మన రోజువారీ కూరల్లో వాడే టమాట ప్రతి కుటుంబానికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా టమాటా ధర పైపైకి దూసుకెళ్తుంది. అయితే, ఇవాళ (శనివారం) టమాట ధర ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో నాణ్యమైన టమాట ధర కిలో 196 రూపాయలకు చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. అత్యల్పంగా రూ.140లకు కిలో టమాట దొరుకుతుంది.
Read Also: UP NEWS: కోచింగ్ సెంటర్ ఆపరేటర్పై కాల్పులు.. తలపై బుల్లెట్ గాయాలు
అయితే, ప్రస్తుత సీజన్ లో టమాట పంట చివరి దశకు చేరుకుంటున్నాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లో దిగుబడి తగ్గిపోయింది. దీని వల్ల నేడు (శనివారం) మదనపల్లి కూరగాయల మార్కెట్ కు కేవలం 253 టన్నుల టమాట మాత్రమే వచ్చింది. ఫలితంగా టమాట ధర ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యాపారులు అంటున్నారు. మదనపల్లి మార్కెట్లో మొదటి రకం టమాటా కిలో 160-196 రూపాయలు పలికితే రెండో రకం 120-156 రూపాయలుగా పలుకుతుంది. వ్యాపారులు 25 కిలోల టమాటల బుట్టను 4500 నుంచి 4900 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారు.
Read Also: Errabelli Dayakar Rao : హన్మకొండ వరంగల్ జిల్లాల్లో 418 కోట్ల నష్టం వాటిల్లింది
ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాకు చెందిన మురళి అనే రైతు కేవలం 45 రోజుల్లోనే టమాటల అమ్మకంతో దాదాపు 4 కోట్ల ఆదాయం సంపాదించినట్లు తెలుస్తోంది. గతేడాది సరైన ధర లేక 1.5 కోట్ల రూపాయల అప్పుల పాలైన మురళి.. ఈ ఏడాది వచ్చిన ఆదాయంతో తన రుణం తీర్చేసుకున్నాడు అని స్థానికులు తెలిపారు. తాజాగా ఈ ఏడాది టమాటా తోట విస్తీర్ణం మరింతగా పెంచాలని అతడు అనుకుంటున్నాడు.