బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు
అభ్యాస అనుభవాన్ని పెంపొందించేందుకు, నల్గొండ జిల్లాలోని జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని 29 పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ తరగతి గదులను ప్రవేశపెట్టనున్నారు. ఈ 29 బీసీ రెసిడెన్షియల్స్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లను పొందుతున్నాయి, ఇందులో నల్గొండ జిల్లాలో 15, సూర్యాపేట జిల్లాలో తొమ్మిది మరియు భువనగిరి జిల్లాలో ఐదు ఉన్నాయి. డిజిటల్ లెర్నింగ్ పద్ధతుల అమలు విద్యకు వాస్తవ ప్రపంచ విధానంతో విద్యార్థులను నిమగ్నం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని తరగతి సౌకర్యాలు కార్పొరేట్ పాఠశాలల ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడుతున్నాయి, తద్వారా విద్య యొక్క మొత్తం నాణ్యతను మెరుగుపరుస్తుంది.
పొంగులేటి వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం ఫైర్
ఖమ్మం మాజీ ఎంపీ పోంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలను ఖమ్మం జిల్లా పోలీసుల అధికారుల సంఘం ఖండించింది. ఖమ్మంలో మాజీ ఎంపి పోంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం నాడు జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పోలీసుల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడటం సరికాదని దీనిని పోలీసులు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. శాంతభద్రత పరిరక్షణలో మా ప్రాణాలను పణంగా పెట్టి బాధ్యతయుతమైన విధులు నిర్వహిస్తున్న పోలీసులను తమ మెప్పు కోసం పోలీసులను చులకన చేసి విమర్శలు చేయడం తగదని అన్నారు.
మణిపూర్‌లో మరోసారి హింస.. చర్చికి నిప్పుపెట్టిన దుండగులు
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈసారి రాజధాని ఇంఫాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. న్యూ చాకోన్ ప్రాంతంలోని స్థానిక మార్కెట్‌లో స్థలంపై వివాదం నడుస్తోంది. మెయిటై, కుకీ వర్గాల మధ్య జరిగిన పోట్లాటపై వివాదం జరిగింది. విషయం క్రమంగా ముదిరింది.. ఆ తర్వాత అగ్నిప్రమాదం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.
ప్రపంచంలో ఏ దేశం పార్లమెంట్ ను మార్చలేదు.. మోడీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
కొత్త పార్లమెంట్ భవనంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం మొత్తం కరోనా వంటి భయంకరమైన మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు. ఈ మొత్తం భవన నిర్మాణానికి 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
స్టేషన్ మర్చిపోయిన లోకో ఫైలట్.. ట్రైన్ రివర్స్ తిప్పేశాడు
బస్సులు, కార్లు రివర్స్ వెల్లడం చూశాం కానీ.. రైలు రివర్స్ వెళ్తుందని చాలా కొద్దిమంది మాత్రమే వినుంటారు.కేరళలోని షోరనూర్ వెళ్తున్న వేనాడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదవశాత్తు స్టాప్ దాటింది. రైలు ఒక కిలోమీటరు ముందుకు వెళ్ళింది. అప్పుడు లోకో పైలట్‌కి ఒక్కసారిగా గుర్తుకొచ్చింది.లోకో పైలట్ అతను మునుపటి స్టేషన్‌లో ఆగవలసి ఉందని గమనించాడు. ఈ పొరపాటు కారణంగా రైలును వెనక్కి తిప్పాల్సి వచ్చింది. చేర్యానాడ్ రైల్వే స్టేషన్‌లో ఎలాంటి సిగ్నల్ లేదు. సిగ్నల్స్ బ్లాక్ స్టేషన్లలో అంటే పెద్ద స్టేషన్లలో మాత్రమే అమర్చబడతాయి. లోకో పైలట్ అది గమనించలేదు. దీంతో అక్కడ ఆగాలన్న విషయం మర్చిపోయాడు. దీంతో రైలు ఒక కిలోమీటరు ముందుకు వెళ్ళింది. అప్పుడే అకస్మాత్తుగా అతనికి గుర్తు వచ్చింది. తరువాత రైలును చేర్యానాడ్ రైల్వే స్టేషన్‌కు వెనుకకు తీసుకువెళ్లవలసి వచ్చింది. దీని కారణంగా.. రైలు షెడ్యూల్ 8 నిమిషాలు ఆలస్యమైంది. అయితే తరువాత లోకో పైలట్ ఈ ఆలస్యాన్ని కవర్ చేశాడు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. బదిలీలకు మార్గదర్శకాలు విడుదల
ప్రభుత్వ ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. దీంతో ఉపాధ్యాయులంతా సంబరపడుతున్నారు. ప్రభుత్వ టీచర్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను సోమవారం నాడు విడుదల చేసింది. గత వారంలో రాష్ట్ర ప్రభుత్వ బదిలీలపై ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల బదిలీల విషయమై జగన్ ప్రభుత్వం వేర్వేరుగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇందులో ఎనిమిదేళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్లకు బదిలీలు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన హెడ్మాస్టర్ బదిలీ తప్పనిసరి అని జగన్ సర్కార్ పేర్కొ్ంది. కొత్త జిల్లాలు యూనిట్ గా టీచర్ల బదిలీలను నిర్వహించనుంది. ఈ నెల 31లోపుగా ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులతోనే రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్ల బదిలీల కోసం జీవో నం.47ను విడుదల చేసింది. ఐదు రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. టీచర్ల ట్రాన్స్ఫర్లపై సమావేశం చర్చించారు. గతంలో కూడా ఇదే విషయమై ఉపాధ్యా సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చించారు.
కమెడియన్ సుధాకర్ మృతి అంటూ ప్రచారం.. నమ్మకండి
టాలీవుడ్ స్టార్ కమెడియన్ సుధాకర్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటితరానికి ఆయన కామెడీ గురించి తెలియకపోవచ్చు. కానీ, 90s కిడ్స్ ను ఆయన కామెడీ గురించి చెప్పమంటే కథలు కథలుగా చెప్పుకొస్తారు. విలన్ గా, కామెడీ హీరోగా, స్టార్ కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన ప్రస్తుతం అనారోగ్యం పాలయ్యారు.గత కొన్నేళ్లుగా ఆయనకు చికిత్స జరుగుతుంది. అయితే నిన్నటి నుంచి ఆయన మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం రిప్ సుధాకర్ అంటూ పోస్ట్లు ప్రత్యేక్షమయ్యాయి. దీంతో ఆయన అభిమానులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ కు ఏమి కాలేదని, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. అసత్య ప్రచారాలు చేయవద్దని, చనిపోని మనిషిని మీ వ్యూస్ కోసం చంపేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో ఆ ఫేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.
జేపీఎస్ సర్వీసును క్రమబద్ధీకరణపై కసరత్తు
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.