ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అని అంటారు. దీనినే ‘దేవశయని ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్లి.. కార్తీక మాసంలోని ఏకాదశి రోజున మేల్కొంటాడు. తొలి ఏకాదశి రోజున విష్ణు, లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదంగా పరిగణిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం… ఏడాది జులై 6న తొలి ఏకాదశి వచ్చింది.
తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి.. పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజ గది శుభ్రం చేసుకుని.. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించాలి. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. తులసి, చామంతి వంటి పూలతో విష్ణుమూర్తిని పూజించాలి. పాలు, పళ్లు లాంటివి మాత్రమే తీసుకోవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ.. విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు (ద్వాదశి రోజు) దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి.. సకల సంపదలూ కలిగాయని చెబుతారు.
Also Read: Toli Ekadasi 2025: నేడు తొలి ఏకాదశి.. ముహూర్తం, పూజా విధానం ఇవే!
తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ‘ఏకాదశి’ వ్రత కథను తప్పకుండా పఠించాలి. వ్రత కథను పఠించడం ద్వారా విష్ణువు దయ మీపై ఎళ్లవేళలా ఉంటుంది. వ్రత కథను పఠించడం అన్ని కోరికలు నెరవేరుతాయని, పాపాల నుంచి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు. మరణం తర్వాత మోక్షం పొందుతారని కూడా చెబుతారు. పురాతన కాలంలో సూర్యవంశంలో మాంధాత అనే మహారాజు కరువు కాటకాలతో అల్లాడుతున్న రాజ్యం కోసం అంగీరస మహర్షి సూచనల మేరకు తొలి ఏకాదశి వ్రతం చేశారు. తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన తర్వాత రాజ్యంలో కుండపోత వర్షం కురిసింది. ప్రజలందరూ ఆనందంతో జీవించారు.