ప్రస్తుత రోజుల్లో పశుపోషణ లాభదాయకమైన వ్యాపారంగా మారింది. పాల ఉత్పత్తి రంగంలో గేదెల పెంపకం మంచి ఆదాయంగా నిరూపించబడింది. పశుపోషకులు పాలు అమ్మడం ద్వారా ప్రతి నెలా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం వ్యవసాయంతో పాటు రైతులకు అదనపు ఆదాయ సాధనంగా మారుతోంది. ఇక డెయిరీ ఫామ్ వ్యాపారులు అయితే బోలెడు డబ్బును వెనకేసుకుంటుంటారు. రైతులు అయినా, డెయిరీ ఫామ్ వ్యాపారులు అయినా అధికంగా పాలు ఇచ్చే కొన్ని గేదె జాతుల గురించి తప్పక తెలుసుకోవాలి.
రైతులు, డెయిరీ ఫామ్ వ్యాపారులకు అధిక పాల ఉత్పత్తి కలిగిన గేదె జాతులు భారీ లాభాలను తెచ్చిపెడుతాయి. ముర్రా జాతికి చెందిన గేదెలు ఎక్కువ పాలు ఇచ్చే జాతిగా పరిగణించబడుతుంది. ఈ గేదె రోజుకు సగటున 20 నుచి 25 లీటర్ల పాలు ఇస్తుంది. ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున ఇవి ఉన్నాయి. ముర్రా గేదె పాలలో కొవ్వు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి తగినంత కాల్షియం, ప్రోటీన్‌ను అందిస్తాయి. ఈ పాలను వివిధ పాల ఉత్పత్తులను తయారు చేయడంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ముర్రా గేదె ధర దాదాపు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఈ రకం గేదెలను పెంచడం చాలా లాభదాయకంగా పరిగణించబడుతుంది. ఒక ముర్రా గేదె రోజుకు 25 లీటర్ల పాలు ఇస్తే.. రూ.1500 నుంచి రూ.2000 వరకు సంపాదించవచ్చు.
జఫరాబాది గేదె జాతి బలమైన శరీర నిర్మాణం కలిగి ఉంటుంది. పాల దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. ఈ గేదెలు గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందినవి. ఇవి నల్ల రంగులో ఉంటాయి. కొన్ని బూడిద రంగులో కూడా ఉంటాయి. నుదిటి మధ్యలో తెల్లటి మచ్చ ఉంటుంది. ఈ జాతి గేదెలను దీని ద్వారా గుర్తించవచ్చు. జఫరాబాది గేదె రోజుకు 10-15 లీటర్ల వరకు, 20-25 లీటర్ల వరకు పాలు ఇవ్వగలదు. ఈ జాతి గేదె ధర రూ. 70-80 వేల నుండి ప్రారంభమై రూ. 1 నుండి 1.5 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర ప్రధానంగా పాలు ఇచ్చే సామర్థ్యం, గేదె వయస్సుపై ఆధారపడి ఉంటుంది.
Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్ మూవీకి అరుదైన గౌరవం.. ఏకైక ఇండియన్ సినిమా!
మెహ్సానా గేదె రోజుకు 20 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ గేదెను గుజరాత్, మహారాష్ట్రలలో ఎక్కువగా పెంచుతారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా పెంచుతున్నారు. ఈ గేదెను పెంచడం ద్వారా రైతులు తక్కువ సమయంలోనే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సూరతి జాతి కూడా పాల ఉత్పత్తిలో మంచి ఆప్షన్. సగటున ప్రతి సంవత్సరం 1400 నుండి 1600 లీటర్ల పాలను ఇస్తాయి. డాక్టర్ అతుల్ కుమార్ ఈ గేదెలు అధిక పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. ఒకవేళ అమ్మినా కూడా భారీగా ఆదాయం వస్తుందని తెలిపారు.