Today (23-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం వరకు సానుకూలంగానే కొనసాగి చివరికి మంచి లాభాల్లో ముగియటం విశేషం. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజంతా పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ కావటానికి చాలా కారణాలు ఉన్నాయి.
పెట్టుబడిదారులకు అంతర్జాతీయంగా బలమైన సెంటిమెంట్ సిగ్నల్స్ అందాయి. వివిధ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా వెలువడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగొస్తున్నాయి. వారం పది రోజుల్లో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి 10 వారాల గరిష్టానికి చేరంది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా ఇన్వెస్టర్లలో కొత్త పెట్టుబడుల పట్ల విశ్వాసం పెరుగుతోందనటానికి ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగే నిదర్శనమని చెప్పొచ్చు.
read more: Apple Company: iPhone లేటెస్ట్ మోడల్స్‌కి కేరాఫ్‌గా మారనున్న ఇండియా
సెన్సెక్స్ 319 పాయింట్లు పెరిగి 60 వేల 941 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 18 వేల 118 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 21 కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ స్టాక్ విలువ 9 నెలల గరిష్టానికి చేరింది. క్యూ3 ఫలితాల అనంతరం మూడు రోజుల్లోనే 15 శాతం ర్యాలీ తీశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎస్ బ్యాంక్, సరెగమ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తదితర కంపెనీల షేర్ల విలువ బాగా పతనమైంది.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ బాగా రాణించింది. సున్నా పాయింట్ 8 శాతం వరకు లాభపడింది. ఐటీ షేర్లు ఒక శాతానికి పైగా ప్రాఫిట్స్ పొందాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ రియాల్టీ సూచీలు వెనకబడ్డాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక శాతం ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి. తాజా త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి వెలువడటం రిల్‌కి కలిసొచ్చింది. ఎస్ బ్యాంక్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బలహీనంగా ఉండటంతో స్టాక్స్ విలువ 12 శాతం పడిపోయింది.
డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి 81 రూపాయల 41 పైసలకు చేరింది. తద్వారా 10 వారాల గరిష్ట విలువను సాధించింది. 10 గ్రాముల బంగారం ధర 144 రూపాయలు పెరిగి గరిష్టంగా 56 వేల 802 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు స్వల్పంగా 93 రూపాయలు పెరిగి అత్యధికంగా 68 వేల 640 రూపాయల వద్ద ముగిసింది. క్రూడాయిల్ ధర కూడా స్వల్పంగా 69 రూపాయలు లాభపడి బ్యారెల్ ముడి చమురు ధర 6 వేల 689 రూపాయల వద్ద స్థిరపడింది.