Tollywood Drugs Case:ప్రభుత్వం, పోలీసులు ఎంత ఆపాలని చూసినా టాలీవుడ్ డ్రగ్స్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఎవరో ఒకరు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న నిర్మాత డ్రాగన్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అప్పటినుంచి కూడా అధికారులు ఈ డ్రగ్స్ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్నవారు ఎవరైనా సరే.. అస్సలు వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ వనస్థలిపురంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. ఈ రైడ్ లో ఒక సినిమా ఆర్టిస్ట్ ను కూడా పట్టుకున్నారు. డబ్బింగ్ సినిమాలకు సౌండ్ ఇంజీనీర్ గా పనిచేస్తున్న జితేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 30 గ్రాముల MDMA ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గోవాలో ఒక నైజీరియన్ వద్ద డ్రగ్స్ కొని.. ఇక్కడ అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక జితేందర్ తోపాటు నాగేశ్వర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి కావాల్సినవారికి హైదరాబాద్ లో అమ్ముతున్నారని, ఒక్కో గ్రాము 8 వేల నుంచి 10 వేల వరకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక జితేందర్ పట్టుబడడంతో అతనితో పాటు సినిమా వారు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా..? లేదా.. ? అనేదానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.