Today (06-02-23) Business Headlines:
ప్రపంచంలో విలువైన కరెన్సీగా..
ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ కొనసాగుతోంది. ఒక కువైట్ దినార్ వ్యాల్యూ లేటెస్టుగా 266 రూపాయల 64 పైసలకు చేరింది. ఈ జాబితాలో కువైట్ దినార్ తర్వాతి స్థానాల్లో బహ్రెయిన్ దినార్, ఒమిని రియాల్ నిలిచాయి. ఒక బహ్రెయిన్ దినార్ విలువ 215 రూపాయల 90 పైసలు పలికింది. ఒక ఒమిని రియాల్ వ్యాల్యూ 211 రూపాయల 39 పైసలుగా నమోదైంది. దీంతో.. బలమైన కరెన్సీల లిస్టులో.. అమెరికా డాలర్, గ్రేట్ బ్రిటన్ పౌండ్, యూరో వెనకబడ్డాయి.
48 కోట్ల ఆధార్-పాన్’ల లింక్
దేశంలో మొత్తం 61 కోట్ల పర్మనెంట్ అకౌంట్ నంబర్లు ఉండగా దాదాపు 48 కోట్ల PANలతో ఆధార్ నంబర్ల అనుసంధానం పూర్తయింది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తిచేసుకోవాలంటూ గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిని లింక్ చేసుకోకపోతే బిజినెస్, ట్యాక్స్ సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు వీలుండదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ హెచ్చరించింది. ఆధార్, PAN అనుసంధానాన్ని గతంలో ఫ్రీగా చేసేవారు. ప్రస్తుతం వెయ్యి రూపాయల ఫీజు తీసుకుంటున్నారు.
విండ్’ఫాల్ పన్ను పెంపు
15 రోజులకొకసారి విండ్’ఫాల్ పన్నులో మార్పులు చేస్తున్న ప్రభుత్వం తాజాగా ముడి చమురుపై పన్ను పెంచింది. డీజిల్’తోపాటు ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ ఎగుమతులకూ ఈ నిర్ణయాన్ని వర్తింపజేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్’పై ప్రస్తుతం 1900 రూపాయలు ట్యాక్స్ వేస్తుండగా దాన్ని 5 వేల 50 రూపాయలు చేశారు. డీజిల్ ఎగుమతులపై పన్నును లీటర్’కి 5 రూపాయల నుంచి ఏడున్నరకు పెంచారు. ఏటీఎఫ్ ఎక్స్’పోర్ట్స్’పై ట్యాక్స్’ను మూడున్నర నుంచి 6 రూపాయలు చేశారు. ఇవి మొన్నటి నుంచి అమల్లోకొచ్చాయి.
రెపో రేట్ 0.25% పెరిగే ఛాన్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును ఈసారి పావు శాతం పెంచే అవకాశాలున్నాయని అనలిస్టులు అంటున్నారు. RBI మానెటరీ పాలసీ కమిటీ 3 రోజుల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ మీటింగ్ ముగిశాక.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి ద్వైమాసిక సమీక్షను ఎల్లుండి బుధవారం విడుదల చేయనుంది. గతేడాది మే నెల నుంచి రెపో రేటును 2 పాయింట్ రెండు ఐదు శాతం పెంచిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపులోకి రావటంతో అమెరికా కేంద్ర బ్యాంకు కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో దూకుడు తగ్గించిన సంగతి తెలిసిందే.
అదానీ విదేశీ బాండ్లూ వెనక్కి?
ఇప్పటికే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ నుంచి వెనక్కి తగ్గిన అదానీ గ్రూపు ఇప్పుడు విదేశీ బాండ్ల విషయంలో కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్లు ఇంగ్లిష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ.. విదేశీ బాండ్ల ద్వారా 4 వేల వంద కోట్ల రూపాయలు సమీకరించాలని ప్రణాళిక వేసిన సంగతి తెలిసిందే. కానీ.. ఇటీవల విడుదలైన హిండెన్’బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అదానీ గ్రూపుపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో ఈ సంస్థ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దేశీయంగా చేయాల్సిన ఫండ్ రైజింగ్ ప్రయత్నాల నుంచి కూడా విరమించుకుంది.
ఐఆర్ఈడీఏ, వాప్కోస్ ఐపీఓ
ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్’కి వెళ్లనున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్.. దీపం.. వెల్లడించింది. ఈ మేరకు వాప్కోస్ ఇప్పటికే సెబీకి తన డ్రాఫ్ట్’ను సబ్మిట్ చేసింది. దీని ప్రకారం 3 పాయింట్ రెండు ఐదు కోట్ల షేర్లను అమ్ముతారు. IREDA పబ్లిక్ ఇష్యూకి ప్రభుత్వం ఐదేళ్ల కిందటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సంస్థ దాదాపు 14 కోట్ల షేర్లను విక్రయించనుంది.