కర్నూలు జిల్లాలోని తాలుకా పోలీస్‌స్టేషన్ పరిధిలో గార్గేయపురం చెరువులో లభ్యమైన ముగ్గురు మహిళల అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గార్గేయపురం చెరువులో ఆదివారం ఉదయం ఇద్దరు మహిళల మృతదేహాలు, చెరువు పక్కన గుట్టు మీద మరో మహిళ మృతదేహం దొరికింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల మృతదేహాలు కుళ్లిపోయే స్థితికి చేరుకోవడంతో అంత్యక్రియలు చేశారు.
Read Also: KKR vs SRH Qualifier 1: స్టార్ ఓపెనర్ దూరం.. హైదరాబాద్‌తో తలపడే కోల్‌కతా తుది జట్టు ఇదే!
అయితే, మృతి చెందిన ముగ్గురు మహిళల్లో ఇద్దరు మహబూబ్‌నగర్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో ఒకరు జానకి కాగా ఆమెది మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం అభంగపట్నంగా గుర్తించారు. మరో మహిళ అరుణగా గుర్తించినా ఆమె స్వస్థలంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, దగ్గరలోని పోలీసులు చెక్ చేయగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ ఆటోను గుర్తించారు. ఆటో నెంబరు సాయంతో డ్రైవర్ షేక్ మహబూబ్ బాషాను అదుపులోకి తీసుకున్నారు. ఇక, షేక్ మహబూబ్‌బాషాతో అరుణకు గొడవలు ఉన్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఈ నేపథ్యంలోనే అరుణను జానకిని తన ఆటోలో ఎక్కించుకుని గార్గేయపురం చెరువు దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడే వీరికి కల్లు తాపించి మద్యం మత్తులో ఉన్న వీరిని చెరువులోకి తోసేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే ఆటో డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ఈ కేసును మరింత లోతుగా పోలీసులు విచారణ చేస్తున్నారు.