నేడు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 9 ఏళ్లలో సాధించిన ప్రగతి, సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ పధకాల అమలు తీరుతెన్నుల పై సమీక్ష చేయనున్నారు. గత తొమ్మిదేళ్ళు గా బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన పలు పధకాలను “కేంద్ర మంత్రి మండలి” సమావేశంలో వివరించనున్నారు ప్రధాని మోడీ. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పధకాల అమలు తీరుతెన్నులపై పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించనున్నారు ప్రధాని. ప్రజలతో నేరుగా సంప్రదించి క్షేత్రస్థాయిలో పథకాల అమలులో ఉన్న లోటుపాట్లను సరిచేయాలని ప్రధాని మోడీ ఆదేశించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, రామ మందిర నిర్మాణం లాంటి పలు అంశాలను “కేంద్ర మంత్రి మండలి” సమావేశంలో ప్రధాని వివరించనున్నారు.
ప్రభుత్వ పనితీరును, పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేలా నిర్ధిష్టమైన కార్యాచరణను మంత్రి మండలి సహచరులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోడీ. ప్రభుత్వ తదుపరి లక్ష్యాలను, “ఉమ్మడి పౌర స్మృతి”, దేశ రాజధాని ప్రాంతం అరెడినెన్స్ బిల్లు, “జాతీయ పరిశోధనా ఫౌండేషన్” బిల్లు ల ఆవశ్యకత గురించి ప్రధాని మోడీ వివరించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమయ్యేలా మంత్రి మండలి సహచరులకు ప్రధాని మోడీ సూచనలు చేయనున్నారు. అలాగే, సమాంతరంగా సంస్థాగత అంశాలపై సమాలోచనలు చేస్తోంది అధికార బీజేపీ. శనివారం జరిగిన బీజేపీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ కి చెందిన అన్ని మోర్చాల అధ్యక్షుల సమావేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వివిధ రాష్ట్రాల్లో, పార్టీ అవసరాలకు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ ను అధికార బీజేపీ అగ్రనాయకత్వం సిద్ధం చేసుకుంది. మార్పులు, చేర్పుల కార్యాచరణను అమలు చేయడానికి ముందు, దేశంలో వచ్చే రెండు వారాల్లో జోన్లవారీగా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read : CM Jagan : నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత నేను ఎప్పటికీ మర్చిపోలేను