Tirumala Leopard: తిరుమల నడక దారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.. ఇప్పటికే తిరుమలలో ఆరు చిరుతలు బోనుకు చిక్కాయి.. ఓ బాలుడు, చిన్నారి లక్షితపై దాడి తర్వాత అప్రమత్తమైన టీటీడీ.. ఫారెస్ట్ అధికారులతో కలిసి ‘ఆపరేషన్ చిరుత’ చేపట్టారు.. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.. చిరుత సంచారాన్ని గుర్తించి బోన్‌లు ఏర్పాటు చేయడంతో.. ఇప్పటికే ఆరు చిరుతలను బంధించారు.. ఇక, దాదాపు వారం రోజుల పాటు ట్రాప్ కెమెరాలకు చిరుతల సంచారం చిక్కకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. నడకదారిలో భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.. చిరుతలు ఇక లేవు అనే నిర్ణయానికి కూడా వచ్చారు టీటీడీ అధికారులు.. కానీ, మళ్లీ ట్రాప్ కెమెరాకు చిరుత సంచారం చిక్కడంతో ఆందోళన మొదలైంది.. రాత్రి.. టీటీడీ ఈవో ఇంటి సమీపంలో చిరుత సంచారాని ట్రాప్ కెమరాలు ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇక, ఆ చిరుతను కూడా బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Minister KTR: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మరోవైపు.. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ బృందం తిరుమలలో పర్యటించనుంది.. తిరుమల నడకదారిలో ఇనుప కంచే ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించనుంది వైల్డ్ లైఫ్ కమిటీ.. నడక దారిలో ఇనుప కంచే ఏర్పాటుపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. కంచే ఏర్పాటుపై అనుమతులు మంజూరు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. నిన్న 55,747 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 21,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.11 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.