుందని.. ఆ యజమాని మార్గం మధ్యలోనే వదిలేయడంతో.. ఇలా మృతదేహంతో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.. ఆ వీడియోలో తాత చేతుల్లో బాలుడి మృతదేహం కనిపిస్తుంది.. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
వైసీపీలోకి కీలక నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
పల్నాడు జిల్లా మేమంతా సిద్ధం బస్సుయాత్రలో పలువురు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. ఈ రోజు పి.గన్నవరంకు చెందిన జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నియోజక ఇంచార్జ్ పోతిన మహేష్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వారితో పాటు పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. అందరికీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
పిడకల సమరం..! ఇంత ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉందా..?
ప్రేమికులను విడదీసిన పెద్దలను చూసుంటాం, ప్రేమ కథలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలనూ విని ఉంటాం.. కానీ, ప్రేమను గెలిపించే పోరాటం పిడకల సమరం మాత్రం మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.. దానికి మన ఆంధ్రప్రదేశ్ వందల ఏళ్ల క్రితమే వేదికగా మారింది.. చరిత్రలో నిలిచిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో కొంత ఆలస్యం చేస్తారు వీరభద్రస్వామి. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తమ భద్రకాళి దేవిని వీరభద్ర స్వామి మోసం చేసారని అమ్మ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే, వీరభద్ర స్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. దీనిని తెలుసుకొన్న వీరభద్ర స్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్ర స్వామిని వెళ్లవద్దని వేడుకొంటారు. కానీ, స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్తారు.. అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకోన్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామిపై పేడతో తయారు చేసిన పిడకలు విసురుతారు.. ఇక, విషయం తెలుసుకున్న స్వామి వారి భక్తులు కూడా ప్రతిగా పిడకలతో అక్కడికి వెళ్తారు.. అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగుతారు. అలా ఇరువర్గాలు పిడకల సమరం సాగిస్తారు. బ్రాహ్మదేవునికి వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయాన్ని విశ్వకర్మ (భద్రకాళి అమ్మ వారి) తండ్రి చెబుతారు. బ్రహ్మ దేవుడు వీరభద్ర స్వామి తండ్రి శివుడు దృష్టికి తీసుకుని వెళ్లడంతో.. అనంతరం బ్రహ్మ దేవుడు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారని చెబుతారు.
పవన్ కల్యాణ్‌పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్ మగాడు అయితే డైరెక్ట్ గా నా మీద మాట్లాడాలని సవాల్ చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో పుట్టాడు.. ఆ రాష్ట్రం (తెలంగాణ) వేరు.. మన రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) వేరన్న ఆయన.. హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలని అనుకోవడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, కోపం, పట్టుదల.. పవన్ కల్యాణ్‌కి ఏమయ్యాయి? అని నిలదీశారు.. అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తారా? అని ప్రశ్నించారు.. ఇక, పవన్ కల్యాణ్ రెచ్చిపోతున్నాడు.. రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు ముద్రగడ పద్మనాభం. ఇక, ఇక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై నోటికి వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదని పవన్ కల్యాణ్‌కు సూచించారు ముద్రగడ.. నేను ఏమైనా మాట్లాడితే.. సినిమాల్లో ఉండే సైడ్ క్యారెక్టర్లతో తిట్టిస్తారని మండిపడ్డారు.. తెరచాటుగా నాపై మాట్లాడడం కాదు.. ప్రెస్‌మీట్ పెట్టండి.. నాపై సూటిగా మాట్లాడండి.. ప్రశ్నలు వేయండి.. నేను సమాధానం చెబుతా.. మళ్లీ నేను ప్రశ్నలు వేస్తా.. దానికి మీరు కూడా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు ముద్రగడ పద్మనాభం.. మరోవైపు.. ఎన్నికల్లో కోట్లు, లక్షలు ఖర్చు చేస్తారని చెబుతున్నారు.. ప్రజలు అంతా అమ్ముడు పోతారనే కోణంలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కర్నూలు జిల్లాలో టీడీపీలో కుదుపు..! పార్టీకి కీలక నేతలు గుడ్‌బై..?
కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ గండి పడే అవకాశం ఉందంటున్నారు.. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారట. టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో పలువురు కీలక నేతలు ఉన్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.. ఈ నెల 12వ తేదీన పలువురు టీడీపీ నేతలు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.. ఇప్పటికే వైసీపీతో టచ్ లోకి వెళ్లిపోయారట కొందరు నేతలు.. వారి దారిలోనే మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారట.. 12వ తేదీన సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ, ఆలూరు మాజీ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం మల్లికార్జున, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట.. ఇక, రామసుబ్బారెడ్డి తో ఇప్పటికే చర్చలు జరిపారట మాజీ మంత్రి కేఈ ప్రభాకర్.. కానీ, కేఈ ప్రభాకర్ టీడీపీ వీడకుండా కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తురని తెలుస్తోంది.. మరోవైపు మంత్రాలయం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తిక్కారెడ్డి.. పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలతో సంతృప్తి పడలేదు.. మంత్రాలయం అసెంబ్లీ టికెట్ పై ఇప్పటికీ పట్టు వీడడం లేదు తిక్కారెడ్డి.. ఈ నేపథ్యంలో.. తిక్కారెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్‌పై ఓ నిర్ణయానికి వస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఈ వలసలకు టీడీపీ చెక్ పెడుతుందా? లేదంటా కర్నూలు జిల్లాలో టీడీపీలో భారీ కుదుపు తప్పదా? అనేది ఆసక్తికరంగా మారింది.
వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయవద్దు.. మేం అండగా ఉంటాం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాలంటీర్ల ప్రస్తావన లేకుండా సాగడం లేదు.. ఎన్నికల విధుల్లో, ప్రచారాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత.. మూకుమ్మడిగా వివిధ ప్రాంతాల్లో తమ పదవులకు రాజీనామా చేస్తూ వస్తున్నారు వాలంటీర్లు.. అయితే, వాలంటీర్స్ ఎవరూ రాజీనామా చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మా ప్రభుత్వం (తెలుగుదేశం పార్టీ సర్కార్ ) మీకు అండగా ఉంటుందని వెల్లడించారు. మీ సహకారంతో తాడిపత్రి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేస్తాం అన్నారు. ఇక, గత ఐదు సంవత్సరాలలో తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. మంచి పరిపాలన అందించడానికి మీ సేవలు వినియోగించుకుంటామని స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
టెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11 నుండి 20 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు నేటితో ముగియాల్సి ఉండగా.. ఈ నెల 20 వరకు పొడిగించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. సీబీటీ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. టెట్‌కు ఇప్పటి వరకు 1,95,135 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ సారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో మరోసారి దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.
ఈ సారి కూడా మెదక్ గడ్డపై బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం
కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు తియ్యగా నోటితో మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగులాగా ఉందన్నారు. ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసిందని హరీష్ విమర్శించారు. ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకు రాని హస్తంలాగా తయారయ్యిందన్నారు. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉందని.. ఈ సారి కూడా మెదక్ గడ్డపై బీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్‌కు తప్పిన ముప్పు.. తృటిలో బయటపడ్డ నానా పటోలే
మహారాష్ట్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగంగా భారీగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, మరికొందరు క్షేమంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. భండారా నగరానికి సమీపంలోని భిల్వారా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నానా పటోలేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆగి ఉన్న కారును ట్రక్కు బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. తృటిలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం… డ్రైవర్ ట్రక్కుపై నియంత్రణ కోలుపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా పోలీసులు తేల్చారు.
కెనడా సర్కారుకు షాకిచ్చిన కమిషన్ నివేదిక.. ఏం తేలిందంటే..!
కెనడా సర్కారుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు నిరాధారమని తేలిపోయాయి. ఈ మేరకు ఆ దేశ దర్యాప్తు సంస్థ తేల్చిచెప్పింది. ఈ పరిణామం చెంపదెబ్బ కొట్టినట్టైంది. 2019, 2021 ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని ఆరోపించిన వ్యాఖ్యల్ని కెనడా వెనక్కి తీసుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం విదేశీ జోక్యం కేసుపై అధికారిక దర్యాప్తులో భారతీయుల హస్తం లేదని తోసిపుచ్చింది. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటుందంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు అబద్ధమని తాజాగా తేలిపోయాయి. ఈ మేరకు తాజాగా విడుదలైన కమిషన్ నివేదికతో తేటతెల్లమైంది. దీంతో కెనడా సర్కారుకు గట్టి షాకే తగిలింది. ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని దర్యాప్తులో తేటతెల్లమైనట్లు నివేదికను సమర్పించాయి. భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ట్రూడో సర్కారుకు ఊహించని దెబ్బగానే చెప్పొచ్చు. భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తొలుత ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యపై భారత్‌ను నిందించిన ఆ సర్కారు.. అనంతరం కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ విచారణ మొదలుపెట్టింది. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని తాజాగా ఆ దేశ దర్యాప్తులో వెల్లడైంది. ఎన్నికల్లో భారత్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది.
ఫాస్ట్ బౌలింగ్‌లో ‘క్లాసెన్’ మెరుపు స్టంపింగ్.. ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే! వీడియో వైరల్
క్రికెట్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్స్ స్టంపింగ్ చేయడం మాములే. స్పిన్ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా ఉండి.. స్టంపింగ్ చేస్తుంటారు. ఫాస్ట్ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా.. వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదు. అందులోనూ స్టంపింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్.. ఫాస్ట్ బౌలింగ్‌లో మెరుపు స్టంపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీపర్ క్లాసెన్ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇన్నింగ్స్ ఆరంభంలో స్వింగ్‌తో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. భువీ స్వింగ్‌ను ఎదురుకునేందుకు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి షాట్‌లు ఆడాడు. ఇది గమనించిన సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమ్మిన్స్.. కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌ను స్టంప్స్‌కు దగ్గరగా ఉండమని సూచించాడు. ఇన్నింగ్స్ ఇదో ఓవర్ నాలుగో బంతిని భువీ సందించగా.. గబ్బర్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి షాట్ ఆడాడు. బంతి బ్యాట్‌కు కనెక్ట్ కాలేదు. గంటకు 140 కిమీ వేగంతో వచ్చిన బంతిని అందుకున్న క్లాసెన్.. మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో ధావన్ సహా అందరూ షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఆ ఒక్కటి అడక్కు’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్!
‘అల్లరి నరేశ్’ కామెడీ సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. ఇటీవలి కాలంలో నాంది, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి యాక్షన్ చిత్రాలు చేశారు. దాంతో నరేశ్ మళ్లీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారా? అని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో మళ్లీ తన మార్క్ కామెడీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అల్లరి నరేష్ 61వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంను నూతన దర్శకుడు అంకం మల్లి తెరకెక్కించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ చిలక ఈ సినిమాను నిర్మించారు. ఈ వేసవిలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఏప్రిల్ 19న ఆ ఒక్కటి అడక్కు సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేసింది. తెలంగాణ, ఏపీ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ దక్కించుకుంది. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవల జతకట్టిన విషయం తెలిసిందే.
ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్‌గా టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్!
‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఈశ్వర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. కృష్ణంరాజు లెగసీని ప్రభాస్ మరో స్థాయికి తీసుకు వెళ్లారు. ఆ లెగసీని ప్రభాస్‌తో పాటు మరో హీరో కూడా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. అతడే ‘విరాట్ రాజ్’. ప్రభాస్‌కు కజిన్ అయిన విరాట్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. విరాట్ పరిచయం అవుతున్న సినిమాకు ముహూర్తం ఈరోజు ఘనంగా జరిగింది. టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ ‘గణేష్ మాస్టర్’ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో విరాట్ రాజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ టైటిల్‌ను ఆవిష్కరించారు. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ చిత్రానికి ‘గౌడ్ సాబ్’ అనే టైటిల్ పెట్టారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్టెప్పులేపించిన గణేష్ మాస్టర్.. మెగా ఫోన్ పట్టాడు. గణేష్ మాస్టర్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. గౌడ్ సాబ్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని పేర్కొన్నారు. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ మరియు టీమ్ మొత్తంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆర్‌ఎం స్వామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గీత రచయిత వెంగీ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి.. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలని చూస్తున్నారట. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ మంచి సక్సెస్ అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.